ఎందుకీ ప్రజాస్వామ్య పతనం? | India is ranked 104 in the rankings of world democracies | Sakshi
Sakshi News home page

ఎందుకీ ప్రజాస్వామ్య పతనం?

Published Sat, Jun 29 2024 4:32 AM | Last Updated on Sat, Jun 29 2024 4:32 AM

India is ranked 104 in the rankings of world democracies

భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీ కొద్ది సంవత్సరాల క్రితం సగర్వంగా ప్రకటించారు. ఆ మాట చారిత్రకంగా వాస్తవమని ఏ చరిత్రకారుడు కూడా అన్నట్లు లేడు. ఆధునిక సమాజాలు స్థిరపడినా కొద్దీ ఆధునిక ప్రజాస్వామ్యాల దశ మొదలైంది. అటువంటి ప్రాంతాలలో భారతదేశం కూడా ఒకటనటంలో సందేహం లేదు. ప్రపంచ ప్రజాస్వామ్యం వేల ఏళ్ళుగా రూపుదిద్దుకున్న చరిత్రలో భారత భూమి భాగస్వామ్యం ఉండటం గర్వించదగ్గ విషయం. అయితే, ‘వి–డెమ్‌’ ప్రకారం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్‌లో ఇండియా స్థానం 104. మొత్తం 179 దేశాలతో పోల్చినప్పటి స్థితి ఇది. భారత్‌ లాంటి మహత్తర దేశస్థానం ఎందువల్ల పడిపోయినట్లు? ఆ పతనానికి బాధ్యులెవరు? 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 27న పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమె ద్వారా ఒక ముఖ్యమైన మాటను చెప్పించగలదో లేదోనని ముందుగా కొంత అనుమానం కలిగింది. చివరకు చెప్పించటం చూసి సంతోషం కలిగింది. భారతదేశం ‘మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అభివర్ణించారామె. ప్రపంచ చరిత్ర పుటలలోకి వెళ్ళి చూసినట్లయితే ఆ మాటకు కొంత విలువ ఉంటే ఉండవచ్చు. కనుక అది చారిత్రక దృష్టితో సంతోషించదగిన మాటే. అయితే, రాష్ట్రపతితో ఆ మాట చెప్పించిన మోదీ పాలనలో, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్‌లో మన స్థానం 104కు ఎందుకు పతనమైందన్నది భారతీయుల సందేహం.

భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాతృక అని మోదీ కొద్ది సంవత్సరాల క్రితం సగర్వంగా ప్రకటించారు. ఆ మాట చారిత్రకంగా వాస్తవమని ప్రపంచంలో ఏ చరిత్రకారుడు కూడా అన్నట్లు లేడు. అయితే, క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాల క్రితం ప్రపంచంలోని పలు సమాజాలు నాగరికమైనా కొద్దీ అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల లక్షణాలు కనిపించసాగాయి. నిజానికి అందుకు బీజాలు ఆదిమ తెగల సమాజాలలోనే ఉన్నట్లు మానవ వికాస శాస్త్రజ్ఞులు చెప్తారు. 

ఆ తర్వాత దశలో ఆధునిక సమాజాలు స్థిరపడినా కొద్దీ ఆధునిక ప్రజాస్వామ్యాల దశ మొదలైంది. అటువంటి ప్రాంతాలలో భారతదేశం కూడా ఒకటనటంలో సందేహం లేదు. అవే పరిణామాలు గ్రీసు, ఈజిప్టు, ఇతర మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలు, చైనా వంటి చోట్ల కూడా చోటు చేసుకున్నాయి. ఆ విధంగా ఇవన్నీ క్రీస్తు పూర్వ కాలపు అక్క చెల్లెల్లన్నమాట. అందుకు అనుగుణంగానే ఈ ప్రాంతాలన్నింటా ప్రజాస్వామిక తత్త్వవేత్తలు, సంఘ సంస్కర్తలు, పరిపాలనా శాస్త్రవేత్తలు అప్పటినుంచే ఆవిర్భవించటం మొదలైంది.

