కాబూల్/న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. తాలిబన్లు దేశంపై తమ పట్టుని పెంచుకుంటున్నారు. అఫ్గాన్ సైన్యం, తాలిబన్ల మధ్య ఘర్షణలతో దేశంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఒక్కో ప్రావిన్స్‌ని ఆక్రమించుకుంటూ వస్తున్న తాలిబన్లు మజర్–ఎ–షరీఫ్ నగరం వైపు దూసుకొస్తున్నారు. దీంతో ఆ దేశం విడిచి పెట్టి మంగళవారమే వెనక్కి రావాలని కేంద్రం అక్కడి భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. మజర్–ఎ–షరీఫ్‌లో దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. అందులో పని చేసే దౌత్య అధికారులు, ఇతర భద్రతా సిబ్బందిని హుటాహుటిన ప్రత్యేక విమానంలో వెనక్కి రప్పిస్తోంది.
‘మజర్–ఎ–షరీఫ్ నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక విమానం వస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరూ వెంటనే అందులో బయల్దేరండి. ఇక్కడ ఎవరికీ భద్రత లేదు’’ అఫ్గాన్‌లో భారత్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. అఫ్గాన్‌లో హింస ఇంకా కొనసాగితే విమాన సర్వీసుల్ని రద్దు చేస్తామని ఈ లోగా భారతీయులందరూ వెనక్కి రావాలని సూచించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం అఫ్గాన్‌లో ఇండియన్ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల్ని ప్రాజెక్టుల నుంచి తప్పించి విమాన సర్వీసులు రద్దయ్యేలోపు భారత్‌కు పంపించాలని సలహా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న డేటా ప్రకారం ప్రస్తుతం అఫ్గాన్‌లో 1,500 మంది వరకు భారతీయులు ఉన్నారు.
3 రోజుల్లో 27 మంది చిన్నారులు మృతి
అఫ్గాన్‌లో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి చిన్నపిల్లల ఏజెన్సీ యూనిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత మూడు రోజుల్లోనే అన్నెం పున్నెం తెలీని 27 మంది చిన్నారులు అఫ్గాన్ సైన్యానికి, తాలిబన్లకి మధ్య జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా వెల్లడించింది. గత నెల రోజుల్లో వెయ్యిమంది సాధారణ పౌరులు మరణించారు. 20 ఏళ్ల మిలటరీ ఆపరేషన్ తర్వాత అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతూ దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నారు. కుందుజ్ సహా ఎన్నో కీలక నగరాలు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. గత మూడు రోజుల్లో అయిదు ప్రావిన్షియల్ రాజధానుల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment