Constitutional rights
-
రాజ్యాంగ విలువలను పాటిస్తున్న ప్రభుత్వం ఏపీ
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చిందని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎ.నారాయణస్వామి కితాబిచ్చారు. తద్వారా బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తోందన్నారు. విజయవాడలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమరసత సమ్మేళనంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. చాలాచోట్ల రాజకీయ పార్టీలకు దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని.. ఇప్పటికీ 15 రాష్ట్రాల్లో ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ లేకపోవడం ఇందుకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఎన్ని ప్లానింగ్, స్టాండింగ్ కమిషన్లు వచ్చినా అంబేడ్కర్ ఆశించినట్టు అస్పృశ్యతను రూపుమాపలేకపోయాయన్నారు. కుక్కను ముద్దాడుతున్న సమాజంలో దళితుడిని ముట్టుకోవడానికి ఆలోచిస్తున్నారన్నారు. ఈ దృక్పథంలో మార్పు తెచ్చేందుకు రాజకీయ నాయకులు, అధికారులు సామాజిక కార్యకర్తలుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రత్యేక చీమా రెజ్మెంట్లో పోరాడిన దళిత యోధులను సైతం తర్వాత కాలంలో అంటరాని వాళ్లుగా చిత్రీకరించారన్నారు. జాతి వ్యవస్థను సంఘటితం చేస్తున్న అగ్రవర్ణాల్లోని వ్యక్తులు కూడా వెలికి గురయ్యారన్నారు. ఇప్పటికీ దళిత సీఎంలు గుళ్లలోకి వెళ్లలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోందని.. దళితుల అంటరానితనంపై కూడా చర్చించాలని అభిప్రాయపడ్డారు. సమరసత, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ.. సంస్కరణలకు బాటలు వేస్తున్నాయని కొనియాడారు. స్కూళ్లలో దళితులకు ప్రవేశం కల్పించిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, బెనారస్ హిందూ వర్సిటీ తొలి దళిత విద్యార్థి కూర్మయ్య, సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంటరానితనం సోదర కులాల్లోనూ ఉండటం బాధాకరం: ఎమ్మెల్సీ డొక్కా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంటరానితనం కేవలం అగ్రకులాలకే పరిమితం కాలేదని, సోదర కులాల్లోనూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాని నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం చాలా పదునైన ఆయుధమని, దానిని జాగ్రత్తగా సామాజిక సంస్కరణల కోసం ఉపయోగించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఇప్పటికీ మనుగడ కోసం సంఘర్షణ పడుతుంటే.. దేశంలో మాత్రం హైందవం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. సమయానికి అనుగుణంగా కావాల్సిన సంస్కరణలతో ఐక్యతను పెంచుకోవాలన్నారు. గన్నవరంలోని శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ.. కుల వ్యవస్థ దేశానికి వెన్నెముక అన్నారు. ప్రతి కులం వెనుక ఒక సైన్స్ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కుల సంప్రదాయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. వందేళ్ల కిందటే దళితుల బస్తీల్లో దేవాలయాలు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.విష్ణు మాట్లాడుతూ.. ఆది ఆంధ్రా సమ్మేళనం నిర్వహించి 105 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమరసత సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, సామాజిక సమరసత మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కోడూరు జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్థ భారతం పునర్ముద్రణ, వచన వ్యాఖ్యానం, కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ముని మనుమరాలు రాధిక, వేముల కూర్మయ్య కుమారుడు డాక్టర్ రామలింగేశ్వరరావు, భాగ్యరెడ్డి వర్మ మనుమడు అజయ్ గౌతమ్‌లను నిర్వాహకులు సత్కరించారు. -
ప్రశ్నే ప్రజాస్వామ్యానికి జీవనాడి
ఆదేశిక సూత్రాలనే కాదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా ఆచరణలోకి రాకుండా కేంద్ర పాలకులు జాగ్రత్తపడుతున్నారు. అదేమని అడిగితే, మాటల తూటాలను కూడా బూతులుగా పరిగణిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నోరెత్తకుండా చేసి, యథేచ్చగా పాలన చేయడానికి రోజుకొక కొత్త చిట్కాలు వెలువడుతున్నాయి. వలస పాలకులైనా, నాడు దేశ పౌరుల స్వేచ్ఛను ‘బందీ’ చేయడానికి వినియోగించిన దేశ ద్రోహ నేర చట్టాన్ని రద్దు చేసు కున్నారుగానీ, మన పాలకులు దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పటికైనా దేశ ఉన్నత న్యాయస్థానంలో మంచి సంస్కరణలకు పునాది లేచింది. ‘న్యాయం అనేది ప్రజల న్యాయబద్ధమైన హక్కుల్ని రక్షించడంలోనే కాదు, సామాజిక–ఆర్థిక న్యాయాన్ని చేకూర్చడంలో కీలకమైన అంశంగా ఉండాలి.’ ‘‘ఒక వ్యంగ్య చిత్రకారుణ్ణి (కార్టూనిస్టు) దేశద్రోహ నేరారోపణపైన జైల్లో పెట్టడమంటే ఇక మన రాజ్యాంగం విఫలమైనట్టే!’’ – సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై.చంద్రచూడ్ ‘‘భావ ప్రకటనా స్వేచ్ఛకు దేశం హామీ పడిన మాట నిజమే నయ్యా, ఇంతకూ నువ్వు పాలక పార్టీ మనిషివి, అవునా?’’ – మంజుల్ కార్టూన్ (29 జనవరి 22) ‘‘కర్ణాటకలోని బీజేపీ పాలనలోని అవినీతి నిరోధక విభాగం అధిపతిని నేను గట్టిగా మందలించినందుకుగానూ నన్ను బదిలీ చేస్తా మని బీజేపీ పాలకులు ఢిల్లీ నుంచి పరోక్షంగా బెదిరించారు.’’ – కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్.పి.సందేశ్ (కోర్టులో బహిరంగ ప్రకటన– 13 జూలై 22 నాటి వార్త) వివిధ స్థాయుల్లో ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరులు, విధానాలు మెజారిటీ పాలక ప్రభుత్వం పేరిట దేశంలో చలామణీ అవుతున్నాయి. ఈ వాతావరణంలో రాజ్యసభను (పేరు ఎగువ సభ) పాలకపక్షం ఉపయోగించుకుంటున్న తీరు ప్రశ్నార్థకమవుతోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు తమకు మెజారిటీ లోపించినప్పుడు కొన్ని కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవడానికి రాజ్య సభలో అడ్డదారులు తొక్కడం మనకు తెలుసు. ఇప్పుడు ఆ తప్పుడు పద్ధతిలో భాగంగానే బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలకులూ రాజ్య సభను ఉపయోగించుకోవడానికి వెనుకాడటం లేదు. పరోక్ష పలుకు బడికి లేదా ప్రయత్నాలకు వేదికగా రాజ్యసభ మారుతోంది. గతంలో దేశ ప్రధాని హోదాలో పీవీ నర సింహారావు (కాంగ్రెస్)కు అస్తుబిస్తు మెజారిటీ ఉన్నప్పుడు, ‘గట్టె’క్క డానికి వాటంగా ఉపయోగపడింది రాజ్యసభేనని మరచిపోరాదు. అందుకే అప్పుడూ, ఇప్పుడూ కూడా పాలకపక్షాలు రాజ్యసభ స్థానాలు పెంచుకోవడానికి అన్యమార్గాలు వెతుకుతున్నాయి. ఆ మార్గాల్లో ప్రధానమైన ఎత్తుగడగా రాష్ట్రాలను పరోక్షంగా ప్రభావితం చేయడం ఒకటి. వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పదార్థాలన్నీ బీరుపోకుండా చేరినట్టే, అలహాబాద్ కోర్టు తీర్పుతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పదవిని కోల్పోవలసి వచ్చినప్పుడు ఆమెను తాత్కాలికంగా గట్టెక్కించడానికి పరోక్షంగా సాయం చేసినవారు సుప్రీం న్యాయమూర్తి వి.ఆర్. కృష్ణయ్యరే! కాగా సుప్రీంకోర్టు ప్రధాన సీనియర్ న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ప్రభుత్వ పన్నాగాలకు లోనుకాకుండా ఉన్నందుకే అర్హమైన ప్రమోషన్‌ను కోల్పోవలసి వచ్చింది. అయినా ప్రజల మధ్య, న్యాయమూర్తుల మధ్య, ప్రజాస్వామ్య సంప్రదాయాల మధ్య జస్టిస్ ఖన్నా నిలబడ్డారు. అయితే, మన దేశంలో ఆయన్ని మరచిపోయాం! మరీ విచిత్రమేమంటే, ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిర రాజకీయ డిటెన్షన్ ఉత్తర్వులను ఒక్క కలంపోటుతో రద్దు చేసినందువల్ల జైళ్ల నుంచి విడు దలైన రాజకీయ ఖైదీల్లో హెచ్చుమంది బీజేపీ డిటెన్యూలు కూడా ఉన్నా వాళ్లకూ ఖన్నా సేవలు గుర్తు రాకపోవడం గమనార్హం. అంతేగాదు, బ్రిటన్‌లో రాణి క్వీన్స్ కౌన్సిల్లో విశిష్ట సభ్యుడైన హెచ్.హెచ్. యాస్క్విత్ (1908–16) ఇంగ్లండ్ ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా ఇంగ్లిష్ వాడి జైళ్లలో మగ్గుతూన్న మన బాల గంగాధర తిలక్‌ను ప్రస్తావించాడు. ప్రజానుకూలమైన జర్నలిజాన్ని (పబ్లిక్ జర్నలిజం) ఇంగ్లండ్ ప్రజలు గౌరవిస్తారనీ, అలాగే తిలక్ రాతలన్నీ పబ్లిక్ జర్నలిజంగానే పరిగణనలోకి వస్తాయనీ యాస్క్విత్ సమర్థించాడు. తిలక్ రచనల్ని పబ్లిక్ జర్నలిజంగా పరిగణించకపోతే, పత్రికా స్వేచ్ఛకే గండికొట్టినట్టు అవుతుందని హెచ్చరించాడు. ఈ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ‘పరగడుపు’గా భావిస్తు న్నందునే మన పాలకులు దేశ వాస్తవ చరిత్రను పక్కకు తోస్తున్నారు. మహాత్మాగాంధీ మునిమనుమడు, చైతన్యశీలి అయిన తుషార్ గాంధీ, ఇంకా ఇతర గాంధేయులు ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ పాల కులు క్రమంగా దేశంలోని ప్రధాన గాంధేయ సంస్థలపై ఆధిపత్యం సాధించి నియంత్రించ బోతున్నారనీ, గాంధీ సిద్ధాంతాలకు భిన్నమైన సిద్ధాంతాలను చొప్పించే ప్రమాదం ఉందనీ వారు పేర్కొన్నారు. ఈ వ్యూహంలో భాగమే సావర్కార్ భజనను ముందుకు నెట్టడమని చెబుతూ, ప్రస్తుత కేంద్ర పాలకుల్ని తృప్తిపరచడం కోసం దేశ చరిత్రనే వక్రీకరిస్తున్నారనీ తుషార్ ప్రభృతులు దేశ ప్రజల్ని హెచ్చరించి అప్రమత్తుల్ని చేయవలసి వచ్చింది. ఇక, రాష్ట్రపతులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని భారత రాజ్యాంగ సభ సభ్యుడు ప్రొఫెసర్ కె.టి. షా అన్నారు. దీన్ని ప్రతిపాదిస్తూ ఓ చిత్రమైన వ్యంగ్యాస్త్రం రాజ్యాంగ సభ సభ్యుల పరిశీలనకు వదిలారు: ‘‘దేశ రాష్ట్రపతి దేశ ప్రధానమంత్రికి కేవలం ఓ గ్రామ్‌ఫోన్‌గా మాత్రమే పనిచేయాలని సభవారు కోరుకుంటు న్నారా?’’ అని షా ప్రశ్నించారు. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి తన అధి కారాలను కేంద్ర మంత్రి మండలి సహాయ, సలహాల మీద ఆధారపడి అమలు చేస్తారనీ, అందువల్ల రాష్ట్రపతులు కేవలం ‘రబ్బరు స్టాంపు’గా వ్యవహరించడం కుదరదనీ లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పి.డి.టి ఆచార్య (14 జూలై 2022) వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి ఉద్దండులు కొన్ని విధాన నిర్ణయాలపైన ప్రభు త్వంతో బాహాటంగానే విభేదించి, ప్రభుత్వాల్ని ప్రభావితం చేయగలి గారని ఆచార్య గుర్తు చేశారు. అంతేగాదు, ‘భారతదేశానికి రాష్ట్రపతులు అవసరమేగానీ, కేవలం రాష్ట్రపతి కార్యాలయ నిర్వాహ కులు మాత్రం కా’దని ఆచార్య అభిప్రాయం! ఇతర అన్ని పరిణామాలకన్నా, నేటి భారత పాలనా యంత్రాం గంలో విధాన నిర్ణయాల పరిధిలో అడుగడుగునా ‘కొట్టొచ్చేట్టు’ అశ్రద్ధ కనిపిస్తోంది. భారత రాజ్యాంగంలో ఏ ఆదేశిక సూత్రాలు పేద, నిరుపేద బహుజనుల భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు దోహదం చేస్తాయో ఆ సూత్రాలనే పాలకులు పక్కనబెట్టడానికి అలవాటు పడ్డారు. ‘ ప్రజా బాహుళ్యం పట్ల ... రాజ్యాంగం కల్పించిన హక్కుల్నే కాదు, బాధ్యతల అధ్యాయంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలను కూడా ఆచరణలోకి రానివ్వకుండా పాలకులు జాగ్రత్తపడుతున్నారు. అదే మంటే పార్లమెంట్లో, శాసనసభల్లో మాటల తూటాలను బూతు లుగా పరిగణించి, అసలు నోరెత్తకుండా చేసి, యథేచ్చగా పాలన కొనసాగించేలా రోజుకొక కొత్త చిట్కాలు వెలువడుతున్నాయి. మన వేలు విడిచిన వలస పాలకులైనా, నాడు దేశ పౌరుల స్వేచ్ఛను ‘బందీ’ చేయడానికి వినియోగించిన దేశ ద్రోహ నేర చట్టాన్ని ఇంగ్లండులో రద్దు చేసుకున్నారుగానీ, మన పాలకులు ఇంకా దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. కనీసం ఇప్పటికైనా దేశ ఉన్నత న్యాయస్థానంలో మంచి సంస్కరణలకు పునాది లేచింది. వాటిని కూడా అదుపు చేయాలన్న దుగ్ధ పాలకులను విడనాడటం లేదు. జస్టిస్ ఫజిల్ అలీ అన్నట్టు ‘న్యాయం అనేది ప్రజల న్యాయబద్ధమైన హక్కుల్ని రక్షించడంలోనే కాదు, సామాజిక – ఆర్థిక న్యాయాన్ని ఆచరణలో చేకూర్చడంలో కీలకమైన అంశంగా ఉండాలి’. ‘‘చీకట్లను చీల్చుకుని ఒక కొత్త సూర్యుడు ప్రభవిస్తున్నాడు, ఒక సామూహిక గానం పల్లవిస్తోంది – ఇళ్లనూ, బళ్లనూ, వాకిళ్లనూ సమస్త ఆత్మీయ ప్రపంచాలనొదిలి ఆదర్శాలనే ప్రపంచంగా మార్చుకున్నారు వాళ్లు నూతన ప్రపంచానికి ద్వారాలు తెరిచారు వాళ్లు వాళ్లకు మన ఆహ్వానం అనివార్యం’’(దొరా ఫరూఖీ కవితకు ఉదయమిత్ర స్వేచ్ఛానువాదం.)! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పదోన్నతుల కోటాలోనూ అన్యాయమే!
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పులుగా భావించాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం ప్రాథమిక హక్కు కాదనీ, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. పైగా రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తిపరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. ఇప్పుడు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. తరతరాలుగా సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన దళితుల పట్ల ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరమైన విషయం. ‘మీరు ఇస్తున్న తీర్పుల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మీరు ఇచ్చే తీర్పులను అంగీకరించవచ్చు. కానీ గౌరవించలేననే విషయాన్ని నేను చాలాసార్లు కరాఖండిగా చెప్పాను. అదే సమయంలో ప్రతి న్యాయవాదికీ అట్లా చెప్పే స్వేచ్ఛ ఉండాలని నేను విశ్వసిస్తున్నాను. సరిగ్గా అదే అభిప్రా యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన వ్యాఖ్యానించదల్చుకు న్నాను’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణపై 1951, మే 18వ తేదీన పార్లమెంటులో ప్రసం గిస్తున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి ఆయన కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం పునాదిగా ఏర్పర్చుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడాది దాటక ముందే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు, సుప్రీంకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29ని ఉల్లంఘిస్తున్నాయని న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టికల్ 15కు సవరణ చేయాలని భావించింది. ఆ సంద ర్భంలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ పైవిధంగా మాట్లాడారు. ఇది నేటి పరిస్థితులకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుందని నా భావన. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రతీసారీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అయితే వారం క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఆందోళనకరంగా ఉన్నది. ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలలో ప్రమోషన్ల విష యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదనీ, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం అసలు ప్రాథమిక హక్కు కాదనీ, రాష్ట్ర ప్రభు త్వాలకు తాము ఆదేశాలివ్వలేమనీ, రాష్ట్రాలు తమకు తాముగా నిర్ణ యాలు తీసుకోవచ్చనీ సుప్రీంకోర్టు ఒక అనూహ్యమైన తీర్పు నిచ్చింది. ఇందులో రెండు విషయాలున్నాయి. ప్రమోషన్ల విషయం పేర్కొన్న ఆర్టికల్ 16(4)ఎ ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావించినట్లయితే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకొని తగువిధమైన నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి ఎటు వంటి ఆటంకాలు ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నాం. ఇందులో ఆర్టికల్ 32 ప్రకారం, పౌరులెవరికైనా పైన పేర్కొన్న ఆర్టికల్స్ అమలు చేసే విష యంలో ప్రభుత్వాలు విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా జోక్యం చేసుకునే హక్కు హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉంటుందనే విషయం న్యాయశాస్త్రం చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పు లుగా భావించాలి. అయితే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాలను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. అసలు రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తి పరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం సాధారణ వ్యక్తులతోపాటు, న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వా ధినేతలను ఒప్పించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఎస్సీ, ఎస్టీల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత, ద్వేషం సమాజంలో నెలకొని వుంది. దాని ప్రభావం అధికారయంత్రాంగం, న్యాయవ్యవస్థ మీద పడుతున్నది. అందువల్లనే ఇప్పటికీ ఎన్నో తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రావడం మనం చూడవచ్చు. నిజానికి ఏ దేశంలోనైనా కొన్ని వర్గాలకు, తెగలకు ప్రత్యేకమైన రాయితీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాజిక వివక్షను రూపుమాప డానికి చేసిన, చేస్తున్న ప్రయత్నాలు. వాటి వల్ల ప్రజల మధ్య అంత రాలు తగ్గుతాయన్న ఆశాభావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ సమాజం ఉంది. అదే ఉద్దేశ్యంతో భారతదేశంలో కూడా అంటరాని కులాలైన ఎస్సీలకూ, అడవుల్లో, కొండల్లో నివసించే ఆదివాసీలైన ఎస్టీలకూ రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని పథకాలను రూపొందించారు. అయితే సమాజంలో ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళకు అంటరాని కులాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ల పట్ల చాలా ఆగ్రహం ఉన్నది. తమ ఉద్యోగాలను, తమ చదువులు, సీట్లనూ, తమ అవకాశాలనూ వీళ్ళు కొల్లగొడుతున్నారని వారు భావి స్తున్నారు. ముఖ్యంగా గత ఇరవై, ముప్ఫై ఏళ్లలో వచ్చిన యువతరం ఇటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. అంతకన్నా ముందుతరం చాలా వివక్షను ప్రదర్శించింది. అప్పుడు ఉద్యోగాల్లో అంత ఎక్కువ మంది కనిపించలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారు. ఇదే కొందరికి మింగుడుపడడంలేదు. సమాజ పరిణామక్రమంపట్ల అవగాహన లేకపోవడం, ఒకవేళ తెలిసినా దానిని అంగీకరించే స్థాయిలేకపోవడం, వాళ్ళ ప్రవర్తనకు కారణం కావచ్చు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా, ఒక మనిషిని అంటు కోకూడదనే భావన మన దేశంలోనే ఉన్నది. వాళ్ళను ముట్టుకుంటే మైలపడతామనే భావన అందరికీ నరనరానా వ్యాపించి ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో దేవాలయాల్లోకి రానివ్వకపోవడం, దళితులు వంట చేసినా, వస్తువులు అమ్మినా తీసుకోకపోవడం, ఎవరైనా అమ్మా యిలు, అబ్బాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటే కూతుళ్ళని కూడా చూడకుండా హత్యచేయడం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవి వేల ఏళ్ళుగా సాగుతున్న అత్యాచారాలు, అంతేకాకుండా వేలమందిని అమానుషంగా హత్యలు చేసిన సమాజం ఇది. అయితే ఇన్ని ఘోరాలకు బలవుతూ కూడా వేల ఏళ్ళ నుంచి సమాజాభివృద్ధికి తమ ప్రాణాలను ధారపోశారు. యాంత్రీకరణ జర గక ముందు అన్ని రకాల వృత్తులకు తోలు పరికరాలను అందించింది అంటరానివారే. చెరువులను నిర్మించి, నిర్వహించి, ప్రాణాలకు తెగించి చెరువులను రక్షించిన వాళ్లూ అంటరానివాళ్ళే. దహన కార్య క్రమాలూ, ఖనన కార్యక్రమాలూ చేసింది వారే. వీధులనూ, వాకి ళ్ళనూ శుభ్రంచేసి యావత్ సమాజం ఆరోగ్యాన్ని కాపాడి, మానవ జాతి మనుగడకు కారణమైందీ ఈ అంటరానివారే. అంటే వ్యవసాయ యుగంలో ప్రాణాలను, ఆరోగ్యాలను ఫణంగా పెట్టింది కూడా ