పదోన్నతుల కోటాలోనూ అన్యాయమే! | Reservation In Promotion Constitutional Rights Says mallepally laxmaiah | Sakshi
Sakshi News home page

పదోన్నతుల కోటాలోనూ అన్యాయమే!

Published Thu, Feb 20 2020 4:32 AM | Last Updated on Thu, Feb 20 2020 4:32 AM

Reservation In Promotion Constitutional Rights Says mallepally laxmaiah - Sakshi

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పులుగా భావించాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం ప్రాథమిక హక్కు కాదనీ, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. పైగా రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తిపరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. ఇప్పుడు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. తరతరాలుగా సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన దళితుల పట్ల ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరమైన విషయం.

‘మీరు ఇస్తున్న తీర్పుల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మీరు ఇచ్చే తీర్పులను అంగీకరించవచ్చు. కానీ గౌరవించలేననే విషయాన్ని నేను చాలాసార్లు కరాఖండిగా చెప్పాను. అదే సమయంలో ప్రతి న్యాయవాదికీ అట్లా చెప్పే స్వేచ్ఛ ఉండాలని నేను విశ్వసిస్తున్నాను. సరిగ్గా అదే అభిప్రా యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన వ్యాఖ్యానించదల్చుకు న్నాను’ అంటూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణపై 1951, మే 18వ తేదీన పార్లమెంటులో ప్రసం గిస్తున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి ఆయన కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం పునాదిగా ఏర్పర్చుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడాది దాటక ముందే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 29ని ఉల్లంఘిస్తున్నాయని న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టికల్‌ 15కు సవరణ చేయాలని భావించింది. ఆ సంద ర్భంలోనే బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పైవిధంగా మాట్లాడారు. ఇది నేటి పరిస్థితులకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుందని నా భావన.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రతీసారీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అయితే వారం క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఆందోళనకరంగా ఉన్నది. ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలలో ప్రమోషన్ల విష యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదనీ, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం అసలు ప్రాథమిక హక్కు కాదనీ, రాష్ట్ర ప్రభు త్వాలకు తాము ఆదేశాలివ్వలేమనీ, రాష్ట్రాలు తమకు తాముగా నిర్ణ యాలు తీసుకోవచ్చనీ సుప్రీంకోర్టు ఒక అనూహ్యమైన తీర్పు నిచ్చింది. ఇందులో రెండు విషయాలున్నాయి. ప్రమోషన్ల విషయం పేర్కొన్న ఆర్టికల్‌ 16(4)ఎ ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల వారికి ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావించినట్లయితే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకొని తగువిధమైన నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి ఎటు వంటి ఆటంకాలు ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 14 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నాం. ఇందులో ఆర్టికల్‌ 32 ప్రకారం, పౌరులెవరికైనా పైన పేర్కొన్న ఆర్టికల్స్‌ అమలు చేసే విష యంలో ప్రభుత్వాలు విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా జోక్యం చేసుకునే హక్కు హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉంటుందనే విషయం న్యాయశాస్త్రం చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పు లుగా భావించాలి. అయితే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాలను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి.

అసలు రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తి పరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం సాధారణ వ్యక్తులతోపాటు, న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1942లో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వా ధినేతలను ఒప్పించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఎస్సీ, ఎస్టీల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత, ద్వేషం సమాజంలో నెలకొని వుంది. దాని ప్రభావం అధికారయంత్రాంగం, న్యాయవ్యవస్థ మీద పడుతున్నది. అందువల్లనే ఇప్పటికీ ఎన్నో తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రావడం మనం చూడవచ్చు.

నిజానికి ఏ దేశంలోనైనా కొన్ని వర్గాలకు, తెగలకు ప్రత్యేకమైన రాయితీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాజిక వివక్షను రూపుమాప డానికి చేసిన, చేస్తున్న ప్రయత్నాలు. వాటి వల్ల ప్రజల మధ్య అంత రాలు తగ్గుతాయన్న ఆశాభావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ సమాజం ఉంది. అదే ఉద్దేశ్యంతో భారతదేశంలో కూడా అంటరాని కులాలైన ఎస్సీలకూ, అడవుల్లో, కొండల్లో నివసించే ఆదివాసీలైన ఎస్టీలకూ రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని పథకాలను రూపొందించారు. అయితే సమాజంలో ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళకు అంటరాని కులాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ల పట్ల చాలా ఆగ్రహం ఉన్నది. తమ ఉద్యోగాలను, తమ చదువులు, సీట్లనూ, తమ అవకాశాలనూ వీళ్ళు కొల్లగొడుతున్నారని వారు భావి స్తున్నారు. ముఖ్యంగా గత ఇరవై, ముప్ఫై ఏళ్లలో వచ్చిన యువతరం ఇటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. అంతకన్నా ముందుతరం చాలా వివక్షను ప్రదర్శించింది. అప్పుడు ఉద్యోగాల్లో అంత ఎక్కువ మంది కనిపించలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారు. ఇదే కొందరికి మింగుడుపడడంలేదు. సమాజ పరిణామక్రమంపట్ల అవగాహన లేకపోవడం, ఒకవేళ తెలిసినా దానిని అంగీకరించే స్థాయిలేకపోవడం, వాళ్ళ ప్రవర్తనకు కారణం కావచ్చు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా, ఒక మనిషిని అంటు కోకూడదనే భావన మన దేశంలోనే ఉన్నది. వాళ్ళను ముట్టుకుంటే మైలపడతామనే భావన అందరికీ నరనరానా వ్యాపించి ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో దేవాలయాల్లోకి రానివ్వకపోవడం, దళితులు వంట చేసినా, వస్తువులు అమ్మినా తీసుకోకపోవడం, ఎవరైనా అమ్మా యిలు, అబ్బాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటే కూతుళ్ళని కూడా చూడకుండా హత్యచేయడం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవి వేల ఏళ్ళుగా సాగుతున్న అత్యాచారాలు, అంతేకాకుండా వేలమందిని అమానుషంగా హత్యలు చేసిన సమాజం ఇది.

అయితే ఇన్ని ఘోరాలకు బలవుతూ కూడా వేల ఏళ్ళ నుంచి సమాజాభివృద్ధికి తమ ప్రాణాలను ధారపోశారు. యాంత్రీకరణ జర గక ముందు అన్ని రకాల వృత్తులకు తోలు పరికరాలను అందించింది అంటరానివారే. చెరువులను నిర్మించి, నిర్వహించి, ప్రాణాలకు తెగించి చెరువులను రక్షించిన వాళ్లూ అంటరానివాళ్ళే. దహన కార్య క్రమాలూ, ఖనన కార్యక్రమాలూ  చేసింది వారే. వీధులనూ, వాకి ళ్ళనూ శుభ్రంచేసి యావత్‌ సమాజం ఆరోగ్యాన్ని కాపాడి, మానవ జాతి మనుగడకు కారణమైందీ ఈ అంటరానివారే. అంటే వ్యవసాయ యుగంలో ప్రాణాలను, ఆరోగ్యాలను ఫణంగా పెట్టింది కూడా ఈ అంటరానివారే. పైగా, పారిశ్రామిక రంగానికి ప్రథమ అవసరాలైన రైల్వేలు, గనులలో ఎండనకా, వాననకా, రక్తాన్ని చెమటగా ధారపో సింది కూడా ఈ అంటరానివారే. 1938లో ఇల్లందు బొగు ్గగనిలో ప్రమాదం జరిగి 42 మంది మరణిస్తే, అధికారులు మినహా మిగతా 37 మంది అంటరానివారే. ఇప్పటికీ మల మూత్రాలను ఒంటినిండా పులుముకొని, ప్రాణాలకు తెగించి మ్యాన్‌హోల్స్‌లో దిగుతున్నది కూడా వాళ్లే. నిజానికి వాళ్లు సమాజానికి చేసిన సేవతో పోలిస్తే ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్లు ఏ మూలకూ సరిపోవు. ఒకవైపు సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన వీళ్ళను వేల ఏళ్ళుగా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. అభివృద్ధిపథంలో దూసుకెళు తున్నామనుకుంటోన్న ఈ ఆధునిక, నవీన యుగంలో కూడా ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరం.

‘హీరోషీమా, నాగసాకిలపై బాంబులు వేసి, మారణహోమం సృష్టించినందుకు జపాన్‌ వెళ్ళిన ప్రతి అమెరికా అధ్యక్షుడూ,  ఆప్రాంతానికి వెళ్ళి జపాన్‌ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆనవాయితీ, అమృ త్‌సర్‌లోని స్వర్ణదేవాలయం మీద భారత సైన్యం చేసిన దాడిపట్ల పశ్చాత్తాపంతో స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రతిప్రధాని విచారం వ్యక్తం చేస్తారు. కానీ రెండువేల ఏళ్ళకుపైగా నూటికి 25 శాతం మంది మీద అమానుషమైన వివక్ష, హత్యలను, అత్యాచారాలను చేస్తున్న హిందూ సమాజంలో మాత్రం ఎటువంటి సానుభూతి కనిపించక పోవడం, కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం బాధకలిగిస్తున్నది. ఒక హిందువుగానే నేను తలవంచి దళితులకు క్షమాపణలు చెబు తాను’ అన్న మాజీ ఐఏఎస్‌ అధికారి కె.ఆర్‌. వేణుగోపాల్‌గారి మాట లను హిందూ సమాజం ఒకసారి అవలోకనం చేసుకుంటే యావత్‌ సమాజం దళితులు, అంటరానివారిపట్ల గౌరవాన్ని ప్రదర్శించగలుగుతుంది. తమ ప్రవర్తన పట్ల పునరాలోచించుకోగలుగుతుంది.

మల్లెపల్లి లక్ష్మయ్య  
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement