children deaths
-
Parenting: ఓడినప్పుడు అండగా నిలవండి
పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరూ గెలవరు. కొందరు ఓడుతారు. గెలవడానికి ఎన్ని కారణాలో ఓడటానికి అన్ని కారణాలు. తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు ఒక క్షణం పిల్లలు తెచ్చిన ఫలితాలతో డిస్ట్రబ్ అయినా దండించే సందర్భం ఇది కాదు. పిల్లల ఓటమిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అవసరం. వారిని గమనించి తిరిగి ముందుకు నడపడమే అవసరం. ఓడిన పిల్లలకు అండగా నిలవండి. కొందరు లెక్కలేని పిల్లలు ఉంటారు. వీరు ఎగ్జామ్స్ బాగానే రాసినా రిజల్ట్స్ తేడాగా వస్తే పట్టించుకోరు. ఫెయిల్ అయితే మరీ కొంపలు మునిగినట్టుగా కూచోరు. నెక్ట్స్ టైమ్ చూసుకుందాం అన్నట్టు ఉంటారు. ఈజీగా ఉంటారు. కాని కొందరు పిల్లలు పరీక్షలు ఎలా రాశారో ఇంట్లో కచ్చిత అంచనాతో చెప్పరు. ఫెయిల్ అవుతామేమోనని భయపడుతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఇక పూర్తిగా ముడుచుకుపోతారు. తల్లిదండ్రుల ముందుకు రారు. బంధువుల్లో పరువుపోయిందని బాగా బెంబేలు పడతారు. ఎవరితోనూ కలవరు. ఇక భవిష్యత్తు ముగిసినట్టే భావిస్తారు. వీరితోనే సమస్య. వీరు ఏ క్షణమైనా పేలే బుడగలాంటివారు. ఇలాంటి వారితో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల్ని, బంధువుల్ని అప్రమత్తం చేయాలి. ఈ దశ నుంచి వారిని సక్రమంగా బయటపడేయాలి. ఫెయిల్ ఎందుకు? ఈ ప్రశ్న పిల్లల్ని అడిగే ముందు పెద్దలే ప్రశ్నించుకోవాలి. పిల్లల్ని సరైన బడి/కాలేజ్‌లోనే చేర్చారా? అక్కడ పాఠాలు సరిగా జరిగాయా? సిలబస్ పూర్తి చేశారా? నోట్స్ సరిగా ఇచ్చారా? స్టూడెంట్ ఆ సబ్జెక్ట్స్ ఎలా ఫాలో అవుతున్నాడో ఎందులో వీక్ ఉన్నాడో టీచర్లు ఇంటికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారా? పిల్లలకు ట్యూషన్ అవసరమైతే సరైన ట్యూషన్ పెట్టించారా? పిల్లలు చదివే వాతావరణం ఇంట్లో ఉందా? వారు చదువుకునే వీలు లేకుండా అస్తమానం పనులు చెప్తూ, టీవీ మోగిస్తూ, ఇంట్లో నాన్ సీరియస్ వాతావరణం పెట్టారా? పరీక్షల సమయంలో సిలబస్‌ను సరిగా విభజించుకుని చదవగలిగాడా? ఎగ్జామ్‌లో ఇచ్చిన ప్రశ్నలకు టైమ్ మేనేజ్మెంట్ చేయగలిగాడా? ఎగ్జామ్ భయంతో ఏమీ రాయలేకపోయాడా?... ఇవన్నీ ఫెయిల్ అవడానికి కారణాలు. టెన్త్ వరకూ అందరికీ తప్పదు కాని ఇంటర్ విషయానికి వచ్చేసరికి ఇష్టమైన కోర్సులో చేర్చారా? చదవే ఆసక్తి, శక్తి ఉన్న సబ్జెక్ట్స్లోనే చేర్చారా?... ఇవీ ముఖ్యమైన విషయాలే. ఏం చేయకూడదు? పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. కొంతమంది తల్లిదండ్రులు ఏడ్చి, నెత్తి బాదుకుని భయభ్రాంతం చేస్తారు. ఏమాత్రం కూడదు. ఆడపిల్లైతే ‘పెళ్లి చేసి పారేస్తాం’ అని మగపిల్లలైతే ‘నాలుగు గేదెలు కొనిస్తాం. మేపుకో’ అని అనడం చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏం చేయాలి? ‘మరో అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరేం పర్వాలేదు’ అని చెప్పాలి. ‘నీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? ఈ పరీక్షలు పాస్ కావడంలో నీకు ఎదురైన సమస్య ఏమిటి?’ అని తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు బాగా రాశాననే నమ్మకం ఉంటే రీవాల్యుయేషన్‌కు వెళ్లాలి. ప్రతి స్టూడెంట్‌కు ఎవరో ఒక టీచర్/లెక్చరర్ మీద గురి ఉంటుంది. కొంత చనువు ఉంటుంది. అలాంటి వారి దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయించాలి. ఇది తాత్కాలిక అడ్డంకి అని దీనిని దాటి ముందుకు పోవచ్చని భరోసా ఇవ్వాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధిస్తావ్ అని చెప్పాలి. స్నేహితులతో కూడా ఇవే మాటలు చెప్పించాలి. ఆరోగ్యం, ఆయుష్షు ఉంటే జీవితంలో చాలా సాధించవచ్చని ఆశ కల్పించాలి. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకూడదు. చదువు ముఖ్యమే కాని చదువు కంటే జీవితం ముఖ్యమనే విషయం బోధపరచాలి. తల్లిదండ్రులు కూడా అదేసంగతి తెలుసుకోవాలి. ‘తక్కువ మార్కులతో పాసైన వారు ఎక్కువ మార్కులతో పాసైనవారిని భవిష్యత్తులో జీతానికి పెట్టుకోవచ్చు’. చెప్పలేం కదా. పిల్లలు ఫెయిల్ అయ్యారని తెలియగానే ముందు వారికి నొప్పి కలిగే మాట ఏదీ మాట్లాడకూడదు. వారితో మాట్లాడటం మానేయకూడదు. కొట్టడం ఇంకా చెడ్డ చర్య. ఎవరితో పోల్చకూడదు. బాగా మంచి మార్కులతో పాసైన వారిని చూపించి వీరిని హేళన చేయకూడదు. భోజనాల దగ్గర ‘మింగుదూ రా’ లాంటి మాటలు పొరపాట్న కూడా మాట్లాడకూడదు. తోబుట్టువులను ఉసిగొల్పకూడదు. -
ఏమైందో ఏమో.. కన్నతల్లే కాలయముడు అయింది.. ఆపై
కర్ణాటక: ఎంత కష్టం వచ్చినా కాపాడాల్సిన తల్లి క్షణికావేశంలో హంతకిగా మారింది. ఇద్దరు పిల్లలను చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి మత్తూరు సమీపంలోని నడుపనట్టి గ్రామానికి చెందిన వెంకటేషన్ (39). ఇతనికి తొమ్మిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన గాయత్రి (32)తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కనిష్కా (7), శరవణ్ (4) అనే పిల్లలున్నారు. వెంకటేష్ తిరుపతిలో టోపీల వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే నెలల తరబడి ఉండేవాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గాయత్రి తన ఇద్దరు పిల్లలను ఉరికి వేలాడదీసి హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొంది. అత్త ఉదయలక్ష్మి చూసి మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఊత్తంగేరి డీఎస్పీ అలెగ్జాండర్ కేసు విచారణ చేపట్టారు. -
పసిబిడ్డల మరణాల్లోనూ కులవివక్ష
ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బడ్జెట్‌కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్లోనూ భాగం లేదు. ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనం. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతం బిహార్‌లో పసిబిడ్డలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? దళితులు, ఆదివాసులు దేశ చిత్రపటం నుంచి కనుమరుగవుతారేమోననే భయం వెంటాడుతోంది. హర్వంశ్పూర్ బిహార్, ముజఫర్ పూర్ ప్రాంతంలోని వైశాలి జిల్లాలోని ఒక కుగ్రామం. చాతురి సాహిని తనకు అత్యంత ప్రియమైన ఇద్దరు కొడు కులను పోగొట్టుకున్నాడు. పెద్ద కొడుకు ప్రిన్స్‌కు 7 ఏళ్ళు కాగా, చిన్న కొడుకు చోటూకి 2 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ ఇద్దరు చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మరణించారు. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతంపసిబిడ్డల ప్రాణాలు పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? అయితే ఇది ఒక్క హర్వంశ్పూర్కు పరిమితమైన విషయం కాదు, సాహినికి మాత్రమే సంబంధించింది కూడా కాదు. గత రెండు నెలల్లో ముజఫర్ పూర్ ప్రాంతంలో 161 మంది పిల్లలు చనిపోయారు. 842 మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిపాలయ్యారు. చనిపోయిన వారిలో అత్యధిక మంది అట్టడుగు వర్గాలైన దళిత కుటుంబాల నుంచి వచ్చిన వారు. చనిపోయిన వారిలో దళితులు 101 మంది, 47 మంది వెనుకబడిన కులాల వాళ్ళు, 20 మంది ముస్లింలు ఉన్నారు. ఈ లెక్కలను ముజఫర్‌పూర్‌లోని దళిత సంఘాల కార్యకర్తలు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సహకారంతో ఇంటింటికీ తిరిగి సేకరించారు. ప్రభుత్వాలు కేవలం పిల్లల వివరాలు తెలిపాయే కానీ, వారి సామాజిక వర్గం వివరాలు తెలియజేయలేదు. బిహార్‌లో పిల్లలుచనిపోతున్న సమయంలోనే అక్కడి కార్యకర్తలతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సమ న్వయం చేసుకొని ఈ అధ్యయనం చేసింది. అందులో భాగంగానే ఒక గ్రామానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించింది. బిహార్‌లో పిల్లల మరణాలకూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం ఉంటుందనే అంచనాయే ఈ అధ్యయనానికి నాంది పలి కింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న బడ్జెట్లలో చేస్తున్న కేటాయింపులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల పట్ల, ముఖ్యంగా సామాజిక అసమానతలను తొలగించే ప్రయత్నాల పట్ల వాళ్ళ వైఖరిని స్పష్టం చేస్తాయి. ప్రభుత్వాల కుల వివక్ష ధోరణికి ఈ బడ్జెట్లు అద్దంపడు తున్నాయి. అందుకే ఈ నెల మొదటి వారంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణలను ఈ ఘటన వెలుగులోనే పరిశీలించాల్సి ఉంటుంది. హరివంశ్‌పూర్ గ్రామ పిల్లలు మరణించడానికీ, ఆ గ్రామ సామా జిక, ఆర్థిక పరిస్థితులకూ సంబంధం ఉన్నది. మొదట పిల్లల మరణానికి లిచీ పండ్లు తినడమే కారణమని ప్రచారం చేశారు. కానీ అనేక మంది వైద్య నిపుణులు, వైద్యుల బృందాలు ఈ వాదనను కొట్టి వేశాయి. చివరకు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పిల్లల మరణాలకు లిచీ పండ్లు తినడం కారణం కాదని తేల్చేసింది. మెదడువాపు వ్యాధితో ఆసు పత్రిలో చేరిన వాళ్ళలో 90 శాతం మంది ఏడేళ్లలోపు వయస్సు వాళ్ళేనని తేలింది. ఇందులో 135 మంది 3 ఏళ్ల లోపు పిల్లలేనని నిర్ధారించారు. వాళ్ళు కూడా ఈ మరణాలకు పౌష్టికాహార లోపం, కడు దారిద్య్రం కార ణమని తేల్చారు. హరివంశ్‌పూర్ గ్రామంలో 2 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 15 మంది భూమిహార్లకు తప్ప మరెవ్వరికీ వ్యవసాయ భూములు లేవు. ఈ గ్రామంలోని వారందరూ ఈ పదిహేను మంది భూస్వాముల భూములలో పనిచేసి బతకాల్సిందే. ఈ గ్రామం లోని కూలీలందరికీ నెలకు 10 నుంచి 12 రోజులు పని తప్ప వేరే ఉపాధి లేదు. ఈ గ్రామంలోని దాదాపు 30 శాతం మంది యువకులు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ముంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి, బతుకులీడుస్తుంటారు. భారత ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గర్వపడుతున్నది. సంతోషమే. కానీ భారత ప్రజలు కోట్లా దిమంది ఆకలితో నకనకలాడుతున్నారన్న విషయాన్ని మరుగుపరుస్తు న్నారు. 2018 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం, 119 దేశాల వివరాలు సేకరిస్తే, అందులో 103 వ స్థానంలో భారత్ ఉంది. అయితే ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే ఏడాది మొత్తానికి వర్తించేలా ప్రభుత్వాలు చేసే ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. అందుకే బడ్జెట్‌కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్లో భాగం లేదు. సరిగ్గా ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనమని స్పష్టం అవుతోంది. గత అయిదేళ్ళలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అగాధాల అంచులకు నెట్టి వేశాయి. మొత్తం బడ్జెట్లో ఎస్సీల విషయానికొస్తే, 2014 –2015 నుంచి 2019–20లలో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చూస్తే, 2014– 15లో 2.82 శాతం ఉండగా దాన్ని 2015–16లో 1.72 శాతానికి తగ్గించి, మళ్ళీ 2019–2020లో 2.92కు పెంచారు. ఇది పూర్తిగా ఎస్సీల పట్ల ఒక వివక్షాధోరణికి అద్దం పడుతున్నది. ఎస్టీలకు కూడా 2014–15 లో 1.80 శాతం ఉంటే, 2015–16లో 1.12 శాతానికి తగ్గించి మళ్ళీ 2019–20లో 1.89 శాతానికి పెంచారు. ఇది కూడా అదే వివక్ష, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కూడా ఇదే ధోరణిలో సాగుతున్నది. ఎస్సీ వెల్ఫేర్ కేటాయింపులు 2017–18లో 5.54, 2018–19లో 5.58, 2019–20లో 6.76గా ఉన్నాయి. నిజానికి 16 శాతం నిధులను ఎస్సీ వెల్ఫేర్‌కు కేటా యించాలి. ఏ సంవత్సరం కూడా వాళ్ళు సగానికి కూడా చేరుకోలేదు. ఎస్సీ వెల్ఫేర్‌కు 8 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 3.38 శాతం, 2018–19లో 3.85 శాతం, 2019–20లో 4.4 శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ప్రధానమైన అంశం విద్యకు ప్రోత్సాహం. ఇందులో స్కాలర్షిప్స్ అత్యంత ముఖ్య మైన విషయం. ఎస్సీలకు సంబంధించి ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్స్ 2014–15లో 499 కోట్లుగా ఉంటే, 2019–20 వచ్చేసరికి 355 కోట్లకు తగ్గించారు. 2016–17, 2017–18, 2018–19లలో కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2016–17లో 50 కోట్లు, 2017– 18లో 50 కోట్లు, 2018–19లో 125 కోట్లు, 2019–20లో ఇది మరింత దిగజారి 109 కోట్లకు తగ్గించడం ఏ సంక్షేమానికి సంకేతమో అర్థం కావడం లేదు. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయింపులు కూడా పెంచింది నామమాత్రమే. ఏకలవ్య మోడల్ పాఠశాలలకు గత కొన్ని సంవత్సరాలుగా నిధు లను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితీ, ఆశ్రమ పాఠశాలలకు సైతం గత మూడేళ్ళుగా నిధుల కేటాయింపులే లేకపోవడం గమనిస్తే ఈ వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యం స్పష్టమౌతోంది. స్వచ్ఛభారత్ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న మనం ఆచరణలో అమానవీయ విధానాలను రూపు మాపడంలేదు. కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్ దాస్ అతల్వాలే ఇచ్చిన సమాధానం ప్రకారం, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, 1993 నుంచి ఇప్పటి వరకు 445 మంది మ్యాన్ హోల్లోకి దిగి ఊపిరాడక చనిపోయారు. గత మూడేళ్ళలో 88 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో తమిళనాడు144, గుజరాత్ 131, కర్ణాటక 75, యూపీలో 71 మంది చనిపోయారు. అయితే వారి సంక్షేమం కోసం గానీ, వారిని ఈ అమానవీయ వృత్తి నుంచి ఇతర వృత్తుల్లోకి తీసుకెళ్ళే పరిస్థితి కానీ, వారి చదువుల పట్ల ప్రభుత్వం చూపుతోన్న శ్రద్ధను కానీ చూస్తే మనం తలదించుకోక తప్పని పరిస్థితి. మాన్యువల్ స్కావెంజర్స్గా పనిచేస్తున్న వాళ్ళ స్వయం ఉపాధి కోసం 2013–14లో 557 కోట్లు కేటాయిస్తే, 2015–16లో 10 కోట్లు, 2018– 19లో 20 కోట్లు, మళ్ళీ 2019–20లో 110 కోట్లు కేటాయించారు. వారి పిల్లల చదువుకోసం 2015–16లో 10 కోట్లు, 2016–17లో 2 కోట్లు, దానిని మళ్ళీ 1 కోటికే పరిమితం చేశారు. మళ్లీ 2019–20లో దాన్ని 5 కోట్లుగా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో దిక్కుతోచని పరిస్థితి. గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతోన్న నిర్లక్ష్యానికి ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటితో పాటు, భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అంటే ఒకవైపుఆర్థికంగా, సామాజికంగా వివక్షకు, అంటరానితనానికీ, వెలివేతకూ గురవుతూనే, రెండోవైపు జీవించే హక్కును కూడా కోల్పోతున్నారు. వీటన్నింటి ప్రతిరూపమే బిహార్‌లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోవడం. ఈ దేశంలో క్రమంగా అంటరాని కులాలైన దళితులు, ఆది వాసులు భారతదేశ చిత్రపటం నుంచి కను మరుగవుతారేమోననే భయం వెంటాడుతున్నది. భారత లోక్‌సభలో 112 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక హక్కుల కారణంగానే వీరికి ఆ పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీల పక్షాన ప్రభు త్వంలో, ప్రభుత్వంతో పోరాడి, సంప్రదించి, ఏదోరకంగా ఎస్సీ, ఎస్టీల సామాన్య ప్రజల హక్కులను, జీవన భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత వారిది. కానీ అటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు లేదు. ఇది శోచనీయం. వాళ్ళే కాదు. సమాజంలోని ప్రగతిని కాంక్షించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్లు కూడా ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న వివక్ష, వెలివేతలపై స్పందించాల్సిన తక్షణావశ్యత ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
అయ్యో పిల్లలు.. ఆకలితో అలమటించి..!
న్యూఢిల్లీ : ఎనిమిది, నాలుగు, రెండు ఏళ్ల వయసున ముగ్గురు చిన్నారులు. అన్యం పుణ్యం ఎరుగని ఈ పసి పిల్లలు ఎనిమిది రోజుల పాటు తినడానికి తిండి లేక, ఆకలితో అలమటించిపోయారు. తండ్రి ఎక్కడికి పోయాడో తెలియదు, అమాయకురాలైన తల్లి.. వీరికి కడుపు కాలిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి. 8 రోజుల పాటు ఈ బాధను అనుభవించిన ముగ్గురు చిన్నారులు, చివరకు తనువు చాలించారు. సొమ్ముసిల్లిపోయిన వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి, ఈ తల్లికి కడుపు కోత పెట్టేలా.. డాక్టర్లు షాకింగ్ న్యూస్ చెప్పారు. అప్పటికే ఆ పిల్లలు మరణించారని డాక్లర్లు నిర్దారించారు. ముగ్గురు పిల్లలు ఒకేసారి చనిపోవడంపై విచారణ చేపట్టిన పోలీసులకు, ఆ తల్లి అరిచిన ఆకలి కేకలు గుండెలు బద్దలయ్యేలా చేశాయి. పిల్లలు ఎలా చనిపోయారంటూ పోలీసులు అడగగానే..‘ నాకు ఆహారం ఇవ్వడంటూ...’ అరుస్తూ అక్కడిక్కడే ఆమె సొమ్ముసిల్లిపడిపోయింది. ఈ సంఘటనంతా ఆసుపత్రిలో ఉన్నవారందరికీ కన్నీరు తెప్పించింది. ప్రాథమిక విచారణ జరిపిన డాక్టర్లు, ముగ్గురు పాపలు ఆకలితో మరణించారని నిర్థారించారు. ఎనిమిది రోజులుగా వారు ఎలాంటి ఆహారం తీసుకోలేదని పేర్కొన్నారు. రెండోసారి శవపరీక్ష నిర్వహించిన డాక్టర్లకు మరింత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనీసం వారి శరీరాల్లో ఎలాంటి కొవ్వు లేదని తెలిసింది. అంతేకాక వారి కడుపులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. పోషకాహార లోపం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ కేసే నిదర్శనమని లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ అమితా సక్సేనా అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తన 15 ఏళ్ల వైద్య వృత్తిలో ఇలాంటి కేసును ఎన్నడూ చూడలేదని మరో డాక్టర్ చెప్పారు. దేశంలో రెండో అతిపెద్ద ఆదాయ నగరంగా ఉన్న రాజధాని ఢిల్లీలో ఆకలితో పిల్లలు మరణించడమనేది నిజంగా షాకింగ్ గురిచేస్తుందని అన్నారు. బెంగాల్‌కు చెందిన ఈ కుటుంబం, తూర్పు ఢిల్లీలోని మండవలిలో నివాసం ఉంటున్నారు. రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించే తొక్కే భర్త ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో, ఈ కుటుంబాన్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టేసింది. పని వెతుకోవడం కోసం అతను ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడని, రెండో రోజుల్లో తిరిగి వస్తుంటాడని కొందరు పక్కింటివాళ్లు చెప్పారు. పిల్లల తల్లి, మానసికంగా వికరాంగులని తెలిసింది. భర్త కనిపించకుండా పోవడంతో, ఈ కుటుంబమంతా మూడు రోజులుగా గదిలోనే ఉంటున్నారు. వారి గదిలో కొన్ని మెడిసిన్ బాటిల్స్‌ను, డయేరియా మాత్రలను ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది. గత కొన్ని రోజులుగా ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆరోగ్యం కూడా బాగాలేనట్టు తెలిసింది. డయేరియాతో వారు వాంతులు చేసుకుంటున్నారని, మరో పాప ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం తింటున్నా అనారోగ్యానికి గురైనట్టు ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ఈ హృదయ విదారకర ఘటనతో, ఒక్కసారిగా ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురుస్తోంది. ‘ఇది చాలా అవమానకరమైన సంఘటన.. దీనిపై రాజకీయం చేయదల్చలేదు. కేంద్రం రాయితీలోనే ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. దాన్ని పౌరులకు అందించాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రభుత్వంపై ఉంది’ అని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. చనిపోయిన చిన్నారుల తల్లిని పరామర్శించిన అనంతరం.. వీరి బాధను విని చాలా షాకింగ్ గురయ్యా, ఇది పూర్తిగా ప్రభుత్వం, సిస్టమ్ విఫలమేనని కాంగ్రెస్ అజయ్ మాకేన్ కూడా విమర్శించారు. అయితే ఇంటివద్దకే రేషన్ డెలివరీని బీజేపీ బ్లాక్ చేయడంతోనే, ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆప్ నేత సంజయ్ శర్మ అంటున్నారు. -
గోరఖ్‌పూర్ ఘోరకలి: ఆక్సిజన్ సప్లయర్‌పై దాడి
- 63 మంది చిన్నారుల మరణాలపై యూపీ సీఎం సీరియస్ - బీఆర్డీ ఆస్పత్రికి పయనమైన ఇద్దరు మంత్రులు.. - ఆదిత్యనాథ్‌పై విపక్షాల మండిపాటు.. రాజీనామాకు డిమాండ్ లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు మృత్యువాతపడిన ఘటనలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. శనివారం మధ్యాహ్నం లక్నోలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరిగింది. భేటీ ముగిసిన కొద్ది సేపటికే.. బీఆర్డీ ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరాదారుగా ఉన్న ప్రైవేటు సంస్థ కార్యాలయంపై పోలీసులు, వైద్యాధికారులు సంయుక్తంగా దాడి చేశారు. అక్కడి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం తమకు రూ.70 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంన్నదునే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్లే సరఫరా నిలిపివేశామని సదరు ప్రైవేటు సంస్థ వాదిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా శుక్రవారం సాయంత్రానికి 300 ఆక్సిజన్ సిలెండర్లను ఫైజాబాద్ నుంచి గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రికి పంపించామని ఆ సంస్థ పేర్కొంది. సరఫరా దారులపై చర్యలు తీసుకునేది, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదు. సీఎం వెళ్లిపోయిన కొద్దిసేపటికే 23 మంది మృతి గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో ఆగస్టు 7, 8 తేదీల్లో 21 మంది పిల్లలు చనిపోయారు. గురువారం(ఆగస్ట్ 9న) ఉదయం సీఎం ఆదిత్యనాథ్ బీఆర్డీ ఆస్పత్రికి వెళ్లి, చిన్నారుల మరణాలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ సరిగ్గా ఆయన వెళ్లిపోయిన కొద్ది సేపటికే ఒక్కొక్కరుగా చిన్నారులు చనిపోయారు. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 23 మంది చనిపోయారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందన్న విషయాన్ని అధికారులుగానీ, వైద్యులుగానీ సీఎం దృష్టికి తీసుకురాకపోవడం గమనార్హం. అయితే ఆస్పత్రిలో స్టోర్‌ను నిర్వహిస్తోన్న ఉద్యోగులు.. ఆక్సిజన్ కొరతపై సీఎం ఆదిత్యనాథ్‌కు గురువారం ఉదయమే ఓ లేఖరాసినట్లు వెల్లడి కావడం మరో సంచలనం. ఆగస్టు 7 నుంచి 12 (ఉదయం 11 గంటల) వరకు బీఆర్డీ ఆస్పత్రిలో మొత్తం 63 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో నవజాత శిశువులు కూడా ఉన్నారు. స్వచ్ఛందంగా సిలిండర్ల సరఫరా బీఆర్డీ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు చనిపోయిన ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని యూపీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. సీఎం ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు, పలువురు ఆక్సిజన్ సరఫరాదారులు బీఆర్డీ ఆస్పత్రికి స్వచ్ఛందంగా సిలిండర్లను పంపుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితిలో మార్పు కనిపించింది. (చదవండి: గోరఖ్‌పూర్ ఘోరకలి: 63కు పెరిగిన మరణాలు) (మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు!) -
కాలుష్యం.. చిన్నారుల పాలిట శాపం
ఏటా 17 లక్షల చిన్నారుల మృత్యువాత జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం వల్ల ఏటా 17 లక్షల మంది అయిదేళ్లలోపు చిన్నారులు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తేల్చిచెప్పింది. కలుషిత నీరు, ఇంట్లో పొగతాగడం, పారిశుధ్యం లేకపోవడం తదితర కారణాల వల్ల చిన్నారుల్లో మరణాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ సోమవారం తన నివేదికలో తెలియజేసింది. పిల్లల్లో ఎక్కువమంది డయేరియా, మలేరియా, న్యుమోనియాతో చనిపోతున్నారని తేల్చిచెప్పింది. వాతావరణ కాలుష్యం చిన్నారుల పట్ల శాపంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్గరెట్ చాన్ ఆవేదన వ్యక్తం చేశారు. లేత శరీరాలు, అప్పుడప్పుడే ఏర్పడుతున్న రోగనిరోధక వ్యవస్థ ఈ కాలుష్యాన్ని తట్టుకోలేక పోతున్నాయని చాన్ విశ్లేషించారు. ‘ప్రతి సంవత్సరం న్యుమోనియా వల్ల అయిదేళ్లలోపు 5,70,000 మంది చిన్నారులు చనిపోతున్నారు. పరిశుభ్రమైన నీరు దొరక్క డయోరియాతో 3,61,000 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. పుట్టిన చిన్నారుల్లో దాదాపు 2.70 లక్షల మంది అపరిశుభ్ర వాతావరణం కారణంగా నెలరోజుల్లోనే కన్నుమూస్తున్నారు. మలేరియాతో ఏడాదికి 2 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. మరో రెండు లక్షల మంది అయిదేళ్లలోపు పిల్లలు గాయాలు విషపూరితమై చనిపోతున్నారు. విషపూరితమైన పర్యావరణం మన పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంద’ ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ మారియా నైరా తెలిపారు. పరిశుభ్రమైన నీటిని అందించడంతో పాటు పునర్వియోగ ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ కాలుష్యాన్ని చాలా వరకూ తగ్గించవచ్చని నీరా అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుడుతున్నారని తెలిపింది. -
మూల్యం 17లక్షల మరణాలు
కలుషిత వాతావరణం కారణంగా ఏటా 17 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ప్రతి నలుగురు చిన్న పిల్లల్లో(ఐదేళ్ల లోపు వయసు) ఒకరి మరణానికి కారణం వారి చుట్టూ ఉన్న అనారోగ్యకరమైన వాతావరణమేనని స్పష్టం చేసింది. నీళ్ల విరేచనాలు, మలేరియా, నిమోనియా తదితర వ్యాధుల కారణంగా అత్యధికంగా ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నట్లు వెల్లడించింది. కలుషిత వాతావరణం అన్నింటికన్నా ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డా. మార్గరెట్ చాన్ పేర్కొన్నారు. కలుషిత నీరు, గాలి వారి ఎదుగుదలకు కారణమయ్యే అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. కొన్నిసార్లు తల్లి గర్భంలో ఉండగానే శిశువు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని లేదా నెలలు నిండకముందే తల్లి శిశువుకు జన్మనివ్వాల్సిన పరిస్ధితి ఏర్పడుతుందని చెప్పారు. -
చిన్నారుల మరణాల్లో భారత్@48
యూనిసెఫ్ వార్షిక నివేదికలో వెల్లడి వాషింగ్టన్/తియాన్జిన్: ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో (2014 వరకున్న వివరాల ప్రకారం) భారత్ 48వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యునిసెఫ్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2015లో భారత్‌లో 2.57 కోట్ల మంది జన్మించగా ఇందులో 12 లక్షల మంది చిన్నారులు వివిధ కారణాలతో మరణించారు. 2030 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్తాన్, కాంగో, అంగోలాల్లోనే ఉంటాయని యునిసెఫ్ వెల్లడించింది. నివేదికలోని మరిన్ని అంశాలు ► చిన్నారుల మరణాలకు నెలలు నిండకముందే పుట్టడంతో వచ్చే సమస్యలు, న్యుమోనియా ప్రధాన కారణాలు. ► భారత్‌లో పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 48 మంది చనిపోతున్నారు. ► దేశంలో సగటు ఆయుర్దాయం 68 ఏళ్లు. ► డ్రాపవుట్ల సంఖ్యలో తగ్గుదల. పూర్వ ప్రాథమిక విద్యకు దూరంగా పేదలు. ► 2009-2014 గణాంకాల ప్రకారం అక్షరాస్యత పురుషుల్లో 90 శాతం, మహిళల్లో 82 శాతం(15-24ఏళ్లలోపు). ► వందమందిలో 74 మంది మొబైల్ వినియోగం, 18 మంది ఇంటర్నెట్ వినియోగం. ► వెయ్యిమందిలో 12 మంది బాల కార్మికులు. ► 21 లక్షల మందికి హెచ్ఐవీ. ఇందులో 1.3 లక్షల మంది చిన్నారులు. ► వరల్డ్ ఎకనమిక్ ఫోరం హ్యూమన్ క్యాపిటల్ (ఆర్థికాభివృద్ధికి కావాల్సిన సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి, సరైన వినియోగం) సూచీలో భారత్‌కు 105 స్థానం. ► నాణ్యమైన విద్య విషయంలో 39, సిబ్బంది శిక్షణలో 46, నైపుణ్య ఉద్యోగుల విషయంలో 45వ స్థానంలో భారత్.