కన్నతల్లి ప్రేమ కన్నా మిన్న ఏది? | Dr Dasaradha Rama Reddy Speaks About World Mothers Day Special | Sakshi
Sakshi News home page

కన్నతల్లి ప్రేమ కన్నా మిన్న ఏది?

Published Sun, May 10 2020 3:01 AM | Last Updated on Sun, May 10 2020 1:57 PM

Dr Dasaradha Rama Reddy Speaks About World Mothers Day Special - Sakshi

ఈ భూమ్మీద కరోనా వైరస్‌ ఎక్కడైనా సోకగలదేమో కానీ.. తల్లిపాలను ‘అంటు’కోలేదు. అవును.. తల్లిపాలలో వైరస్‌ ఉండదు. ఒకవేళ కరోనా సోకిన తల్లైనా.. తన బిడ్డకు పాలివ్వవచ్చు. (అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనిసెఫ్‌ ప్రకటించిన విషయమిది)

సాక్షి, హైదరాబాద్‌: ‘భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ నడకనే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే’ అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ దశరథరామారెడ్డి. ‘అమ్మ కూడా చిన్నప్పుడు గారాల కూతురే. కానీ మనం పుట్టగానే అన్ని బాధ్యతలు తనపై వేసుకుని పెద్దరికంతో మనల్ని పెంచుతుంది. మన అల్లరినీ, కోపాల్నీ, అలకల్నీ భరిస్తుంది. మనం పెద్దయ్యాక.. మన ముందు పసిపాప అవుతుంది.

కానీ మనమేం చేస్తున్నాం? చాలామంది పెద్దయ్యాక అమ్మని ‘వదిలించుకుంటున్నారు’. మనకు ఇష్టమైన వ్యక్తుల కోసం కష్టపడుతున్నప్పుడు గానీ మనకు అర్థమవ్వదు.. అమ్మ ఓపిక ముందు మనమెంత అని? కానీ, ఆ నిజం మనకు అప్పుడు అర్థం కాదు. జీవితంలో పెద్దయ్యాక.. ఏదోరోజున ‘అరె అమ్మని ఆనాడు కష్టపెట్టానే’ అని బాధపడిన రోజు తెలిసివస్తుంది అమ్మంటే ఏంటో. అలా మనం బాధపడే సందర్భం రాకూడదంటే అమ్మని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అమ్మనే కాదు, ఆమె ఆరోగ్యాన్నీ కనిపెట్టుకుని చూసుకుంటే మన జీవితాలకు కావాల్సినంత భరోసా లభిస్తుంది’ అంటున్నారాయన. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

కరోనాతో కళ్లు తెరుస్తున్న కుటుంబాలు
మనం జీవితంలో ఎంత సాధించినా, ఎంత ఎదిగినా అమ్మ ఉన్నంత వరకు పిల్లలుగానే ఉంటాం. పిల్లల్లానే ఆలోచిస్తాం. మన కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను జీవిత చరమాంకంలో కళ్లలో పెట్టుకుని చూసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. అమ్మను దూరం చేసుకొని బాధపడేవారు చాలామంది ఉన్నారు. డబ్బులు, ఆస్తులు సంపాదించుకోవడం గొప్ప కాదు. కానీ అమ్మ ఆప్యాయతను పొందడమే నిజమైన అదృష్టం. ప్రస్తుతం కరోనా వసుధైక కుటుంబం గొప్పదనాన్ని చాటిచెప్పింది. అందరూ ఇళ్లలో ఉండి అమ్మకు సమయం ఇస్తున్నారు. ఒక్కోసారి ప్రకృతి ఇటువంటి వాటిని సృష్టించి పరిస్థితిని సమం చేస్తుందంటారు. కరోనా అలానే చేస్తుందేమో..

తల్లుల ఆరోగ్యం కోసం బీమా...
అమ్మ ఆరోగ్యం కోసం ప్రతీ ఏటా అవసరమైనప్పు డు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ము ఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక చెకప్‌ లు తప్పనిసరి. చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితు లు సరిగా లేక తల్లి అనారోగ్యానికి గురైతే వైద్యం చే యించలేని దుస్థితి..అందువల్ల తల్లితోపాటు కుటుంబసభ్యులంతా ఆరోగ్య బీమా చేయించుకో వాలి. దీనివల్ల అమ్మను అనారోగ్యాల నుంచి రక్షిం చుకోగలం. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లతో పా టు విటమిన్‌ డీ, విటమిన్‌ బీ12 సమస్యలు ఎక్కువ. హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపం వల్ల ఇతరత్రా అనారోగ్యాలు అమ్మను కబళిస్తున్నాయి. వీటి నుంచి అమ్మను కాపాడుకోవాలి.

కరోనా వేళ..  అమ్మ పైలం
గర్భిణుల కోసం యూనిసెఫ్‌ ప్రత్యేక సూచనలు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్‌ కీలక ప్రకటన జారీచేసింది. కరోనా సమయంలో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. ఒక్క తెలంగాణలోనే ఈ ఏడాది మార్చి చివరి నుంచి మే నెలాఖరు వరకు ఏకంగా 1.1 లక్షల ప్రసవాలు జరుగుతాయని అంచనా. లాక్‌డౌన్లు, కర్ఫ్యూల వంటి నియంత్రణ చర్యల నేపథ్యంలో గర్భి ణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు యూనిసెఫ్‌ విజ్ఞప్తి చేసింది.
► గర్భిణులకు యాంటెనాటల్‌ చెకప్‌లు, నైపుణ్యం కలిగిన డెలివరీ కేర్, ప్రసవానంతర సంరక్షణ సేవలు అందించడంతో పాటు కరోనా నుంచి భద్రత కల్పించాలి. వారిని పర్యవేక్షించే ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలి.
► ప్రసవ సమయంలో అన్ని ఇన్ఫెక్షన్‌ నివారణ, నియంత్రణ చర్యలు ఉన్నాయని గర్భిణులకు హామీనివ్వాలి.
► మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను ప్రసూతి కేంద్రాలకు వెళ్లాలని సూచించాలి. టెలి కన్సల్టేషన్, మొబైల్‌ ఆరోగ్య వ్యూహాలను వారికి తెలియజెప్పాలి.
► వైద్య ఆరోగ్య సేవలు అందనిపక్షంలో ఇంట్లోనే ప్రసవించేలా ఏర్పాట్లు చేయాలి. అందుకోసం ఆరోగ్య కార్యకర్తలకు మంచి శిక్షణతో పాటు తగిన సామగ్రి, రక్షణ అందించాలి.
► తల్లీపిల్లల ఆరోగ్యానికి, వారి ప్రాణాలను రక్షించే సేవలకు అవసరమైన నిధులు కేటాయించాలి.
► వైరస్‌ బారినపడకుండా తమను తాము రక్షించుకోవడానికి గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి. ఆన్‌లైన్‌ ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలి. 
► గర్భిణులు వైరస్‌ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తుంటే వారిలో ఎవరికైనా జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
► తల్లిపాలలో వైరస్‌ ఉండదు. కాబట్టి వారికి ఒకవేళ వైరస్‌ సోకినా బిడ్డకు తల్లిపాలను ఇవ్వనివ్వాలి. 
► కరోనా ఉన్న తల్లులు బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి.
► శిశువును తాకడానికి ముందు, తరువాత చేతులు కడుక్కోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement