చదువుల్లో మిన్నయిన రాష్ట్రం | mallepalli lakshmaiah comments on education in indian states | Sakshi
Sakshi News home page

చదువుల్లో మిన్నయిన రాష్ట్రం

Published Thu, Sep 8 2016 1:35 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

చదువుల్లో మిన్నయిన రాష్ట్రం - Sakshi

చదువుల్లో మిన్నయిన రాష్ట్రం

స్వాతంత్య్రానంతరం కేరళలో అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు ప్రాధాన్యాన్నిచ్చింది. నేటికీ కేరళ ఏటా అభివద్ధి పనులకు కేటాయిస్తున్న బడ్జెట్‌లో 40 శాతం విద్య మీద వెచ్చిస్తోంది. ప్రైవేటు విద్యాసంస్థలు ఇటీవలి కాలంలో పెరిగినా ఇప్పటికీ ప్రాథమిక, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ప్రభుత్వ పాత్ర గణనీయమైనదిగానే ఉంది. విద్యావ్యాప్తిలో, నిరక్షరాస్యతా నిర్మూలనలో కేరళ మీడియా నిర్వహించిన పాత్ర సైతం ప్రశంసనీయమైనది.
 
 ప్రపంచంలో కనీస అక్షర జ్ఞానం లేనివారు 77 కోట్ల 50 లక్షలు. వారిలో ఆరు కోట్ల 70 లక్షల మంది చిన్నారులు బడి బాటనెరుగని వారు. చదువుని మధ్యలోనే మానేసేవారు ఎన్నో లక్షలు. అభివద్ధి పథంలో ఉన్నామని చెప్పుకుంటున్న భారతదేశం అక్షరాస్యతలో 124వ స్థానంలో ఉండడం అత్యంత విచారకరం. మన దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో తెలంగాణ 35వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 32వ స్థానంలో ఉన్నాయి.

ఈ రోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. 1965లో, సరిగ్గా యాభయ్యేళ్ళ క్రితం ఐక్యరాజ్యసమితిలో ఒక విభాగమైన యునెస్కో (ఐరాస విద్య, విజ్ఞాన, సాంస్కతిక సంస్థ) ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ఈ స్వర్ణోత్సవ సంవత్సరంలో యునెస్కో ప్రపంచంలోని నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించాలని పారిస్‌లో విద్యా మంత్రుల సమావేశాన్ని నిర్వహిస్తోంది.
 
మన దేశంలో అక్షరాస్యతలో బిహార్‌ది చిట్టచివరి స్థానం (63.82 శాతం) కాగా మొదటి స్థానంలో కేరళ ఉంది. సంపూర్ణ అక్షరాస్యతకు దరిదాపులకు చేరిన కేరళ (93.91 శాతం) అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది. నిరక్ష రాస్యత నిర్మూలనలో కేరళ సాధించిన ప్రగతికి గల కారణాలను పరిశీ లించడం ఇతర రాష్ట్రాల్లో సంపూర్ణ అక్షరాస్యతకు అనుసరించాల్సిన వ్యూహా లను రూపొందించుకోడానికి తోడ్పడుతుంది. ఆ రాష్ర్ట చారిత్రక నేపథ్యం, అక్కడ ఉద్భవించిన సామాజిక, సాంస్కతిక, రాజకీయ ఉద్యమాలు, అక్కడి ప్రభుత్వాలు అవలంబించిన విధానాలు కేరళ సాధించిన పురోగతికి కార ణాలు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో లాగే కేరళలో కూడా కుల వివక్ష వల్ల విద్య కొందరికి మాత్రమే అందుబాటులో ఉండేది. బ్రాహ్మణులు, నాయర్‌లకే విద్యావకాశం ఉండటం సాంప్రదాయంగా ఉండేది.
 
 రాణి గౌరి బాయి చదువుల దారి
 అయితే 1817లో ట్రావెన్‌కోర్ సంస్థానం మహారాణి గౌరి పార్వతీబాయి విద్యను అందించే బాధ్యత రాజ్యానిదేనని ప్రకటించి ఒక విప్లవాత్మక మార్పు నకు శ్రీకారం చుట్టారు. మహారాణి నిర్ణయం వల్ల నాడే ఆ ప్రాంతంలో చాలా పాఠశాలలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1832లో మొట్టమొదటిసారిగా ఇంగ్లిష్ మీడియం విద్యాలయాలను ప్రారంభించడానికి ఆనాటి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆసక్తి ఉన్నవారు ప్రై వేటు పాఠశాలలను తెరవడానికి కూడా అనుమతినిచ్చింది. దీనితో 1834 నుంచి క్రిస్టియన్ మిషనరీ పాఠ శాలలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో ట్రావెన్‌కోర్ దివాన్ మాధవరావు పాత్ర గణనీయమైనది.
 
1868-69 నాటికి దాదాపు 2,152 మంది విద్యార్థులతో 29 పాఠశాలలు ఉండేవి.  1860 నుంచే బాలికలకు ప్రత్యేక విద్యావకాశాలు కల్పించాలని నిర్ణ యించడం ఇంకో విశేషం. 1819-22 మధ్య కాలంలో మిషనరీ పాఠశాలలు బాలికల విద్య కోసం చేస్తుండిన కషి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసింది. 1865 నుంచే వెనుకబడిన, అణగారిన వర్గాల కులాల పిల్లల కోసం పాఠ శాలలను తెరిచే కార్యక్రమాన్ని చేపట్టారు.
 
1895-96 నాటికి ఈ వర్గాల కోసం దాదాపు 30 పాఠశాలలను ప్రారంభించడం గొప్ప విశేషం. ఒక్క దశాబ్దంలోనే మొత్తం పాఠశాలల సంఖ్య 480కి చేరగా, వాటిలో  చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల సంఖ్య 43,580కి చేరడం మరింత విశేషం. విద్యా వ్యాప్తికి గౌరీ బాయి చేసిన కషికి ముందే 1806లోనే క్రై స్తవ మిషనరీలు ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించాయి. తద్వారా అణగారిన కులాలైన ఇళవ, శనర్స్‌కు విద్యావకా శాలు లభించాయి. 1837 నాటికే పదిహేను బాలికల పాఠశాలల్లో 361 మంది అమ్మాయిలకు చదువుకునే అవకాశాన్ని కల్పించారు.
 
సంస్కరణణోద్యమాలు, కమ్యూమిస్టు ప్రభుత్వాల అండదండలు
ఈ రెండు ప్రయత్నాలకు తోడుగా పులయ అనే అంటరాని కులాలపక్షాన అయ్యంకాళి, ఇళవ కులం నుంచి ఉద్భవించిన నారాయణ గురు ఉద్యమాలు కేరళ సమాజాన్ని అట్టడుగు పొరల్లో నుంచి చైతన్యవంతం చేశాయి. 1875లో 3.15 శాతంగా ఉన్న ఇళవ కులం అక్షరాస్యత నారాయణగురు కషి వలన 1903లో 13.71 శాతానికి చేరుకున్నది. 1903కల్లా శ్రీనారాయణగురు ధర్మ పరిపాలన యోగం(ఎన్.ఎన్.డి.పి) స్వయంగా పాఠశాలలను ప్రారంభించే స్థాయికి చేరుకుంది.

ప్రముఖ దళిత నాయకులు అయ్యంకాళి స్థాపించిన సాధుజన పరిపాలన సభ కూడా అంటరాని కులాల విద్యావ్యాప్తి కోసం నిరంతర ఉద్యమాన్ని నిర్వహించింది. 1912 నుంచి 1930 ట్రావెన్‌కోర్ అసెంబ్లీ సభ్యునిగా ఉన్న అయ్యంకాళి పులయ ప్రజలను అక్షరాస్యులను చేయడం కోసమే తన శక్తియుక్తులను ఎక్కువగా వినియోగించారు. ఆధిపత్య కులమైన నాయర్లు కూడా తమ జాతి మహిళలను విద్యావంతులను చేసే కషిని  ప్రారంభించారు. 1884లో మలయాళీ సభను స్థాపించారు. ఆ క్రమం లోనే మలయాళీ ముస్లింలు కూడా 1922లో కేరళ ముస్లిం ఐక్య సంఘం స్థాపించి తమ పిల్లల చదువు పట్ల శ్రద్ధను కనబరిచారు.
 
స్వాతంత్య్రానంతరం కేరళలో జరిగిన అనూహ్య రాజకీయ మార్పులతో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. బడ్జెట్ కేటాయింపుల్లో విద్యకు ప్రాధాన్యాన్నిచ్చింది. నేటికీ  ఏటా అభివద్ధి పనులకు కేటాయిస్తున్న బడ్జెట్‌లో 40 శాతం విద్య మీదనే కేరళ వెచ్చిస్తోందంటేనే విద్యారంగంలో ఆ రాష్ట్ర ప్రగతికి ప్రధాన కారణం ఏమిటో బోధపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం, ఎయిడెడ్ విద్యాసంస్థల భాగస్వామ్యం కేరళలో ఎక్కువ.

ప్రై వేట్ విద్యాసంస్థలు అక్కడ కూడా ఇటీవలి కాలంలో పెరిగిన మాట నిజమే, అయినా ఇప్పటికీ ప్రాథమిక, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో ప్రభుత్వ పాత్ర గణనీయంగానే కనిపిస్తున్నది. విద్యా వ్యాప్తిలో, నిరక్షరాస్యతా నిర్మూలనలో కేరళ మీడియా నిర్వహించిన పాత్ర సైతం ప్రశంసనీయమైనది. ఈ విషయంలో మలయాళ మనోరమ వంటి పత్రికల కషి ప్రత్యేకించి కొనియాడదగినది.  
 
 కేరళ ప్రభుత్వాలు విద్య పట్ల చూపిన శ్రద్ధ వల్లనే అక్కడి విద్యా వంతులకు బయటి రాష్ట్రాల్లో, విదేశాల్లో మంచి అవకాశాలు లభించాయి, లభిస్తున్నాయనడంలో సందేహం లేదు. మన తెలుగు రాష్ట్రాలకు అది బాగా తెలిసిన సంగతే.  విద్య, సేవా రంగాలలో ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, ప్రై వేట్ హాస్పిటల్స్‌లో ఎక్కడ చూసినా కేరళ యువతీయువకులే మనకు కనిపిస్తారు. తెలంగాణలోని గ్రామీణ ప్రజలు కేరళ టీచర్లున్న ప్రైవేట్ పాఠశాలలకు  తమ పిల్లలను పంపడానికి ఎక్కువగా మొగ్గు చూపడమే దీనికి నిదర్శనం.
 
 కేరళ నుంచి ఇతర ప్రాంతాలకు ఉద్యోగావకాశాలకోసం వెళ్ళేవారిలో నూటికి 90 శాతానికి పైగా నైపుణ్యం కలిగినవారే. ఉదాహరణకు, గల్ఫ్ దేశాలలో  పనిచేస్తున్న వైట్ కాలర్ ఉద్యోగుల్లో నూటికి 70 శాతం కేరళ వారే. 100 మంది ఐటీఐ చదువుకున్న వాళ్లు బయటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుంటే, ఇందులో 40 మంది కేరళకు చెందినవారేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. కేరళ విద్యావిధానం సష్టించిన నైపుణ్యం ఆ రాష్ట్రానికి ఒక వరంగా పరిణమించింది. 1998లో ఆ రాష్ట్రం నుంచి 14 లక్షల మంది నిపుణ కార్మి కులు గల్ఫ్‌కు వలస వెళితే, ఆ సంఖ్య 2014కు 24 లక్షలకు చేరుకున్నది.  ఆ రాష్ట్రానికి 1998లో విదేశీ మారకద్రవ్యం ద్వారా రూ. 13వేల కోట్ల ఆదాయం వస్తే, 2014లో అది రూ. 71 వేల కోట్లకు పెరిగింది.
 
 అక్షరాస్యతలో అట్టడుగునుంటే నిపుణ శ్రామికులకు కొరతే
 తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యతలో అట్టడుగున ఉండటం మాత్రమే కాదు. నైపుణ్యం కలిగిన మానవ వనరులలో కూడా మనం అధోగతిలోనే ఉన్నాం. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారు కేరళతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువగా ఉండడం మాత్రమే కాదు, చాలా హీనమైన పనులను వారు చేయాల్సివస్తోంది. తెలంగాణ నుంచి మట్టిపని చేయడానికి మగవాళ్లు ఎక్కువమంది గల్ఫ్‌కు వెళుతుంటే, ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇంటిపనివారిగా స్త్రీలు ఎక్కువగా అక్కడికి వెళుతున్నట్టు తెలుస్తోంది. నైపుణ్యం అక్కర్లేని ఈ పను లకు వెళుతున్న వారిలో అత్యధికులు నిరక్షరా స్యులు కావడంవల్ల వారు అక్కడ అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. గల్ఫ్ దేశాల చట్టాలు, విధానాలు తెలియక వేలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు.
 
 విద్యారంగంలో, నిరక్షరాస్యత నిర్మూలనలో ఇంత ప్రగతి సాధించిన కేరళలో కూడా ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నదన్న విషయాన్ని మరువకూడదు. ఇతర కులాలకు, ఎస్సీ, ఎస్టీలకు విద్య విష యంలో అంతరాలు అధికంగానే ఉన్నాయి. దాదాపు పదిశాతంగా ఉన్న ఎస్సీలు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారు. మొత్తం కేరళ అక్షరాస్యత  93 శాతం అయితే, ఎస్సీల అక్షరాస్యత 81 శాతం మాత్రమే.  
 
 ప్రపంచీకరణ, ప్రై వేటీకరణ, సరళీకరణ విధానాలు కేరళను కూడా వదిలిపెట్టలేదు. ఫలితంగా పేదలైన ఎస్సీలు, ఎస్టీలు కొన్ని కింది స్థాయి వెనుకబడిన కులాలు ఇంకా అంతరాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో గెలిచిన సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య సంఘటన ప్రభుత్వం విద్యావిధానంలోని లోపాలను సరిదిద్ద డానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది.
 
 ఆ రాష్ట్ర విద్యా మంత్రి రవీంద్రనాథ్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ కేరళ విద్యావిధానంలో, ముఖ్యంగా ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి సమర్థవంతమైన నిపుణు లను తయారు చేస్తామని ప్రకటించారు. కేరళలో కూడా విద్యా వ్యవస్థ వ్యాపారమై పోయిందని, దానిని ఇంకా కొనసాగనివ్వమని, విద్యా స్వర్ణ యుగాన్ని తిరిగి సాధిస్తామని ఆయన ప్రకటించారు. కేరళ అందించిన అనుభవం, అనుసరించిన మార్గం ఇప్పటికైనా దేశం మొత్తానికి, ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాలకు స్ఫూర్తినివ్వగలిగితే ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం తెలుగుబిడ్డలు గుర్తుంచుకోదగిన రోజవుతుంది.
 
 

మల్లెపల్లి లక్ష్మయ్య
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ’ మొబైల్ : 97055 66213

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement