mallepally laxmaiah
-
మన ప్రజాస్వామ్యం కాగితపు పులా?
ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలో ఉందని ‘వి–డెమ్’ నివేదిక చెబుతోంది. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కానీ భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మానవ హక్కులూ, ప్రజాస్వామ్య భావాలూ, సమానత్వ అంశాలూ మేళవింపుగా ఉన్న ఆధునిక రాజ్యాంగం కలిగిన దేశం కూడా. అయితే ఇటీవల ప్రజాస్వామ్య దేశం తన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వ పోకడలకు దగ్గరవుతున్నట్టు, ‘వి–డెమ్’ తన పరిశోధనలో తేల్చింది. ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలోకి వెళ్ళింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఆదిమ తెగలు, ఇతర వర్గాలకు సంబంధించిన స్వేచ్ఛల్లో మనం ఇతర దేశాలకన్నా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే ఒక ఐదారు అంశాలు ప్రస్తావనకు వస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛతో పాటు పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్వీడన్ విశ్వవిద్యాలయాల ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తోన్న వి–డెమ్ (విభిన్న ప్రజాస్వామ్యాలు) సర్వే కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలనే పేర్కొంటుంది. అయితే భారత్ సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో ఈ పరిశీలన మాత్రమే సరిపోదు. ఇక్కడ ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. మూల కారణం ప్రస్తుతం మన దేశంలో మోదీ పాలన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనే విషయం ఎక్కువగా చర్చకు వస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. రాజ్యాంగ విలువలకు స్థానం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించి అణచివేతను కొనసాగించారు. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వానికీ, మోదీ నియంతృత్వానికీ గుణాత్మకమైన తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది. ఇందిరాగాంధీ తన పాలనను కాపాడుకోవడానికి తాత్కాలికంగా నిర్బంధాన్ని అమలు జరిపారు. తదనంతరం తన తప్పు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. మోదీ పాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ప్రజలను విభజించి, రాజ్యాంగం ప్రకటించిన ‘మేమంతా భారతీయులం’ అనే భావనకు చరమగీతం పాడుతున్నది. రెండువేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటున్నది. అయితే మోదీకి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఆ ధైర్యం కలగడానికి, అంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి పునాది ఇక్కడి కుల వ్యవస్థలో ఉంది. దానితో పాటు రోజురోజుకీ గుత్తాధిపత్యం వైపు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రమాదాన్ని రాజ్యాంగ ముసాయిదాను సమర్థించిన 1949 నవంబర్ 25 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్ బహిరంగంగా దేశం ముందుంచారు. ‘‘ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఆ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఆ వ్యత్యాసాలను తొలగించుకోకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అంటూ ఆనాడు చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనపడుతున్నది. సోదరభావం కీలకం ఇతర దేశాల ప్రజాస్వామ్య భావనకూ, భారత దేశంలోని ప్రజాస్వామ్య అవగాహనకూ తేడా ఉన్న విషయాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలనలోనే ఆయన తన ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రజాస్వామ్యం అనగానే అది ఎన్నికలు, పాలన, ప్రభుత్వాల విధానాలు అని అనుకోవడం పొరపాటనీ, అది ప్రజల మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తుందనీ కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి మూడు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కీలకమని చెపుతూ, ఇందులో అత్యంత ముఖ్యమైనది సోదరత్వం అంటారు. ఇది భారత దేశంలో కొరవడిన అంశమని తేల్చారు. గత డెబ్భై అయిదు సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ అంబేడ్కర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. కులవ్యవస్థను నిర్మూలించే ఎటువంటి ప్రయత్నాన్ని గానీ, ప్రణాళికను గానీ కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఏనాడూ చేయలేదు. కేవలం ఆర్థిక తోడ్పాట్ల వంటివి మాత్రమే ఈ దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురాలేవనీ, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించగలిగే పక్కా ప్రణాళిక అవసరమనీ గుర్తించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. భారత దేశంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే బలవంతులు. ప్రజల్లో తరతరాలుగా నాటుకొని పోయిన కుల వ్యత్యాసాలు, కుల అసమానతలు ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. గత పదేళ్ళలో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజే పీ ప్రభుత్వం మనగలుగుతుందంటే కులాలలోని విభేదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే. దానితో పాటు, హిందూ మతంలోని పలు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. గ్రామాల్లో ఏ కులాలైతే ఆధిపత్యంలో ఉన్నాయో వాటిని తమ బలంగా మార్చుకోవడం, అత్యధిక జనాభా కలిగిన కులాలను సమీకరించడం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. అదే సమయంలో గత వందల ఏళ్ళుగా ముస్లింలు, హిందువుల మ«ధ్య ఉన్న వైషమ్యాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా బలంగా వాడుకుంటున్నది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట నిజమే కానీ, దాని బలమేమీ తగ్గలేదు. కులాల పట్ల ప్రజల్లో ఉన్న భావాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ప్రభుత్వాల విధానాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా కనపడుతున్నది. ఇటీవల దళితుల్లో పెరిగిన చైతన్యం అత్యాచారాల విషయంలో కేసులు నమోదు కావడానికి ఉపయోగపడింది. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య కులాలకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది బీజేపీ. తమ పార్టీ పునాదిగా ఉన్న ఆధిపత్య కులాలను మరింత సంతృప్తి పరిచేందుకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేసింది. చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన వంటి విధానాలు ఏవి అమలు జరగాలన్నా కుల వ్యవస్థ ప్రధానమైన అవరోధం. దీనికి ప్రభుత్వాల బాధ్యత కన్నా, ప్రజల్లో కుల భావనలను తొలగించడం ముఖ్యం. ప్రజల్లో కుల అసమానతల పట్ల సానుకూలత ఉన్నంత వరకూ, గ్రామాల్లో ఇంకా ఈ కులవ్యవస్థ కొనసాగుతున్నంత వరకూ ప్రజాస్వామ్యమనే భావనకు ఆస్కారమే లేదు. తాత్కాలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు, ప్రజాస్వామ్యం, అంటే సమానత్వంతో కూడిన సామాజిక జీవన గమనం కోసం... ప్రభుత్వాల నిర్బంధాలు, నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే... ప్రజల్లో ఉన్న కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
కర్ణాటక ఫలితాన్ని ఎలా చూడాలి?
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది అనడం కన్నా బీజేపీ ఓడింది అనడం కరెక్టు. ఎందుకంటే కాంగ్రెస్‌ది సంపూర్ణ విజయం అనుకోలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ వైపు వచ్చారంతే! ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలకూ, బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. దేశంలో నెలకొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రకటించాలి. ఇది ప్రజా విజయం. అధికార భారతీయ జనతా పార్టీ ఓటమి. ఇదే ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం. అంతేగానీ, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ విజయమనుకుంటే పొరపాటు. ఇది దేశ వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతమవుతుందనుకుంటే అంతకన్నా పొరపాటు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల వల్ల అంచనాలు తారుమారయ్యే అవకాశం మాత్రం ఉంది. మొదటిగా, ప్రజల విజయం విషయానికి వస్తే– గతంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాదనుకున్నవాళ్ళు జనతాదళ్ (ఎస్)కు, కాంగ్రెస్‌కు మధ్యలో నిలిచిపోయారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు తెలివిగా చాలా చోట్ల జనతాదళ్(ఎస్)ను పక్కన పెట్టి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా జేడీ(ఎస్),కాంగ్రెస్ పోటీలో ఉంటే, బీజేపీని కాదనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గారు. గత ఎన్నికల్లో జేడీ(ఎస్) 37 సీట్లలో విజయం సాధిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో అది 19కి పడిపోయింది. అంటే సగానికి దిగజారిందని అర్థం. దీనికి కారణం, ప్రజల చతురత తప్ప మరొకటి కాదు. మూడు, నాలుగు పార్టీలు పోటీలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు అనుసరించడానికి ఇది ఒక నమూనా. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చాలా బలంగా ఉన్నట్టు మనం భావిస్తున్నాం. ఎందుకంటే, పార్లమెంటు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని రెండుసార్లు నిలబెట్టుకుంది. అది కూడా అత్యంత అధిక సంఖ్యలో. అక్కడ నాలుగు పార్టీలు పోటీ పడుతు న్నాయి. అందులో గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ చాలా బలహీనపడింది. కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే తన ఉనికిని చాటగలగింది. అయితే అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోగా, 2022లో దాని బలం 255కు పడిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 47 స్థానాలకు పరిమితం కాగా, 2022లో 111 స్థానాలకు తన బలాన్ని పెంచుకున్నది. అంటే క్రమంగా సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతోంది. మిగతా రెండు పార్టీల పరిస్థితిని చూస్తే, ఇది మనకు అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 2017 ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలిచి, 6.25 శాతం ఓట్లను సాధించుకుంటే, 2022 ఎన్నికల్లో రెండు సీట్లకు పరిమితమై పోయి, 2.33 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. బహుజన్ సమాజ్ పార్టీ 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లను సంపాదించి, 19 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2022 ఎన్నికల్లో ఓట్ల శాతం 12.88కి పడిపోగా, కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్, బీఎస్పీ క్రమంగా తమ రాజకీయ బలాలను కోల్పోతున్నట్టు కనిపిస్తున్నది. ఒకవేళ అక్కడ బీజేపీని ఓడించాలనుకునే ప్రజలు సమాజ్ వాదీ పార్టీవైపే మొగ్గితే భారతీయ జనతాపార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ప్రాధా న్యతను కోల్పోవాల్సి వస్తుంది. అంటే జాతీయస్థాయి ఎన్నికల్లో కూడా బీజేపీ తన ఆధిపత్యాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదు. దానికి ఉదాహరణగా సీట్లు మాత్రమే కాదు, ఓట్ల శాతాన్ని కూడా చూడాలి. సమాజ్‌వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో 21.82 శాతం ఓట్లను పొందితే, 2022 ఎన్నికల్లో అది 32.06 శాతానికి పెరిగింది. అంటే దాదాపు పది శాతానికి పెరిగింది. కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాదీ పార్టీలు ప్రజాదరణ కోల్పోతున్నట్లు, సమాజ్‌వాది పార్టీ వైపు ప్రజలు వెళుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో విషయం, బీజేపీ ఓటమి: నిజానికి కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇప్పటికీ ఒకే పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి రాలేదు. 1985 నుంచి ఇదే చరిత్ర పునరావృతమవుతూ ఉంది. 1985 వరకు కర్ణాటకలో కాంగ్రెస్ పాలన కొనసాగింది. 1985లో మొదటి సారిగా జనతాపార్టీ నాయకత్వంలో రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఏర్పా టయ్యింది. ఇదే మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం.1994లో జనతాదళ్ 227 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 1999లో కాంగ్రెస్, 2004లో జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం, 2008లో బీజేపీ ప్రభుత్వం, 2013లో మళ్ళీ కాంగ్రెస్, 2018లో మళ్ళీ బీజేపీ అధికారాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఇది కర్ణాటక అసెంబ్లీ చరిత్ర. కర్ణాటక ప్రజలు 1985 నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీకి రెండవసారి అధికారం కట్టబెట్టలేదు. అయితే బీజేపీ ఈ చరిత్రను తిరగరాయాలని ఉవ్విళ్ళూ రింది. అది ప్రజల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసింది. సూటిగా చెప్పాలంటే ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చ గొట్టి, మిగతా ప్రజలందరినీ తమవైపు తిప్పుకోవాలని చూసింది. అందులో భాగంగానే హిజాబ్, అజాన్, ఉమ్మడి సివిల్ కోడ్, పశుసంరక్షణ పేరుతో దాడులు, ఒక రకంగా, ఉత్తర ప్రదేశ్‌లో అనుసరించిన అన్ని విధానాలను ఇక్కడ అమలు చేయాలని శతవిధాలుగా ప్రయ త్నించింది. కానీ ఆ విషయాలేవీ కర్ణాటక ప్రజలు పట్టించుకోలేద నడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఇది మతాల మధ్య విభజన అయితే – ఇక కులాల మధ్య ముఖ్యంగా ఎస్సీలలో ఉన్న వ్యత్యాసాలను ఉపయోగించుకొని మాదిగల ఓట్లను పొందడం కోసం రిజర్వేషన్ల విభజనను తెరపైకి తీసుకొచ్చింది. అదికూడా ఫలించలేదు. తన ఆర్థిక, సామాజిక కార్య క్రమాలు, అభివృద్ధి పనులను చూపించుకోవడం కాకుండా, ఇటువంటి విభజనతో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నది. ఇప్పటికీ కర్ణాటకలో బీజేపీ బలమేమీ తగ్గలేదు. కానీ విడిపోయిన ప్రజలను ప్రతిపక్షం వైపు నిలబడేటట్టు చేసి, తన ఓటమిని తానే రాసుకుంది బీజేపీ. మూడో విషయం, కాంగ్రెస్ గెలుపు: ఇది బీజేపీ ఓడిపోయి,అందించిన గెలుపు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులైన శివకుమార్, సిద్ధరామయ్య ఐక్య కృషి తోడైనప్పటికీ తనకు తాను గెలిచిన గెలుపు కాదిది. ఎందుకంటే, పదేళ్ళ కిందట దేశంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలకూ, ఇప్పడు బీజేపీ అమలు చేస్తున్న విధానాలకూ మౌలికమైన తేడా లేదు. అయితే ఇటీవల ఆ పార్టీ నాయ కుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు గత కాంగ్రెస్ విధా నాలకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అదే విధంగా కార్పొరేట్ల గుత్తాధిపత్యం మీద రాహుల్ చేస్తున్న విమర్శల్లో ఆ మార్పును చూడవచ్చు. కానీ అవి పార్టీ విధానంగా ప్రకటించాలి. అదే విధంగా గతంలో తాము అనుసరించిన ఆర్థిక, రాజకీయ విధానాల పైన ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అంబానీలను ఆకాశానికెత్తిన విషయాన్ని గుర్తు చేసుకొని సవరించుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అదే విషయంపై కొన్ని విషయాల్లో వ్యతిరేకించిన జైపాల్‌రెడ్డి లాంటి నాయ కులు పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే సంవత్సరంలో రాజీవ్ గాంధీ లాంటి నాయకులు అనుసరించిన హిందూత్వ అనుకూల విధానాలను సమీక్షించుకోవాలి. అయితే బీజేపీని కేవలం అధికారం కోసం మాత్రమే వ్యతిరేకించాలనే భావన ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఆశించలేం. దేశంలో నెల కొన్న అన్ని విషయాలపైనా, ప్రజల క్షేమం, సంక్షేమం, సమగ్రాభివృద్ధి అనేవి కాంగ్రెస్ ఆశయాలైతే, వాటికి అనుగుణమైన విధానాన్ని ప్రక టించాలి. కేవలం ఎన్నికల సమయంలో, లేదా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని, ఆ తర్వాత దాని ఊసుఎత్తక పోతే, కాంగ్రెస్‌కు కర్ణాటక లాంటి గెలుపులు కష్టమనే చెప్పాలి.అందుకే ఇకనైనా కాంగ్రెస్ చేసిన తప్పులకు లెంపలేసుకొని, సరికొత్త ప్రజా మార్గాన్ని ఎంచుకోక తప్పదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్
2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్‌ప్లాన్‌కు బదులుగా కాంపోనెంట్గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్‌ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్‌ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్‌ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ని కలిసి సమర్థంగా సబ్‌ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం. ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్‌ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్‌లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్‌లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన. సబ్‌ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్‌కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్‌లు రిజర్వేషన్లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్‌ప్లాన్‌ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ఎస్సీ సబ్ ప్లాన్‌గా మార్చారు. అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి ఆర్డినెన్స్‌కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో.. !?
భారతదేశంలో మరణానికి ముందు వెనుకల కూడా సనాతనమైన, అమానవీయమైన సాంప్రదాయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఆ సంప్రదాయాల్లో పడి గంజిలో పడ్డ ఈగల్లా బయ టకు రాలేక, అందులో పడి చావలేకా... కొట్టుమిట్టాడుతున్నాం. అద్దె ఇంట్లో ఆత్మీయులు, కుటుంబ సభ్యులు మరణిస్తే కనీసం అక్కడ ఉండి కర్మకాండలు నిర్వహించుకోవడానికి వీలులేని దయనీయ సామాజిక వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అందుకే అద్దె ఇంట్లో ఉండేవారు అంతిమ దశలో తమకంటూ సొంత గుడిసె అయినా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ తల్లి తన కుమారుణ్ణి ఊరు చివర చిన్న గుడిసె అయినా పరవాలేదు, సొంత ఇల్లు కట్టమని వేడుకుంది. దీంతో ఆమె కుమారుడు లోన్ తీసుకుని సొంతిల్లు కట్టి తల్లి భయాన్ని పోగొట్టాడు. కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనకయ్య, భార తమ్మ అనే రజక దంపతులు ఎన్నో ఏళ్ళుగా తమ చేతనైన పనిచేసుకొని బతుకుతున్నారు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి స్వప్న దివ్యాంగురాలు. ఒక కాలు పని చేయదు. రెండో అమ్మాయి సరితకు పెళ్ళయ్యింది. నిజానికి బసవయ్యకు పెళ్లయిన ఒక కుమారుడు ఉన్నా అతడు తొమ్మిదేళ్ల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. అప్పుడు కూడా అప్పటి అద్దె ఇంటి యజమాని ఇంటికి రానివ్వలేదు. ఇపుడు బసవరాజు కనకయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి మరణించాడు. ఆసుపత్రి యాజమాన్యం ఆయన బతికే అవకాశం లేదని, ఇంటికి తీసుకుపోతే బాగుంటుందని చెప్పింది. ఆ స్థితిలో ఉన్న కనకయ్యను ఇంటికి తీసుకుపోతే, ఇంటి యజమానులు రానీయలేదు. గత్యంతరం లేక కరీంనగర్ పట్టణంలోని శ్మశానంలోకి తీసుకెళ్ళారు. ప్రాణం ఉండగానే కనకయ్యను శ్మశానంలోకి తీసుకెళ్ళిన కుటుంబం ఆయన చావుకోసం ఎదురు చూసింది. ఒక రోజు తర్వాత కనకయ్య కన్నుమూశాడు. మరణానంతరం జరగాల్సిన కర్మకాండ అంతా ముగించుకొని మాత్రమే తిరిగిరావాలని ఇంటి యజమాని చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలతో మృతుని భార్య 14 రోజులు శ్మశానంలోనే గడిపింది. హైదరాబాద్‌లోని అపార్ట్మెంట్లలో ఎవరైనా అద్దెకు ఉండి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కాంపౌండ్ నుంచి శవాన్ని తీసివేయాలి. ఒకవేళ ఆసుపత్రిలో మరణిస్తే అటునుంచి అటే సొంత ఊరికైనా తీసుకెళ్ళాలి. లేదా నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి. కొన్ని గ్రామాల్లో మరొక వింత సాంప్రదాయం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, చికిత్స పొందుతూ మరణిస్తే, ఆ వ్యక్తి మృతదేహాన్ని రానివ్వని గ్రామాలు కూడా ఉన్నాయి. పది సంవత్సరాల క్రితం మంథని దగ్గర్లోని ఒక ఊరి ప్రజలు ఇట్లాగే ప్రవర్తిస్తే, పోలీసుల సహకారంతో ఆ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షిని. అదేవిధంగా తిరుపతి పట్టణంలో, దాని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్టు, జరుగుతున్నట్టు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలిసింది. విశాఖతో పాటు అనేక చోట్ల ఇంటి అద్దె కోసం వచ్చిన వాళ్ళను కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు ఉంటే ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. మనిషికి మరణం తథ్యమనీ, అది ఎప్పుడైనా, ఎవరికైనా రావొచ్చనీ తెలిసి కూడా మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది అర్థం కాని ప్రశ్న. దీనికి గాను నేను ఎవ్వరినీ నిందించడం లేదు. కానీ దీని గురించి ఆలో చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కొందరు పుట్టించిన సాంప్రదాయాలు కారణమవుతున్నాయని భావించక తప్పదు. ఇంట్లో ఒక మరణం జరిగితే, కొందరు పురోహి తుడిని సంప్రదిస్తుంటారు. ఇటీవల ఇటువంటి వారి సంఖ్య మరింత పెరిగింది. ఆ పురోహితుడు... వ్యక్తి ఏ ముహూర్తంలో చనిపోయాడో నిర్ణయించి దుర్ముహూర్తమైతే, దానికి శాంతి ఉపాయాలు సూచించి, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు మరణించిన ఇంటిని విడిచి పెట్టాలని సూచిస్తున్నారు. దీనిని చూసి ఇంటి యజమానులలో... తమ ఇంట్లో వేరే వాళ్ళ మరణం జరగరాదని, మృతదేహాన్ని ఇక్కడపెట్టరాదనే ఛాందస భావనలు కూడా బాగా పెరుగుతున్నాయి. తమ ఇంట్లో పెళ్లి జరగబోతున్న వారు సొంత బంధువుల అంత్యక్రియలకూ హాజరు కావడానికి ఇష్టపడటం లేదు. ఇట్లా మరణం చుట్టూ అల్లుకున్న ఈ ప్రవర్తన మన సమాజం డొల్లతనాన్ని చూపెడుతున్నది. నిజానికి మన రచనలలో, ప్రసంగాల్లో మృత దేహాన్ని పార్థివ దేహం అంటారు. అంటే పంచభూతాలతో నిండిన శరీరం జీవం పోవడం వల్ల... వాయువును, అగ్నిని, నీటిని, తన సహజ స్వభావాన్ని కోల్పోయి కేవలం మట్టిగా మిగిలిందని చెబుతారు. మట్టి మట్టిలో కలుస్తుంది. పంచ భూతాలతో నిండిన శరీరంలో మట్టి మిగిలినందున ఎంతో పవిత్రమైందిగా చూడాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం వింత సాంప్రదాయంగా భావించొచ్చు. కానీ చావును ఒక భయంకరమైన ఘటనగా చూపించి, దాని చుట్టూ ఒక మూఢనమ్మకాన్ని సృష్టించి, ఆ అంధ విశ్వాసాన్ని సమాజం అంతటా వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి మూఢ నమ్మకాలను తొలగించకుండా, సమాజంలో మానవత్వాన్ని నింపలేం. ఈ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తున్న వారే ముందుకు వచ్చి, ఇవి సరైనవి కావని చెప్పాలి. లేదా అవి శాస్త్రీయమైనవైతే వాటిని ఆధారాలను, శాస్త్రాలను బయటపెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆ పని చేయలేకపోతే, మానవత్వమున్న ప్రతి ఒక్కరం దీని మీద ఒక కార్యాచరణకు పూనుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయాలి. ఇంటి యజమానులు ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే, శిక్షించడానికి వీలుగా ఆ చట్టంలో సవరణలు చేసి, వాళ్ళను శిక్షార్హులుగా చేయాలి. దీని గురించి న్యాయనిపుణులు, ప్రజా ప్రతినిధులు ఆలోచిం చాలి. మన దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న పట్టణీకరణ, అద్దె ఇండ్ల సమస్యలను పెంచుతున్నది. కావున ఇది కోట్ల మంది సమస్య. రాజకీయ పార్టీలు, సంఘాలు మానవత్వంతో తమ పాత్రను నిర్వహించాల్సి ఉంది. (క్లిక్ చేయండి: 66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
కట్టుకథలు, అర్ధ సత్యాలు మాత్రమే!
అక్టోబర్ 21న మల్లెపల్లి లక్ష్మయ్య రాసిన ‘ఆ ప్రతిజ్ఞలే మార్గదర్శకాలు’ వ్యాసానికి ఇది స్పందన. గత అరవై ఏళ్లుగా నియోబుద్ధిస్ట్ లాబీ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ గురించి కట్టుకథలు, అర్ధసత్యాలు సృష్టించడంలో విజయం సాధించారు. అరుణ్ శౌరి (వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్) తప్ప ఎవరూ అంబేడ్కర్‌కు సంబంధించిన నిజానిజాలను వెలికితీసే విషయంలో ధైర్యం చేయలేకపోయారు. అంబేడ్కర్ ప్రతి మాటనూ అంబేడ్కర్‌వాదులూ, నియోబుద్ధిస్టులూ గుడ్డిగా సమర్థిస్తారు. అంబేడ్కర్‌పై చిన్న విమర్శను కూడా వారు సహించలేరు. వారికి మాత్రం హిందూ మతంపైనా, హిందూ దేవుళ్లపైనా విమర్శలు చేసే వాక్ స్వాతంత్య్రం ఉంది. అంబేడ్కర్ స్వయంగా తన రచనల్లో హిందూ మతం పైనా, బ్రాహ్మణులపైనా తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. 1956 అక్టోబర్ 14న అమాయక హిందువులను బౌద్ధ మతంలోకి మారుస్తూ దీక్ష ఇచ్చిన సమయంలో చేయించిన 22 ప్రతిజ్ఞల్లోనూ ఇదే విద్వేషం కనిపిస్తుంది. ఆరోజు అక్కడ చేరినవారందరూ తాము బౌద్ధంలోకి మారుతున్నామనే అనుకున్నారు. బౌద్ధంలో ఈ 22 ప్రతిజ్ఞలు లేవని వారెవరికీ తెలియదు. నిజానికి అంబేడ్కర్ బౌద్ధమతంలోకి మార్చే పేరుతో ఆయనే ఓ సొంత మతాన్ని ఆవిష్కరించారు. – డాక్టర్ పి. కృష్ణమోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్వీయూ -
66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!
అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది. 1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు. రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్‌కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్‌ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్‌లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు. అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి. అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్‌లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్‌లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్‌ను పెద్దగా బాధించలేదు. కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన అంబేడ్కర్‌ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్‌లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్‌లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్‌లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్‌లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్‌లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్‌ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్‌ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్‌లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్‌ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
చిహ్నమే కాదు, స్ఫూర్తీ ముఖ్యమే!
అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనికుడు. అశోకుడిది ఒక ఆదర్శవంతమైన పాలన. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశోకుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నాలను రూపొందించుకున్నామో, ఆ లక్ష్యాలను ప్రభుత్వాలు మరువకూడదు. ‘‘భారత జాతీయ జెండాలో గతంలో మనం వాడిన చరఖాకు బదులుగా చక్రాన్ని ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇది కేవలం ఒక గుర్తు కాదు. దీని వెనుక ఒక సామాజిక మార్పు, ఒక మహోన్నత వ్యక్తి దాగున్నారు. అతడే అశోకుడు. అశోకుడు భారతదేశ చక్రవర్తులలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప దార్శనిక చక్రవర్తి. భారత చరిత్రలో అశోకు డిది ఒక ఆదర్శవంతమైన పాలన. అది భారత చరిత్ర పైనే కాదు, ప్రపంచ చరిత్రపైనే గొప్ప ప్రభావాన్ని చూపింది. అది ఒక జాతీయ వాద చరిత్ర కాదు. అశోకుడు తన దూతలను, ప్రతినిధులను ప్రపంచంలోని అనేక దేశాలకు పంపించాడు. అయితే ఆయనది దురా క్రమణ కాంక్ష కాదు. శాంతి సందేశమే ఆయన ఆశయం.’’ జాతీయ పతాకంలో చేర్చాల్సిన ధర్మచక్రాన్ని గురించి 1947 జూలై 22న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలివి. మన జాతీయ పతాకంలో పొందుపరచిన ధర్మచక్రానికీ, సమ్రాట్ అశోకుడికీ ఉన్న సంబంధం ఏమిటో చాలామందికి తెలుసు. మన దేశ రాజముద్ర, అశోకుని స్తంభంలోని సింహాల చిత్రమని కూడా చాలా మంది ఎరిగినదే. అయితే, అవి ఎలా నిర్మించారు? ఎందుకు నిర్మిం చారు? వాటిని ఎవరు గుర్తించారు? అనే విషయాలు తెలియవు. ఈ తరానికి వాటి ప్రాముఖ్యత తెలియాల్సిన అవసరమున్నది. మన జాతీయ చిహ్నాన్ని కొద్దిరోజుల క్రితం నూతన పార్లమెంటు భవనంపై ప్రతిష్ఠించారు. ఇది మంచి నిర్ణయమే. అయితే ఆ సింహాల నిర్మాణం పైనే వివాదం చెలరేగింది. సౌమ్యంగా, ప్రశాంతంగా కనిపించే సింహా లకు బదులుగా వాటిని ఉగ్రరూపంలో నిర్మించారని పలువురు చరిత్ర కారులు ఆరోపించారు. ప్రతిపక్షాలూ విమర్శలను గుప్పించాయి. బ్రిటిష్ పాలకులు భారత దేశం వచ్చేవరకూ అశోకుని గురించి గానీ, బౌద్ధ చరిత్ర గానీ ప్రచారంలో లేదు. రాత ప్రతుల్లో, ముఖ్యంగా పాళీ భాషలో, సంస్కృత భాషలో బౌద్ధం గురించి వివరాలు ఉండేవి కానీ, ఇతర ఆధారాలు లేవు. 1818 సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్ జనరల్ హెన్సీ టైలర్ సాంచి స్థూపాన్నీ, దాని అవశేషాలనూ కనుగొన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి, అంటే 1881లో దానిని పదిలపరిచే పని మొదలైంది. 1919 కల్లా పూర్తయ్యింది. ఎప్పుడైతే సాంచిలో ఇటు బౌద్ధ శిల్పాలు, ఇతర అవశేషాలు బయటపడ్డాయో, బౌద్ధ చరిత్ర మీద, అశోకుని పాలన మీద అధ్యయనం జరపాలన్న ఆసక్తి బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తల్లో మొదలైంది. అంతకుముందే సారనాథ్ ప్రాంతంలో కూడా కొన్ని ఆశ్చర్యం గొలిపే శిలావిగ్రహాలు, ఇతర నిర్మాణాలను 1780లో విలియం హోడ్జెస్ అనే చిత్రకారుడు గుర్తించాడు. అక్కడ అతడొక స్థూపాన్ని చూశాడు. కానీ అది బౌద్ధ స్థూపం అని తెలియదు. ఆ తర్వాత 1794లో బెనారస్ కమిషనర్ జోనాధన్ డంకన్ కొన్ని తవ్వకాలు జరి పాడు. కొన్ని ఇటుకలు మాత్రమే అక్కడ దొరికాయి. అయితే 1861లో బ్రిటిష్ భారత పురాతత్వవేత్త లార్డ్ కన్నింగ్‌హామ్ ఆ స్థూపాన్ని సందర్శించి, తవ్వకాలను ముమ్మరం చేశాడు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఎఫ్.ఓర్టల్ ఆనాటి భారత పురాతత్వ సొసైటీ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్‌ను ఒప్పించి, 1904–05 సంవత్సరాల మధ్య కాలంలో చేపట్టిన తవ్వకాలలో స్థూపం స్వరూపం బయట పడింది. అందులోని అశోక స్తంభం, ఆ స్తంభంలోని సింహాలు, ఇతర చిహ్నాలు అన్నీ కలిపి భారత రాజముద్రను రూపొందించుకున్నాం. అశోకుని స్థూపంలో ఉన్న సింహాల భాగాన్ని భారత రాజ ముద్రగా 1947 డిసెంబర్ 29వ తేదీన ఆమోదించుకున్నాం. దానిని 1950, జనవరి 26 నుంచి అమలులోకి తెచ్చారు. ఇందులో నాలుగు దిక్కులా సింహాల బొమ్మలను విశ్వాసానికి, శక్తికి, ధైర్యానికి గుర్తు లుగా ప్రతిష్ఠించుకున్నాం. అంతే కాకుండా జాతీయ వృక్షంగా మర్రి చెట్టును నిర్ణయించుకున్నాం. ఇవన్నీ కూడా బౌద్ధ సాంప్రదాయంతో ముడివడి ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అశోక స్తంభ నిర్మాణం కమలం మీదనే జరిగింది. జాతీయ పక్షి నెమలి అశోకుని వంశానికి చిహ్నం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం, మన రాజముద్రలో ఉన్న సింహాలు బుద్ధుని ప్రతీకలుగా భావిస్తారు. ఆయన జన్మించినది శాక్య తెగ. అందుకే సిద్ధార్థుడిగా జన్మించి, గౌతమ బుద్ధునిగా మారిన బుద్ధున్ని శాక్య సింహంగా పిలుస్తారు. స్తంభం పైన నాలుగు సింహా లను ఉంచడమంటే నలుదిక్కులా ఆయన బోధనలను వ్యాప్తి చేయా లనీ, విస్తరించాలనీ అశోకుని ఉద్దేశ్యంగా చరిత్రకారులు భావిస్తారు. అందులో ఏనుగు ఆయన శక్తికీ, ఆయన జన్మ రహస్యానికీ చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా వృషభం ఆయన బలాన్ని సూచిస్తుంది. ఆయన ఇంటినుంచి మహాభినిష్క్రమణ రోజున బుద్ధుడు తీసుకెళ్ళిం దనడానికి సంకేతంగా గుర్రాన్ని భావిస్తున్నారు చరిత్రకారులు. అయితే మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత దాదాపు 84,000 బౌద్ధ నిర్మాణాలను చేపట్టినట్టు బౌద్ధ సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. అఫ్గానిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా, గౌహతి నుంచి కర్ణాటక దాకా భారతదేశమంతటా బౌద్ధాన్ని తన శాసనాల ద్వారా, స్థూపాలు, ఇతర నిర్మాణాల ద్వారా దశదిశలా వ్యాప్తి చేశాడు. అశోకుడు కనుక అటువంటి నిర్మాణాలను చేపట్టి ఉండకపోతే భారత దేశంలో బౌద్ధం పునరుజ్జీవనం పొందడం సాధ్యమయ్యేదే కాదు. బుద్ధుడు జన్మించిన ఈనాటి నేపాల్‌లోని లుంబిని, జ్ఞానోదయం పొందిన బోధ్ గయ, మొదటి బోధన చేసిన సారనాథ్, నిర్వాణం పొందిన కుశీ నగరం... ఈ రోజు ప్రపంచానికి అందు బాటులో ఉన్నాయంటే అది అశోకుడి దార్శనికత ఫలితమే. బౌద్ధ సాహిత్యంలోని ఈ విషయాలన్నింటినీ విదేశీ బౌద్ధ యాత్రికులు, ప్రత్యేకించి హ్యూయన్‌త్సాంగ్, పాహియాన్ లాంటి వాళ్లు తమ రచనల్లో పేర్కొన్నారు. బౌద్ధ చారిత్రక ప్రదేశాలను సంద ర్శించినట్టు; అక్కడ చైత్యాలు, విహారాలు, స్థూపాలు ఉన్నట్టు వారు రాశారు. ఆ వివరాలను పరిగణనలోనికి తీసుకొని బ్రిటిష్ పురాతత్వ చరిత్రకారులు తవ్వకాలు జరిపి బౌద్ధ చారిత్రక ఆధారాలను బయట పెట్టారు. ఇంకొక విషయం చెప్పాలి. అశోకుడు వేసిన చాలా శాసనాల్లో తన పేరు నేరుగా లేదు. ‘దేవానాం పియ’(దేవానం ప్రియ) అని మాత్రమే శాసనాల్లో ఉంది. అయితే 1840 సంవత్సరంలో శ్రీలంకలో టర్నల్ అనే రచయిత శ్రీలంక చరిత్ర మహాగ్రంథమైన ‘మహావంశ’లో అశోకుడే దేవానాం పియ అని అని గుర్తించాడు. అశోకుడు కేవలం కొన్ని చారిత్రక నిర్మాణాలకు మాత్రమే పరిమితం కాలేదు. అప్పటి వరకూ కొనసాగుతున్న యజ్ఞ, యాగా దుల హింస, ప్రత్యక్ష దోపిడీ నుంచి బుద్ధుని బోధనల ద్వారా సమాజాన్ని విముక్తం చేశారు. దానివల్ల వృత్తులు, పరిశ్రమలు, వ్యవ సాయం అభివృద్ధి చెందాయి. మూఢనమ్మకాలను వ్యాపింపజేసిన పురోహిత వర్గ ఆధిపత్యాన్ని అశోకుడు నిలువరింపజేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పురోహిత వర్గం అశోకుడి మీద ఎన్నో రూపాల్లో తప్పుడు ప్రచారాలు చేసింది. కానీ సత్యం జయిస్తుందనే గౌతమ బుద్ధుని ఉవాచ అశోకుడి విషయంలో రుజువైంది. భారత దేశా నికిæస్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం రాసుకున్న రాజ్యాంగం అశో కుని సంక్షేమ విలువలకు నిలువుటద్దం. భారత జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం, రాజముద్ర లాంటి అశోకుని గుర్తులు మన భారతావని భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. అయితే ప్రతిమలు, వాటి ప్రతిష్ఠలు మాత్రమే కాకుండా, ఎవరి స్ఫూర్తినైతే నింపుకోవాలన్న సదుద్దేశ్యంతో ఆ చిహ్నలను రూపొందించు కున్నామో, ఆ లక్ష్యాలను మరువకూడదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
దళిత ఉద్యమాలకు ఉగ్రరూపం
యాభై ఏళ్ల కింద మహారాష్ట్రలో మొదలైన ‘దళిత్ పాంథర్’ ఉద్యమ స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఇది ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. దళిత్ పాంథర్ వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు; దేశంలోని అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ స్పీకర్, మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూర్చున్నారు. చర్చలు సాగుతున్నాయి. అంతలో సందర్శకుల గ్యాలరీలో ఏదో అలజడి. ఇద్దరు యువకులు భాస్కర్ గవలి, నారాయణ్ మోరే సభలోకి అగ్నిగోళాలు విసిరారు. అగ్నిగోళాలు విసురుతుండగానే ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధిల్లాలి’ అంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. అగ్నిగోళాలు అంటే, కిరోసిన్‌లో ముంచిన గుడ్డతో చేసిన బంతులు. రాష్ట్ర మంత్రి శంకర్ రావు పాటిల్ రాజీనామ చేయాలని కూడా ఆ యువకులు నినదించారు. అంతేకాకుండా, దళితులకు ప్రత్యేక దేశం కావాలంటూ ప్రచురించిన కరపత్రాలను సభలోకి విసిరారు. ఇది 1972 జూన్ 12న మహారాష్ట్ర శాసనసభలో జరిగిన ఘటన. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో పొగబాంబులు వేసి నినదించిన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ల తర్వాత మళ్ళీ ఈ దళిత నాయకులే అటువంటి వీరోచితమైన పనికి పూనుకున్నారు. ఇది జరిగి యాభై సంవత్సరాలు గడిచాయి. ఈ సంఘట నకు ఒక సంస్థ ఆవిర్భావం ప్రధాన కారణం. దాని పేరే, ‘దళిత్ పాంథర్’! ఆ సంస్థ కేవలం మహారాష్ట్రలోనే కాదు, భారతదేశ ప్రజా ఉద్యమాల్లో, ప్రత్యేకించి దళిత ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది. అందుకే ఆ సంస్థ స్వర్ణోత్సవాలను దేశ వ్యాప్తంగా దళితులు ఒక ఉద్యమ స్ఫూర్తితో జరుపుకొంటున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన దళిత పాంథర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించే అవకాశం నాకు రావడం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. అంతకుమించిన గొప్ప అనుభవాన్నిచ్చింది. ఇద్దరు దళిత యువకులు మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిగోళాలు విసిరేంతటి సాహసానికి పూనుకోవడానికి రెండు దుస్సంఘటనలు కారణమయ్యాయి. ఒకటి, పుణే జిల్లాలోని బావ్డా గ్రామంలో దళితులను మిగతా కులాలన్నీ ఏకమై వెలివేశాయి. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్ రావు సోదరుడు శహాజిరావు పాటిల్ దీనికి నాయకత్వం వహించారు. రెండవది, పర్భని జిల్లా భాహారా గావ్‌లో ఒక అగ్రవర్ణానికి చెందిన బావి నుంచి ఇద్దరు దళిత మహిళలు నీళ్ళు తోడుకొని తాగుతున్నందుకు వారిని పట్టుకొని నగ్నంగా ఊరేగించారు. ఇది వారి గుండెల్ని మండించింది. ఈ సాహసం చేయడానికీ, దళిత పాంథర్ ఉద్యమం ప్రారంభం కావడానికీ ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులే కారణం. అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇలయపెరుమాళ్ కమిటీ నివేదిక దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న అత్యాచారాల వివరాలను 1969లో బయటపెట్టింది. 1965లో విచారణ ప్రారంభించిన కమిటీ 1969 జనవరి 30 నాడే నివేదికను పార్లమెంటుకు అందజేసింది. ఆ నివేదిక పార్లమెంటును కుదిపివేసింది. అందులో మహారాష్ట్రకు సంబంధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇవి యువకులనూ, రచయితలనూ బాగా కదిలించాయి. వీటికి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటనను నిర్మించాలనీ, ప్రభుత్వాలకు ఒక గుణపాఠం నేర్పాలనీ ఆ కార్యకర్తలు నిర్ణయించారు. ఈ ఉద్యమ ప్రయత్నంలో జేవీ పవార్, దయా పవార్, అర్జున్ డాంగ్లే, నామ్‌దేవ్ దసాల్, ప్రహ్లద్ చార త్వంకర్లను మొదటి వ్యక్తులుగా చెబుతున్నారు. ‘ముందుగా ఒక ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటున్నాం. దళితులపైన జరుగుతున్న దాడులనూ, దౌర్జన్యాలనూ వివరిస్తూనే, దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను, అన్యాయాలను ప్రభుత్వం అరికట్టకపోతే, చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’ అని ఆ ప్రకటన స్పష్టం చేసింది. దానిమీద రాజా ధాలే, నామ్‌దేవ్ దసాల్, అర్జున్ డాంగ్లే, భీంరావు షిర్వాలే, ఉమాకాంత్ రణధీర్, గంగాధర్ పంతాల్నే, వామన్ నింబల్కర్, మోరేశ్వర్ వహానే సంతకాలు చేశారు. ఆ విధంగా ప్రారంభమైన దళిత్ పాంథర్ ఉద్యమం 1972 నుంచి 1977 వరకు మరెన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ఇదే స్ఫూర్తితో అక్కడక్కడా అనేక దళిత పోరాటాలు సాగాయి. దారుణమైన నిర్బంధాన్నీ, అరెస్టులనూ ఈ ఉద్యమం ఎదుర్కొన్నది. అయితే వివిధ పద్ధతుల్లో దాడులనూ, దౌర్జన్యాలనూ ప్రతిఘటించి, దళితుల్లో ఒక భరోసాను నింపింది. ప్రభుత్వాలను తమ తప్పు తెలుసుకునేటట్టు చేయగలిగింది. కులతత్వాన్ని బోధించే హిందూ శక్తులను ప్రతి ఘటించింది. గ్రామాల్లో కులతత్వ దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొని, దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచింది. 1992 ఆగస్టు 12న ఎరగావ్లో ఒక దళిత రైతును దేవుడికి బలిచ్చిన దారుణమైన అకృత్యం జరిగింది. రామ్‌దాస్ నార్నవరె అనే దళిత రైతు ఎనిమిది ఎకరాల ఆసామిగా ఉండి, ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడడం కులతత్వ వాదులకు నచ్చలేదు. అతడిని అత్యంత దారుణంగా ముక్కు, చెవులు కోసి, గొంతు కోసి చంపేశారు. పోస్టు మార్టమ్, పోలీసు కేసు కూడా లేకుండా అతని దేహంతో పాటే ఈ దేశ దళితుడి ఆత్మగౌరవాన్ని భూమిలో పాతేశారు. ఇది తెలిసిన దళితులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తే, నిజాలు బట్టబయలయ్యాయి. అప్పుడు నిందితులను అరెస్టు చేయక తప్పలేదు. పుణే జిల్లా భంగావ్ గ్రామంలో 1973 సెప్టెంబర్ 17న దళిత్ పాంథర్స్ కార్యకర్తలు జరిపిన బహిరంగ సభ ఆ గ్రామంలోని దళితులను ఏకం చేసింది. రాజ్‌గురు తహశీల్‌లోని అస్థేడ్ గ్రామంలో దళిత రైతుకు చెందిన 30 ఎకరాల భూమిని సాగుచేయకుండా, తుపాకితో బెదిరించిన భూస్వామిని నిలదీసి ఆ భూమిని ఇప్పించారు. దళిత్ పాంథర్‌కు చెందిన 92 మంది యువకులు ప్రత్యక్షంగా గ్రామంలోకి వెళ్ళారు. వాళ్ళ మీద అగ్రకులాలు దాడిచేశాయి. వాళ్ళను ప్రతి ఘటించి విజయం సాధించారు. ఇట్లా ఎన్నో సంఘటనల్లో తమదైన మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించారు. ఒకానొక దశలో యావత్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యక్షంగా నిలబడి పోరాటం సాగించడం వల్ల దళితుల్లో ఒక విశ్వాసం ఏర్పడింది. అప్పటికి వివిధ పార్టీలలో ఉన్న దళిత నాయకులు నిర్లిప్తంగా ఉండడం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ స్థాపించిన భారత రిపబ్లికన్ పార్టీ నాయకత్వ అవకాశవాదాన్ని ఈ ఉద్యమం బహిర్గత పరిచింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో అంటకాగిన ఆర్పీఐ నాయకత్వం దళితులకు దూరమైంది. ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పుణే పర్యటనలో దళిత్ పాంథర్స్ ప్రతిఘటనల పిలుపుతో తన ప్రయాణాన్నే మార్చుకోవాల్సి వచ్చింది. దళిత్ పాంథర్ ఉద్యమం ఒక రకంగా నాటి కుల సమాజాన్నీ, దౌర్జన్య కాండనూ సవాల్ చేసింది. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలతో అంటకాగకుండా స్వతంత్ర మార్గంలో సాహసోపేతంగా ఉద్యమాన్ని నడిపింది. ఇది మహారాష్ట్రకే పరిమితం కాలేదు. గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడులలో అన్ని రాష్ట్రాల దళితుల మీద ప్రభావాన్ని కలిగించింది. దానితో పాటు, మరాఠా దళిత సాహిత్యాన్ని దేశానికే మార్గదర్శకంగా మలచడంలో ఈ ఉద్యమం పాత్ర మరువలేనిది. ఆ ప్రభావం ఇతర భాషల దళిత సాహిత్యం మీద కూడా పడింది. ఎంతో మంది దళిత రచయితలు రాసిన తమ స్వీయ చరిత్రలు నూతన సాహిత్య విలు వలకూ, ధోరణులకూ పునాదులు వేశాయి. గత యాభై ఏళ్ళలో దళితుల జీవితాల్లో మార్పు రాలేదని అనలేం. కానీ దాడులు, అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే, దళిత సమస్యలే అజెండాగా, రాజకీయ అవకాశ వాదంలేని ఒక స్వతంత్ర దళిత ఉద్యమం మళ్ళీ ఆరంభం కావాల్సిన సమయం ఆసన్నమైంది. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి
‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయం పాలనా వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ళ ప్రత్యేక మండళ్ళ అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.’’ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రాజ్యాంగ సభలో ఆదివాసీల తరఫున డిసెంబర్ 16, 1946న స్వయంగా ఆదివాసీ అయిన జైపాల్ సింగ్ ముండా మాట్లాడుతూ... ‘‘నా జాతి ప్రజలను ఆదివాసీయేతరులు నిరంతరం దోపిడీ చేయడం యావత్ దేశ చరిత్ర నిండా కనిపిస్తుంది. అయితే మనం ఈ రోజు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాలి. స్వతంత్ర భారతంలో నా ప్రజలు నిర్లక్ష్యానికి గురికాకుండా సమానత్వం కోసం కృషి చేయాలని రాజ్యాంగ సభనూ, ప్రత్యేకించి ఈ సభ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూనూ కోరుతున్నాను’’ అని అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆది వాసీల రక్షణకు అనేక ఏర్పాట్లు రాజ్యాంగంలో చేసిన విషయమూ తెలిసిందే. బాబూ రాజేంద్రప్రసాద్, జైపాల్ సింగ్ ముండాలు చేసిన వ్యాఖ్యానాలకూ, డిమాండ్లకూ ఈనాటికీ కాలం చెల్లలేదు. వాళ్ళు ఆశించిన వ్యవస్థ గానీ, పరిస్థితులు గానీ ఈనాటికీ ఆవిష్కృతం కాలేదు. 75 ఏళ్ళ స్వాతంత్య్రం గానీ, 72 ఏళ్ళ రాజ్యాంగ రక్షణ గానీ ఇంకా ఆదివాసులకు రావాల్సినంత స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రా టిక్ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ పేరును ప్రతిపాదించింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది పరిశీలకుల అభిప్రాయం. ద్రౌపదీ ముర్మూ సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ మహిళ. భారతదేశంలోని ఆదివాసీ తెగలలో సంతాల్ తెగ జనాభా రీత్యా మూడవ అతిపెద్ద తెగ. ఆదివాసీ తెగలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా అధికారంలో లేనందువల్ల అక్కడి ఆదివాసీ ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలుచు కోవడం ద్వారా రాష్ట్రపతి గెలుపును సులభతరం చేసుకోవచ్చునని బీజేపీ భావించి నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే కావచ్చు. అంతే కాకుండా ఆదివాసుల పట్ల తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందనీ, వారికి అనుకూలంగా ఉందని జాతీ యంగా, అంతర్జాతీయంగా చెప్పుకోవడానికి కూడా ద్రౌపదీ ముర్మూని ముందు భాగాన నిలిపి ఉండవచ్చు. అభిప్రాయాలేవైనా, కారణాలేమైనా ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేయడానికి బీజేపీ నిర్ణయించడం ఆహ్వానించదగినదే. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉండబోతోంది. ఎన్డీయే ఇప్పటికే ఒక ముస్లింను, ఒక దళితుడిని రాష్ట్రపతిగా అందించింది. అయితే ముస్లింనూ, దళితుడినీ మొదటిగా రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కావడం విశేషం. ఒక వ్యక్తిని ముఖ్యంగా అణగారిన వర్గాలు, నిర్లక్ష్యానికి గురైన వర్గాలనుంచి ఏదైనా ఒక ముఖ్యమైన స్థానంలో నియమించినా, నిలబెట్టి గెలిపించినా, దాని ప్రయోజనం ఆ వ్యక్తికే పరిమితం కాకూడదనేది ప్రజాస్వామిక సూత్రం. ఒక సమూహానికి ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తే ఆ వ్యక్తికే కాక ఆ సమూహానికీ ప్రయోజనం చేకూరాలి. ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతిగా గెలిపించాలనే బీజేపీ సంకల్పం కేవలం ద్రౌపదీ ముర్మూ వ్యక్తిగత హోదాను పెంచడం, దానితో రాజకీయ ప్రయోజనం సాధించడం వరకు ఆగిపోకూడదు. ఇప్పటివరకు నిర్లక్ష్యానికి, దోపిడీ, అణచివేతకు గురైన ఆదివాసుల పట్ల ఒక ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమే కాదు, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అప్పుడు మాత్రమే బీజేపీకి ఆదివాసుల పట్ల ప్రేమ ఉన్నట్లు అర్థం చేసుకోగలం. మిగతా సమాజంతో పోల్చి చూసినప్పుడు ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాల్లో వచ్చిన మార్పు చాలా స్వల్పమే. నిజం మాట్లాడాలంటే శూన్యమనే చెప్పాలి. భారతదేశంలో దాదాపు ఒక లక్షా 50 వేల గూడేలున్నాయి. అందులో చాలా గూడేలకు సరైన మౌలిక వసతులు లేవనే విషయాన్ని నవంబర్ 18, 2019న నాటి ఆదివాసీ శాఖా మంత్రి అర్జున్ ముండా లోక్‌సభకు తెలియచేశారు. ఇదే సందర్భంలో మరిన్ని వాస్తవాలనూ ఆయన తెలిపారు. భారత్‌లో మొత్తం గృహాలు 24 కోట్ల 66 లక్షల 92 వేల ఉండగా, ఆదివాసులవి 2 కోట్ల 33 లక్షల ఇళ్ళున్నట్లు, దాదాపు ఒక కోటి యాభై లక్షల ఇళ్ళు సరైన రీతిలో లేవని తెలిపారు. మరుగుదొడ్లు అతి స్వల్పంగా నిర్మాణ మయ్యాయి. 70 శాతం పిల్లలు 10వ తరగతి నుంచే చదువులు మానేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే అన్ని తరగతుల్లో కలిపి ఆదివాసీలు 6 శాతానికి మించి లేరు. ఇందులో 4వ తరగతి చిన్నా చితకా ఉద్యోగాలే అధికం. ఆదివాసులు ఎక్కువగా మలేరియా, క్షయ వ్యాధులతో మరణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో వంద మంది మలేరియా బారిన పడితే అందులో ఆదివాసులు 30 మంది ఉంటున్నారు. అదివాసీ జనాభాలో ఇది 50 శాతం. పిల్లలకు వ్యాక్సిన్ సదుపాయాలు అందలేకపోవడం వల్ల శిశు మరణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. దాదాపు 50 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. క్షయ వ్యాధితో సగటు మరణాలు లక్ష జనాభాకు 256 మరణాలు కాగా, ఆదివాసులలో అవి మూడింతలు అంటే 750కి పైగా ఉన్నాయి. వీటితోపాటు, ఇటీవల దేశాభివృద్ధి పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో వెలుస్తున్న మైనింగ్, రోడ్లు, పరిశ్రమలు, ఇతర ఆదివాసీయేతర వ్యక్తులు నెలకొల్పుతున్న సంస్థల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. (క్లిక్: ఆదివాసీ రాష్ట్రపతి కావడానికి ఇన్నేళ్లా?) ద్రౌపదీ ముర్మూను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, దాని నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆదివాసీల ప్రగతి, సంక్షేమం పట్ల, వారికి గౌరవంగా జీవించే హక్కును గ్యారంటీ చేసే విషయంలో శ్రద్ధ వహివంచక పోతే ఇది మరొక విఫల ప్రయోగం కాకతప్పదు. (క్లిక్: సిన్హా ఇప్పుడు ముర్మును అని ఏమి లాభం?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
రెండూ సామాజిక విప్లవ సిద్ధాంతాలే!
భారతదేశ సామాజిక నేపథ్యం నుంచి కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తులనాత్మకంగా పరిశీలించారు. బుద్ధుడినీ, మార్క్స్‌నూ ఒకేస్థాయిలో పోల్చారు. ప్రపంచ ఆవిర్భావంలో దేవుడి ప్రమేయాన్ని బౌద్ధం, మార్క్సిజం... రెండూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ ప్రపంచంలో ఏవీ శాశ్వతం కాదనీ, ఇవి నిత్యం మారుతుంటాయనీ బుద్ధుడు, మార్క్స్ ఇరువురూ చెప్పారు. దాన్ని మార్క్స్ గతి తర్కం అంటే, బుద్ధుడు అనిత్త (అనిత్య) అని పేర్కొన్నారు. ఇక సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. మార్క్స్‌తో అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృత్వాన్ని మాత్రం తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్. ‘ఆధునిక సోషలిజం, కమ్యూనిజంలకు కారల్ మార్క్స్ తండ్రి లాంటి వాడు. ఊహా జనిత సోషలిజాన్ని ఎండగట్టి ఆయన శాస్త్రీయ సోషలిజానికి పునా దులు వేశారు. పెట్టుబడిదారులతో పాటు, ఊహాజనిత సోషలిస్టులకు వ్యతిరేకంగా సిద్ధాంత పోరాటాలు చేశారు. ఈ రెండూ సమాజ ప్రమాదకారులేనని కారల్ మార్క్స్ తేల్చి చెప్పారు. అందుకే కారల్ మార్క్స్ సోషలిస్టు వ్యవస్థను శాస్త్రీయంగా నిర్వచించడంలో ఆద్యుడిగా నిలిచారు’’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ‘బుద్ధ లేదా కారల్ మార్క్స్’ రచనలో పేర్కొన్నారు. 1956 నవంబర్ 20వ తేదీన నేపాల్ లోని ఖాట్మండులో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో పాల్గొని ఇదే విషయమై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అంటే అంబేడ్కర్ మహాపరినిర్వాణం పొందడానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు ఈ సమావేశం జరిగింది. భారత దేశ చారిత్రక పరిస్థితులు, సామాజిక నేపథ్యం నుంచి ప్రపంచ శ్రామిక వర్గ మహానేత, కమ్యూనిస్టు వ్యవస్థ నిర్మాత కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసిన రచనగానీ, ప్రసంగం గానీ మరొకటి లేదని భావిస్తున్నాను. ‘కారల్ మార్క్స్, గౌతమ బుద్ధుని పోల్చి చూపడం చాలామందికి హాస్యాస్పదంగానే అనిపించవచ్చు. దీనికి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మార్క్స్‌కీ బుద్ధునికీ మధ్య 2,381 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. బుద్ధుడు జన్మించింది క్రీ.పూ.563 కాగా, మార్క్స్ పుట్టింది క్రీ.శ.1818 సంవత్సరం. బుద్ధుడినీ, మార్క్స్‌నూ ఒకే స్థాయిలో పోలు స్తుంటే, మార్క్సిస్టులకు అపహాస్యంగా అనిపిస్తుంటుంది. ఈ పోలిక చాలా తొందరపాటుగా భావిస్తుండవచ్చు. అయితే మార్క్సిస్టులు తమ అపోహలను పక్కన పెట్టి, కారల్‌మార్క్స్‌తో పాటు బుద్ధుని బోధనలనూ, బౌద్ధం ప్రాధాన్యతనూ అధ్యయనం చేస్తే వాళ్ళ ఆలో చనల్లో తప్పనిసరిగా మార్పు వస్తుంది’’ అంటూ బాబాసాహెబ్ తన రచనను మొదలు పెట్టారు. బౌద్ధాన్నీ, మార్క్సిజాన్నీ విడివిడిగా వివరించి, మళ్ళీ పోలికలను, వ్యత్యాసాలను విడదీసి చూపెట్టారు. వీటిని మూడు భాగాలుగా చూడవచ్చు. మొదటిది, తాత్విక విష యాలు, రెండవది, ఆర్థిక–సామాజిక అంశాలు. మూడవది, రాజ కీయ వ్యవస్థల నిర్మాణం. మొదటి అంశమైన తాత్వికతను చూస్తే, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో ఈ ప్రపంచ ఆవిర్భావం గురించి చెబుతూ, అందులో దేవుడి ప్రమేయాన్ని ఈ రెండు సిద్ధాంతాలూ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. మార్క్స్ మానవ పరిణామ క్రమాన్ని డార్విన్, ఇతర శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఉదహరిస్తే, అంతకన్నా 2,300 ఏళ్ళ క్రితమే, ఈ విశ్వం తనంతట తానే ఉద్భవించిందనీ, ఇందులో ఎటు వంటి అతీంద్రియ శక్తుల ప్రమేయం లేదనీ తన ‘అగ్గన్న సుత్త’ ప్రసంగంలో గౌతమ బుద్ధుడు పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఆవిర్భ వించడం గురించి తెలిపిన విషయం డార్విన్ సిద్ధాంతానికి పునాదిగా కనిపిస్తుంది. ఇక రెండో సామ్యం, ఈ ప్రపంచంలోని వస్తువులు ఏవీ కూడా శాశ్వతం కాదు అనేది. ఇవి నిత్యం మారుతుంటాయి. దీనిని మార్క్స్ గతి తర్కం అంటే, గౌతమ బుద్ధుడు అనిత్త(అనిత్య) అని పేర్కొన్నారు. అంటే అశాశ్వతం అని అర్థం. వస్తువుకు పుట్టుక, నాశనం ఉండదనీ, అది పాత రూపం మార్చుకొని, కొత్తదానిలోకి మారుతుందనీ మార్క్స్ భావం అభావం చెందడంగా భావిస్తే... బుద్ధుడు దానిని పునబ్బవ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరూ ప్రతి సంఘటనకు కార్యకారణ సంబంధముంటుందని తేల్చారు. బౌద్ధంలో దానిని ‘ప్రతీత్య సముత్పాద’ అంటారు. ఒక సంఘటన జరగడం ఏదో యాదృచ్ఛికం కాదనీ, దానికి కారణాలు ఉంటాయనీ భావం. అంటే సమాజాన్ని గతి తార్కిక దృష్టితో చూడటం అనేది రెండు సిద్ధాంతాలలోనూ ఉంది. సమాజంలోని కష్టాలకూ, సమస్యలకూ రెండు తాత్విక మార్గాలూ పరిష్కారాన్ని కనిపెట్టాయి. సమాజంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం బౌద్ధం అన్వేషిస్తే, పేదరికం... దానికి కారణమైన దోపిడీ, దాన్ని నిర్మూలించే మార్గాన్ని మార్క్సిజం చూపెట్టింది. ఈ రెండింటిలోనూ సొంత ఆస్తి అనేది ప్రధాన కారణంగా పనిచేసింది. అందుకే బౌద్ధ భిక్కులు ఎవ్వరూ కూడా ఆస్తులనే కాదు, అనవసర వస్తువులను కూడా కలిగి ఉండకూడదనే నిబంధనలు పెట్టారు. సొంత ఆస్తి వ్యవస్థ దోపిడీకీ, పేదరికానికీ కారణమనీ... అందువల్ల సొంత ఆస్తిని నిర్మూలించే కమ్యూన్లను ఏర్పాటు చేయాలనీ మార్క్స్ భావించారు. దానినే గౌతమ బుద్ధుడు బౌద్ధ సంఘాల ద్వారా ఒక నూతన వ్యవస్థను నిర్మించాలని ప్రతిపాదించారు. కమ్యూనిస్టు దేశాల్లో కమ్యూన్లు, సహకార వ్యవస్థలు ప్రజల సామాజిక అభి వృద్ధికి నేతృత్వం వహించాయి. ఆర్థిక, సామాజిక, నైతిక మద్దతును రైతులకూ, కార్మికులకూ అందించాయి. బౌద్ధ సంఘాలు, బౌద్ధారా మాలు కూడా ఆర్థిక సహాకార సంస్థలను నడిపాయి. దానికి సంబం ధించిన ఆధారాలు మనకు బౌద్ధ సాహిత్యంలో దర్శనమిస్తాయి. అయితే సమాజ మార్పునకు వర్గపోరాటాలే మార్గమని మార్క్సిజం భావిస్తే, బౌద్ధం మాత్రం అనివార్యమైతే తప్ప యుద్ధాలు వద్దని తేల్చిచెప్పింది. చాలా మంది బౌద్ధం అనగానే అహింసను ప్రబోధించే మానవ సిద్ధాంతంగా భావిస్తారు. కానీ బౌద్ధం న్యాయం కోసం, ప్రజల రక్షణ కోసం యుద్ధం చేయాల్సి వస్తే వెనుకాడకూడదని తేల్చి చెప్పింది. ఒకదేశ సేనాధిపతి సింహసేనాపతితో బుద్ధుడు జరిపిన సంభాషణలో ఈ విషయం తేల్చి చెప్పారు. ఇది అంగుత్తర నికాయలోని ‘సింహసేనాపతి సుత్తలో ఉంది. మార్క్సిజం లాగానే బౌద్ధం ఆనాటి వైరుధ్యాన్ని కనిపెట్టి మహా విప్లవాన్ని నడిపింది. యజ్ఞయాగాలలో సమాజాన్ని నిట్టనిలువునా దోపిడీ చేస్తూ, ఆనాటి సామాజిక ప్రగతికి అడ్డుగోడలుగా నిలిచిన పురోహిత, వైదిక వ్యవస్థను ఎదుర్కొని సామాజిక విప్లవాన్ని సాధించింది. అందుకే బౌద్ధం భారత దేశ తొలి సామాజిక విప్లవం. అదే విధంగా మార్క్సిజం ఆధునిక ప్రపంచ విప్లవ సిద్ధాంతం. అయితే అంబేడ్కర్ మార్క్సిజంతో తీవ్రంగా విభేదించిన అంశం ‘కార్మిక వర్గ నియంతృత్వ’ వ్యవస్థ. దీన్ని ప్రాథమికంగా మార్క్స్ నిర్వచిస్తే, దానిని రష్యా విప్లవనేత లెనిన్ ఆచరణలో చూపెట్టారు. మార్క్స్‌ని అన్ని విషయాల్లో ఏకీభవిస్తూనే, కార్మిక వర్గ నియంతృ త్వాన్ని మాత్రం చాలా తీవ్రంగా ఆక్షేపించారు అంబేడ్కర్. బౌద్ధం లోనే తన అభిప్రాయానికి పునాది ఉందని అంబేడ్కర్ పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు ఆనాటి మహాజనపదాల ప్రజాస్వామ్య విలువలను విశ్వసించాడనీ, వాటిని తన విధానంగా ప్రతిపాదించాడనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆనాటి కన్నా ఈనాడు సమాజం ఎంతో ముందుకు పోయిందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నియంతృత్వమైనా సరియైనది కాదనీ, అది ప్రజలను స్వేచ్ఛకు దూరం చేస్తుందనీ అంబే డ్కర్ భావించారు. మార్క్స్ సిద్ధాంతం ద్వారా ఆర్థిక సమానత్వం వస్తుందనీ, కానీ భారతదేశంలో అంతరాలకి ముఖ్యమైన కులవ్యవస్థ సృష్టించిన కుల వ్యత్యాసాలు సోదరత్వాన్ని అడ్డుకుంటున్నాయనీ అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఆ ఒక్క విషయం మినహా భారతదేశ విప్లవ సిద్ధాంతమైన బౌద్ధానికీ, మార్క్సిజానికీ చాలా సామ్యాలున్నాయని అంబేడ్కర్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలు సామాజిక, రాజకీయ ఆర్థిక సమానతల కోసం జరుపుతున్న పోరా టంలో బౌద్ధం, మార్క్సిజం సిద్ధాంతాల అవసరముందనే విషయాన్ని మనం గమనించాలి. మార్క్సిజం ప్రకారమే, ప్రతి దేశంలో ఉన్న చారిత్రక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాటికి అనుగుణంగానే చారి త్రక భౌతిక వాదాన్ని రూపొందించుకోవాలని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త మార్తా హర్నేకర్ అన్న మాటలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 (నేడు కారల్ మార్క్స్ జయంతి) -
ప్రజాస్వామ్యమే అంబేడ్కర్ భావసారం
బాబాసాహెబ్ అంబేడ్కర్ సాగించిన కార్యాచరణ మీద చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అనుభవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. ఆ అధ్యయనాన్ని అక్షరబద్ధం చేశాడు. ఆయన తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. ఆయన చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్సరాల రచనల్లో కొన్నిటినైనా చదవాలి. ‘భిక్షువులారా! శ్రావస్తిలో ఒకప్పుడు ఒక రోజు... పుట్టుకతో అంధులైన వారిని పిలిచి, ఒక ఏనుగును తెప్పించి, దానిని గుర్తుపట్టమనీ, అది ఏ ఆకారంలో ఉంటుందో చెప్పాలనీ ఆజ్ఞాపించారు. అయితే అంధులు ఒక్కొక్కరు ఏనుగులోని ఒక్కొక్క భాగాన్ని తడిమిచూసి తమ అభిప్రాయాలను వివరించారు. తలను పట్టుకున్న మొదటివాడు అది ఒక కుండలాగా ఉందన్నాడు. చెవి పట్టుకున్న వాడు అది చేటలా ఉందన్నాడు. దంతాన్ని తాకిన వాడు నాగలికర్రుగా అనుకున్నాడు. మరొకరు తొండం ఎడ్ల బండి కాడిలా ఉందన్నాడు. ఆఖరి వాడు తోకను ముట్టుకొని అది రోకలిలా ఉందని చెప్పాడు. వీళ్ళందరు ఏనుగు మొత్తాన్ని తాకలేదు. అది ఎట్లా ఉందో చెప్పలేకపోయారు. వాళ్ళు పుట్టుకతో అంధులు కావడం వల్ల అట్లా అనుకున్నారు. అయితే కండ్లు ఉండి, ధమ్మాన్ని (ధర్మాన్ని) సమగ్రంగా అర్థం చేసుకోలేక చాలా మంది తమకు ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకు ఏ ధర్మమైనా అర్థం కాదు. అందుకే ప్రతి చిన్న విషయానికీ వాదోపవాదాలకు రావడం, తమ అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రదర్శించడం చేస్తున్నారు. మీరు అలా చేయకూడదు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి’’ అంటూ గౌతమ బుద్ధుడు తన శిష్యులకు హితబోధ చేశారు. ఇది బౌద్ధ సాహిత్యంలో తిత్తియసుత్తలో ఉంది. ఆ తర్వాత ఇదే కథ జైన, హిందూ, సూఫీ సాహిత్యంలోకి వెళ్ళింది. చాలా మందికి ఈ కథ తెలుసు. ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళ గురించీ, వాదోపవాదాలు చేసే వాళ్ళను గురించీ ఈ కథ చెప్పడం వింటూంటాం. అయితే ఇక్కడ సందర్భమేమిటనే సందేహం రాక తప్పదు. భారత దేశ సామాజిక గతినీ, స్థితినీ తెలియజేసి, దానిని ఎలా మార్చాలో తన విస్తృతమైన అధ్యయనం ద్వారా తెలియజేసిన భారత సామాజిక విప్లవకారుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ విషయంలో ఇటీవల ఇదే జరుగుతున్నది. అంబేడ్కర్ తాత్విక చింతన, ఆయన సాగించిన కార్యాచరణ, జీవిత ఘట్టాలు, ఇట్లా అనేక విషయాలపై చాలామంది అసమగ్రమైన అధ్యయనంతో అసందర్భంగా మాట్లాడుతున్నారు. అయితే ఎవరినీ నిందించడం నా ఉద్దేశ్యం కాదు. కానీ దాని వల్ల అంబేడ్కర్ ప్రధానమైన తాత్విక చింతన, ఆయన సాగించిన సంఘర్షణాయుతమైన జీవన గమనం తప్పుగా అర్థం అవుతుంది. నిజానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ తాత్విక కేంద్ర బిందువులను అర్థం చేసుకుంటే, ఆయన మనకు అర్థం అవుతారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ దేశపు మూలస్తంభపు పునాదిని కనిపెట్టారు. అందు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అంబేడ్కర్‌ని మనం మేధావిగా చెప్పుకుంటాం. అయితే అది సాధ్యం కావడానికి ఆయన అనుభవం, ఆందోళన, ఆలోచన, అధ్యయనం, అక్షరం, ఆచరణలు ఒకదాని వెంట ఒకటి నడిచాయి. అంబేడ్కర్ ప్రతి విషయాన్నీ అను భవించి, ఆలోచించాడు. దానికి తగ్గట్టుగా అధ్యయనం సాగించాడు. అందుకు తగ్గట్టుగా అధ్యయనాన్ని అక్షరబద్దం చేశాడు. దానిని ఆచరణలో చూపెట్టాడు. తాత్విక వేత్తలు చెప్పినట్టుగా, ప్రపంచాన్ని చాలా మంది అధ్యయనం చేసి, వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ మార్చడమెలాగో చెప్పిన వాడే తాత్వికుడు. అటువంటి వాడే అంబేడ్కర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ తన కాలేజీ చదువు ముగించుకొని, కొలంబియాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. అక్కడ తన జీవిత అనుభవం ద్వారా ఏర్పడిన ఆందోళనను ఆలోచనలో పెట్టి అధ్యయనం సాగించాడు. అక్కడే తన దృక్పథాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో తీర్చిదిద్దుకున్నాడు. 1913 నుంచి 1917 వరకు అంబేడ్కర్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేసిన అధ్యయనం ఆయనను ఒక తాత్వికుడిగా తీర్చిదిద్దుకోవడానికి మంచి అవకాశా న్నిచ్చింది. దానికి ప్రధానమైన వ్యక్తి ఆయన గురువు ప్రొఫెసర్ జాన్ డ్యూయీ. పంతొమ్మిదవ, ఇరవైవ శతాబ్దాలలో అమెరికాలోని తాత్వికుల్లో జాన్ డ్యూయీ అగ్రగణ్యుడు. అటువంటి ఒక తాత్వికుడు అంబేడ్కర్‌కు గురువుగా దొరికాడు. జాన్ డ్యూయీ ప్రధానమైన పరి శోధన డెమోక్రసీ. ప్రజాస్వామ్య భావనను ఆధునికంగా ఆలోచించిన వాడు జాన్ డ్యూయీ. ప్రజాస్వామ్యాన్ని అబ్రహం లింకన్ సహా అనేక మంది పరిపాలనా సంబంధమైన విషయంగా వ్యాఖ్యానిస్తే, జాన్ మాత్రం దానిని ఒక సామాజిక అంశంగా, యావత్ సమాజానికి సంబంధించిన విషయంగా, మానవ సంబంధాలకు విస్తరింపజేశాడు. తన ‘ప్రజాస్వామ్యం – విద్య’ అనే పుస్తకంలో రాసిన విధంగా, ‘‘ప్రజాస్వామ్యం కేవలం పాలనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ప్రజల మధ్య, ప్రజల జీవనానికి సంబంధించినది. వారి మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించేది’’. అయితే అంబేడ్కర్ తన మొత్తం ప్రయాణంలో ప్రజాస్వామ్య తాత్విక పునాదిని అర్థం చేసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జాన్ డ్యూయీ నుంచి ప్రేరణ పొందా డనడానికి ‘కుల నిర్మూలన’లో వ్యక్త పరిచిన ప్రాథమిక అభిప్రాయమే నిదర్శనం. అంబేడ్కర్ ప్రజాస్వామ్యాన్ని అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా మలుచుకున్నాడు. అంబేడ్కర్ తన నలభై సంవత్సరాల చురుకైన ఉద్యమ జీవితంలో సాగించిన పరిశోధనలు, అమలు చేసిన కార్యాచరణలు దానినే బలపరుస్తున్నాయి. ఆయన 1916లో కులాల పుట్టుక అనే అంశంపై పరిశోధన చేసి, దానిని కుల నిర్మూలనలో ఒక లక్ష్యంగా చేసుకొని, బౌద్ధాన్ని స్వీకరించడం ద్వారా ఒక సామాజిక ప్రజాస్వామ్యంగా మనకు అందించారు. అదే విధంగా 1919లో సౌత్భరో కమిటీ ముందు ప్రభుత్వ నిర్వాహణలో ప్రజల భాగ స్వామ్యం ఉండాలనీ, అందులో అణిచివేతకు గురైన వర్గాలను ప్రత్యే కంగా గుర్తించి తగు ప్రాధాన్యత కల్పించాలనీ ప్రసంగించాడు. సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ల ద్వారా దానికి ఒక బలాన్ని చేకూర్చి 1950లో ఆమోదించిన రాజ్యాంగంలో అందుకు తగ్గట్టుగానే చట్టబద్ధత కల్పించాడు. ఇది రాజకీయ ప్రజాస్వామ్యం. అదేవిధంగా 1918లో మొట్టమొదటి ఎకనామిక్ జర్నల్‌లో ‘థియరీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్’ అనే వ్యాసంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిపై మార్గనిర్దేశనం చేశాడు. వ్యవసాయం మీదనే ప్రజలు ఆధారపడటం వల్ల ఆ వ్యవస్థ ఒత్తిడికి గురవుతోందనీ, తన 27వ ఏటనే దేశానికీ, ప్రపంచానికీ మార్గనిర్దేశనం చేశాడు. ఇదే విషయమై పరిశోధన సాగించిన సర్ ఆర్థర్ లూయీస్‌కు 1954లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అంటే దాదాపు 36 సంవత్సరాల ముందే అంబేడ్కర్ తన దార్శనికతను ప్రదర్శించాడు. అంతేకాకుండా, 1945లో తాను రాసిన ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న డాక్యుమెంటులో దేశంలోని వనరులను, ముఖ్యంగా భూమినీ, భారీ పరిశ్రమలనూ, బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థల వంటి వాటినీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచకూడదనీ, వాటిని జాతీయం చేయాలనీ ప్రతిపాదించాడు. అంబేడ్కర్ తన ఆదర్శ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని భూమికగా ఎంచుకొని, సమానత్వాన్ని సాధించాలని భావించాడు. అందుకే తాను చేసిన రచనలు, సాగించిన వాదనలు, ఉద్యమాలన్నీ అదే మార్గంలో ఉంటాయి. ఆయన సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రజాస్వా మ్యాన్ని మార్గంగా ఎంచుకున్నాడు. అందుకే ఆయన లక్ష్యాల్లో సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వం ముఖ్యమైనవి. వాటి సాధనకు మార్గం సుగమం చేసేదే ప్రజాస్వామ్యం. అందుకే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న ఆయన నలభై సంవత్స రాల రచనల్లో కొన్నిటినైనా మనం చదవాలి. ఆయన మూలసిద్ధాంత మైన ప్రజాస్వామ్య భావనను అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఆయుధ వ్యాపారమే అసలు ముద్దాయి
ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ల మధ్య సాగుతున్న యుద్ధానికి పైకి కనిపిస్తున్న కారణాలకు మించి మరోటున్నది. అమెరికా, మరికొన్ని ఇతర దేశాలూ చేస్తున్న ఆయుధ వ్యాపారమే ఇందుకు అసలు కారణం. ఉక్రెయిన్‌కి రష్యా బూచిని చూపించి, 2014 నుంచి ఇప్పటి వరకు అమెరికాతోపాటూ కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ వంటి దేశాలు ఉక్రెయిన్‌తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ఇవ్వాళ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వీటికి చిత్తశుద్ధి ఉంటే ఆయుధ వ్యాపారాన్ని ఆపాలి. ఆయుధ వ్యాపారం ఉన్నంత కాలం... ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ‘‘యుద్ధం ఒక పెద్ద వ్యాపారం. డబ్బు పెద్ద మొత్తంలో చేతులు మారుతుంటుంది. అంతే కాదు, యుద్ధం ద్వేషాన్నీ, భయాన్నీ, అపనమ్మకాన్నీ పెంచు తుంది. ఈ యుద్ధాల్లో ఎంతో మంది సైనికులు, సాధారణ ప్రజలు అనివార్యంగా అనేక విధాలైన బాధలకు; మానసిక, శారీరక గాయాలకు... చివరకు మృత్యువుకు బలవుతారు’’ అంటూ బ్రిటిష్ సంగీత విద్వాంసుడు జాన్ అండర్సన్ యుద్ధం గురించిన ఒక సజీవ సత్యాన్ని మన కళ్ళ ముందుంచారు. తన యుద్ధాలతో యూరప్‌ను గడగడ లాడించిన ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టి ‘యుద్ధం హంత కుల వ్యాపారం’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రాచరికాలు పోయాయి, నియంతృత్వాల స్థానంలో ప్రజాస్వామ్యం నెలకొన్నది. ఈ ఆధునిక యుగంలో యుద్ధం అవసరం మారిపోయింది. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు బ్రిటిష్ వ్యాపారులు భారత దేశంతో పాటు, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి డబ్బు, వ్యాపారంతో పాటు ఆయుధాలనూ నమ్ముకున్నారు. అయితే 1945ల తర్వాత, అంటే రెండవ ప్రపంచయుద్ధం అనంతరం చాలా దేశాలు బ్రిటిష్, ఫ్రెంచి, డచ్ తదితర సామ్రాజ్య వాద విస్తరణ వాదుల నుంచి విముక్తి పొంది, ప్రజాస్వామ్య ప్రభు త్వాలను ఏర్పరుచుకున్నాయి. ఇక ప్రపంచం శాంతియుతంగా సహ జీవనం సాగిస్తుందని అనుకున్నాం. కానీ యుద్ధాలు ఆగలేదు. గతంతో పోలిస్తే యుద్ధాలు తక్కువ జరిగినా ఆయుధ వ్యాపారం ఆగలేదు. ప్రపంచంలోని 36 దేశాలు మినహా మిగతా అన్ని దేశాలూ పెద్ద ఎత్తున సైన్యాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ చాలా చిన్న దేశాలు. కానీ మిగతా దేశాలన్నీ కూడా సైన్యాన్నీ, ఆయుధాలనూ వీలైతే అణ్వాయుధాలనూ కలిగి ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయవేదికలు, నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రజలు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు ఉన్న సమయంలోనూ యుద్ధాలు తప్పవా? వాస్తవానికి యుద్ధాలు లేని ప్రపంచాన్ని నిర్మించుకునేంత ప్రజాస్వామిక భావజాలం నెలకొని ఉన్నది. కానీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నిజానికి యుద్ధాలు జరుగుతున్నాయనడం కంటే యుద్ధాలు చేయిస్తున్నారు అనడం సబబుగా ఉంటుంది. ప్రస్తుతం మనం ప్రతిరోజూ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని, దాని పర్యవసానాలను చూస్తున్నాం. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. ఎంతోమంది ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయారు. చివరకు మన తెలుగు విద్యార్థులూ ఎంతో మంది నరకాన్ని అనుభవించారు. రష్యా – ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో పాత్రధారులుగా రష్యా, ఉక్రెయిన్లే కనిపిస్తున్నా... కని పించని కుట్రలు చేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా... ఈ యుద్ధంలో ప్రప్రథమ భాగస్వామి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అమెరికాతో సహా అనేక యూరప్ దేశాలూ ఈ యుద్ధంలో తమ వంతు మంటలు రాజేసినవే! ఈ యుద్ధానికి అసలు కారణం వ్యాపారం. ఎందుకంటే ఉక్రె యిన్‌కి రష్యా బూచిని చూపించి, అమెరికా తన ఆయుధ వ్యాపారాన్ని సమర్థంగా కొనసాగించుకుంటోంది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు అంట గట్టడంలో అమెరికా చాలాకాలంగా సఫలమౌతోంది. రష్యాతో ఉక్రె యిన్ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి అమెరికాతో పాటు అనేక దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడం పెరిగింది. 2014 నుంచి, ఇప్పటి వరకు కెనడా, చెక్ రిపబ్లిక్, పోలండ్, టర్కీ, యూఏఈ, బ్రిటన్ దేశాలు ఉక్రెయిన్‌తో ఆయుధాల వ్యాపారం చేస్తున్నాయి. ఇందులో అమెరికా భాగమే అధికం. 1993లో యుఎస్ఎస్ఆర్ నుంచి ఉక్రెయిన్ విడిపోయినప్పుడు ఆ దేశం రక్షణ బడ్జెట్ స్థూల జాతీయోత్పత్తిలో 0.35 శాతం. అంటే 0.12 బిలియన్ డాలర్లన్నమాట. 2014లో అది 3 బిలియన్ డాలర్లకు పెరిగి, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.25 శాతం వరకు పెరిగింది. అంటే దాదాపు 19 రెట్లు రక్షణ బడ్జెట్ పెంచుకోవాల్సి వచ్చింది. 2015 నాటికి 2.96 బిలియన్ డాలర్ల (జీడీపీలో 3.25 శాతం)కు చేరింది. 2019 వచ్చేసరికి ఈ కేటాయింపులు 5.23 బిలియన్ డాలర్ల (జీడీపీలో 4 శాతం)కు చేరుకున్నాయి. 2014 సంవత్సరంలో రష్యాతో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడం ప్రారంభమైంది. ఈ ఘర్షణల వల్ల 2014లో 28.6 శాతం ఉన్న ఉక్రెయిన్‌లోని పేదరికం 2016కి వచ్చేసరికి 58.6 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారిపోయింది. రెండేళ్ళ క్రితం ప్రపంచాన్ని చుట్టుముట్టిన కోవిడ్ కాలంలో ఎన్నో పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ ఆయుధ కర్మాగారాలు లాభాలు గడించాయి. స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో పనిచేస్తున్న స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న వంద అగ్రశ్రేణి కంపెనీలు అత్యధిక లాభాలను ఆర్జించినట్టు తెలియజేసింది. ఈ వంద కంపెనీల్లో అమెరికాకి చెందినవే 48 ఉన్నాయంటే అమెరికా ఆయుధ వ్యాపారం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రపంచంలో ఆయుధాలు ఎగుమతి చేస్తున్న పది అగ్రదేశాల్లో అమెరికాది అగ్రస్థానం. 2016–2020 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆయుధాల అమ్మకంలో అమెరికా భాగం 37 శాతంగా ఉంది. 20 శాతంతో రెండో స్థానంలో రష్యా ఉంది. 2011–15 వరకు అమెరికా భాగస్వామ్యం 32 శాతంగా మాత్రమే ఉండేది. 2011–2015 మధ్య రష్యా ఆయుధ వ్యాపార అమ్మకాలు 26 శాతంగా ఉండేవి. దీన్ని బట్టి ఆరు శాతం అమ్మకాలను రష్యా కోల్పోయింది. ఫ్రాన్స్ (8.2 శాతం), జర్మనీ (5.5 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించాయి. చైనా (5), బ్రిటన్ (6), స్పెయిన్ (7), ఇజ్రాయెల్ (8), దక్షిణ కొరియా(9), ఇటలీ (10) ఆయుధ వ్యాపారంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డబ్బుల్లో ఆయుధ వ్యాపారాన్ని లెక్కిస్తే, 2020లో ప్రపంచం మొత్తం ఆయుధాలు, రక్షణ మీద పెట్టిన ఖర్చు 1.951 ట్రిలియన్ డాలర్లు. ఇందులో అమెరికా ఒక్కటే చేసిన ఖర్చు 778 బిలియన్ డాలర్లు. ఖర్చులో చైనా 252 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. మనదేశం 72.9 బిలియన్ డాలర్ల ఖర్చుతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (61.7 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (59.2 బిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (57.5 బిలియన్ డాలర్లు), జపాన్ (49.1 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (45.7 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశమేమిటంటే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, రష్యా లాంటి దేశాలు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టి అంతకంతకు ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాయి. కానీ ఇండియా లాంటి పేదదేశం ఆయుధాలను కొనడానికి మాత్రమే లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆయుధాలను దిగుమతి చేసుకుంటోన్న దేశాల్లో సౌదీ అరేబియా, భారత్, ఈజిప్టు, ఆస్ట్రేలియా, చైనా, అల్జీరియా, దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ, పాకిస్తాన్‌లు వరుసగా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. అంటే అమెరికా యూరప్ దేశాలు తమ ఆయుధాల వ్యాపారానికి ఆసియాను కేంద్రంగా ఉప యోగించుకుంటున్నాయన్నమాట! యుద్ధం ఏదైనా అది లక్షలాది మంది ప్రజల ప్రాణాల హననం. కోట్లాది మందిని దిక్కులేని వారిగా తయారుచేసే దుర్మార్గ వ్యాపార వ్యసనం. యుద్ధం వద్దనుకుంటే ఆయుధ వ్యాపారం ఆగిపోవాలి. ఆయుధాల వ్యాపారం కొనసాగినంత కాలం ఏదో ఒక మూల యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉంటాయి. కాదు యుద్ధాన్ని రగిలిస్తూనే ఉంటారు. అందులో పేద దేశాల ప్రజలెప్పుడూ బలౌతూనే ఉంటారు. ఇదే ప్రతి యుద్ధం నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
సమానత్వం దిశగా ముందడుగు
భారత దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక మహత్తర విప్లవం. వేల సంవత్సరాలుగా ఉన్న అసమానతలకు రాజ్యాంగం చరమగీతం పాడింది. ప్రజలంతా సమానమేననీ, పౌరులందరూ సమానమైన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. అయితే ఇప్పటికీ దేవాలయాల్లో దళితులకు ప్రవేశం దొరకని సందర్భాలను చూస్తూనే ఉన్నాం. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే! వీటి విరుగుడుకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు. వాటికి అనుగుణంగానే తమిళనాడు ప్రభుత్వం, హిందువులుగా విశ్వాసం కలిగిన అన్ని కులాల వారికీ పూజారు లుగా ఉండే అవకాశం కల్పిస్తోంది. అంతకుమునుపే కేరళ ప్రభుత్వం ఈ బాటలో నడుస్తోంది. కులనిర్మూలనా ఉద్యమంలో ఇవి గొప్ప ముందడుగులు. ఒకే రకమైన నేరం చేసినప్పటికీ శిక్షలు కులాన్ని, వర్ణాన్ని బట్టి ఉంటాయని హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతర వ్యాఖ్యానాల ద్వారా ప్రజల మెదళ్ళలో తరతరాలుగా చొప్పించారు. అందుకే చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణులు దైవంతో సమానం కాబట్టి వారిని శిక్షించే అధికారం ఎవరికీ లేదు. క్షత్రియులు ఏది చేసినా రాజ్య రక్షణార్థమై చేస్తారు. అందువల్ల వాళ్ళు శిక్షార్హులు కాదు. వైశ్యులను మందలించాలి, శూద్రులను కఠినంగా శిక్షించాలన్న సూత్రాన్ని వేల సంవత్సరాలుగా ఘోషిస్తూ వస్తున్నారు. దానికి అడ్డు కట్టపడింది సరిగ్గా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే! భారత రాజ్యాంగం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజ లంతా సమానమేననీ, పౌరులందరూ సమానావకాశాలు, సమాన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక విప్లవం. గత రెండువేల సంవత్సరాలకు పైగా భారత దేశంలో ఉన్న ప్రజలను... వర్ణాలుగా, ఆ తర్వాత కులాలుగా విభజించి, ఒకరిపై మరొకరికి ఆధిపత్యం కల్పించి, పుట్టుక ద్వారానే కులం, కులం ద్వారానే గౌరవం, అధికారం కట్టబెట్టిన స్మృతులు, శ్రుతులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కాలం చెల్లిపోవడం సమాజానికి జరిగిన ఒక గొప్ప మేలు. రాజ్యాంగం అమలులోకి రావడం ఒక మహత్తరమైన సందర్భమే అయినా, దాని అమలు మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయితే భారత రాజ్యాంగం, దానిపై ఆధారపడి రూపొందించిన చట్టాలు మాత్రం అణగారిన ప్రజలకు ఒక భరోసానిచ్చాయి. రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఒకసారి మాట్లాడుతూ, ‘‘అది ఎంత మంచి రాజ్యాంగం అయినప్పటికీ, అమలు చేసేవాళ్ళకు చిత్తశుద్ధి లేకపోతే అది నిరర్థకమవుతుంది. ఒక వేళ రాజ్యాంగం చెడ్డదైనప్పటికీ, దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్లయితే, ఆ రాజ్యాంగమే తన స్వరూపాన్ని మార్చుకుంటుంది’’ అని ప్రభుత్వాల స్వభావాన్నీ, రాజ్యాంగం అమలు ప్రాధాన్యాన్నీ స్పష్టంగా విడమర్చి చెప్పారు. సరిగ్గా అదే విషయం తమిళనాడులో రుజువైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ శక్తిని నిరూపిస్తున్నాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ చిదంబరం నటరాజ దేవాలయంలో ఒక దళిత మహిళకు జరిగిన అవమానం పైన ప్రభుత్వం స్పందించి, ఇరవై మంది అర్చకులపై కేసును నమోదు చేసింది. చిదంబరం నటరాజ దేవాలయంలో ‘కనకసభ’ ప్రాంగణంలోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించిన లక్ష్మి అలియాస్ జయశీల అనే మహిళను పూజారులు అడ్డుకోవడం మాత్రమే కాకుండా, కులం పేరుతో దూషించారని ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం పూజారులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. గతంలో దేవాలయ ప్రవేశాలను నిరోధించిన సంఘటనల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు నిజమైన దోషు లను విడిచిపెట్టి, ఎవరెవరి మీదనో కేసులు పెట్టాయి. కానీ తమిళ నాడు ప్రభుత్వం దేవాలయాల మీద గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న అర్చక వర్గం పైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం సాహసోపేత నిర్ణయం. ఈ సాహసం చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది ప్రాథమిక హక్కులే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 – ఇలా ఎన్నెన్నో ఆర్టికల్స్ అసమానతల తొలగింపు లక్ష్యంగా నిర్దేశించుకున్నవి. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఈ ఆర్టికల్స్ అన్నింటి వెనుక ప్రజలందరికీ సమానమైన, గౌరవప్రదమైన జీవితాలను అందించాలనే ఏకైక లక్ష్యం ఇమిడి ఉంది. వాటి అమలు బాధ్యతను ప్రభుత్వాల చేతికి ఈ ఆర్టికల్స్ అప్పగించాయి. ఇప్పటికీ మన దేశంలోని చాలా గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. ఆధిపత్య కులాలు దేవాలయాలను దళితులకు దూరంగా ఉంచుతున్నాయి. అందువల్ల తమిళనాడు ప్రభుత్వం 2007 సంవత్సరంలో హిందువులుగా విశ్వాసం కలిగి, హిందూ దేవాల యాల్లో పూజలు చేసుకోవాలనుకున్న అన్ని కులాలకు పూజారులుగా ఉండే అవకాశం ఉన్నదని భావించి, అర్హతలను బట్టి వారిని ఎంపిక చేసి, శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కానీ కొంతమంది సనాతనవాదులు ఈ విషయమై కోర్టు కెక్కారు. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గొగోయ్, జస్టిస్ రమణ ఈ కేసును విచారించి, దేవాలయాల్లో పనిచేయడానికి అవసరమైన సిబ్బందిని, అర్చకవర్గాన్ని ఒక కులానికి మాత్రమే పరి మితం చేయకూడదనీ, హిందువులైన అందరూ హిందూ దేవాల యాల్లో అర్చకులుగా అర్హులేననీ, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సభ చర్చలను ఉదాహరిస్తూ, 2015 డిసెంబర్ 16న ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అయితే 2021లో తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే హిందూ దేవాలయాల్లో వివక్షకు తావు లేకుండా అర్హులైన అందరినీ అర్చకులుగా నియమిస్తామని తన ప్రణాళికలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 2021 ఆగస్టు 14న గతంలో శిక్షణ పొందిన అర్చకులను ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా దక్షిణాదిలో మరొక రాష్ట్రం కేరళ 2017 అక్టోబర్ 5వ తేదీన బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు రాష్ట్రాలు భారత రాజ్యాంగంలోని కీలకమైన సమాన హక్కుల అమలుకు ఒక కొత్త దారిని చూపాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై; వాటిని అమలు చేసిన డీఎంకే, సీపీఎం లపై విమర్శలు వచ్చాయి. కానీ అవి వాటిని పట్టించుకోకుండా, రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను అమలుచేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే అంబేడ్కర్ 1935 డిసెంబర్లో ‘కుల నిర్మూ లన’ పేరుతో ప్రసంగపాఠంలో చాలా విస్తృతంగా కుల సమస్యను గురించి చర్చించారు. ఒక రకంగా భారత దేశ సమాజ మార్పునకు ఈ పుస్తకం ఒక ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. కుల సమస్య సమసిపోవడానికి అడ్డంకిగా ఉన్న అంశాలను, పరిష్కారాలను ఎంతో సైద్ధాంతిక అనుభవంతో వివరించారు. కుల నిర్మూలన జరగాలంటే కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమే పనికిరావనీ, ముఖ్యంగా ప్రజల మెదళ్ళను కలుషితం చేసిన, చేస్తున్న ధర్మశాస్త్రాలను తిరస్క రించాలనీ, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనీ సూచించారు. అంతేకాకుండా హిందూ కులవ్యవస్థలో ఉన్న అసమానతలను తొల గించడానికి ఒక కార్యక్రమాన్ని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారు. అన్ని ధర్మశాస్త్రాలనూ పక్కన పెట్టి, హిందువులందరికీ ఆమోద యోగ్యంగా ఉండే ఒక గ్రం«థాన్ని రూపొందించాలని సూచించారు. ఒక కులానికే పరిమితమైన పూజారి వ్యవస్థను రద్దు చేయాలనీ, హిందూ మతం అవలంబిస్తోన్న అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలనీ ప్రతిపాదించారు. పూజారులు ప్రభుత్వోద్యోగులుగా ఉండాలనీ, ప్రభుత్వమే వారికి శిక్షణనిచ్చి నియమించాలనీ, ప్రభుత్వో ద్యోగులైన ఐసీఎస్(ఇప్పటి ఐఏఎస్) ఉద్యోగాల్లాగా ఒక పద్ధతి ప్రకారం నియామకాలు జరగాలనీ పేర్కొన్నారు. దానికి అనుగుణం గానే రాజ్యాంగంలో సమాన హక్కులు, అవకాశాలను పొందు పరి చారు. 1935లో అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశాలు ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు అమలులోకి తీసుకురావడానికి చేస్తున్న కృషి... కుల నిర్మూలనా మహోద్యమంలో ఒక ముందడుగు అని చెప్పక తప్పదు! వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
రెండు దేశాల భారత్
ఒకవైపు గిడ్డంగుల్లో ఆహారధాన్యాలు పుచ్చిపోతాయి. మరోవైపు పేద జనపు డొక్కలు తిండిలేక మాడిపోతాయి. ఒకవైపు సంపద పోగుపడి బిలియనీర్ల సంఖ్య ఎగబాకుతుంటుంది. ఆ పక్కనే మరికొన్ని కోట్ల పేదల ఆదాయం పడిపోయి, పేదరికం కూడా పెరిగిపోతుంటుంది. క్షీరసాగర మథనంలో కొందరికే అమృతం దక్కినట్టు స్వాతంత్య్ర ఫలాలు కూడా కొందరికే దక్కాయి. దేశం పేదది కాకపోయినా దేశంలో ఇంకా పేదవాళ్లున్నారు. విలువలకు పేరున్న దేశమైనా కులాల అసమానతలున్నాయి. అందుకే ఈ దేశంలోని వైవిధ్యాలనే కాదు, వైరుద్ధ్యాలనూ తరచి చూసుకోవాలి. జనాల మధ్య అంతరాలను తగ్గించడం ద్వారానే ఈ దేశాన్ని ఒక్కటిగా చేయగలం అని గుర్తించాలి. క్షీర సాగర మథనం. సముద్రం నుంచి అమృతాన్ని వెలికితీసేందుకు ఇటు రాక్షసులు, అటు దేవతలు రెండు వర్గాలు కలిసి శ్రమించి, మంధర పర్వతంతో సముద్రాన్ని మథిస్తారు. అందులోంచి అనేక విశిష్ట వస్తువులు, మనుషులు, జంతువులు, అనంతరం విషం, చిట్టచివరకు అమృతం వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన కథే కావొచ్చు. కానీ నేడు ఇదే అత్యంత సందర్భోచితమైన అంశం. ఏ అమృతం కోసమైతే ఇరు వర్గాలు సమంగా శ్రమించాయో, దాని ఫలితాలు మాత్రం ఇరు పక్షాలకీ సమంగా అందలేదు. చావును శాశ్వతంగా తరిమికొట్టే అమృ తాన్ని దేవతలు చేజిక్కించుకుని, మరొక వర్గానికి మత్తులో ముంచెత్తే సురాపానం అంటగట్టారు. దేవతలు కదా ఏం చేసినా చెల్లుతుంది. మరో వర్గం కూడా అంతే శ్రమించినప్పటికీ అసలు ఫలితం దక్కక పోవడం కథలోని సారాంశం. అమృతం అందుకున్న వర్గం మరింత శక్తితో తమ ఆధిపత్యాన్ని నిలుపుకొంటూనే వచ్చింది. మరొక వర్గం కాలక్రమేణా దాడులకూ, దౌర్జన్యాలకూ గురై క్షీణించింది లేదా అధికారగణం చేతిలో బానిసలుగా మారిపోయింది. అసలు విషయానికొద్దాం. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. మన భారత ప్రభుత్వం ఈ సంద ర్భాన్ని ‘అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవా లని నిర్ణయించింది. అందుకుగానూ గతేడాది మార్చి 12 నుంచి వచ్చే సంవత్సరం అంటే ఆగస్టు 15, 2023 వరకు ఈ ఉత్సవాలను నిర్వ హిస్తోంది. ఈ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర ప్రయాణంలో పాల్గొన్న ప్రజలందరికీ ఈ ఉత్సవాలను అంకితం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 75 ఏళ్ల ఉత్సవాలు కాబట్టి అమృత్ మహోత్సవ్ అనే పేరు పెట్టారు కానీ, సరిగ్గా సరిపోయింది అది. అమృతం కోసం సాగర మథనంలో పాల్గొన్న అందరికీ అమృతం అందనట్టే స్వాతంత్య్ర ఫలాలు సైతం కొందరికే దక్కాయన్న విషయానికి ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర పాలన మన దేశ ప్రజలకు అందించింది ఆకలి, పేదరికం, నిరుద్యోగం, అణచివేత. గత 75 ఏళ్ళలో జరిగిన ఆర్థికాభివృద్ధి, సమకూరిన సంపద, అతికొద్ది మంది సంపన్నుల, ఆధిపత్య వర్గాలకే వెళ్ళి పోయింది. సమాజంలో సంపద సమష్టిగానే వృద్ధి చెందుతుంది. కానీ ఫలితాలు అందరికీ అందడంలో మాత్రమే తేడా ఉంటుంది. మన దేశంలోని కేవలం వందమంది కోటీశ్వరులు 57 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కలిగివున్నారని గ్లోబల్ రిపోర్టు తెలియజేసింది. అంటే ఇది భారతదేశ రెండు సంవత్సరాల ఆర్థిక బడ్జెట్‌కు సమానమని గుర్తించాలి. అదేవిధంగా 50 శాతం మంది జనాభా కేవలం 6 శాతం సంపదను కలిగి ఉన్నారు. అంతేకాకుండా కేవలం ఒక సంవత్సరంలోనే, అది కూడా కోవిడ్ సమయంలోనే 102 మందిగా ఉన్న కోటీశ్వరులు(బిలియనీర్స్) 142కి పెరిగారు. మార్చి 2020 నుంచి, నవంబర్ 30, 2021 వరకు 23 లక్షల కోట్లు ఉన్న కోటీశ్వరుల సంపద 57.3 లక్షల కోట్లకు చేరినట్టు లెక్కలు చెబు తున్నాయి. అదే విధంగా కోవిడ్ సమయంలోనే ఇప్పటి వరకు ఉన్న పేదలకు అదనంగా, 4.6 కోట్ల మంది పేదరికంలోకి దిగజారి పోయారు. అదేవిధంగా భారత దేశానికి మరొక అవలక్షణం ఉన్నది. అదే కులం. భారత దేశంలో సమకూరిన సంపద కూడా కొన్ని కులాలకే పరిమితమైపోయింది. ఇదే విషయాన్ని నితిన్ కూర్ బర్తి అనే విద్యావేత్త, 1961 నుంచి 2021 వరకు చేసిన అధ్యయనంలో కులాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయనీ, మన దేశంలో ఉన్న ఆధిపత్య కులాలు ఆదాయంలోనూ ఖర్చులోనూ మిగిలిన కులాల కన్నా ముందు వరుసలో ఉన్నాయనీ తేల్చారు. ‘వెల్త్ ఇన్ ఈక్వాలిటీ క్లాస్ అండ్ కాస్ట్ ఇన్ ఇండియా – 1962–2021’ అన్న ఈ పరిశోధనా పత్రాన్ని ఆయన ప్యారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు 2018లో సమర్పించారు. 2011లోని ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా ప్రకారం, ఒక ఎస్సీ కుటుంబానికి ఒక సంవత్సర ఆదాయం 89 వేలు ఉంటే, ఎస్టీ కుటుంబ వార్షికాదాయం 75 వేలు ఉంది. అదే ఓబీసీల్లో ఇది ఒక లక్షా నాలుగు వేలు. ఇక ఆధిపత్య కులాల్లో ఇది లక్షా 64 వేలు అని నితిన్ తేల్చారు. అదేవిధంగా సంవత్సర ఖర్చు ఎస్సీల్లో 87 వేలు, ఎస్టీల్లో 72 వేలు, ఓబీసీల్లో లక్షా ఎనిమిదివేలు, అగ్రకులాల్లో లక్షా 46 వేలుగా ఆయన లెక్కలు గట్టారు. సాధారణ ప్రజల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు మనకు ఈ లెక్కలు చెబుతున్నాయి. వీటితో పని లేకుండానే ఏ గ్రామం వెళ్ళినా ఈ తేడాలు మనకు వీధుల్లో దర్శనమిస్తాయి. దళిత కుటుంబాల్లో, వారి ఇళ్లల్లో ఈ విషయాలు అత్యంత స్పష్టంగా మనం గమనించొచ్చు. ఇదే విషయం ఇటీవల మరొక సర్వేలో తేలింది. క్రానిక్ పావర్టీ రీసెర్చ్ సెంటర్ ద్వారా జరిగిన పరిశోధన ద్వారా ఇదే విషయం అక్షరసత్యమని రుజువయ్యింది. పేదరికం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వంగా కొందరికి మారిపోయిందని ఆ సంస్థ నిర్వహించిన సర్వే నిగ్గు తేల్చింది. ఇది భారత దేశానికే పరిమితమైన పరిణామంగా ఆ సంస్థ పేర్కొన్నది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలు, దళిత వాడలు, ఆ వర్గాలకు చెందిన ప్రజలు పేదలుగానే పుట్టి, పేదలు గానే మరణిస్తూ, తమ పిల్లలకు సైతం పేదరికాన్నే వారసత్వంగా ఇచ్చి వెళుతున్నారని ఈ పరిశోధన అభిప్రాయపడింది. ప్రపంచంలో వందమంది పేదలుంటే అందులో 28 మంది మనదేశంలోనే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆకలితో అలమటించే భారత దేశ ప్రజల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం 18 కోట్ల మంది ఇంకా సరిౖయెన ఆహారం కూడా అందని స్థితిలో బతుకులీడుస్తున్నారని 2020 నివేదికలో పేర్కొన్నారు. ఇంకా మహిళల్లో ఆకలి బాధ తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 15 నుంచి 49 ఏళ్ళ వయసు ఉన్న మహిళల్లో దాదాపు 51 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లల్లో 35 శాతం మంది సరిౖయెన ఎదుగదలను కలిగిలేరు. ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో మన ర్యాంకు 101 అని తేల్చారు. అయితే మన దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నదనుకుంటే పొరపాటే. బియ్యం, గోధుమల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. భారత రైతాంగం కష్టపడి పండించిన ఈ ధాన్యమంతా ఎఫ్‌సీఐ గోదాముల్లో పడి మూలుగుతోంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం, గడచిన ఐదేళ్ళలో 38 వేల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పుచ్చి, పురుగుల పాల య్యాయి. 2021 డిసెంబర్ నాటికి 213 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 378 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. కానీ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతావనిలో ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వరి, గోధుమల లాంటి ఆహారధాన్యాలు పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఆకలితో కాలే కడుపునకు పిడికెడు అన్నం లేదు. ఇది భారత దేశ అమృతోత్సవ సంబరాల సత్యాలు. భారత దేశంలో క్షీరసాగర మథనం లాంటి సంప్రదాయాలే మనకు ఆద ర్శాలు. ఒక వైపు సంపద, మరోవైపు పేదరికం, ఒకవైపు ఆహార ధాన్యాల నిల్వలు పుచ్చిపోతోన్న స్థితి, మరోవైపు ఆకలితో మలమల లాడే కడుపులు. ఇన్ని సాక్ష్యాలున్నా ఇంకా మనది సమైక్య భారతమని అందామా? ముమ్మాటికీ అనలేం. ఇది వైరుద్ధ్య భారతం. ఇక్కడ ఒక్క భారతం లేదు. ఇవి రెండు భారతాలు. ఇంకా చెప్పాలంటే మరెన్నో భారతాలు. నిజానికి ఈ దేశం పేదది కాదు. ప్రజలే పేదవాళ్ళు. ఈ వైరుద్ధ్యాలు ఇప్పటికైనా మనకు అర్థం కాకపోతే, పరిణామాలు ఎవ్వరూ ఊహించలేరు. అమృతోత్సవాలు జరపడం కాదు, అందరికీ అమృతం అందించే గుణం కావాలి. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
పంజాబీయులు మన సహోదరులు
దేశంలోని అన్ని రాష్ట్రాలూ దేనికవే ప్రత్యేకమైనవే అయినా, పంజాబ్ మరింత ప్రత్యేకమైనది. దేశ సరిహద్దులో ఉండటం వల్ల రక్షణ అనేది వారి రక్తంలో కలిసిపోయింది. దానికి సాక్ష్యంగా ఇప్పటికీ దేశ జనాభా ప్రాతిపదికన అత్యధిక శాతం మంది సైన్యంలో కొనసాగుతున్నది అక్కడి నుంచే. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఎందరో వీరులు ఇక్కడ ఉదయించారు. హరిత విప్లవం కాలంలో దేశానికి అన్నం గిన్నె అయింది ఈ రాష్ట్రమే. అలాగే ఇటీవలి రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపింది కూడా పంజాబీ రైతులే. అలాంటి వారిని ప్రధాని కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఆరోపిస్తూ కొంతమంది దేశద్రోహులుగా నిందిస్తున్నారు; ఇది తగని పని. అది వారి సమగ్రతను అనుమానించడమే. వారి త్యాగాల చరిత్రను అవమానించడమే. జనవరి 5వ తేదీన పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ జిల్లా సమీపంలోని పయరయన గ్రామం దగ్గర ఫ్లైఓవర్ పైన దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ నిలిచిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న వీరుల సమాధి హుస్సేనివాలా దగ్గర జరిగే సభలో పాల్గొనడానికి వెళుతున్న ప్రధానికి ఎదురైన ఈ ఘటన యావత్ దేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైతులు అడ్డుకోవడం వల్లనే ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్ళలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతాంగ ఉద్య మానికి సారథ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ఈ వాదనను ఖండించింది. ప్రధాని కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోలేదనీ, ఆ దారిలో ప్రధాని వస్తున్న విషయం కూడా రైతులకు తెలియదనీ కిసాన్ మోర్చా జనవరి 6వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ, నిరసనలు తెలియజేయాలని నిర్ణయించిన మాట నిజమనీ, జనవరి 2వ తేదీన గ్రామస్థాయిలో, 5వ తేదీన జిల్లా స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించాలనీ నిర్ణయించినట్టు కూడా ఆ ప్రకటన తెలిపింది. నల్ల చట్టాల రద్దుతో పాటు, ధాన్యపు మద్దతు ధర ప్రకటించాలనీ, రైతులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలనీ, ఇప్పటికీ జైళ్ళలో ఉన్న రైతాంగ నాయకులను విడుదల చేయాలనే డిమాండ్లతో ఈ నిరసనలు చేపట్టామనీ కిసాన్ మోర్చా వెల్లడించింది. కిసాన్ మోర్చా నుంచి వచ్చిన ప్రకటన వల్ల, కొన్ని పత్రికలు రాసిన కథనాల వల్ల రైతులకు నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకునే ఉద్దేశమే లేదని తెలుస్తున్నది. అయినా కొంతమంది అదేపనిగా ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకోవడం దేశ ద్రోహమనీ, వీళ్ళంతా జాతి వ్యతిరేకులనీ... ఇంకాస్త ముందుకు వెళ్ళి, సిక్కులు ఇతర దేశాలతో చేతులు కలిపి ప్రధాని పైన దాడి చేయాలనుకొన్నారనీ... ఇలా అనేక అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి పంజాబ్‌లోని రైతులు, ప్రత్యేకించి సిక్కులు బలమైన శక్తిగా నిలబడ్డారు. అందువల్లే కావొచ్చు, సిక్కుల పైన గతం నుంచీ కొంత మందికి ఉన్న విద్వేషాన్ని మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. సిక్కులు... ప్రత్యేకించి పంజాబ్ సిక్కులు మనం ఈ రోజు అనుకుంటున్న భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి బలిదానాలు చేశారు. ఈ రోజు మనం పిలుస్తున్న సిక్కు సంప్రదాయం, లేదా సిక్కు మతం ఆవిర్భవించిందే భారతదేశ రక్షణకు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశానికి పంజాబ్ పశ్చిమంగా ఉండి, నిత్యం దాడులకు, యుద్ధాలకు గురైంది. అయితే వందల ఏండ్లుగా సాగుతున్న విదేశీ దాడులను ఎదుర్కోవాలంటే కుల వ్యవస్థ వల్ల ఉన్న అనైక్యత ఉండకూడదనీ, మూఢనమ్మకాలు సమసి పోవాలనీ, వందల దేవుళ్ళ పేరుతో విభజనకు గురవడం సరికాదనీ గురునానక్ గుర్తించారు. విదేశీ దాడులను ఆపాలన్న ఉన్నత లక్ష్యంతో క్రీ.శ.1469లో గురు నానక్ ప్రారంభించిన సిక్కు సంప్రదాయదాన్ని, ఏడవ గురువైన గురుగోవింద్ సింగ్ ఒక శక్తిమంతమైన మతంగా అభివృద్ధి చేశారు. చదువు, యుద్ధ విద్య, క్రమశిక్షణ, సత్ప్రవర్తనలో కాగిన ఒక జీవన విధానాన్ని గురుగోవింద్ సింగ్ ప్రబోధించారు. వీరివల్లనే భారత దేశం విదేశీయుల దాడులను ప్రత్యేకించి మొఘల్ దాడులను, బ్రిటిష్ దాడులను ఎదుర్కోగలిగింది. శత్రువుల గుండెల్లో భయోత్పాతాన్ని సృష్టించిన సిక్కుల త్యాగా లను చరిత్ర సుస్థిరం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ కారుల్లో సిక్కుల పాత్ర చిరస్మరణీయం. ఉరికొయ్యల ఉయ్యాలలూగుతానని ప్రకటించిన నూనూగు మీసాల షాహీద్ భగత్ సింగ్ త్యాగం వెలకట్టలేనిది. భగత్‌సింగ్‌ను ఈ నేల ఏనాటికీ మరువజాలదు. లాల్, బాల్, పాల్ త్రయంలో లాల్‌గా పిలుచుకునే లాలా లజపతి రాయ్ పంజాబ్ బిడ్డనే విషయాన్ని మరువకూడదు. జలియన్ వాలా బాగ్ మారణకాండకు లండన్ వెళ్లి ప్రతీకారం తీర్చుకున్న ఉద్దండుడు ఉద్ధం సింగ్ సైతం ఈ గడ్డమీది వాడే. భారతదేశ విభజన సందర్భంగా వేలాదిమంది సిక్కులు మత కలహాలకు బలయ్యారు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గంలో పంజాబ్‌కు ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పిస్తామని చెప్పి, ఆనాటి నాయకులు ఇచ్చిన మాట మరిచిపోయారు. దాంతో 1980 ప్రాంతంలో ఖలిస్తాన్ ఉద్యమం బయలుదేరింది. అది క్రమంగా హింసారూపం దాల్చింది. ఎందరో సిక్కు యువకులు టెర్రరిస్టులుగా ముద్రపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ పగ, ప్రతీకారమే మన ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణాలను బలిగొన్నది. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది. అయినప్పటికీ పంజాబ్ ప్రజలు, రైతులు దేశ ఆర్థికాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశం ఎదుర్కొన్న సమస్యల్లో ప్రధానమై నది ఆహార కొరత. అందుకుగాను దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తులను పెంచాలని అప్పటి ప్రభుత్వాలు నూతన వ్యవసాయ విధానాలను ప్రకటించాయి. దానిపేరే సస్యవిప్లవం. అందులో మళ్ళీ మొదటి వరసలో నిలిచింది పంజాబ్, హరియాణా రైతులే. 1970 నాటికి దేశంలోని ఆహార అవసరాలలో 70 శాతం అందించిన రాష్ట్రం పంజాబ్ ప్రాంతమేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలుసు. ఒక రకంగా దేశాన్ని కాపాడింది పంజాబ్ మాత్రమే నంటే అనుమానం అక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు పంజాబ్, హరియాణా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అదేవిధంగా మొదటగా చెప్పినట్లుగానే, ఇప్పటికీ దేశ రక్షణ కర్తవ్య నిర్వహణలో పంజాబ్, హరియాణా ప్రజల, ప్రత్యేకించి సిక్కుల పాత్రను విస్మరించలేం. ఇటీవల పార్లమెంటులో ప్రకటించిన సైన్యం వివరాల ప్రకారం మొత్తం దేశ సైన్యం 11 లక్షల 51 వేలు. ఇందులో 89, 088 మంది పంజాబీయులే. ఇది మొత్తం సైన్యంలో 7.7 శాతం. దేశ జనాభాలో పంజాబ్ జనాభా 2.3 శాతం. అంటే జనాభా దామాషా కన్నా 5.4 శాతం అధికంగా పంజాబీలు సైన్యంలో ఉన్నారు. సైన్యంలో పంజాబ్‌ది రెండోస్థానం. ఉత్తరప్రదేశ్‌ది మొదటిస్థానం. ఉత్తరప్రదేశ్ నుంచి సైన్యంలో ఉన్నవారు 1,67,000. కానీ దాని జనాభా దేశంలో 16.5 శాతం కాగా, సైన్యంలో వారు ఉన్నది 14.5 శాతం. అంటే జనాభా ప్రాతిపదికన 2 శాతం తక్కువ. అదేవిధంగా హరియాణా నుంచి సైన్యంలో ఉన్నవారి సంఖ్య 65, 978. కాగా దేశా జనాభాలో వారిది 2.09 శాతం. అయినా సైన్యంలో ఉన్నవాళ్లు 5.7 శాతం. అంటే దాదాపు మూడున్నర శాతం అధికం. పంజాబ్, హరి యాణాల్లో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారనే విషయాన్ని మరవద్దు. దేశ ఆర్థికాభివృద్ధిలో, దేశ రక్షణలో, దేశభక్తిలో పంజాబ్‌ది అగ్ర భాగం. అటువంటి దేశభక్తి నరనరాన నింపుకున్న పంజాబ్ ప్రజలను, దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ రైతులను దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకశక్తులుగా ముద్ర వేయడం ఎంత మాత్రం విజ్ఞత అనిపించు కోదు. ప్రధాని కాన్వాయ్ నిలచిపోవడం విషయంపై విచారణ జర గాలి. నిజాలను రాబట్టాలి. అది పోలీసుల పని. కానీ పంజాబ్ రైతులు ఎందుకు ఇంకా ఆగ్రహంతో ఉన్నారో తెలుసుకొని, పరిష్కారాలను కనిపెట్టడం రాజనీతిజ్ఞుల కర్తవ్యం. పాలకులు ప్రజాస్వామ్యయు తంగా ఆలోచించగలగాలి. ఇప్పటికే విద్వేషాలు, వివక్షలు ఎన్నో ప్రతి కూల ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికైనా రాజనీతిజ్ఞతతో వ్యవహరి స్తారో, ప్రజల ఆశలను అడియాసలు చేసి దోషులుగా మిగిలిపోతారో తేల్చుకోవాల్సిందే పాలకులే. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!
ఎన్నిసార్లు మాట్లాడినా ఎంతోకొంత మిగిలిపోయే అంశం – కుల వివక్ష. అది దేశమంతా వేళ్లూనుకుని ఉన్న జాడ్యం. దాన్ని తెగ నరకాలంటే ఆధిపత్య కులాలు తమ ధోరణిని పరిశీలించుకోవాలి. అణిచివేతకు గురయ్యే వాళ్లు ప్రశ్ననే అస్త్రంగా మలుచుకోవాలి. అలా ఎక్కుపెట్టిన ఒక ప్రశ్నారూపమే ‘జై భీమ్’. అయితే విమర్శకులనూ, ప్రేక్షకులనూ ఏకరీతిలో స్పందింపజేసిన ఈ సినిమా తమిళనాడులోని ఒక వర్గాన్ని మాత్రం ఆగ్రహానికి గురిచేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రం మీద రాజకీయంగా శక్తిమంతులైన వణ్ణియర్ల కుల సంఘం లేవనెత్తిన అభ్యంతరాల వల్ల... ఆదివాసీ ఇరుళ తెగ, ఇంకా అలాంటి సామాజిక వెలివేతకు గురవుతున్నవారి జీవితం గురించి చేయాల్సిన ఆలోచన పక్కదారి పడుతోంది. అది కీరపాక్కం గ్రామం. తమిళనాడులోని చెంగల్పట్ జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊరికి దగ్గర ఒక గుడిసెల సముదాయం. గుడిసెలపై కప్పి ఉన్న పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ పేపర్లు వాళ్ళ కటిక దారిద్య్రాన్ని విప్పి చెబుతున్నాయి. ఆ ఇళ్ళల్లోని ఒక ఇంట్లో నాగమ్మ అనే యాభై ఐదేళ్ళ మహిళ ఉంటున్నది. ఆ గూడెం ఊరిలో భాగం కాదు. అక్కడికి వెళ్ళ డానికి రోడ్డు పెద్ద మాట, ఎటువంటి దారీ తెన్నూ లేని వారి జీవితంలానే ఉంటుంది తొవ్వ. ఒక రోజు కొందరు వ్యక్తులు ఏడుపులు, పెడబొబ్బలతో ఒక మనిషిని మోసుకొచ్చారు. ఆ వ్యక్తి చావుకు దగ్గరవుతున్నట్టు వాళ్ళ ఏడుపులని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ గుంపు నాగమ్మ గుడిసె ముందు ఆగింది. నాగమ్మకు వెంటనే విషయం అర్థమైంది. మోసు కొచ్చిన వ్యక్తిని పట్టుకొని చూసింది. పాము కాటు వేసినట్టు గమనించింది. దగ్గర్లో ఉన్న పొదల్లోకి వెళ్ళి ఆకులను తీసుకొచ్చింది. తన వద్ద ఉన్న కొన్ని వేళ్ళు, బెరడులు, ఆకుల్ని కలిపి నూరింది. పసరు పాము కాటు వేసిన చోట పిండింది. నూరిన ముద్దను గాయంపైన కట్టింది. అట్లా రెండు మూడుసార్లు చేసిన తర్వాత ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. ఈ వైద్యం చేసింది తమిళనాడులోని ఇరుళ ఆదివాసీ తెగకు చెందిన మహిళ. తమిళనాడులో ఉన్న ప్రాచీన ఆదివాసీ తెగలలో ఇది ఒకటి. తమిళనాడులో ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో రాణిస్తున్న సూర్య తీసిన ‘జై భీం’ చిత్రం ఇటీవల ఒక సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మానవత్వం ఉన్న ప్రతి మనిషీ ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఆ సినిమాలో ఒక ఆదివాసీ వ్యక్తిపై, దొంగతనం నేరం మోపి, పోలీ సులు చిత్రహింసలు పెట్టి చంపేశారు. అయితే ఇది కథ కాదు. నిజంగా జరిగింది. ఆ వ్యక్తి పేరు రాజాకన్నన్. ఆయన ఇరుళ తెగకు చెందిన వాడు. జై భీం చిత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కూడా తయారయ్యింది. కోడిగుడ్డుపైన ఈకలు పీకినట్టు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు, పేర్లు తమ ప్రతిష్టను దెబ్బతీశాయనీ, ఐదు కోట్ల పరువునష్టం చెల్లించాలనీ కోర్టును ఆశ్ర యించారు. వాళ్ళే వణ్ణియర్ కుల సంఘం పెద్దలు. ఆ కుల సంఘానికి మరో పేరు పీఎంకే. పాట్టాళి మక్కళ్ కట్చి. దాని నాయకుడు ఎస్. రామదాసు. ఆయన కూడా ఈ చిత్రంపైన విరుచుకుపడ్డారు. వణ్ణియర్ కుల ప్రతిష్టకూ ఈ చిత్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? నిజానికి దీనిని ఎవ్వరూ అంతగా గమనించలేదు. సినిమాలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన పేరు సినిమాలో గురుమూర్తి. ఆ పేరు పెట్టడమే వాళ్ళ తొలి అభ్యంతరం. గురుమూర్తి అనే పేరు వాళ్ల ఒక నాయకుడిని గుర్తు చేస్తుందన్నది వాళ్ళ వాదన. అయితే వాళ్ళ నాయకుడి పేరు జె.గురు. ఆ ఇన్స్పెక్టర్ క్రూరంగా ప్రవర్తిస్తాడు. అందువల్ల తమ నాయకుడి జ్ఞాపకాలు వస్తాయని ఆ సంఘం ఆరోపణ. జె. గురు అనే నాయకుడు రెండుసార్లు శాసనసభ్యుడు. అరియాబారు జిల్లా, జయకొండు నియోజకవర్గం నుంచి పీఏంకే నుంచి ఎన్నికయ్యారు. ఆయనది వణ్ణియర్ సంఘంలో కీలక భూమిక. వీళ్లు ఉత్తర తమిళనాడులో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గం. జె.గురు అనే వ్యక్తి పదుల కొద్దీ దాడుల్లో పాల్గొన్నాడనడానికి ఆయన మీద నమోదైన కేసులే సాక్ష్యం. ఈ చిత్రంపై వణ్ణియర్ సంఘం చేసిన రెండో ఆరోపణ... సిని మాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గురుమూర్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనుక ఒక క్యాలెండర్ ఉందనీ, అందులో తమ కుల చిహ్నమైన కలశం ఉన్నదనీ (దీన్ని ఇటీవల సినిమా నుంచి తొలగించారు). నిజా నికి ఈ రెండు విషయాలను ప్రేక్షకులను గమనించనే లేదు. కానీ ఈ సంఘం ఈ చిత్రాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అంటే అందుకు తమిళనాడు కుల చరిత్రను తడిమి చూడాల్సిందే. తమిళనాడులో జరుగుతున్న కుల ఘర్షణలు, దళితుల, ఆదివాసులపైన దాడులు చాలా కిరాతకంగా ఉంటున్నాయి. ఉత్తర తమిళనాడులో వణ్ణియర్లు సామాజిక, రాజకీయ ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వణ్ణియర్లు అధికంగా ఉన్నచోటే ఇరుళ ఆదివాసీ తెగ కూడా ఉంది. ఇరులు అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగ. ఈ తెగ దేశానికీ, సమాజానికీ ఎంతో మేలు చేసిన విషయం ఎవరికీ తెలియదు. పాము కాటుకు విరుగుడు ఇంజెక్షన్ తయారు చేయడానికి ప్రాథమికమైన ముడిపదార్థం పాము విషం. పామును పట్టుకొని, ప్రాణాలకు తెగించి పాము కోరల నుంచి పాము విషాన్ని తీసి ఇస్తే, దానిని వివిధ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేసి, విషం విరుగుడు ఇంజక్షన్ తయారు చేస్తారు. అంతేకాకుండా, ఈ తెగ గొప్ప వైద్య సాంప్రదాయాన్ని ప్రకృతి నుంచి పుణికి పుచ్చుకుంది. దాదాపు 300 రకాల మందులను తయారు చేసే జ్ఞానం వీరి సొంతం. అయితే ఇప్పటికీ వీరు గ్రామాల్లో నివాసముండరు. నూటికి తొంభై మందికి చదువులేదు. సరైన జీతాలు లేని పద్ధతుల్లో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో పని చేస్తున్నారు. ఇవన్నీ పోను గ్రామాల్లో ఎక్కడ దొంగతనమైనా ముందు ఇరుళ సామాజిక వర్గం వారిని పట్టుకొచ్చి, హింసించడం తమిళనాడులో పాతుకు పోయిన కులాధిపత్యానికి తార్కాణం. ప్రతి సంవత్సరం కొన్ని వందల కేసులు వీళ్ళ మీద నమోదవుతుంటాయి. మగ వాళ్ళ కోసం వచ్చిన పోలీసులు మహిళలను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అత్యా చారాలు జరిపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది జై భీం సినిమాలో కూడా చూశాం. ఇరుళ ఆదివాసీ హక్కుల సంఘాలు ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఒకవైపు పోలీసులు, రెండో వైపు పల్లెల్లోని ఆధిపత్య కులాలు ఇరుళ తెగ ప్రజలను పెడుతున్న హింస చెప్పనలవి కానిది. వణ్ణియర్ సంఘం నాయకులు ఎటువంటి భయ సంకోచాలు లేకుండా, చట్టాలను, రాజ్యాంగాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పదేళ్ళ క్రితమే పీఏంకే అధ్యక్షుడు రామదాసు ‘కులాంతర వివాహాలను జరగనివ్వం. ఎవరైనా వణ్ణియర్ కులం పిల్లలతో సంబంధాలు పెట్టుకుంటే తగిన శిక్ష అనుభవిస్తారు’ అని ప్రకటించారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ పదవ తేదీన ఇరుళ తెగకు చెందిన రమేష్, వణ్ణియర్ కులానికి చెందిన మోహన ప్రేమ వివాహం చేసుకున్నారు. ధర్మపురి జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి, అబ్బాయి తల్లిదండ్రులను పట్టుకొని ఊరికి తీసుకొచ్చి, అబ్బాయి తండ్రిమీద ఆ ఊరిలోని ఆ కులపోళ్ళు బహిరంగంగా మూత్రం పోసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ధర్మపురి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంటే జై భీం చిత్రంలో మనం చూసింది ఒక్క ఘటన మాత్రమే. ఈ చిత్రం వల్ల తాము చేసిన ఎన్నో దురంతాలు ప్రజల మెదళ్లలోకి వెళతాయని భయపడిన కులోన్మాదులు ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. నిజానికి తమిళనాడులో పంటలను దెబ్బతీస్తున్న ఎలుకలను, గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు హానికరంగా మారిన పాములను పట్టుకొని తరతరాలుగా రైతులకు మిత్రులుగా ఉన్న ఇరుళ తెగ మీద జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు కుల మతోన్మాదాన్ని తుదముట్టించాలి. మానవీయతకు ప్రాణం పోయాలని తపిస్తున్న వాళ్లంతా మరొక్కసారి దళితులు, ఆదివాసీలు ఈ దేశానికీ, సమాజానికీ చేసిన నిస్వార్థమైన సేవలను, అని తరసాధ్యమైన త్యాగాలను గుర్తించాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
జ్ఞానమనే వెలుగుకు ప్రతిరూపమైన పండుగ
దీపావళి అంటే దీపాల వరుస. పల్లె పట్నం తేడా లేకుండా ప్రతి చోటా, ప్రతి ఇంటా, తమ తాహతకు తగ్గట్టుగా దీపాలను వెలిగిస్తారు. ప్రతి పండుగకు ఒక కథ ఉంటుంది. ఈ పండుగకు కూడా ఒక కథ ఉంది. నరకాసు రుడు అనే రాక్షసుడు వేల మంది మహిళలను చెరబట్టాడనీ, ఇంద్రుని రాజధానిపైన దండెత్తాడనీ, విష్ణువు కృష్ణుడి అవతారమెత్తి నరకాసురుడిని చంపాడనీ, అందుకే దీపావళిని చేస్తున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. నరకాసురుడే కాదు, ఎవరైనా ఇంద్రుణ్ణి జయించినా, జయించడానికి ప్రయత్నించినా, విష్ణువును ప్రతిఘ టించినా ఇదేగతి పట్టింది. వీళ్ళంతా అడవుల్లో నివాస ముండేవాళ్ళు. అవతారాలెత్తిన దేవుళ్ళందరూ వీరిని చంపారు. ఆనాడు ఆధిపత్య సంస్కృతిని ప్రతిఘటించి, వైదిక సంప్రదాయాలను నిరసించినవాళ్ళను రకరకాల పేర్లతో చంపేశారు. భారతదేశ చరిత్రలో బౌద్ధం ఒక సామాజిక విప్లవం. యజ్ఞాల పేరుతో సాగుతున్న సామాజిక, ఆర్థిక దోపిడీని నిరోధించడానికి బౌద్ధులు సాగించిన సామాజిక ఉద్యమం ఆనాటి సమాజాన్ని మూఢాచారాల నుంచి విముక్తం చేసింది. బౌద్ధులు ఇళ్లను వదిలి, ప్రజల్లో కలిసిమెలిసి తిరుగుతూ, వాళ్లు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ జీవనం గడిపేవాళ్ళు. అయితే ఎనిమిది నెలలు అంటే చలికాలం, వేసవిలో మాత్రమే సంచారం చేసేవాళ్లు. వర్షాకాలం నాలుగు నెలలు, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం బయటకు వచ్చేవాళ్ళు కాదు. అయితే సిద్ధార్థ గౌతముడు జ్ఞానం పొంది గౌతమబుద్ధుడిగా మారిన తర్వాత 18 సంవత్సరాలకు తాను పుట్టిన ఊరి ప్రజలు ఆహ్వానిస్తే వెళతాడు. ఆయన ఊరికి వస్తున్నాడని ప్రజలంతా సంతోషంతో ఊరంతా దీపాలతో అలం కరించి స్వాగతం పలుకుతారు. ఎందుకంటే, అది అమా వాస్య రోజు. చిమ్మచీకటి. నూనె దీపాలు తప్ప మరొక వెలుగు పరికరం లేదు. అందుకే ప్రతి ఇంటా దీపాలు వెలిగించారు. ఆ తర్వాత ఇది ఒక సంప్రదాయంగా మారింది. ప్రతి సంవత్సరం వర్షవాసం ముగించుకొని గ్రామాలకు, నగరాలకు వస్తున్న బౌద్ధ భిక్కులకు ఇంటింటా దీపాలతో స్వాగతం పలికేవారు. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందడానికి కొన్ని నెలల ముందు ఆయన ప్రియ శిష్యులలో ఒకరైన మహామౌద్గాలాయనను బౌద్ధ వ్యతిరేకులు సరిగ్గా వర్షా్షవాసం ముగిసిన రోజు, ప్రజలంతా సంబరాలలో ఉండగా ఒక గుట్టమీద దాడిచేసి కిరాతకంగా హత్య చేశారు. బుద్ధుడి తర్వాత అంతటి విద్వత్తును సంపా దించినవాడు మౌద్గాలాయన. ఆయన మరోపేరు మొగ్గలన్న. ఇది ఆనాటి సమాజాన్ని దుఃఖంలో ముంచింది. అయితే సమ్రాట్ అశోకుడు బౌద్ధాన్ని స్వీక రించిన తర్వాత మళ్ళీ బౌద్ధానికి జీవం పోసినట్టయ్యింది. వర్షా్షవాసం ముగించుకొని వస్తున్న బౌద్ధ భిక్కులను మనుపటిలాగా సంతోషంతో ప్రజలు ఆహ్వానించలేక పోయారు. ఇది గమనించిన అశోకుడు ప్రజల శోకాన్ని పోగొట్టడానికి నిర్ణయించుకున్నాడు. బుద్ధుని బోధనలను, జ్ఞాపకాలను స్థిరంగా ఉంచడానికి తన పాలనా పరిధిలోని 84 వేల గ్రామాలు, పట్టణాల్లో శిలా ఫలకాలను, చైత్యాలను, ఇతర విహారాలను నిర్మించాడు. అందులో భాగంగానే మొగ్గలన్న మహాపరినిర్వాణం పొందిన రోజును ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని వెలుగుగా భావించి, ఆయన ఆలోచనలకు ప్రతిరూపంగా బౌద్ధ స్థలాల్లోనూ, ప్రతి ఇంటా దీపాల వరుసలను పెట్టాలని ప్రకటించాడు. మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి, వాళ్లను స్మరించుకోవడానికి ధమ్మదీప దానోత్సవం జరుపుకోవాలని చెప్పాడు. ఈ విషయాలన్నీ శ్రీలంక పరిభాషలో రచించిన ‘దీపవంశం’ పుస్తకంలో ఉన్నాయి. ఇది పాళీ బౌద్ధ సాహిత్యమైన ‘అట్టకత’లో నుంచి తీసుకున్నట్లు, ఇది క్రీ.శ. 3, 4 శతాబ్దాల మధ్యలో లిఖితమైనట్టు చరిత్ర చెబుతున్నది. జైనమతంలో కూడా జరుపుకొంటున్న దీపావళికి ఒక ప్రత్యేకమైన స్థానమున్నది. జైన తీర్థంకరులలో 24వ గురువు మహావీరుని మహాపరినిర్వాణం ఇదే రోజున జరిగింది. ఆయన ప్రాణం మనకు వెలుగును అందించిం దనీ, ఆయన దీపమై నిలిచాడనీ భావిస్తూ జైనులు దీపా వళిని ఘనంగా జరుపుకుంటారు. దీపావళిని తమ వ్యాపార, వాణిజ్యాలకు ఆరంభ దినంగా కూడా భావిస్తారు. నరకాసుర వధ గానీ, రాముడు అయోధ్యకు చేరినప్పుడు ప్రజలు దీపావళి జరిపారనే విషయం గానీ చారిత్రకంగా నిర్ధారణ కాలేదు. ఇది తర్వాత అల్లిన కథగా చరిత్రకారులు చెబుతున్నారు. కానీ బౌద్ధ, జైన సాంప్రదా యాలను ప్రజలు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లోని కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో తమ పూర్వీకుల సమా«ధులను శుభ్రపరిచి, సున్నాలు వేసి, పూలతో అలంకరించి, పటాకులను కాల్చి నివాళి అర్పిం చడం ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది. అశోకుడు ప్రకటించిన ధర్మదీప దానోత్సవాన్ని బ్రాహ్మణేతర కులాలు, ప్రత్యేకించి దళితులు పాటిస్తున్నారు. బౌద్ధం, జైనం తాత్వికంగా మరణాన్ని అనివార్యమైన విషయంగా భావిస్తాయి. చనిపోయిన వాళ్ళకోసం దుఃఖించడం వ్యర్థ మనే విషయాన్ని బుద్ధుడు స్వయంగా ప్రకటించాడు. అదే విషయాన్ని అశోకుడు తన ఆచరణ ద్వారా బౌద్ధులకు ధమ్మ దీప దానోత్సవాన్ని అందించాడు. అదే ఈరోజు ప్రజలంతా జరుపుకుంటోన్న దీపావళి పండుగ. బౌద్ధ, జైన బోధనలను, వారి ఆచార సంప్రదా యాలను కనుమరుగు చేయడానికే వారి వ్యతిరేకులు దీపావళిని జరుపుకోవడం మొదలైందని చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. సమత, మమత, కరుణ, సమానత్వం, సత్యం లాంటి ఆలోచనలను, ఆచరణను అందించిన బౌద్ధం మనకు ధమ్మదీప దానోత్సవాన్ని కూడా ఇచ్చింది. అందుకే దీపావళి బౌద్ధుల, జైనుల పండుగగా మొదలై ఇప్పుడు అందరూ జరుపుకొంటు న్నారు. బౌద్ధులు, సామాజిక బాధ్యత కలిగినవాళ్లు దీపా వళి రోజున మొగ్గలన్నతో సహా ఎంతో మంది సామాజిక విప్లవకారులను స్మరించుకోవాల్సిన అవసరమున్నది. అందరం మనుషులమేననే భావనను, సమానత్వం, సోద రత్వం అనే మార్గాన్ని అందించిన ధమ్మదీప దానోత్స వాన్ని దీపావళిగా జరుపుకొందాం. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
దళితబంధు ఆపడం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ‘దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా వాసాలమర్రిలో దళితులకు రూ.7.60 కోట్లను గత ఆగస్టు 5న విడుదల చేశారు. అలాగే పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆగస్టు 16 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దళితబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం. హుజూరాబాద్ ఎన్నికలతో సంబంధం లేకపోయినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం కాకపోయినా.. ఎన్నికల కమిషన్ ఈ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దళితబంధు పథకాన్ని ఆపాలని ఆదేశించడం దళితుల హక్కులను హరించడమే. పథకం నిలిపివేతపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయండి’ అని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ, ఎండీని ప్రతివాదులుగా చేర్చారు. -
‘దళిత బంధు’వులు ఎవరు?
‘‘ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైన పార్లమెంటు, అసెం బ్లీల ఎన్నికల ప్రక్రియను నిర్వ హించే ఎన్నికల సంఘం ప్రభుత్వ అధికార యంత్రాంగానికి లోబడ కుండా స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయి’’ అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఈ విషయంపై 1949 జూన్ 15న జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు. ఆ చర్చలో పాల్గొన్న రాజ్యాంగ సభ సభ్యులు కూడా అదే విధమైన అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. అందువల్లనే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ – 324లో ఎన్నికల సంఘపు విధులు, అధికారాలను వివరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద రాజకీయ, అధికార జోక్యం ఉండకూడ దని, ఆయనను తొలగించే ప్రక్రియను కఠినతరం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న విధంగానే నిబం ధనలను కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొల గించాలంటే పార్లమెంటు నిర్ణయం తీసు కోవాలి. ఆ అధి కారాన్ని రాష్ట్రపతికి గానీ, కేంద్ర మంత్రి వర్గానికిగానీ కల్పించలేదు. ఎంతో దూరదృష్టితో రాజ్యాంగ రచనా సంఘం, అంతిమంగా రాజ్యాంగ సభ మహత్తరమైన నిబంధనలు కల్పించాయి. అయితే, గత డెబ్భై ఏళ్ళలో కొద్దిమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మాత్రమే కొంత మేరకైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేశారు. చాలా మంది అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేశారు. గత మూడు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం యావత్ దళిత జాతిని విస్మయానికి గురి చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌లో నిలిపివేయాలని ఆదేశించింది. భార తీయ జనతాపార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. వాస్తవాలను పరిశీలించకుండా ఎన్నికల సంఘం తీసు కున్న ఈ నిర్ణయం రాజకీయ జోక్యం ప్రకారమే జరిగిందనే వాదనకు బలం చేకూరుతున్నది. ఎందుకంటే, ఈ పథకం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రకటించింది కాదు. తెలంగాణ దళిత బంధు పథకానికి అన్ని రకాల అనుకూలాంశాలే ఉన్నాయి. మొదటగా దీనికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మార్చి18, 2021న ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్లో దీని ప్రస్తావన ఉంది. ఆ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభ ఆమో దించింది. దాని తర్వాత ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వ డానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. పది గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దళితుల ఆర్థికాభివృద్ధికి చిన్న చిన్న సాయం సరిపోవడం లేదనీ, వారు అనుభవిస్తున్న పేదరికం నుంచి బయటపడటానికి తగిన విధంగా ఆర్థిక సాయం చేయాలనీ నిర్ణయం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. అన్ని రకాల అధికార లాంఛ నాలను పూర్తిచేసుకొని ఆగస్టు 5న యాదాద్రి–భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో 76 దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింప జేశారు. వెనువెంటనే వారి వారి ఖాతాల్లోకి పది లక్షలు జమ చేశారు. కొందరు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాతనే ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గానికి దీనిని విస్తరింప జేశారు. ఆ రోజున 15 మందికి లాంఛనంగా చెక్కులు అంద జేశారు. ఇప్పటికి దాదాపు 17,500 మందికి తమ బ్యాంకు ఖాతాల్లో పది లక్షలు జమయ్యాయి. ఇందులో కొంత మంది వ్యాపార, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువ డింది సెప్టెంబర్ 29న మాత్రమే. అంటే ఎన్నికల నోటిఫి కేషన్ రావడానికి 50 రోజుల ముందు ఈ పథకం అమలు లోకి వచ్చింది. అంతేకాకుండా, రాష్ట్రంలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు కోసం మూడు రోజుల క్రితం 18వ తేదీన 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం అమలుకు, హుజూరాబాద్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని దీనిని బట్టి అర్థమవుతున్నది. మరో విషయాన్ని మరచి పోకూడదు. హుజూరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా జరు గుతున్నాయి. పోటీచేసిన రాజకీయ పార్టీలు తాము మాత్రమే గెలవాలని ప్రయత్నిస్తాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తమ వి«ధానాల ద్వారా, తాము చేసిన మంచి పనుల ద్వారా, చేయబోయే పనుల ద్వారా ఓట్లను పొంద వచ్చును. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అనుసరించిన విధానంలో పూర్తి చెడు ఉద్దేశ్య కనిపి స్తున్నది. బీజేపీకి దళితుల పట్ల ఉన్న నిర్లక్ష్య భావన, చిన్న చూపు దీన్ని బట్టి మరోమారు రుజువవుతోంది. 2018 ఎన్నికల ప్రణాళికలో కేంద్రంలో బీజేపీ... ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన కూడా చేయకపోవడం యాదృచ్ఛికం కానేకాదు. దానికనుగుణంగానే ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఎటు వంటి నూతన పథకాలను ప్రవేశపెట్టలేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను. కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులతో పాటు, పారిశుద్ధ్య కార్మి కులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. లక్షల కోట్లు కోవిడ్ ఉద్దీపన నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, అత్యల్ప జీతాలు తీసుకునే పారిశుద్ధ్య కార్మికులకు కనీసం ఇన్సెంటివ్గానైనా ఒక్క పైసా ఇచ్చింది లేదు. అంతే కాకుండా గత అయిదేళ్ళుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. దక్షి ణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సబ్‌ప్లాన్ నిధులు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతంగానే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చాయి. హుజూరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన దళిత బంధు వ్యతిరేక వైఖరి వివక్షా పూరి తమైనది. బీజేపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు నా మనవి. మీరు ఒకసారి వెనక్కు తిరిగిచూసుకోండి. ఈ ఏడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఏ పథకాలు అమలు చేశారో ఆలోచించండి. ఎన్ని నిధులు ఈ అణగారిన వర్గా లకు కేటాయించారో, వాటి ఫలితాలేమిటో సమీక్షించు కోవాల్సిన సందర్భమిది. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్‌ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్‌కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్‌కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
సాధికారత సాధించని ఒడంబడిక
ఎన్నికల్లో ఇప్పుడు రిజర్వుడు స్థానాలుగా ప్రతిఫలించిన పూనా ఒడంబడిక జరిగి తొమ్మిది దశాబ్దాలు గడిచింది. స్వాతంత్య్ర పూర్వ భారతదేశంలో అంబేడ్కర్‌కూ, మహాత్మాగాంధీకీ కుదిరిన ఈ ఒడంబడిక గట్టి వాదోపవాదాలకు కేంద్రబిందువైంది. అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్లే ప్రతినిధులుగా ఎన్నిక కావాలని అంబేడ్కర్ వాదించారు. ఇది హిందూ సమాజాన్ని మరింత చీల్చుతుందని గాంధీజీ భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిమధ్యా కుదిరిన, కుదిర్చిన రాజీయే పూనా ఒడంబడిక. ఈ ఒడంబడిక రావడానికి కారణమైన ముందటి, అనంతర పరిణామాలు స్వాతంత్య్ర పోరాటానికి సమాంతరమైన చరిత్ర! ‘‘భారత సామాజిక నిర్మాణం రెండు ముఖ్యమైన భాగాలుగా విభజితమైంది. అందులో ఒకటి వర్ణం, రెండవది అవర్ణం. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు ఉంటారు. అవర్ణంలోని వారిని అంటరాని తెగలు, నేరస్థ, ఆదిమ తెగలుగా వర్గీకరించారు. అయితే వర్ణంలోని ద్విజులు, ద్విజులు కానివారి మధ్య విభజన ఉంటుంది. అది పెద్దగా కనిపించని సన్నని పొర. అవర్ణంలోని ఆదిమ తెగలు ఎవరికి వారుగానే జీవిస్తారు. వర్ణంలోని కులాలతో వీరికి అంతగా సంబంధాలుండవు. అయితే వర్ణా నికి బయట అవర్ణులుగా ఉన్న అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య ఉన్న వైరుధ్యం ఇనుప కంచె లాంటిది. దానిని ఛేదిం చడం అంత సులువు కాదు.’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1940కి ముందే చేసిన విశ్లేషణ ఇది. ఆ రోజు అంటరాని కులాలుగా పిలిచిన నేటి షెడ్యూల్డ్ కులాలు, రాజకీయ పరిభాషలో దళితులు ఈ సమా జంలో ఇప్పటికీ భాగం కాలేకపోయారు. భారతదేశంలో ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు, ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్య స్థాపన అవగాహనల కోసం 1919లో భారత దేశం సందర్శించిన సౌత్‌బరో కమిటీ ముందు ఒక ముప్ఫై యేళ్ళ యువ కుడైన అంబేడ్కర్, అమెరికాలో చదివిన ఉన్నత విద్యావంతుడిగా సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. భారతదేశంలో కులాల మధ్య ఉన్న అంతరాలు, ముఖ్యంగా అంటరాని కులాలకూ, ఇతర కులాలకూ మధ్య ఉన్న అసమానతలు ప్రభుత్వాల ఏర్పాటులో ప్రభావం చూప కూడదంటే, అంటరాని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించా లని, దీనికి నామినేషన్ పద్ధతి కాకుండా, వాళ్ళ ఓట్ల ద్వారానే వాళ్ళ ప్రతినిధులుగా ఎన్నిక కావాలని, ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో జరగా లని సూచించారు. అంటే సమాజంలోని విద్యావంతులకు, సంపన్ను లకు, భూస్వాములకు, వ్యాపారస్తులకు మాత్రమే ఓటు హక్కు కల్పిం చడం సరిపోదని, కుల, మత, ప్రాంత భేదం లేకుండా ప్రతి వయో జనుడికీ ఓటు హక్కు కల్పించాలని సౌత్ బరో కమిటీ ముందు ప్రతిపాదించాడు ఆ యువకుడు. ఆ తర్వాత సైమన్ కమిషన్ ముందు, 1930–32 మధ్య జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లలోనూ ఆయన ఇదే అంశాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో వాదించారు. అప్పటికే ముస్లింలకు, క్రిస్టియన్లకు అమలు జరుగుతున్న ప్రత్యేక ఎన్నిక విధా నాన్ని, అంటే తమ అభ్యర్థులకు తామే ఓట్లు వేసుకునే పద్ధతిని అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్‌గా పిలుస్తోన్న అంటరాని కులాలకు వర్తిం పజేయాలని వాదించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశాలకు గాంధీజీ హాజరుకాలేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ మొదటి సభలో ఈ విషయంపై చేసిన ప్రతిపాదనను విని బెంబేలెత్తిపోయిన గాం«ధీజీ, రెండో సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో గాంధీజీ అత్యంత శ్రద్ధపెట్టిన అంశం డిప్రెస్డ్ క్లాసెస్‌కు ప్రత్యేక ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించడమే. అంబేడ్కర్, గాం«ధీ మధ్య ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరి గాయి. అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారని, హిందువు లలో భాగంగా వారిని ఎన్నడూ చూడలేదని, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారని అంబేడ్కర్ వాదించారు. ఈ కారణంగానే వారికి రాజకీయ హక్కులు, ప్రాతినిధ్యం కావాలని; వారి ప్రతినిధు లను వారే ఎన్నుకునే అవకాశం కల్పించాలని కుండబద్దలు కొట్టారు. లేదంటే, రాజకీయ స్వేచ్ఛకు బదులు దళితులు తరతరాల బానిసత్వా నికి బలి కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంబేడ్కర్ సూచించి నట్టుగా, అంటరాని కులాలకు ప్రత్యేక ఎన్నిక విధానంలో తమ అభ్యర్థులను తామే ఎన్నుకునే విధానానికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. అందుకు అనుగుణంగా నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఒక ఉత్తర్వును జారీచేశారు. దానిపేరే కమ్యూనల్ అవార్డు. అయితే, గాంధీ దీనిని జీర్ణించుకోలేకపోయారు. 1932, మార్చి 11న బ్రిటిష్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఒక లేఖ రాశారు. ‘అంటరాని కులాలకు ప్రత్యేక ఓటింగ్ విధానం కల్పించి, వారి అభ్యర్థిత్వాన్ని వారే ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తే, నేను ఆమరణ దీక్షకు పూనుకుం టాను’ అన్నారు. రామ్సే మెక్‌డొనాల్డ్ గాంధీ లేఖకు, ‘‘మీ ఉద్దేశం హిందువులకు, అంటరాని కులాలకు కలిపి ఓటింగ్ ఉండాలని కాదు. హిందువుల మధ్య ఐక్యత సాధించాలని కాదు. అంటరాని కులాల తరఫున శాసనసభలో నలుగురు నిజమైన ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకోవడమే తప్ప మరొకటి కాదు’’ అని తీవ్రంగా జవాబి వ్వడం గమనించాల్సిన విషయం. రామ్సే మెక్‌డొనాల్డ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దానితో కాంగ్రెస్ పార్టీ, హిందూ సంఘాల నాయకులు అంబేడ్కర్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. చివరిదాకా అంబేడ్కర్ వాళ్ళ ఆలోచనలకు తలొగ్గలేదు. కానీ, ఒకవేళ గాంధీ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే గ్రామాల్లో అల్పసంఖ్యాకులుగా ఉన్నవారిపై, అగ్రవర్ణాలు దాడులకు తెగబడతారనే భయంతో రామ్సే మెక్‌డొనాల్డ్ ఇచ్చిన ఉత్తర్వులను వదులుకోవాల్సి వచ్చింది. దాని స్థానంలో 1932 సెప్టెంబర్ 24వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. పూనా ఒడంబడిక ద్వారా ప్రత్యేక ఓటింగ్, అంటే తమ అభ్యర్థులను తాము మాత్రమే ఎన్నుకునే విధానానికి బదులుగా, రిజర్వుడు నియోజక వర్గాల విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న రిజర్వుడు స్థానాల ఎన్నికల విధా నంలో కేవలం ఆధిపత్య కులాల, సవర్ణ హిందువుల అంగీకారం ఉన్నవాళ్ళే ఎస్సీ ప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. దళితుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు, కులసమాజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు ఎస్సీల ప్రతినిధులు కాలేకపోతున్నారు. కారణం మనందరికీ తెలుసు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మెజారిటీగా ఆధిపత్య కులాల నాయకత్వంలో ఉన్నాయి. అంతేకాకుండా, ఓటర్లలో నూటికి 70 నుంచి 80 శాతం మంది దళి తులు కానివారే. అందువల్ల కూడా నిజమైన దళిత ప్రజాప్రతి నిధులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కావడం లేదు. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. దీనికి ప్రస్తుతం ఎన్నికవుతున్న ఎస్సీ ప్రజాప్రతినిధులను బాధ్యులను చేయాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల విధానమే తప్ప వ్యక్తులు కాదు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించినట్టుగా, తమ ప్రతి నిధులను తామే ఎన్నుకునే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే భారత సామాజిక, రాజకీయ రంగంలో మౌలికమైన మార్పులు వచ్చేవి. కానీ ఎస్సీ ప్రతినిధులందరూ ఈ రోజుకు కూడా అసెంబ్లీలోగానీ, పార్లమెంటులో గానీ దళితుల పక్షాన నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత మంది మాట్లాడుతుంటారు. వాళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. మళ్ళీ వాళ్ళే అధికార పక్షంలోకి వెళ్తే నోటికి తాళాలు పడిపోతాయి. ఇది ఒక కఠోర వాస్తవం. అయితే దీనికి పరిష్కారమేమిటి అనే సందేహం వస్తుంది. తక్షణమైతే ప్రజా ప్రతినిధులు తమలో తాము అవలోకనం చేసు కోవాలి. కనీసం తక్షణ సమస్యలపైనైనా దళితుల పక్షాన నిలబడ టానికి ప్రయత్నించాలి. అంతిమంగా ఈ ఎన్నికల విధానాన్ని మార్చడానికి మళ్ళీ ఒక రాజకీయ ఉద్యమం జరగాలి. తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే విధానంపైన ఒక చర్చ జరగాలి. ఇందుకుగాను దళితులు రాజకీయ ఉద్యమానికి సన్నద్ధం కావాలి. సమాజంలోని ప్రజాస్వామిక శక్తులు, అసమానతలు తొలగిపోవాలనే వ్యక్తులు, సంస్థలు, దళిత ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంలో మార్పు కోసం కలిసి రావాలి. లేనట్లయితే సామాజిక ఆర్థిక అసమానతలకు తోడుగా రాజకీయ బానిసత్వం ఇంకా పాతుకుపోయే ప్రమాదం ఉంటుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!
పంజ్‌షీర్... యావత్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. తాలిబన్లకు సైతం చుక్కలు చూపిస్తున్న ఐదు సింహాల గడ్డ. ఆఫ్గాన్ నేలపై ఆధిపత్యాన్ని ససేమిరా సహించని పౌరుషానికి రూపం. ఆ లోయను కైవసం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించినా, చిట్టచివరి యోధుడి చిట్టచివరి రక్తపుబొట్టు నేలలో ఇంకేవరకూ తమను గెలవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు పంజ్‌షీర్ పోరాటవీరులు. ప్రపంచం మొత్తం కరుడుగట్టిన తీవ్రవాదుల్లా భావిస్తోన్న తాలిబన్లను ఎదిరించే సత్తా వీరికెలా వచ్చింది? అంతటి ధీరత్వం, తెగింపు, పట్టుదలకు మూలాలు ఏమిటనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం. పరిపాలన రీత్యా అఫ్గానిస్తాన్‌లోని ఒక రాష్ట్రం... పంజ్‌షీర్. అమెరికా సేనలు అఫ్గాన్‌ను వీడనున్నట్టు ప్రకటించిన తర్వాత యావత్ అఫ్గాన్నూ అవలీలగా ఆక్రమించుకుంది తాలిబన్ సాయుధ సేన. కానీ ఒకే ఒక చిన్న ప్రాంతం మాత్రం ఈ వ్యాసం రాసేనాటికి పూర్తిగా తాలిబన్ల వశం కాలేదు. అమెరికా తయారు చేసిన ఉగ్రవాదం చివరికి అమెరికానే తరిమికొట్టింది. అమెరికా చేసిన తప్పిదం వల్ల అమెరికా వీడి వెళ్ళిన అత్యాధునిక ఆయుధ సంపత్తి, యుద్ధ విమానాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయి. చైనా, రష్యా, పాకిస్తాన్ అండదండలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ పంజ్‌షీర్‌లో అడుగు పెట్టలేక పోయారు. కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌లో చివరగా తాలిబన్లు చేసిన ప్రయత్నం–డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపించడం. నిజానికి తాలిబన్ల బలం ముందు పంజ్‌షీర్ నిలబడుతుందా? అనేది ప్రశ్నార్థకమే. కానీ గత చరిత్రను తడిమితే, వారెప్పుడూ విదేశీ సైన్యానికి గానీ, స్వదేశీ సేనలకుగానీ లొంగిపోయింది లేదు. ఎంతటి ఘాతుకానికైనా తెగబడి పంజ్‌షీర్‌ని వశపర్చుకోజూసినా అది తాలిబన్ల తరంకాలేదు. దీంతో పాకిస్తాన్ సాయంతో యువ కిరణం మసూద్‌ని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అఫ్గాన్ మాజీ ఉపా ధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు. ఇతర నేతల నివాసాలను కూడా బాంబులతో పేల్చి వేశారు. పంజ్‌షీర్ గవర్నర్ కార్యాలయంపై జెండా ఎగురవేసి, తాము గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు తాలిబన్లు. మొన్నటివరకూ అఫ్గాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్– ‘ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా చట్టబద్ధ పాలనను గౌరవించాలి. కానీ హింసను కాదు. పాకిస్తాన్, తాలిబన్లు కలిసి అఫ్గానిస్తాన్‌ను కబళించడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించదు. హింస ముందు అఫ్గాన్ ప్రజలు మోకరిల్లరు’ అంటూ సాహసోపేతమైన ప్రకటన చేశారు. అమ్రుల్లా సలేహ్ పంజ్‌షీర్ నేలపై పుట్టిన వాడు. ఆ ప్రాంతం నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 80వ దశకంలో సోవియట్ సేనలతో, 90వ దశకంలో తాలిబన్ల పాలన కాలంలో పంజ్‌షీర్ తరఫున పోరాడిన అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ ప్రజానాయకుడు అయిన అమ్రుల్లాకు అండగా నిల బడ్డాడు. అమ్రుల్లా వ్యూహంతో, మసూద్ నాయకత్వంలో పంజ్‌షీర్ పోరాడుతోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది ప్రశ్నే కాదు. పంజ్‌షీర్ల వారసుడు ఒక్కడున్నా ఈ యుద్ధం ముగియదన్నది సత్యం. అఫ్గానిస్తాన్ బహు జాతుల సమ్మేళనం. అనేక గిరిజన తెగల సమాహారం. చాలాకాలం ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా బతి కాయి. మెజారిటీగా అందరూ ముస్లింలే అయినప్పటికీ–జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ఇతర విలువల రీత్యా ఎవరికి వారుగానే ఉన్నారు. వీరిలో పష్తూన్, తజిక్స్, హజారాస్, ఉజ్బెక్, బలూచ్, అయిముఖ్, క్విజల్, బాశ్, టర్క్‌మన్, క్యూజక్, పార్శివాన్, సయ్యద్, కిర్గిజ్, అరబ్ లాంటి ఎన్నో తెగలున్నాయి. ఇందులో పష్తూన్, తజిక్స్, హజారాస్ ప్రధానమైనవి. ప్రస్తుత అఫ్గాన్ జనాభా దాదాపు 3 కోట్ల 80 లక్షలు. ఇందులో 42 శాతం పష్తూన్లే. వీరినే పఠాన్లు అని కూడా అంటారు. తజక్ జనాభా 27 శాతం. హజారాలు 9 శాతం, ఉజ్బెక్లు 4 శాతం, అయిమక్లు 4 శాతం, టర్క్మన్లు 3 శాతం, బలూచ్‌లు 2 శాతం ఉన్నారు. పష్తూన్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరు సంచార జీవనం గడుపుతుంటారు. ఆధు నిక పద్ధతులు అలవాటు కాలేదు. తాలిబన్ల సాయుధ బలగంలో వీరిదే అగ్రభాగం. నాయకత్వ స్థానంలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభా రీత్యా రెండవ స్థానంలో ఉన్న తజిక్ తెగ ఆధునిక సమాజంగా వృద్ధి చెందింది. మూడవ స్థానంలో ఉన్న హజారా తెగ వ్యవసాయం, పశుపోషణ, గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తోంది. వెయ్యేండ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన చంఘిజ్‌ఖాన్ వారసులమని వీరు చెప్పుకుంటారు. ఈ మూడు తెగల ప్రభావం ఆఫ్గాన్‌పై ఉంటుందనేది వాస్తవం. ఈ ఆధిపత్య తెగ పశ్తూన్లకూ, మిగిలిన తెగలకూ మధ్య నిరంతర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వైరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొదటిసారిగా 1975లో ఆనాటి ప్రధానమంత్రి దావూద్ ఖాన్‌కు వ్యతిరేకంగా పంజ్‌షీర్ లోయలో తిరుగుబాటు జరిగింది. దావూద్ పష్తూన్ తెగకు చెందిన నాయకుడు. తజక్ తెగకు చెందిన తాహిర్ బదాక్షి నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటును వామపక్ష తిరుగుబాటుగా చెపుతారు. అదేవిధంగా ముస్లిముల్లో షియా వర్గానికి చెందిన హజారా నాయకత్వంలో షల్లెహ–ఏ–జిహాద్ పేరుతో 1960ల్లోనే ఒక విప్లవ సంస్థ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజు పంజ్‌షీర్‌లో ప్రధా నంగా తజక్, హజారా తెగలు... ప్రధానంగా పష్తూన్ల నాయకత్వంలో ఉన్న తాలిబన్లతో ఘర్షణలో ఉన్నారు. అమెరికా సైన్యం అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తరువాత, అఫ్గాన్ జాతీయ ప్రభుత్వాన్ని నడిపిం చడంలో పంజ్‌షీర్ నాయకత్వం ప్రధాన పాత్ర పోషించింది. పంజ్‌షీర్ తెగలు తాలిబన్లను ఎదిరించి నిలవడానికి, చారిత్రకంగా వస్తున్న జాతుల మధ్య వైరుధ్యాలే ప్రధాన కారణం. పంజ్‌షీర్ శత్రు దుర్భేధ్యమైనది. ఇది కాబూల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వతాలను ఆనుకొని ఉన్న ఒక లోయ. ఈ లోయలోకి ప్రవేశించాలంటే ఉన్నది ఒకే ఒక చిన్న మార్గం. ఆ ఏకైక సన్నని తోవగుండానే ఎవరైనా లోనికి పోవాల్సి ఉంటుంది. అది కూడా పంజ్‌షీర్ నదిని దాటుకొని వెళ్లాలి. పంజ్‌షీర్ ప్రజలది ప్రత్యేకమైన జీవన విధానం. యుద్ధ విద్య వారి జీవితంలో భాగం. సహజసిద్ధంగా వారసత్వంగా లభించిన ధీరత్వం వీరికి పెట్టని కిరీటం. వేల ఏళ్ళుగా స్వతంత్రంగా జీవనం సాగించిన పంజ్‌షీర్ ప్రాంతం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించింది. దానికి కారణం ఈ లోయను పచ్చల మణిహారమని చెపుతారు. అత్యంత విలువైన ఖనిజాలు, పచ్చలు(190 క్యారెట్లు కలిగిన ఎమరాల్డ్) ఇక్కడ లభ్యమవడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగింది. మధ్యయుగాల కాలంలోనే వెండి గనులు విస్తారంగా ఉండేవి. క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు నాయకులు, స్వయంగా అన్నదమ్ములు అక్కడి నదిపైన ఆనకట్టను నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తరతరాలుగా ప్రజలను వరదల నుంచి రక్షించడమే కాకుండా, వ్యవసాయాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆ ఐదుగురు సోదరులనే ఇక్కడి ప్రజలు ఐదు సింహాలుగా, తమ కుల దైవాలుగా కొలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి పంజ్‌షేర్ అనే పేరొచ్చింది. పంజ్‌షేర్ కాస్తా వాడుకలో పంజ్షీర్గా ప్రాచుర్యం పొందింది. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం వల్ల పంజ్‌షీర్ ప్రజ లకు స్థిరమైన జీవన విధానం అలవాటయ్యింది. దీంతో పట్టణాల నిర్మాణం వైపు మొగ్గుచూపారు. దీనికి భిన్నమైన జీవన విధానం పష్తూన్లది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ వీరు సంచార జీవనమే సాగిస్తున్నారు. ఇస్లాంలో ఉండే విషయాలను మరింత కఠినంగా, మూఢంగా నమ్ముతారు; ఆచరిస్తారు; ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర సమాజంతో, సంప్రదాయాలతో పరస్పర సంబంధాలు లేకపోవడం వలన వెయ్యేళ్ళ కిందటి సంప్ర దాయాలను మక్కీకి మక్కీ అమలు చేస్తున్న పరిస్థితి. తాము మాత్రమే నిజమైన ముస్లింలుగా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే వైరుధ్యం ఇతర తెగలతో ఘర్షణలకు దారితీస్తోంది. ఆధునిక పద్ధ తుల్లో ముందుకు వెళుతోన్న తజిక్, హజారా తెగలకు పష్తూన్ నాయకత్వంలోని తాలిబన్లు సహజ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఒకరకంగా సాంప్రదాయక ఛాందసత్వానికీ, ఆధునిక జీవన విధానానికీ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. బలవంతమైన మెజారిటీ వర్గం అణచివేతకు వ్యతిరేకంగా పంజ్షీర్లు తరతరా లుగా సాగిస్తోన్న ఈ పోరాటం... గెరిల్లా యుద్ధ తరహాలో ఉన్న ప్రజా స్వామ్యయుతమైన పోరాటం! - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
రెక్కల గుర్రానికి కీలెరిగి వాతపెట్టాలి
పెగసస్ వైరస్... కోవిడ్ కన్నా ప్రమాదకరం. కేంద్రప్రభుత్వం పెగసస్ వైరస్‌ను వాడి, వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించివేస్తోంది? ఆర్థిక రంగంలో కొనసాగుతున్న కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదకు పెగసస్ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజకీయ నాయకులను రెక్కల గుర్రానికి అప్పజెబుతున్నారు. పెగసస్ రెక్కల గుర్రం... రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. అంబేడ్కర్ చెప్పినట్టు... రాజకీయ ప్రజాస్వామ్యానికి రక్షణగా నిలవాలంటే ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సి ఉంటుంది.‘‘జనవరి, 26, 1950 నుంచి మనం ఒక వైరుధ్యాల జీవితంలోకి అడుగిడబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వాన్ని, ఆర్థిక, సామాజిక రంగాల్లో అసమానత్వాన్నీ కలిగి ఉన్నాం. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయాల్లో ప్రజాస్వామ్యం ఉంది. కానీ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది’’ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభ చివరి రోజైన నవంబర్, 25, 1949న చేసిన ప్రసంగంలోని కీలకమైన అంశం ఇది. డెబ్భై ఏళ్ళ క్రితం అంబేడ్కర్ చేసిన ఈ వ్యాఖ్యలను తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పెగసస్ వైరస్ ద్వారా కొన్ని వందల మంది ప్రముఖుల ఫోన్లను నిఘాలో పెట్టినట్టు రుజువైంది. నిజానికి ఇది కోవిడ్ కన్నా ప్రమాదకరం. నూటికి నూరుపాళ్ళూ ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. అయితే ఎందుకు ఈ ప్రభుత్వం పెగసస్ వైరస్‌ను వాడి వ్యక్తి స్వేచ్ఛను హరించివేస్తోంది? ఇది కేవలం రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. ఈ దేశంలో కొనసాగుతున్న ఆర్థిక గుత్తాధిపత్యం, సామాజిక వివక్షలు, అణచివేతలు రోజురోజుకీ వికృత రూపం దాల్చుతున్నాయి. గత కొన్ని వేల ఏళ్ళ నుంచి ప్రజల మధ్య అసమానతలు, వివక్షను పెంచి పోషిస్తోన్న కుల వ్యవస్థను కీర్తించే ప్రయత్నం జరుగుతున్నది. కుల వ్యవస్థ పునాది కలిగిన హిందూ మతం ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి కావాల్సిన ప్రచారం ముమ్మరమైంది. అంతేకాకుండా, ఇతర మతాలు, సాంప్రదాయాలు ప్రజావ్యతిరేకమైనవనే అభిప్రాయం కూడా బలంగా ముందుకు తెస్తున్నారు. అంటే సామాజిక అసమానతలను నిర్మూలించే వైపు కాకుండా, రోజురోజుకీ మరింత పెంచే విధంగా ప్రయాణం సాగుతోంది. అలాగే, ఆర్థికంగా కొన్ని కులాలు, వర్గాలు మాత్రమే బలపడేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అంటే దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో శత్రువులుగానే ఉన్నారు. దీంతో ఎవరినైనా తన శక్తితో ఎగరేసుకుపోగలిగే అస్త్రంగా రెక్కల గుర్రం పెగసస్‌ను ప్రయోగించారు. ఇక రెండో అంశం తాము చేస్తున్న అక్రమ నిఘాను సమర్థించుకోవడానికి ఒక శత్రువును ఎప్పటికప్పుడు సృష్టించడం. అది టెర్రరిజం కావచ్చు. తీవ్రవాదం కావచ్చు, అతివాదం కావచ్చు, ఇతర హింసాత్మక బూచీలేవైనా కావచ్చు. వాటిని బూచీగా చూపి తమ పబ్బం గడుపుకోవడానికి తమ రాజకీయ శత్రువులను అందులోకి లాగడం. పెగసస్‌ను ప్రవేశపెట్టక ముందే ఇంకా కొన్ని నియంతృత్వ పోకడలను మన ముందుకు తెచ్చిందీ ప్రభుత్వం. అది, పాలనా రంగంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను పూర్తిగా విస్మరించడం. అదేవిధంగా న్యాయవ్యవస్థలను నిర్వీర్యం చేయడం. దీంతో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలను దాదాపు స్తంభింపచేయడం జరిగింది. జరుగుతోంది. అంతేకాకుండా, మెజారిటీ వర్గాలను తమ వైపు నిలబెట్టుకోవడానికి అప్పటికే ప్రజల్లో ఉన్న వైరుధ్యాలను, ద్వేషాలను మరింత పెంచి పోషించడం, ఎటువంటి వ్యాఖ్యలకైనా వెనుకాడకపోవడం జరుగుతోంది. ఒక కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సర్వసాధారణమైంది. దీంతో మెజారిటీ వర్గం ప్రజలను సంతోషపెట్టేం దుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా, కొన్ని జాతీయ చిహ్నాలను.. గాంధీ, నెహ్రూ లాంటి జాతీయ నాయకులను అభాసుపాలు చేయడానికి సంకోచించడం లేదు. కొన్ని వర్గాల ప్రజలపైన ముఖ్యంగా దళితులపైన, ముస్లింలపైనా దాడులు చేసి, వాటిని తామే మీడియాలో చిత్రీకరించి మరింత వికృతానందాన్ని పొందుతున్నారు. దీనివల్ల ఆ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. దీనితో పాటు, ప్రస్తుతం భారత ప్రజల్లో ఉన్న సాంస్కృతిక వైవిధ్యానికి భిన్నంగా ఏకీకృత వ్యవస్థని ఏర్పాటు చేసుకునేందుకు తమ సొంత పౌరసత్వ విధానాన్ని ప్రవేశపెట్టడానికి పూనుకుంటున్నారు. వీటన్నింటి తోడ్పాటులో తాము ఊహిస్తున్న, ఆశిస్తున్న ఒక వివక్షాపూరితమైన తమదైన దేశాన్ని నిర్మించే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెగసస్ కూడా, పాక్షికంగా కొనసాగుతున్న రాజ కీయ ప్రజాస్వామ్య హక్కులను సైతం నిరాకరించే ప్రయత్నంలో భాగమే. అయితే పెగసస్ ఈ రోజే పుట్టుకొచ్చిన కొత్త దాడి కాదు. ఇది చివరిది కూడా కాదు. భారతీయ సమాజంలో వేళ్ళూనుకొని ఉన్న ఆర్థిక వైరుధ్యాలు, అసమానతలు, వివక్ష కొనసాగినంత కాలం ఈ దేశంలో ఉడుత ఊపులకు సైతం రాజకీయ ప్రజాస్వామ్యం చివురుటాకులా వణికిపోతూనే ఉంటుంది. అందుకే ఈ రోజు మరొక్కసారి, అంబేడ్కర్ సూచించిన నిజమైన ప్రజాస్వామ్యం వైపు సమాజాన్ని నడిపించకుండా ఈ చట్టాలు, నిఘా రెక్కల గుర్రాలు ప్రజల మీద ఎక్కి సవారీ చేస్తూనే ఉంటాయి. అంబేడ్కర్ ప్రజాస్వామ్యం గురించి వివరించిన మాటలను మనం ఇక్కడ స్ఫురణకు తెచ్చుకోవాలి. ‘‘ప్రజాస్వామ్యం ఒక ప్రభుత్వ విధానం, పాలన నుంచి వచ్చేది కాదు. పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అమలు జరిగేది సంపూర్ణ ప్రజాస్వామ్యం కాదు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఉన్న సంబంధాలు ప్రజాస్వామ్య విలువలకు అద్దంపడతాయి’’. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అనే అంశాలు కీలకమైనవి. ఇందులో స్వేచ్ఛ, సమానత్వం అనే అంశాలు సోదరత్వం అనే భావన మీద ఆధారపడుతూ ఉంటాయనేది అంబేడ్కర్ అభిప్రాయం. ప్రజల మధ్య సోదరత్వం లేకుండా, స్వపర భేదాలు కొనసాగినంత కాలం సమానత్వం, స్వేచ్ఛ అనేవి కూడా సంపూర్ణంగా అమలు జరగవు. ఇదే ఈ రోజు భారతదేశ వాస్తవికత. సామాజికంగా కుల వ్యవస్థ బతికి ఉన్నంతకాలం రాజకీయంగా అమలులో ఉన్న సమానత్వం సరిౖయెన ఫలితాలను ఇవ్వదు. అందువల్లనే రాజకీయ పార్టీలు ప్రజల మధ్య ఉండే ఈ భేదాలను తమ అధికారం కోసం చాలా సమర్థవంతంగా వాడుకుంటున్నాయి. పైగా, ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న అసమానతలు సమాజాన్ని మరింత అగాధంలోకి నెట్టబోతున్నాయి. ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీలు కొన్ని కార్పొరేట్ కంపెనీల ఎదుగుదలకు తోడ్పతున్నాయి. వాటికోసం ప్రజల భూములను, సహజవనరులను ధారాదత్తం చేస్తున్నాయి. దీనిపై తిరుగుబాటు చేస్తున్న ప్రజలు సహజంగానే ప్రభుత్వాలకు దేశ ద్రోహులుగా కనపడతారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాలు కూడా ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులను చేశాయి. అడవులను స్వాహా చేస్తోన్న కార్పొరేట్ కంపెనీలను, అందుకు కొమ్ముగాస్తోన్న ప్రభుత్వాలను ప్రతిఘటిస్తోన్న ఆదివాసులు, అడవి బిడ్డలు రాజద్రోహులవుతున్నారు. అకారణంగా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడానికి చేసిన కుయత్నాల ఫలితమే సుదీర్ఘ రైతాంగ పోరాటానికి దారితీసిందన్నది ఓ కఠోర సత్యం. దేశాన్ని సుసంపన్నంగా నిలిపే సత్తా ఉన్న రైతన్న ప్రభుత్వాల కుట్రలకు గురికావాల్సిన దుఃస్థితి. అంటే ఆర్థిక రంగంలో కొనసాగుతున్న ఈ కుట్రలను ప్రతిఘటిస్తున్న ప్రజలెవరైనా భారత ప్రభుత్వాలకు శత్రువులే. అందుకే వాళ్ళ మీదికి పెగసస్ రెక్కల గుర్రాన్ని వదులుతున్నారు. ఈ విషయాలపై రాస్తున్న, మాట్లాడుతున్న రచయితలను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, రాజ కీయనేతలను రెక్కల గుర్రానికి అప్పజెప్పుతున్నారు. పెగసస్ రెక్కల గుర్రం రోగం మాత్రమే. రోగానికి మూలం ఈ దేశ సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్ష, దోపిడీ. పెగసస్ మీద నిరసన తెలుపుతున్న మనందరం అంబేడ్కర్ చెప్పినట్టు.. ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రజాస్వామ్యం కోసం కూడా పోరాడాల్సిందే తప్ప మరో మార్గం లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077