ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలో ఉందని ‘వి–డెమ్’ నివేదిక చెబుతోంది. బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అంటే భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. కానీ భారత్ లాంటి దేశంలో ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు.
వేల సంవత్సరాలుగా పాతుకు పోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది. ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది.
భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం. మానవ హక్కులూ, ప్రజాస్వామ్య భావాలూ, సమానత్వ అంశాలూ మేళవింపుగా ఉన్న ఆధునిక రాజ్యాంగం కలిగిన దేశం కూడా. అయితే ఇటీవల ప్రజాస్వామ్య దేశం తన ఉదార ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వ పోకడలకు దగ్గరవుతున్నట్టు, ‘వి–డెమ్’ తన పరిశోధనలో తేల్చింది.
ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన దేశం 97వ స్థానంలో, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థల్లో 108వ స్థానంలోకి వెళ్ళింది. మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, మహిళా స్వేచ్ఛ, ఆదిమ తెగలు, ఇతర వర్గాలకు సంబంధించిన స్వేచ్ఛల్లో మనం ఇతర దేశాలకన్నా వెనుకబడి ఉన్నామన్న విషయాన్ని చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు.
బయటి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే ఒక ఐదారు అంశాలు ప్రస్తావనకు వస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్ఛతో పాటు పత్రికా స్వాతంత్య్రం లాంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. స్వీడన్ విశ్వవిద్యాలయాల ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తోన్న వి–డెమ్ (విభిన్న ప్రజాస్వామ్యాలు) సర్వే కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలనే పేర్కొంటుంది.
అయితే భారత్ సహా మరికొన్ని దక్షిణాసియా దేశాలలో ఈ పరిశీలన మాత్రమే సరిపోదు. ఇక్కడ ప్రభుత్వాల విధానాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించలేవు. వేల సంవత్సరాలుగా పాతుకుపోయిన కుల వ్యవస్థ ఈ దేశ పాలననూ, ప్రగతినీ నిర్ణయిస్తున్నది.
మూల కారణం
ప్రస్తుతం మన దేశంలో మోదీ పాలన నియంతృత్వాన్ని అమలు చేస్తున్నదనే విషయం ఎక్కువగా చర్చకు వస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. రాజ్యాంగ విలువలకు స్థానం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని విధించి అణచివేతను కొనసాగించారు. కానీ ఇందిరాగాంధీ నియంతృత్వానికీ, మోదీ నియంతృత్వానికీ గుణాత్మకమైన తేడా ఉన్నదన్న విషయాన్ని గమనించాల్సి ఉంది.
ఇందిరాగాంధీ తన పాలనను కాపాడుకోవడానికి తాత్కాలికంగా నిర్బంధాన్ని అమలు జరిపారు. తదనంతరం తన తప్పు తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. మోదీ పాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, ప్రజలను విభజించి, రాజ్యాంగం ప్రకటించిన ‘మేమంతా భారతీయులం’ అనే భావనకు చరమగీతం పాడుతున్నది. రెండువేల సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న కుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటున్నది.
అయితే మోదీకి గానీ, భారతీయ జనతా పార్టీకి గానీ ఆ ధైర్యం కలగడానికి, అంత బహిరంగంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి పునాది ఇక్కడి కుల వ్యవస్థలో ఉంది. దానితో పాటు రోజురోజుకీ గుత్తాధిపత్యం వైపు వెళ్ళిపోతున్న ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రమాదాన్ని రాజ్యాంగ ముసాయిదాను సమర్థించిన 1949 నవంబర్ 25 రోజున బాబాసాహెబ్ అంబేడ్కర్ బహిరంగంగా దేశం ముందుంచారు.
‘‘ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ ద్వారా మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా ఆ తేడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఆ వ్యత్యాసాలను తొలగించుకోకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది’’ అంటూ ఆనాడు చేసిన హెచ్చరిక ఈరోజు మరింత సత్యంగా కనపడుతున్నది.
సోదరభావం కీలకం
ఇతర దేశాల ప్రజాస్వామ్య భావనకూ, భారత దేశంలోని ప్రజాస్వామ్య అవగాహనకూ తేడా ఉన్న విషయాన్ని కూడా అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. 1936లో రాసిన కుల నిర్మూలనలోనే ఆయన తన ఆలోచనలను ప్రపంచం ముందు పెట్టారు. ప్రజాస్వామ్యం అనగానే అది ఎన్నికలు, పాలన, ప్రభుత్వాల విధానాలు అని అనుకోవడం పొరపాటనీ, అది ప్రజల మధ్య ఉండే సంబంధాలను నిర్వచిస్తుందనీ కూడా అంబేడ్కర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి మూడు ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కీలకమని చెపుతూ, ఇందులో అత్యంత ముఖ్యమైనది సోదరత్వం అంటారు. ఇది భారత దేశంలో కొరవడిన అంశమని తేల్చారు.
గత డెబ్భై అయిదు సంవత్సరాలుగా అటు కాంగ్రెస్ గానీ, ఇతర పార్టీలు గానీ అంబేడ్కర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. కులవ్యవస్థను నిర్మూలించే ఎటువంటి ప్రయత్నాన్ని గానీ, ప్రణాళికను గానీ కాంగ్రెస్ తన సుదీర్ఘ పాలనలో ఏనాడూ చేయలేదు. కేవలం ఆర్థిక తోడ్పాట్ల వంటివి మాత్రమే ఈ దేశంలో దళితులు, ఆదివాసుల జీవితాల్లో సమూలమైన మార్పులు తీసుకురాలేవనీ, కులవ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించగలిగే పక్కా ప్రణాళిక అవసరమనీ గుర్తించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. అదే ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారింది.
ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. భారత దేశంలో ప్రభుత్వాల కన్నా ప్రజలే బలవంతులు. ప్రజల్లో తరతరాలుగా నాటుకొని పోయిన కుల వ్యత్యాసాలు, కుల అసమానతలు ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధం. గత పదేళ్ళలో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో బీజే పీ ప్రభుత్వం మనగలుగుతుందంటే కులాలలోని విభేదాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే.
దానితో పాటు, హిందూ మతంలోని పలు అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. గ్రామాల్లో ఏ కులాలైతే ఆధిపత్యంలో ఉన్నాయో వాటిని తమ బలంగా మార్చుకోవడం, అత్యధిక జనాభా కలిగిన కులాలను సమీకరించడం చూస్తే బీజేపీ ఎత్తుగడ ఏమిటో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
అదే సమయంలో గత వందల ఏళ్ళుగా ముస్లింలు, హిందువుల మ«ధ్య ఉన్న వైషమ్యాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో చాలా బలంగా వాడుకుంటున్నది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన మాట నిజమే కానీ, దాని బలమేమీ తగ్గలేదు. కులాల పట్ల ప్రజల్లో ఉన్న భావాలను రెచ్చగొట్టడం ఇటీవలి కాలంలో ప్రభుత్వాల విధానాల్లో, న్యాయస్థానాల తీర్పుల్లో స్పష్టంగా కనపడుతున్నది.
ఇటీవల దళితుల్లో పెరిగిన చైతన్యం అత్యాచారాల విషయంలో కేసులు నమోదు కావడానికి ఉపయోగపడింది. ఎస్సీ, ఎస్టీల కేసుల విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య కులాలకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది బీజేపీ. తమ పార్టీ పునాదిగా ఉన్న ఆధిపత్య కులాలను మరింత సంతృప్తి పరిచేందుకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల పేరుతో అసలు రాజ్యాంగాన్నే అపహాస్యం చేసింది.
చివరగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన వంటి విధానాలు ఏవి అమలు జరగాలన్నా కుల వ్యవస్థ ప్రధానమైన అవరోధం. దీనికి ప్రభుత్వాల బాధ్యత కన్నా, ప్రజల్లో కుల భావనలను తొలగించడం ముఖ్యం. ప్రజల్లో కుల అసమానతల పట్ల సానుకూలత ఉన్నంత వరకూ, గ్రామాల్లో ఇంకా ఈ కులవ్యవస్థ కొనసాగుతున్నంత వరకూ ప్రజాస్వామ్యమనే భావనకు ఆస్కారమే లేదు.
తాత్కాలికంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలకు ఊతం ప్రజల భావాల్లో ఉంది. అంబేడ్కర్ చెప్పినట్టు, ప్రజాస్వామ్యం, అంటే సమానత్వంతో కూడిన సామాజిక జీవన గమనం కోసం... ప్రభుత్వాల నిర్బంధాలు, నియంతృత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే... ప్రజల్లో ఉన్న కులవ్యవస్థను నిర్మూలించే దిశగా ఒక బలమైన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక కాగితపు పులిగా మాత్రమే మిగిలిపోతుంది.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077
Comments
Please login to add a commentAdd a comment