పసిబిడ్డల మరణాల్లోనూ కులవివక్ష | Mallepally Laxmaiah Article On Caste Discrimination In children Deaths | Sakshi
Sakshi News home page

పసిబిడ్డల మరణాల్లోనూ కులవివక్ష

Published Thu, Jul 18 2019 12:46 AM | Last Updated on Thu, Jul 18 2019 12:47 AM

Mallepally Laxmaiah Article On Caste Discrimination In children Deaths - Sakshi

ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉందనడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రభుత్వాల ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బడ్జెట్‌కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్‌లోనూ భాగం లేదు. ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనం. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతం బిహార్‌లో పసిబిడ్డలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? దళితులు, ఆదివాసులు దేశ చిత్రపటం నుంచి కనుమరుగవుతారేమోననే భయం వెంటాడుతోంది.

హర్‌వంశ్‌పూర్‌ బిహార్, ముజఫర్‌ పూర్‌ ప్రాంతంలోని వైశాలి జిల్లాలోని ఒక కుగ్రామం. చాతురి సాహిని తనకు అత్యంత ప్రియమైన ఇద్దరు కొడు కులను పోగొట్టుకున్నాడు. పెద్ద కొడుకు ప్రిన్స్‌కు 7 ఏళ్ళు కాగా, చిన్న కొడుకు చోటూకి 2 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ ఇద్దరు చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మరణించారు. చందమామపై కాలనీలను కలగంటున్న ఈ రోజుల్లో, గుండెను మార్చి గుండెను అమర్చుతున్న ఈ తరుణంలో మెదడువాపు వ్యాధిలాంటి చిన్నాచితకా వ్యాధులతో సైతంపసిబిడ్డల ప్రాణాలు పోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? అయితే ఇది ఒక్క హర్‌వంశ్‌పూర్‌కు పరిమితమైన విషయం కాదు, సాహినికి మాత్రమే సంబంధించింది కూడా కాదు. గత రెండు నెలల్లో ముజఫర్‌ పూర్‌ ప్రాంతంలో 161 మంది పిల్లలు చనిపోయారు. 842 మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రిపాలయ్యారు. చనిపోయిన వారిలో అత్యధిక మంది అట్టడుగు వర్గాలైన దళిత కుటుంబాల నుంచి వచ్చిన వారు. చనిపోయిన వారిలో దళితులు 101 మంది, 47 మంది వెనుకబడిన కులాల వాళ్ళు, 20 మంది ముస్లింలు ఉన్నారు. ఈ లెక్కలను ముజఫర్‌పూర్‌లోని దళిత సంఘాల కార్యకర్తలు సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ సహకారంతో ఇంటింటికీ తిరిగి సేకరించారు. ప్రభుత్వాలు కేవలం పిల్లల వివరాలు తెలిపాయే కానీ, వారి సామాజిక వర్గం వివరాలు తెలియజేయలేదు.

బిహార్‌లో పిల్లలుచనిపోతున్న సమయంలోనే అక్కడి కార్యకర్తలతో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ సమ న్వయం చేసుకొని ఈ అధ్యయనం చేసింది. అందులో భాగంగానే ఒక గ్రామానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించింది. బిహార్‌లో పిల్లల మరణాలకూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం ఉంటుందనే అంచనాయే ఈ అధ్యయనానికి నాంది పలి కింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌లలో చేస్తున్న కేటాయింపులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాల పట్ల, ముఖ్యంగా సామాజిక అసమానతలను తొలగించే ప్రయత్నాల పట్ల వాళ్ళ వైఖరిని స్పష్టం చేస్తాయి. ప్రభుత్వాల కుల వివక్ష ధోరణికి ఈ బడ్జెట్‌లు అద్దంపడు  తున్నాయి. అందుకే ఈ నెల మొదటి వారంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ విశ్లేషణలను ఈ ఘటన వెలుగులోనే పరిశీలించాల్సి ఉంటుంది. 

హరివంశ్‌పూర్‌ గ్రామ పిల్లలు మరణించడానికీ, ఆ గ్రామ సామా జిక, ఆర్థిక పరిస్థితులకూ సంబంధం ఉన్నది. మొదట పిల్లల మరణానికి లిచీ పండ్లు తినడమే కారణమని ప్రచారం చేశారు. కానీ అనేక మంది వైద్య నిపుణులు, వైద్యుల బృందాలు ఈ వాదనను కొట్టి వేశాయి. చివరకు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పిల్లల మరణాలకు లిచీ పండ్లు తినడం కారణం కాదని తేల్చేసింది. మెదడువాపు వ్యాధితో ఆసు పత్రిలో చేరిన వాళ్ళలో 90 శాతం మంది ఏడేళ్లలోపు వయస్సు వాళ్ళేనని తేలింది. ఇందులో 135 మంది 3 ఏళ్ల లోపు పిల్లలేనని నిర్ధారించారు. వాళ్ళు కూడా ఈ మరణాలకు పౌష్టికాహార లోపం, కడు దారిద్య్రం కార ణమని తేల్చారు. హరివంశ్‌పూర్‌ గ్రామంలో 2 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో 15 మంది భూమిహార్‌లకు తప్ప మరెవ్వరికీ వ్యవసాయ భూములు లేవు. ఈ గ్రామంలోని వారందరూ ఈ పదిహేను మంది భూస్వాముల భూములలో పనిచేసి బతకాల్సిందే. ఈ గ్రామం లోని కూలీలందరికీ నెలకు 10 నుంచి 12 రోజులు పని తప్ప వేరే ఉపాధి లేదు. ఈ గ్రామంలోని దాదాపు 30 శాతం మంది యువకులు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ముంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళ్ళి, బతుకులీడుస్తుంటారు. భారత ప్రభుత్వం లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశ పెట్టినందుకు గర్వపడుతున్నది.

సంతోషమే. కానీ భారత ప్రజలు కోట్లా దిమంది ఆకలితో నకనకలాడుతున్నారన్న విషయాన్ని మరుగుపరుస్తు న్నారు. 2018 గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకారం, 119 దేశాల వివరాలు సేకరిస్తే, అందులో 103 వ స్థానంలో భారత్‌ ఉంది.  అయితే ఆకలికీ, అనారోగ్యానికీ, ఆదాయానికీ, వనరులకూ ఈ దేశంలో కులం ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే ఏడాది మొత్తానికి వర్తించేలా ప్రభుత్వాలు చేసే ఆర్థిక ప్రణాళికల్లోనూ, బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ కులం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే ఆశ్చర్య పోనక్కర్లేదు. అందుకే బడ్జెట్‌కి సైతం కులం ఉంది అని ఇప్పుడు చెప్పక తప్పదు. నూటికి 80 శాతంగా ఉన్న కులాల్లో చాలా వాటికి వనరులు లేవు, ఆదాయాలు, శ్రమలో భాగం లేదు. చివరకు బడ్జెట్‌లో భాగం లేదు. సరిగ్గా ఇదే మన భారత ఆర్థిక రంగం పరుగులు తీస్తున్న వైనమని స్పష్టం అవుతోంది. గత అయిదేళ్ళలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అగాధాల అంచులకు నెట్టి వేశాయి. మొత్తం బడ్జెట్‌లో ఎస్సీల విషయానికొస్తే, 2014 –2015 నుంచి 2019–20లలో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చూస్తే, 2014– 15లో 2.82 శాతం ఉండగా దాన్ని 2015–16లో 1.72 శాతానికి తగ్గించి, మళ్ళీ 2019–2020లో 2.92కు పెంచారు. ఇది పూర్తిగా ఎస్సీల పట్ల ఒక వివక్షాధోరణికి అద్దం పడుతున్నది.

ఎస్టీలకు కూడా 2014–15 లో 1.80 శాతం ఉంటే, 2015–16లో 1.12 శాతానికి తగ్గించి మళ్ళీ 2019–20లో 1.89 శాతానికి పెంచారు. ఇది కూడా అదే వివక్ష, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలు కూడా ఇదే ధోరణిలో సాగుతున్నది. ఎస్సీ వెల్ఫేర్‌ కేటాయింపులు 2017–18లో 5.54, 2018–19లో 5.58, 2019–20లో 6.76గా ఉన్నాయి. నిజానికి 16 శాతం నిధులను ఎస్సీ వెల్ఫేర్‌కు కేటా యించాలి. ఏ సంవత్సరం కూడా వాళ్ళు సగానికి కూడా చేరుకోలేదు. ఎస్సీ వెల్ఫేర్‌కు 8 శాతం కేటాయించాల్సి ఉండగా, 2017–18లో 3.38 శాతం, 2018–19లో 3.85 శాతం, 2019–20లో 4.4 శాతం మాత్రమే బడ్జెట్‌ కేటాయింపులు జరిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో ప్రధానమైన అంశం విద్యకు ప్రోత్సాహం. ఇందులో స్కాలర్‌షిప్స్‌ అత్యంత ముఖ్య మైన విషయం. ఎస్సీలకు సంబంధించి ప్రీ–మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ 2014–15లో 499 కోట్లుగా ఉంటే, 2019–20 వచ్చేసరికి 355 కోట్లకు తగ్గించారు. 2016–17, 2017–18, 2018–19లలో కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2016–17లో 50 కోట్లు, 2017– 18లో 50 కోట్లు, 2018–19లో 125 కోట్లు, 2019–20లో ఇది మరింత దిగజారి 109 కోట్లకు తగ్గించడం ఏ సంక్షేమానికి సంకేతమో అర్థం కావడం లేదు. నేషనల్‌ ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు కేటాయింపులు కూడా పెంచింది నామమాత్రమే. ఏకలవ్య మోడల్‌ పాఠశాలలకు గత కొన్ని సంవత్సరాలుగా నిధు లను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితీ, ఆశ్రమ పాఠశాలలకు సైతం గత మూడేళ్ళుగా నిధుల కేటాయింపులే లేకపోవడం గమనిస్తే ఈ వర్గాల పట్ల పాలకుల నిర్లక్ష్యం స్పష్టమౌతోంది.


స్వచ్ఛభారత్‌ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న మనం ఆచరణలో అమానవీయ విధానాలను రూపు మాపడంలేదు. కొన్ని రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర మంత్రి రామ్‌ దాస్‌ అతల్‌వాలే ఇచ్చిన సమాధానం ప్రకారం, పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు, 1993 నుంచి ఇప్పటి వరకు 445 మంది మ్యాన్‌ హోల్‌లోకి దిగి ఊపిరాడక చనిపోయారు. గత మూడేళ్ళలో 88 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో తమిళనాడు144, గుజరాత్‌ 131, కర్ణాటక 75, యూపీలో 71 మంది చనిపోయారు. అయితే వారి సంక్షేమం కోసం గానీ, వారిని ఈ అమానవీయ వృత్తి నుంచి ఇతర వృత్తుల్లోకి తీసుకెళ్ళే పరిస్థితి కానీ, వారి చదువుల పట్ల ప్రభుత్వం చూపుతోన్న శ్రద్ధను కానీ చూస్తే మనం తలదించుకోక తప్పని పరిస్థితి. మాన్యువల్‌ స్కావెంజర్స్‌గా పనిచేస్తున్న వాళ్ళ స్వయం ఉపాధి కోసం 2013–14లో 557 కోట్లు కేటాయిస్తే, 2015–16లో 10 కోట్లు, 2018– 19లో 20 కోట్లు, మళ్ళీ 2019–20లో 110 కోట్లు కేటాయించారు. వారి పిల్లల చదువుకోసం 2015–16లో 10 కోట్లు, 2016–17లో 2 కోట్లు, దానిని మళ్ళీ 1 కోటికే పరిమితం చేశారు. మళ్లీ 2019–20లో దాన్ని 5 కోట్లుగా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో దిక్కుతోచని పరిస్థితి.  గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీల పట్ల చూపుతోన్న నిర్లక్ష్యానికి ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటితో పాటు, భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి.

అంటే ఒకవైపుఆర్థికంగా, సామాజికంగా వివక్షకు, అంటరానితనానికీ, వెలివేతకూ గురవుతూనే, రెండోవైపు జీవించే హక్కును కూడా కోల్పోతున్నారు. వీటన్నింటి ప్రతిరూపమే బిహార్‌లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోవడం. ఈ దేశంలో క్రమంగా అంటరాని కులాలైన దళితులు, ఆది వాసులు భారతదేశ చిత్రపటం నుంచి కను మరుగవుతారేమోననే భయం వెంటాడుతున్నది. భారత లోక్‌సభలో 112 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులున్నారు. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక హక్కుల కారణంగానే వీరికి ఆ పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీల పక్షాన ప్రభు త్వంలో, ప్రభుత్వంతో పోరాడి, సంప్రదించి, ఏదోరకంగా ఎస్సీ, ఎస్టీల సామాన్య ప్రజల హక్కులను, జీవన భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత వారిది. కానీ అటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు లేదు. ఇది శోచనీయం. వాళ్ళే కాదు. సమాజంలోని ప్రగతిని కాంక్షించే వాళ్లు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్లు కూడా ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న వివక్ష, వెలివేతలపై స్పందించాల్సిన తక్షణావశ్యత ఉంది.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

మల్లెపల్లి లక్ష్మయ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement