సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: కొన్నాళ్లుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకనున్నాయి. సాధారణంగా ఏటా జూన్ ఒకటో తేదీకి ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తుగా అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు కూడా తప్పాయి. ఈనెల ఏడు, లేదా ఎనిమిది తేదీల్లో కేరళలోకి ప్రవేశించవచ్చని ఐఎండీ పేర్కొంది.
ప్రస్తుతం కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులేర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం వంటి పరిణా మాలున్నాయి.
దీంతో శుక్రవారం నాటికల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ బుధవారం వెల్లడించింది. అనంతరం ఈ రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతాయని తెలిపింది. అలాగే అరేబియా సముద్రం, మొత్తం లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని వివరించింది.
మరో మూడు రోజులు వడగాలులే
ఇటు రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం రాష్ట్రంలో భగభగలతో జనం విలవిల్లాడారు. కరీంనగర్ జిల్లా తంగులలో 45.8 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మేడారంలో 45.5 డిగ్రీలు నమోదైంది. కాగా, రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉంది.
గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు రుతుపవనాల ఆగమనం నేపథ్యంలో రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. మరికొన్నిచోట్ల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment