
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో బాలబాలికల నిష్పత్తిలో అంతులేని అంతరం ఉన్నట్టు తాజా పరిశీలనలు తేల్చి చెప్పాయి. స్త్రీల అభ్యున్నతికి అది చేశాం, ఇది చేశాం అంటూ ప్రభుత్వం గుప్పిస్తున్న ప్రకటనలకూ వాస్తవికతకూ నక్కకీ నాగలోకానికీ ఉన్న తేడా ఉన్నట్టు ఈ పరిశోధన తేల్చి చెప్పింది. 2007 నుంచి 2016 కి ఆంధ్రప్రదేశ్ బాలబాలికల నిష్పత్తి దేశంలోకెల్లా అత్యంత దారుణంగా పడిపోయి సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బాలబాలికల నిష్పత్తి 2007 నుంచి, 2016కి 168 పాయింట్లు పడిపోయి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు ఆడ పిల్లలు కేవలం 806 మంది ఉన్నట్టు తేలింది. 2007లో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 974 మంది ఆడపిల్లలుంటే ఆ సంఖ్య తీవ్రంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో స్త్రీపురుష అంతరాలు అంతకంతకూ అధికమౌతున్నట్టు తాజా పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి. కర్నాటకలోనూ పరిస్థితి ఇదే కొనసాగుతోంది. కర్నాటకలో 2007 – 2016 మధ్యన బాలబాలికల లింగ నిష్పత్తి 108 పాయింట్లు పడిపోయింది. తమిళనాడులో 95 పాయింట్లు పడిపోయి ఆ రాష్ట్రంలో సైతం లింగనిష్పత్తి వ్యత్యాసం అధికంగా ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో బాలబాలికల లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది బాలురకీ 954 మంది బాలికలు. 2016 నాటికి 73 పాయింట్లు పడిపోయి ఆడపిల్లల సంఖ్య మరింత క్షీణించి 881కి చేరింది. ఇదే సమయంలో గోవాలో 47 పాయింట్లు పడిపోయింది.
దక్షిణాదిలో లింగ నిష్పత్తిలో కేరళ భేష్....
దక్షిణ భారతదేశంలో కేవలం కేరళలో మాత్రమే లింగనిష్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించింది. కేరళ లో లింగనిష్పత్తి 10 పాయింట్లు పెరిగి ప్రతి వెయ్యి మంది బాలురకి 2007లో 944 మంది ఆడపిల్లలు పుడితే 2016 కి ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి 954 మంది ఆడపిల్లలు ఉండడం ఆశావహంగా కనిపించింది. ఇదే కాలంలో ఒడిశాలో చైల్డ్ సెక్స్ రేషియో 61 పాయింట్లు పడిపోయింది, ఉత్తరాఖండ్ లో 44 పాయింట్లకు పడిపోయింది.
2016లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో సెక్స్ రేషియో అగాధంలో....
పుట్టుకలో ఆడపిల్లల సంఖ్య అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటే రాజస్థాన్ కూడా అదే స్థితిలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పుట్టుకలో అంతరాన్ని బట్టి ఆడపిల్లల పట్ల వివక్ష తీవ్రత అర్థం అవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతివెయ్యి మంది మగపిల్లలకీ ఆడపిల్లలు కేవలం 806 మంది ఉంటున్నారు. ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి ఆడపిల్లలు ఉత్తరాఖండ్‌లో 825 మంది, బీహార్‌లో 837 మందికే పరిమితమయ్యారు. తమిళనాడు ఆడపిల్లల నిష్పత్తిలో ఐదో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ప్రతివెయ్యి మంది మగపిల్లలకు 840 మంది ఆడపిల్లలే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడించాయి.
ఈశాన్య రాష్ట్రాలు మేలు
లింగ నిష్పత్తిలో ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. సిక్కింలో ప్రతి వెయ్యిమంది మగపిల్లలకీ అత్యధికంగా 999 మంది ఆడపిల్లలు ఉంటున్నారు. నాగాలాండ్‌లో 967 మంది, ఆరుణాచల్ ప్రదేశ్‌లో 964, మిజోరాం సైతం 964, త్రిపుర లో 917 మంది ఆడపిల్లలతో 2016లో పుట్టుకలో లింగనిష్పత్తి విషయంలో మెరుగ్గా ఉన్నట్టు తేలింది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో 987 మంది ఆడపిల్లలూ, ఛత్తీస్‌గఢ్‌లో 980 మంది ఆడపిల్లలూ, డామన్ డయ్యూలో 974 మంది ఆడపిల్లలతో ప్రతి వెయ్యి మంది మగపిల్లలతో మిగిలిన రాష్ట్రాలకంటే కొంత మెరుగైన పరిస్థితే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment