ఉరిశిక్ష నేరానికా, నేరస్తుడికా? | Mallepalli Laxmaiah Article On Death Sentence In Sakshi | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 2 2018 2:01 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

Mallepalli Laxmaiah Article On Death Sentence In Sakshi

రెండు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదంతో చిన్నపిల్లలపై అత్యాచారాలు మరణదండన పరిధిలోకి వచ్చాయి. పసిమొగ్గలపై అత్యాచారాలు మన గుండెల్ని రగిల్చివేస్తున్నాయి. కానీ ఈ ఉరిశిక్షలతో ఈ ఘోరాలన్నింటికీ చరమగీతం పాడగలమా? అనేది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న. శిక్షలు నేరాలను నివారించాలేగాని నేరస్తుడిని నిర్మూలించకూడదు. ఉరిశిక్ష విధిస్తారన్న భయం ఉంటే నేరం చేయరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారన్న భయం కారణంగా హత్యలు ఆగిపోవడం లేదు. పైగా ఒక వ్యక్తి జీవించే హక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి అసలు ఉండకూడదు.

భారతదేశంలో మరణ శిక్షలను బీఆర్‌ అంబేడ్కర్‌ నిర్ద్వంద్వంగా వ్యతిరేకిం చారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ ఇంకా చెప్పా లంటే భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ఉరిశిక్షలు విధించినప్పటి నుంచి మరణశిక్షపై మన చట్టసభల్లో అనేక చర్చలు జరిగాయి. అనేక వాదనలూ వచ్చాయి. 7 దశాబ్దాల కాలంలో మన పాలకుల్లో పెద్దగా మార్పు రానప్పటికీ ఇతర సమాజాల్లో ఉరి శిక్షలపై ఎంతో విలువైన పరిణతి కనిపిస్తోంది. ప్రపం చవ్యాప్తంగా 136 దేశాల్లో ఉరిశిక్ష రద్దుచేశారు. దుర దృష్టవశాత్తూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరా జిల్లుతోన్న మన దేశంలో మాత్రం ఉరిశిక్షలు విధించే నేరాల జాబితాలో సరికొత్తవి జోడిస్తూ పోతున్నారు. దాని పర్యవసానమే మొన్న చిన్నారులపై అత్యాచా రాలకు మరణశిక్ష విధించడానికి వీలు కల్పించే బిల్లుకు లోక్‌సభతో ఆమోదముద్ర వేయించుకో వడం. ఈ వ్యాసం మొత్తం ఉరిశిక్షలను గురించే చర్చి స్తుంది తప్ప నేరాన్ని గురించి కాదు. ఎందుకంటే కుల, మత, ప్రాంత, లింగ, వర్గ వివక్షలతో నిండిన మన దేశంలో నేరం వేరు. శిక్ష వేరు. 

ఉరిశిక్షపై మళ్లీ చర్చ
జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల పసి మొగ్గని చిదిమేసిన సామూహిక అత్యాచార, హత్యా ఘటన మన దేశాన్నే కాదు యావత్‌ ప్రపంచాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ‘కుడిచేయి ఏదో ఎడమచేయి ఏదో తేడాయే తెలియని నా కూతురికి హిందువెవరో, ముస్లింలెవ్వరో ఎలా తెలుస్తుంది? వాళ్లు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇంకెవరినైనా ఎంచుకోవా ల్సింది’ అని కఠువా ఘటనలో బలైన ఎనిమిదేళ్ల బాలిక తండ్రి అన్న మాటలివి. ‘మీ కూతురుకు హిందూ, ముస్లింలంటే ఎవరో తెలుసా?’ అని అడి గిన ప్రశ్నకి ఆ చిన్నారి తండ్రి ఇచ్చిన సమాధానమిది. 
ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌ పదిహేడేళ్ల అమ్మా యిపై చేసిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా రాజకీయాల్లోకి కుప్పలుతెప్పలుగా వచ్చిప డుతోన్న నేరస్తులనూ, నిరాఘాటంగా విరాజిల్లు తోన్న నేరప్రవృత్తినీ చెప్పకనే చెప్పింది. ఫిర్యాదు చేసిన మరునాడే బా«ధితురాలి తండ్రి లాకప్‌ డెత్‌ ఈ దేశంలో పేద, అణగారిన వర్గాలకు దొరుకుతున్న న్యాయం ఎలాంటిదో నిరూపించింది. ఈ రెండు ఘటనలూ దేశంలో మరోసారి ఉరిశిక్షల అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ప్రధానంగా అత్యంత కిరాతకంగా పసిమొగ్గను ఛిద్రం చేసిన కఠువా ఘటన మైనర్ల అత్యాచార కేసుల్లో మరణ దండన విధించాలన్న డిమాండ్‌ని ముందుకు తెచ్చింది. రెండు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదంతో చిన్నపిల్లలపై అత్యాచా రాలు మరణదండన పరిధిలోకి వచ్చాయి. పసిమొగ్గ లపై అత్యాచారాలు మన గుండెల్ని రగిల్చివేస్తు న్నాయి. సామాజిక సంక్షోభానికివి అద్దం పడుతు న్నాయి. కానీ ఈ ఉరిశిక్షలతో ఈ ఘోరాలన్నింటికీ చరమగీతం పాడగలమా? అనేది ప్రశ్న.  

ఉరిశిక్షలపై చర్చించిన సందర్భాలు...
1947 నుంచి 1949 వరకు జరిగిన రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా తెరపైకి వచ్చిన ఉరిశిక్షలపై రాజ్యాంగ రచనా కమిటీ ఛైర్మన్‌ బి.ఆర్‌. అంబేడ్కర్, ‘ఉరిశిక్షల రద్దుకే నా ఓటు’ అని స్పష్టంగా పేర్కొ న్నారు. అహింసను బోధించి ఆచరించే ఈ దేశ సంస్కృతికి మరణశిక్షల రద్దు సరిగ్గా సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక వేళ కింది కోర్టులు ఉరిశిక్షలు విధిస్తే పై కోర్టుకు వెళ్లే వీలు ఉంటుంది కదా అన్న వాదనను సైతం తిరస్కరిస్తూ అంబేడ్కర్‌ పైవిధంగా స్పందించారు. అంతకు ముందు అంటే 1931లో భగత్‌సింగ్, రాజ్‌గురుల ఉరితీత సంద ర్భంగా ఉరిశిక్షల రద్దు మన దేశంలో తొలిసారిగా చర్చనీయాంశం అయింది. సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో బిహార్‌ నుంచి ఎంపికైన బాబూ గయా ప్రసాద్‌ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)ను సవరించి ఉరిశిక్ష రద్దు చేయాలని ప్రయత్నించి విఫలమ య్యారు. తీర్మానం వీగిపోగా 1931 మార్చి 23న భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ను ఉరితీశారు. ఏడాది తర్వాత కరాచీలో మరణశిక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌  తీర్మానం చేసింది. రాజ్యంగ రచన సంద ర్భంగా జరిగిన చర్చలో అంబేడ్కర్‌ మరణశిక్షపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. 1952–54 మధ్య కాలంలో లోక్‌సభలో మరణశిక్ష రద్దు ప్రస్తావనకు వచ్చింది. సెక్షన్‌ 302 ఐపీసీ సవరణకు కాంగ్రెస్‌  సభ్యులు ఎంఏ కాజ్మీ బిల్లు ప్రతిపాదించిన సంద ర్భంగా ఇది చర్చనీయాంశం అయింది. 1956లో లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుడు ముకుంద్‌లాల్‌ అగ ర్వాల్‌ మరణశిక్ష రద్దుకు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగాక అది వీగిపోయింది. 1958లో పృథ్వీ రాజ్‌ కపూర్‌ రాజ్యసభలో మరణ శిక్ష రద్దు కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు. చర్చ జరిగాక బిల్లును ఉపసం హరించారు. 1961లో ఇదే తరహా బిల్లును రాజ్యస భలో సావిత్రీ దేవి నికమ్‌ ప్రవేశపెట్టగా, చర్చ జరి గాక దాన్ని సభ తిరస్కరించింది. 1962లో లోక్‌ సభలో రఘునాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన మరణశిక్ష రద్దు బిల్లు తీవ్ర కలకలం సృష్టించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చ వివరాలను లా కమిషన్‌ పరిశీలనకు పంపిస్తా మని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చాకే బిల్లును ఉప సంహరించారు. ‘హత్య ఎవరు చేసినా హత్యే. అది వ్యక్తులు చేసినా, రాజ్యం చేసినా. ఇంకా చెప్పాలంటే చట్టబద్ధంగా మనిషిని చంపితే అది హత్య కాకుండా పోదు’ అనేదే ఈ బిల్లులపై జరిగిన చర్చల్లో మరణ శిక్షను వ్యతిరేకించిన సభ్యుల అభిప్రాయం.

పరిస్థితుల ప్రభావంతోనే నేరాలు
వ్యక్తి చేసే నేరం చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధా రపడి ఉంటుంది. ఆయా సామాజిక పరిస్థితులపైనా, విలువలపైనా ఆధారపడి ఉంటుంది. అది సామా జికమైన వ్యక్తిగత అంశం. కానీ రాజ్యం తన ప్రజల రక్షణకు కొన్ని నియమాలను రూపొందించుకున్న రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయా లకూ, భావావేశాలకూ తావుండకూడదు. ప్రతీకారా నికి చోటుండకూడదు. కానీ ఉరిశిక్షలో న్యాయం ప్రతీ కారంలా కనిపిస్తుంది. ఒక వర్గంపై, మన దేశంలో నైతే ఒక మతంపై, ఒక కులంపై లేదా ఒక జెండర్‌పై ఇంకా చెప్పాలంటే అసమానతలకు తావున్న చోటల్లా ఈ ప్రతీకారం బుసలు కొడుతుంది. నిజానికి అదే ప్రతీకారేచ్ఛ అత్యాచారాలకూ కారణమౌతోంది. అదే ప్రతీకారం ఉరిశిక్షలకూ కారణమవుతోంది. ఇది అత్యంత సంక్లిష్టంగా తోస్తోంది. రాజ్యం చేయాల్సిన పని తన ప్రజలను కాపాడుకోవడం. కానీ తన ప్రజ లను తానే చంపుకోవడం న్యాయంగా మారకూడదు. పంటికి పన్ను, కంటికి కన్ను అన్నట్టు మనిషిని చంపి నట్టు రుజువైతే మిమ్మల్ని కూడా చంపే హక్కు రాజ్యానికుంది అని చెప్పడమంటేనే రాజ్యం కక్షసా ధింపునకు దిగడం అని అర్థం. మానవ మనుగడకు ప్రతిబంధకంగా తయారయ్యే ఉరిశిక్ష మధ్యయుగాల నాటి ఆటవిక లక్షణం తప్ప మరొకటి కాదన్నది ఇప్ప టికే అనేకమంది తేల్చి చెప్పారు. ఫలితంగా, అనేక ప్రజాస్వామ్య దేశాల్లో మరణ శిక్షను రద్దు చేశారు. నేరాలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు నేరాలు జరు గుతున్నాయి? అనే విషయాలు చర్చించుకున్నాం. నేరం చేసే వ్యక్తిపై సమాజం ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే శిక్షలు ఎవరికి అన్నదే ప్రశ్న. మరణశిక్షలు అమలైన వారిపై అధ్యయనం చేయగా, వారిలో 76 శాతం దళితులు, ఆదివాసీలే ఉన్నారని తేలింది. 2015లో లా కమిషన్‌ సారథ్యంలో హైదరా బాద్‌కు చెందిన నల్సార్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఉరిశిక్షలు పడిన 373 కేసులను పరిశీలించారు. వారిలో మూడొంతుల మంది దళితులేనని స్పష్ట మయింది. మరణ దండన పడుతున్నవారిలో 93.5 శాతం మంది అత్యంత పేదలూ, దళితులూ, ఆది వాసీలూ, మైనారిటీలేనని ఈ సర్వే తేల్చి చెప్పింది. భారత లా కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎ.పి. షా మరణశిక్ష రద్దుచేయాలనే ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఎదుట ఉంచే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే జరి గింది. మన దేశంలో రాష్ట్రపతి ఒక్కరే ఉరిశిక్షలు పడిన వారికి క్షమాభిక్ష పెట్టగలరు. తమకు అందిన క్షమాభిక్ష దరఖాస్తులు అన్నింటినీ తిరస్కరించిన రాష్ట్రపతులు శంకర్‌దయాళ్‌ శర్మ, ఆర్‌.వెంకట్రా మన్, ప్రణబ్‌. తనకొచ్చిన అన్ని క్షమాభిక్ష దరఖాస్తు లకూ మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించినవారు కె.ఆర్‌.నారాయణన్, ప్రతిభాపా టిల్‌. ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఏకంగా, మరణ దండ నను రద్దు చేయాలని భావించారు.  2012 జూలై 25 నుంచి ప్రణబ్‌ రాష్ట్రపతిగా ఉన్న 27 నెలల కాలంలో మొత్తం 23 క్షమాభిక్ష కోరుతూ అభ్యర్థనలు వస్తే అందులో 22 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలు స్తోంది. అలాగే శంకర్‌ దయాళ్‌ శర్మ సైతం మొత్తం 14 క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించారు. ఆర్‌. వెంక ట్రామన్‌ 33 అభ్యర్థనలను జైల్‌సింగ్‌ 20 క్షమాభిక్షల పిటిషన్లు తిరస్కరించారు.  

ఎందుకు మరణశిక్షను వ్యతిరేకించాలి?
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గొప్ప తీర్పులిచ్చిన వీఆర్‌ కృష్ణయ్యర్‌ మరణ శిక్షలను మొదటి నుంచీ వ్యతిరేకించారు. 1957–59 మధ్య కేరళ ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రభుత్వంలో ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. జస్టిస్‌ అయ్యర్‌ జడ్జి అయ్యాక తన ఆలోచనలను ఆచరణలో చేసి చూపించారు. సుప్రీంకోర్టు బెంచ్‌ల సభ్యుడిగా ఉండగా తన పరి శీలనకు వచ్చిన మూడు కేసులను విచారించి, దోషు లకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదు శిక్షలుగా మార్చారు. శిక్షలు నేరాలను నివారిం చాలేగాని నేరస్తుడిని నిర్మూలించకూడదు. ఉరిశిక్ష విధిస్తారన్న భయం ఉంటే నేరం చేయరనే అభి ప్రాయం చాలా మందిలో ఉంది. కానీ మనుషులను చంపితే ఉరిశిక్ష వేస్తారన్న భయం కారణంగా హత్యలు ఆగిపోవడం లేదు. హత్య చేసినందుకు దోషిని ఉరి తీస్తే పోయేది మరో ప్రాణమే. మనిషిని వ్యక్తి చంపినా, రాజ్యం చంపినా అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఒక వ్యక్తి జీవించే హక్కుని హరించే అధికారం ప్రభుత్వానికి ఉండ కూడదు.


మల్లెపల్లి లక్ష్మయ్య , వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 97055 66213  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement