ప్రకృతి ప్రేమికులకు పచ్చని స్వాగతం
⇒ పర్యాటక రంగ అభివృద్ధికి ఎకో టూరిజం
⇒ కేరళ పెరియార్ టైగర్ అభయారణ్యం ఆదర్శం
⇒ పర్యావరణం, అటవీ సంరక్షణే ధ్యేయం
⇒ 20వ శతాబ్దంలో పెరిగిన ప్రాధాన్యం
పర్యాటక రంగాన్ని విశేషంగా ఆకర్షించడానికి దేశంలో ఎకో టూరిజం కేంద్రాలు వెలిశాయి. యాత్రికుల సంఖ్యను పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఆదివాసీలు, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల భాగస్వామ్యంతో వనాలు అభివృద్ధి చేయడం ఈ కేంద్రాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశాలు. 20వ శతాబ్దంలో దేశ వ్యాప్తంగా ఎకో టూరిజం ప్రాధాన్యం పెరిగింది. కేరళలోని పెరియార్ టైగర్ అభయారణ్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ స్థానికులకు జీవనోపాధి కల్పించడంతోపాటు విస్తృత అభివృద్ధి చేశారు. ఇటీవల కేరళలో రెండ్రోజులపాటు ఆరు దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎకో టూరిజంపై చర్చించారు. తెలంగాణలో ఈ తరహా విధానాన్ని అవలంబిస్తామని అటవీ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎకో టూరిజం విశేషాలు మీకోసం.. -సాక్షి, స్కూల్ ఎడిషన్
తేన్మల ఎకో టూరిజం ప్రాజెక్టు..
భారతదేశంలో మొదటి పర్యావరణ ప్రాజెక్టు. ఇది కూడా కేరళ రాష్ట్రంలోని తిరుమంగళం రోడ్డులో ఉంది. సహజ ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం విలసిల్లుతోంది. ప్రకృతి ప్రియులకు, సాహస క్రీడాకారులకు కలిపి 5 విభాగాలుగా విభజించారు. కల్చర్ జోన్‌లో స్థానికులు దుకాణాలు నడుపుతున్నారు. మ్యూజికల్ డాన్స్ ఫౌంటేన్ ఉంది. సాహస క్రీడల జోన్‌లో పాత్‌వేస్ వివిధ రకాల క్రీడలకు సంబంధించిన అంశాలుంటాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాజెక్టు తెరిచి ఉంచుతారు. లేళ్ల పార్కులో పిల్లలకు ఎన్నో రకాల వినోదాలుంటాయి. పర్యాటకులు అక్కడి సిబ్బందితో సమాచారం అడిగి తెలుసుకోవచ్చు.
తెలంగాణలో..
పెరియార్ టైగర్ రిజర్వు ఎకో టూరిజం ప్రాంతాన్ని దక్షిణాది రాష్ట్రాల అటవీ మంత్రులతోపాటు తెలంగాణ మంత్రి జోగు రామన్న కూడా సందర్శించారు. అక్కడి టైగర్ ప్రాజెక్టు తరహాలో ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యాన్ని తీర్చి దిద్దుతామని మంత్రి వెల్లడించారు. ఆ జిల్లాలోని కడెం, జన్నారం ఎకో టూరిజానికి అనువుగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని పలు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఈ ఏడాది జూలైలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని మృగవని ఎకో టూరిజం కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతరించి పోతున్న తెగల నాటికలు, కళలను సందర్శకులకు పరిచయం చేయడం దీని ఏర్పాటు ముఖ్య ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలోనూ 300 ఎకరాల విస్తీర్ణంలో ఎకో టూరిజం పార్కులు ఏర్పాటు చేస్తామని రెండునెలల కిందట ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 39 ప్రాంతాల్లో బీచ్ రిసార్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. విశాఖపట్నంలోని లంబసింగి, హార్స్‌లీహిల్స్‌లను వేసవి విడిది ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అటవీశాఖ సమన్వయ సహకారంతో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు సర్కారు చెబుతోంది.
కేరళ ఎందుకు ఆదర్శం?
కేరళలోని పెరియార్ టైగర్ అభయారణ్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా ఆ రాష్ట్రం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తూ సత్ఫలితాలు సాధించింది. పెరియార్ అభివృద్ధిలో ఆదివాసీలు కీలకపాత్ర పోషించినట్లు అటవీశాఖ పరిశీలనలో తేలింది. పోచర్స్ స్థాయి నుంచి ప్రొటెక్టర్ స్థాయికి ఎదిగినట్లు నిపుణులు నిర్ధరించారు. బ్యాంబో రాఫ్టింగ్, పగ్‌మార్క్ ట్రయల్, జంగిల్ స్కౌట్ వంటి కొత్త విధానాలు పెరియార్‌లో ప్రవేశపెట్టారు. తద్వారా ఈ ప్రాజెక్టు పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తోంది.
ఎకో టూరిజం అంటే?
ఒక నిర్ణీత ప్రాంతంలోని అరణ్యాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పరచడాన్ని ఎకో టూరిజం అంటారు. 1990లో అంతర్జాతీయ టూరిజం సొసైటీ (టైస్) ద్వారా ప్రతిపాదించారు. దీని ప్రాథమిక సూత్రాల ప్రకారం పర్యావరణాన్ని సంరక్షిస్తూ అడవులను కాపాడతారు. స్థానిక ప్రజల శ్రేయస్సుకు పాటుపడతారు. సహజ వనాల పరిరక్షణ బాధ్యత తీసుకుంటారు. ప్రయాణ సంబంధాలను మెరుగుపరుస్తారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పరిరక్షణ కోసం నేరుగా ఆర్థిక ప్రయోజనాలను పొందేలా చర్యలు తీసుకుంటారు. అటవీ ప్రాంతంలోని ప్రజల సంస్కృతిని గౌరవించేలా అభివృద్ధి చేస్తారు.
ఏం చేస్తారు?
జీవశాస్త్ర, సాంస్కృతిక వైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థ ద్వారా పరిరక్షించడం
స్థానిక జనాభాకు ఉద్యోగ అవకాశాలు
కల్పించడం ద్వారా జీవ వైవిధ్య స్థిరమైన వినియోగం సాధించడం
స్థానిక సంఘాలు, అన్ని సామాజిక, ఆర్థిక ప్రయోజనాల భాగస్వామ్యం
ఆదివాసీల ఔషధాలు, ఇతర ఉత్పత్తులను ఎకో టూరిజంలో ఉపయోగించడం
వ్యర్థాలను నివారించడం, పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని అరికట్టడం
వృక్ష, జంతు జాలాన్ని ప్రధాన ఆకర్షణగా తయారు చేయడం
ఎకో టూరిజం ద్వారా స్థానికులకు జీవనోపాధి తోపాటు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం.