కొత్త కోణం
‘‘ప్రజలే చరిత్ర నిర్మాతలు. సమస్యలు సృష్టించిన భౌతిక పరిస్థితులను మార్చడానికి ప్రజలు సాగించే ప్రయత్నాల నుంచే ఉద్యమాలు ఉద్భవిస్తాయి. ఆ ఉద్యమాల నుంచి, ప్రజాశ్రేణుల నుంచే నాయకులు పుడతారు. ఆ నాయకులే ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. అంతేగానీ, ఎవరో కొందరు నాయకుల వల్లనే ఉద్యమాలు రావు. ప్రముఖ చరిత్ర కారుడు ఇ.హెచ్.కార్ చెప్పిన సత్యాలివి. ఇదే చరిత్ర. వర్తమానం. భవిష్యత్తు కూడా. అయితే రాజులు, చక్రవర్తులు, ప్రజా స్వామ్య ప్రభుత్వాలు సైతం వాళ్ళు సృష్టించిన సమస్యలను, సామాజి కార్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి బదులు, ఉద్యమాలను అణచి వేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. చివరకు ఎంతటి అమాను షాలకైనా ఒడిగడతారు. అంతిమంగా ప్రజానాయకులను నిర్బంధిస్తే, నిర్మూలిస్తే ఉద్యమాలు సమసిపోతాయని భ్రమిస్తారు. చరిత్ర నిండా ఇవే సాక్ష్యాలు.
సంవత్సరంన్నర క్రితం భీమా కోరేగావ్ కేసులో నిర్బంధించిన ప్రముఖ విప్లవ కవి వరవరరావు నిర్బంధం కూడా సరిగ్గా ఇదేకోవకు చెందింది. ఆకలిగొన్న జనం ఆఖరి అస్త్రమే ఉద్యమం. ప్రభుత్వాల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా విసిగివేసారిన తాడిత, పీడిత జనం పక్షాన ఆ ఆఖరి క్షణం వరకూ నిలవాలన్నదే బహుశా విప్లవకవి వర వరరావు కల. ఆయన కలలో సైతం ప్రజల గొంతుకై పలవరించారు. ఆయన గొంతు పాలకుల నిజస్వరూపాలను పట్టిచ్చిన జనవాక్కు అయివుండవచ్చు. ఆయన వాక్కు కత్తికన్నా పదునైన ఆయుధమే అవ్వొచ్చు. కానీ ఏ ప్రభుత్వాన్నీ కూల్చే కుట్రలు మాత్రం ఆయన చేయలేదు. 81 ఏళ్ళ సుదీర్ఘజనజీవన యానంలో, ఈ పాలకుల కళ్ళు గప్పి ఆయన ఏ ఆయుధాలూ పట్టిందీ లేదు. ఆయన ప్రతికదలికనూ ప్రభుత్వాల వేనవేల నిఘానేత్రాలు వెంటాడని క్షణం అంతకన్నా లేదు. నిత్యసంఘర్షణనీ జనం పునాదిగానే సాగించారు. నిత్యం జనం మధ్యనే నిలిచిపోరాడారు. నిజానికి వరవరరావు ఏ ఆయుధాలతోనో, ఎక్కడో అడవుల్లోనో దొరికినవాడు కాదు. గత యాభై ఏళ్ళకుపైగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, నోరులేని ఆదివాసీల పక్షాన, దళితుల పక్షాన, సాధారణ జనం పక్షాన కవిత్వం రాస్తూ, రచనలు చేస్తూ, జనమే శ్వాసగా జీవిస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎందరు భయపెట్టినా, ఏనాడూ తన మార్గాన్ని వీడలేదు. నిర్బంధాలకు వెరువక, నిర్భీతితో, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పాలకులపై తన ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆయన ఆచరించిన, ఆచరిస్తున్న సిద్ధాంతం పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉండవచ్చు. నచ్చకపోవచ్చు. దానికి అభ్యంతరం లేదు. ఆయన అభిప్రాయాలను విభేదించే వాళ్ళు, దానిని వాళ్ళ ఆచరణతో, వాళ్ళు అనుసరిస్తోన్న సిద్ధాంతాలతో ఎదుర్కోవాలి. అంతిమంగా ప్రజలను గెలుచుకోవాలి.
కానీ ఎనభై ఏళ్ళ వయస్సులో, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో, చివరకు ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్–19 బారిన పడిన తర్వాత కూడా ఆయనను ఇంకా ఖైదీగా చెరలో ఉంచుకోవడం ఎంత మాత్రం మానవీయత అనిపించుకోదు. ప్రపంచ దేశాల్లోని ఖైదీలను కోవిడ్ కారణంగా విడిచిపెడుతోంటే, వరవరరావు లాంటి ప్రాణాపాయంలో ఉన్న 80 ఏళ్ళుపైబడిన ప్రజానాయకుడిని జైల్లో నిర్బంధించి, కుటుంబ సభ్యులను కూడా కలవనీయకపోవడం ఆయన జ్ఞాపకాలను కూడా చెరిపెయ్యాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదు.
వరవరరావు పట్ల ప్రభుత్వం, పోలీసులు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడానికి కారణం ఎంత మాత్రం హేతుబద్ధమైనది కాదు. ఆయన ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తి. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మాటలు తడబడుతున్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. జీవిత సహచరినే గుర్తించలేని స్థితి, ఇలాంటి స్థితిలో ఆయన్ను బంధించి ఉంచడంలో అర్థం ఏముంటుంది. ఇంకా ఆయనను ప్రభుత్వం ప్రమాదకారిగా భావించడంలో అర్థం లేదు. అలాగే 90 శాతం శారీరక వైకల్యం కలిగిన సాయిబాబను కూడా నిర్బంధించడం దారుణం. వ్యక్తుల వల్ల ఉద్యమాలు రావు, నాయకుల మాటలతో, రాతలతో ప్రజలు ఆయుధాలు పట్టుకోరు. ఏ ఉద్యమానికైనా భౌతిక పరిస్థితులే కారణం. ఏ వ్యక్తీ ప్రాణాలను ఫణంగా పెట్టి అడవుల్లో ఉంటూ, పోలీసులను, సైనికులను ఎదుర్కొని పోరాడాలని అనుకోడు. అలా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారు తమ కోసం అడవిబాట పట్టలేదు. సర్వసుఖాలనూ తృణప్రాయంగా వదులుకొని చావుకైనా సిద్ధమవ్వడమంటేనే నిస్వార్థపరత్వమని అర్థం. అలాంటి వారు ప్రజలకోసం అడవిబాట పడితే, ఆయుధ మార్గాన్ని ఎంచుకుంటే, చేతనైతే ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలి. ప్రజలు మంచి జీవితాన్ని కోరుకుంటారు. అందరికీ సమాన హక్కులుండాలని కోరుకుంటారు. మనుషులంతా చట్టం ముందు ఒక్కటేనని భావిస్తారు. అది అబద్ధమని రుజువైన రోజు ప్రజలకు పాలకుల మీద విశ్వాసం పోతుంది. అందుకే ప్రభుత్వాలే ఈ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వం చేసిన తప్పు కాదు. ప్రస్తుత ప్రభుత్వాలతో పాటు గతంలో పాలించిన అన్ని కేంద్ర ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, అసలు సమస్య పరిష్కారాన్ని దాటవేశాయి.
నక్సలైట్ ఉద్యమం ఈనాటిది కాదు గత యాభైయ్యేళ్ళ క్రితం ప్రారంభమైంది. ఇప్పటి సగం జనాభాకు దాని ఆవిర్భావం తెలియదు. అయితే నక్సలైట్ ఉద్యమం నక్సల్బరిలో ప్రారంభమయ్యే నాటికే శ్రీకాకుళం, తెలంగాణల్లోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రజా ఉద్యమంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో 1967 ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న షావుకార్ల దోపిడీ, భూస్వాముల అణచి వేత, గిరిజనుల భూములను రకరకాల పేర్లతో లాక్కోవడం జరిగింది. ఉద్దానంలో భూస్వాములు పేద ప్రజల భూములను దురాక్రమణ చేశారు. దీంతో అక్కడి ప్రజలు భూస్వాములపై తిరగబడ్డారు. అప్పుడే చదువుకొని, కమ్యూనిస్టు భావజాలంతో చైతన్యవంతమైన యువతరం, ప్రత్యేకించి ఉపాధ్యాయ వర్గం ఆదివాసుల పక్షాన నిలబడింది. యావత్ దేశానికే ఈ ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. ముందుగా ప్రజలు ఆయుధాలు పట్టుకోలేదు. ఒక ఊరేగింపుపై భూస్వాములు చేసిన దాడిలో ఇద్దరు కార్యకర్తలు కోరన్న, మంగన్నలు చనిపోయారు. ఆ తరువాతనే ఉద్యమాలకు ఆయుధాల అవసరం ఏర్పడింది. ఆత్మరక్షణ కోసం వారు ఆయుధమార్గాన్ని అనుసరించారు. అప్పటికి ప్రజల దగ్గరున్న ఆయుధాలు బరిసెలు, కొడవళ్ళే, వాటితోటే ప్రజలు పోలీసులపై, పాలకులపై తిరగబడ్డారు. ప్రజాఉద్యమం సాయుధంగా మారిన సందర్భాలను ఎందరో చరిత్రకారులు రికార్డు చేశారు.
అదే కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొరలు, భూస్వాములు కులవివక్ష, అంటరానితనం పాటిస్తూ, అన్ని రకాల వృత్తుల వారినుంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం పరిపాటి. మహిళలపై అత్యా చారాలు నిత్యకృత్యంగా మారాయి. 1974–75 ప్రాంతంలో ప్రజలే ముందుగా తిరుగుబాటు చేశారు. అందుకు సిరిసిల్ల ప్రాంతంలోని నిమ్మపల్లి, జగిత్యాల ప్రాంతంలోని మద్దునూరు గ్రామాల ప్రజలు తిరుగుబాట్లే దానికి సాక్ష్యం. ఆ ప్రాంతంలో చదువుకున్న యువకులు నక్సలైట్ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. నక్సలైట్ పార్టీల నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు. వేలాది మంది ప్రజలు ఈ ఉద్య మంలో మమేకం అయ్యారు. దానికి తట్టుకోలేని భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు. దీంతో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని చిన్నారెడ్డి ప్రభుత్వం 1978 అక్టోబర్‌లో ఆ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో గ్రామ గ్రామాన పోలీసులు క్యాంపులు వెలిశాయి. వేలాది మందిని అరెస్టు చేశారు. వందలాది మంది యువకులు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళారు. దీంతో నక్సలైట్ పార్టీలు తమ ఉద్యమాన్ని అజ్ఞతంలో ఉంటూ నడపడం మొదలు పెట్టాయి. 1979, 80 వచ్చే సరికి పోలీసుల దాడులతో పాటు ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి. నక్సలైట్ సంస్థలు కూడా ఆయుధాలు పట్టినట్టు ప్రకటించుకున్నాయి. క్రమంగా ఉద్యమం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలికి విస్తరించడానికి ఇంద్రవెల్లి సహా అనేక ఘటనలు కారణమయ్యాయి. దీనర్థం నక్సలైట్ ఉద్యమం ఆవిర్భావానికి, విస్తరణకు భౌతిక పరిస్థితులే కారణం.
అంతే కానీ ఏ ఒక్క వ్యక్తీ కారణం కాదు. నక్సలైట్ ఉద్యమానికి మద్దతిస్తున్న వాళ్ళను అరెస్టు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న నక్సలైట్ కార్యకలాపాలతో పాటు, గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ సమీక్షించుకొని, ప్రజావసరాలకు తగినట్టుగా తమ పాలనను మరల్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో దళితులు, ఆదివాసుల్లో ఎంతో నిరాశా, నిస్పృహలు చోటు చేసుకొని ఉన్నాయి. ఆ అసంతృప్తి ఎటువైపు దారితీస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలే కానీ, వాటివల్ల ఉద్భవించిన ప్రజాఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జటిలమౌతుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. వ్యక్తులను నిర్బంధిస్తేనో, వ్యక్తులపై ప్రతీకార చర్యలకు పాల్పడితే చరిత్ర క్షమించదు.
ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన ఇందిరాగాంధీ పేరు పక్కన ఆ మరక ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆ పాపం మూటగట్టుకోకూడదనుకుంటే ప్రజాపోరాట యోధుడు, అపర మేధావి, అలుపెరుగని శ్రామికజనపక్షపాతి వరవరరావుని తక్షణమే విడుదల చేయాలి. ఇదే విషయాన్ని ప్రపంచదేశాల్లోని మేధావులెందరో ప్రత్యక్షంగా డిమాండ్ చేశారు. దేశవిదేశాల్లోని 140 మంది మేధావులు, తాత్విక వేత్తలు, నలభైమంది రచయితలు, కవులు వరవర రావుని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని అంగీకరించి వరవరరావుని తక్షణం విడుదల చేస్తే శత్రువుని సైతం చేతచిక్కితే హాని కలిగించరాదని నమ్మే ఈ దేశం, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సిన పని ఉండదు.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077
మల్లెపల్లి లక్ష్మయ్య
Comments
Please login to add a commentAdd a comment