చిన్నారుల మరణాల్లో భారత్@48
యూనిసెఫ్ వార్షిక నివేదికలో వెల్లడి
వాషింగ్టన్/తియాన్జిన్: ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో (2014 వరకున్న వివరాల ప్రకారం) భారత్ 48వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యునిసెఫ్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2015లో భారత్‌లో 2.57 కోట్ల మంది జన్మించగా ఇందులో 12 లక్షల మంది చిన్నారులు వివిధ కారణాలతో మరణించారు. 2030 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, అంగోలాల్లోనే ఉంటాయని యునిసెఫ్ వెల్లడించింది.
నివేదికలోని మరిన్ని అంశాలు
► చిన్నారుల మరణాలకు నెలలు నిండకముందే పుట్టడంతో వచ్చే సమస్యలు, న్యుమోనియా ప్రధాన కారణాలు.
► భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 48 మంది చనిపోతున్నారు.
► దేశంలో సగటు ఆయుర్దాయం 68 ఏళ్లు.
► డ్రాపవుట్ల సంఖ్యలో తగ్గుదల. పూర్వ ప్రాథమిక విద్యకు దూరంగా పేదలు.
► 2009-2014 గణాంకాల ప్రకారం అక్షరాస్యత పురుషుల్లో 90 శాతం, మహిళల్లో 82 శాతం(15-24ఏళ్లలోపు).
► వందమందిలో 74 మంది మొబైల్ వినియోగం, 18 మంది ఇంటర్నెట్ వినియోగం.
► వెయ్యిమందిలో 12 మంది బాల కార్మికులు.
► 21 లక్షల మందికి హెచ్‌ఐవీ. ఇందులో 1.3 లక్షల మంది చిన్నారులు.
► వరల్డ్ ఎకనమిక్ ఫోరం హ్యూమన్ క్యాపిటల్ (ఆర్థికాభివృద్ధికి కావాల్సిన సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి, సరైన వినియోగం) సూచీలో భారత్‌కు 105 స్థానం.
► నాణ్యమైన విద్య విషయంలో 39, సిబ్బంది శిక్షణలో 46, నైపుణ్య ఉద్యోగుల విషయంలో 45వ స్థానంలో భారత్.