అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనికుడు. అశోకుడిది ఒక ఆదర్శవంతమైన పాలన. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశోకుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నాలను రూపొందించుకున్నామో, ఆ లక్ష్యాలను ప్రభుత్వాలు మరువకూడదు.
‘‘భారత జాతీయ జెండాలో గతంలో మనం వాడిన చరఖాకు బదులుగా చక్రాన్ని ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది కేవలం ఒక గుర్తు కాదు. దీని వెనుక ఒక సామాజిక మార్పు, ఒక మహోన్నత వ్యక్తి దాగున్నారు. అతడే అశోకుడు. అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనిక చక్రవర్తి. భారత చరిత్రలో అశోకు డిది ఒక ఆదర్శవంతమైన పాలన. అది భారత చరిత్ర పైనే కాదు, ప్రపంచ చరిత్రపైనే గొప్ప ప్రభావాన్ని చూపింది. అది ఒక జాతీయ వాద చరిత్ర కాదు. అశోకుడు తన దూతలను, ప్రతినిధులను ప్రపంచంలోని అనేక దేశాలకు పంపించాడు. అయితే ఆయనది దురా క్రమణ కాంక్ష కాదు. శాంతి సందేశమే ఆయన ఆశయం.’’ జాతీయ పతాకంలో చేర్చాల్సిన ధర్మచక్రాన్ని గురించి 1947 జూలై 22న రాజ్యాంగ సభలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి.
మన జాతీయ పతాకంలో పొందుపరచిన ధర్మచక్రానికీ, సమ్రాట్ అశోకుడికీ ఉన్న సంబంధం ఏమిటో చాలామందికి తెలుసు. మన దేశ రాజముద్ర, అశోకుని స్తంభంలోని సింహాల చిత్రమని కూడా చాలా మంది ఎరిగినదే. అయితే, అవి ఎలా నిర్మించారు? ఎందుకు నిర్మిం చారు? వాటిని ఎవరు గుర్తించారు? అనే విషయాలు తెలియవు. ఈ తరానికి వాటి ప్రాముఖ్యత తెలియాల్సిన అవసరమున్నది. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ఆ సింహాల నిర్మాణం పైనే వివాదం చెలరేగింది. సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపించే సింహా లకు బదులుగా వాటిని ఉగ్రరూపంలో నిర్మించారని పలువురు చరిత్ర కారులు ఆరోపించారు. ప్రతిపక్షాలూ విమర్శలను గుప్పించాయి.
బ్రిటిష్ పాలకులు భారత దేశం వచ్చేవరకూ అశోకుని గురించి గానీ, బౌద్ధ చరిత్ర గానీ ప్రచారంలో లేదు. రాత ప్రతుల్లో, ముఖ్యంగా పాళీ భాషలో, సంస్కృత భాషలో బౌద్ధం గురించి వివరాలు ఉండేవి కానీ, ఇతర ఆధారాలు లేవు. 1818 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్ జనరల్ హెన్సీ టైలర్ సాంచి స్థూపాన్నీ, దాని అవశేషాలనూ కనుగొన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి, అంటే 1881లో దానిని పదిలపరిచే పని మొదలైంది. 1919 కల్లా పూర్తయ్యింది. ఎప్పుడైతే సాంచిలో ఇటు బౌద్ధ శిల్పాలు, ఇతర అవశేషాలు బయటపడ్డాయో, బౌద్ధ చరిత్ర మీద, అశోకుని పాలన మీద అధ్యయనం జరపాలన్న ఆసక్తి బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తల్లో మొదలైంది.
అంతకుముందే సారనాథ్ ప్రాంతంలో కూడా కొన్ని ఆశ్చర్యం గొలిపే శిలావిగ్రహాలు, ఇతర నిర్మాణాలను 1780లో విలియం హోడ్జెస్ అనే చిత్రకారుడు గుర్తించాడు. అక్కడ అతడొక స్థూపాన్ని చూశాడు. కానీ అది బౌద్ధ స్థూపం అని తెలియదు. ఆ తర్వాత 1794లో బెనారస్ కమిషనర్ జోనాధన్ డంకన్ కొన్ని తవ్వకాలు జరి పాడు. కొన్ని ఇటుకలు మాత్రమే అక్కడ దొరికాయి. అయితే 1861లో బ్రిటిష్ భారత పురాతత్వవేత్త లార్డ్ కన్నింగ్‌హామ్ ఆ స్థూపాన్ని సందర్శించి, తవ్వకాలను ముమ్మరం చేశాడు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్ ఎఫ్.ఓర్టల్ ఆనాటి భారత పురాతత్వ సొసైటీ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్‌ను ఒప్పించి, 1904–05 సంవత్సరాల మధ్య కాలంలో చేపట్టిన తవ్వకాలలో స్థూపం స్వరూపం బయట పడింది. అందులోని అశోక స్తంభం, ఆ స్తంభంలోని సింహాలు, ఇతర చిహ్నాలు అన్నీ కలిపి భారత రాజముద్రను రూపొందించుకున్నాం.
అశోకుని స్థూపంలో ఉన్న సింహాల భాగాన్ని భారత రాజ ముద్రగా 1947 డిసెంబర్ 29వ తేదీన ఆమోదించుకున్నాం. దానిని 1950, జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చారు. ఇందులో నాలుగు దిక్కులా సింహాల బొమ్మలను విశ్వాసానికి, శక్తికి, ధైర్యానికి గుర్తు లుగా ప్రతిష్ఠించుకున్నాం. అంతే కాకుండా జాతీయ వృక్షంగా మర్రి చెట్టును నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా బౌద్ధ సాంప్రదాయంతో ముడివడి ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అశోక స్తంభ నిర్మాణం కమలం మీదనే జరిగింది. జాతీయ పక్షి నెమలి అశోకుని వంశానికి చిహ్నం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం, మన రాజముద్రలో ఉన్న సింహాలు బుద్ధుని ప్రతీకలుగా భావిస్తారు. ఆయన జన్మించినది శాక్య తెగ. అందుకే సిద్ధార్థుడిగా జన్మించి, గౌతమ బుద్ధునిగా మారిన బుద్ధున్ని శాక్య సింహంగా పిలుస్తారు. స్తంభం పైన నాలుగు సింహా లను ఉంచడమంటే నలుదిక్కులా ఆయన బోధనలను వ్యాప్తి చేయా లనీ, విస్తరించాలనీ అశోకుని ఉద్దేశ్యంగా చరిత్రకారులు భావిస్తారు. అందులో ఏనుగు ఆయన శక్తికీ, ఆయన జన్మ రహస్యానికీ చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా వృషభం ఆయన బలాన్ని సూచిస్తుంది. ఆయన ఇంటినుంచి మహాభినిష్క్రమణ రోజున బుద్ధుడు తీసుకెళ్ళిం దనడానికి సంకేతంగా గుర్రాన్ని భావిస్తున్నారు చరిత్రకారులు.
అయితే మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత దాదాపు 84,000 బౌద్ధ నిర్మాణాలను చేపట్టినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా, గౌహతి నుంచి కర్ణాటక దాకా భారతదేశమంతటా బౌద్ధాన్ని తన శాసనాల ద్వారా, స్థూపాలు, ఇతర నిర్మాణాల ద్వారా దశదిశలా వ్యాప్తి చేశాడు. అశోకుడు కనుక అటువంటి నిర్మాణాలను చేపట్టి ఉండకపోతే భారత దేశంలో బౌద్ధం పునరుజ్జీవనం పొందడం సాధ్యమయ్యేదే కాదు. బుద్ధుడు జన్మించిన ఈనాటి నేపాల్‌లోని లుంబిని, జ్ఞానోదయం పొందిన బోధ్ గయ, మొదటి బోధన చేసిన సారనాథ్, నిర్వాణం పొందిన కుశీ నగరం... ఈ రోజు ప్రపంచానికి అందు బాటులో ఉన్నాయంటే అది అశోకుడి దార్శనికత ఫలితమే.
బౌద్ధ సాహిత్యంలోని ఈ విషయాలన్నింటినీ విదేశీ బౌద్ధ యాత్రికులు, ప్రత్యేకించి హ్యూయన్‌త్సాంగ్, పాహియాన్ లాంటి వాళ్లు తమ రచనల్లో పేర్కొన్నారు. బౌద్ధ చారిత్రక ప్రదేశాలను సంద ర్శించినట్టు; అక్కడ చైత్యాలు, విహారాలు, స్థూపాలు ఉన్నట్టు వారు రాశారు. ఆ వివరాలను పరిగణనలోనికి తీసుకొని బ్రిటిష్ పురాతత్వ చరిత్రకారులు తవ్వకాలు జరిపి బౌద్ధ చారిత్రక ఆధారాలను బయట పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి. అశోకుడు వేసిన చాలా శాసనాల్లో తన పేరు నేరుగా లేదు. ‘దేవానాం పియ’(దేవానం ప్రియ) అని మాత్రమే శాసనాల్లో ఉంది. అయితే 1840 సంవత్సరంలో శ్రీలంకలో టర్నల్ అనే రచయిత శ్రీలంక చరిత్ర మహాగ్రంథమైన ‘మహావంశ’లో అశోకుడే దేవానాం పియ అని అని గుర్తించాడు.
అశోకుడు కేవలం కొన్ని చారిత్రక నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాలేదు. అప్పటి వరకూ కొనసాగుతున్న యజ్ఞ, యాగా దుల హింస, ప్రత్యక్ష దోపిడీ నుంచి బుద్ధుని బోధనల ద్వారా సమాజాన్ని విముక్తం చేశారు. దానివల్ల వృత్తులు, పరిశ్రమలు, వ్యవ సాయం అభివృద్ధి చెందాయి. మూఢనమ్మకాలను వ్యాపింపజేసిన పురోహిత వర్గ ఆధిపత్యాన్ని అశోకుడు నిలువరింపజేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పురోహిత వర్గం అశోకుడి మీద ఎన్నో రూపాల్లో తప్పుడు ప్రచారాలు చేసింది. కానీ సత్యం జయిస్తుందనే గౌతమ బుద్ధుని ఉవాచ అశోకుడి విషయంలో రుజువైంది. భారత దేశా నికిæస్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశో కుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నలను రూపొందించు కున్నామో, ఆ లక్ష్యాలను మరువకూడదు.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077
Comments
Please login to add a commentAdd a comment