మొత్తానికి ఆ విధంగా ప్రపంచ ప్రజాస్వామ్యం వేల ఏళ్ళుగా రూపుదిద్దుకున్న చరిత్రలో భారత భూమి భాగస్వామ్యం ఉండటం మనమంతా గర్వించదగ్గ విషయం. అయితే, అటువంటి మహత్తర దేశస్థానం ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల ర్యాంకింగ్స్‌లో ఇపుడు 104కు ఎందువల్ల పడిపోయినట్లు? ఆ పతనానికి బాధ్యులెవరు? ఆ స్థితి భారతీయులకు గర్వించదగ్గ విషయమా? ప్రజాస్వామ్య దేశాలు, వ్యవస్థలన్నింటిని ఎప్పటికప్పుడు మదింపు చేసే ప్రపంచ స్థాయి సంస్థ పేరు ‘వి–డెమ్‌’. దాని నివేదికలు కొద్ది సంవత్సరాల క్రితమే ఇండియాను ‘ఇటీవల అతి హీనంగా నియంతృత్వీకరణ చెందుతున్న దేశాలలో ఒక’టనీ, ‘ప్రపంచంలోని మొదటి పది నియంతృత్వ దేశాలలో ఒక’టనీ అభివర్ణించాయి. 

తర్వాత 2018 వచ్చేసరికి, అనగా గత ఎన్నికల కన్నా ముందే, ‘ఎన్నికైన నియంతృత్వం’ స్థాయికి పడిపోయింది. 2018 నుంచి 2023 వరకు అయిదేళ్ళ పాటు కూడా అదే స్థాయిలో కొనసాగింది. ఈ 2024 ర్యాంకింగ్స్‌ వచ్చేసరికి పరిస్థితి ఏమి కాగలదో చూడాలి. ఇది వి–డెమ్‌ పరిశీలించిన మొత్తం 179 దేశాలతో పోల్చినప్పటి స్థితి అన్నమాట. వి–డెమ్‌ సంస్థ స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్‌ సైన్స్‌ విభాగం నుంచి పనిచేస్తుంది. ఒక ప్రజాస్వామ్యం ఏవిధంగా పనిచేస్తున్నదో మదింపు వేసేందుకు ఆ సంస్థకు ఐదు కొలమానాలు ఉన్నాయి. అవి, ఎన్నికల తీరు, ఉదారవాదం, ప్రజల భాగస్వామ్యం, చర్చలకు గల అవకాశం, ప్రజా సంక్షేమం. 

వి–డెమ్‌ మాత్రమే కాదు, కొన్ని తేడాలతో ఇతర ప్రముఖ సంస్థలు కూడా హీనమైన ర్యాంకులే ఇస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు ప్రపంచ ప్రసిద్ధ ‘ఎకానమిస్టు’ మేగజైన్‌ 2020లో 53వ ర్యాంక్‌నిచ్చింది. ప్రజాస్వామ్య సూచీలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని భావిస్తే, ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌’ నివేదిక ప్రకారం, ఈ 2024లో ఇండియా ర్యాంకు 180 దేశాలలో 159వది. మానవ హక్కుల విషయంలో 165 దేశాలలో 109వది. నిజానికి ప్రధానంగా ధనిక వర్గాలకు లాభం చేసే ఆర్థికాభివృద్ధి సూచీల మాట ఎట్లున్నా, సామాన్య ప్రజలకు సంబంధించిన మానవాభివృద్ధి సూచీలు కూడా ప్రజాస్వామ్యం గురించేనని భావిస్తే, ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మనది 134వ స్థానం. 

గమనించదగినదేమంటే, ఈ సూచీలన్నీ నరేంద్ర మోదీ పాలనలో క్రమంగా పడిపోతున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఇటువంటి నివేదికలను, వాటిలో పేర్కొన్న వాస్తవాలను, తమ తీవ్రమైన అప్రజాస్వామికతను విస్మరించి, భారతదేశం మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అనే ప్రకటనలు నిర్భయంగా చేయటాన్ని బట్టి వారి తెగువను మెచ్చుకోవాలి.  దేశంలో ప్రజలేమన్నా, ప్రపంచం ఏమన్నా, ఈ మాటను కూడా గోబెల్స్‌ ప్రచారం వలె సాగించినట్లయితే అదే నిజంగా స్థిరపడగలదన్నది మోదీ నమ్మకం అయి ఉండాలి. 

ఇందులోని గమనించదగ్గ మెలిక ఏమంటే, భారతదేశం మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అయినా కాకున్నా ప్రజాస్వామ్యానికి బీజాలు వేసిన భూభాగాలలో ఒకటన్నది నిజమే గాని, దానిని వర్ధిల్ల చేయటంలో మోదీ పాత్ర ఏమిటన్నది ప్రశ్న. మనది మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అనే ప్రచారం చాటున ఆయన తన అప్రజాస్వామికతను, పైన పేర్కొన్న తరహా ర్యాంకింగుల అప్రతిష్ఠను కప్పిపెట్టుకో జూస్తున్నారనిపిస్తున్నది. గోబెల్స్‌ తరహా ఎత్తుగడలలో ఇది ఒకటి. 

ఈ సందర్భంగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ సాగించిన భయం గొలిపే విషప్రచారం అనివార్యంగా గుర్తుకువస్తుంది. ఆ ప్రచారాన్ని చివరకు ఆరెస్సెస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ సైతం బహిరంగంగా ఆక్షేపించవలసి వచ్చిందంటే, మోదీ తీరును ప్రజాస్వామికమని ఎవరైనా అనగలరా? భారతదేశం మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అని సగర్వంగా చాటుకోగల నాయకుని ధోరణి అదేనా? ఈ దేశపు గత చరిత్రను, ప్రజాస్వామిక సంప్రదాయాన్ని ప్రస్తావించే నైతిక హక్కు ఆయనకు ఉంటుందా? పైన పేర్కొన్న ర్యాంకింగ్‌లన్నీ మొన్నటి ఎన్నికల విష ప్రచారం కన్నా ముందటివి. ఆ తర్వాతవి ఏ విధంగా ఉండగలవో చూడాలి.

మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా చెప్పించిన మరొక విశేషం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ. ఈ ప్రస్తావనలు ప్రధానితో పాటు బీజేపీకి చెందినవారు గత కొద్దిరోజులుగా చేస్తున్నారు. అది చాలదన్నట్లు సాక్షాత్తూ రాష్ట్రపతి ద్వారా మాట్లాడించారు. ఎమర్జెన్సీ విధింపు పూర్తి అప్రజాస్వామికమనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ చర్య తీసుకున్న పరిస్థితులు, అది అమలైన తీరు అన్నీ ప్రజాస్వామ్య విరుద్ధమే. దానిని అందరూ ఖండించటమే గాక, తిరిగి ఎన్నడూ ఏ రూపంలోనూ ఆ ధోరణులను ప్రదర్శించకూడదు. 

కానీ, దానిని ఇంతగా ఖండించే మోదీ చేస్తున్నదేమిటీ? తన నాయకత్వాన ఇండియాకు ప్రజాస్వామ్య ర్యాంకింగ్‌లు వరుసగా పడిపోతూ నియంతృత్వ ర్యాంకింగులు ఎందుకు వస్తున్నాయి? ఇందిర ఎమర్జెన్సీ తన వ్యక్తిగత అధికార పరిరక్షణకు ప్రజాస్వామ్యాన్ని, సమాజాన్ని ఒక పరిమిత కాలం పాటు భంగపరిచిన చర్య. అంతే తప్ప ఆ చర్య దీర్ఘకాలిక ప్రభావం చూపలేదు. అందుకు భిన్నంగా మోదీ చర్యల వల్ల భారత సమాజమే విషప్రాయమవుతున్నది. 

ఆ ప్రభావాలు దీర్ఘకాలం పాటు ఉండనున్నాయి. తన తీరు చివరకు ఆరెస్సెస్‌కు సైతం ఇబ్బందికరం, అభ్యంతరకరం అవుతున్నది. అటువంటి నాయకుడు కనీసం ఎన్నికల ఎదురుదెబ్బలతోనైనా పాఠాలు గ్రహించి తన ధోరణిని మార్చుకోవటం అవసరం. భారతదేశం మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అనే నీతులు ఎవరికీ చెప్పనక్కరలేదు. 

- వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు
- టంకశాల అశోక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement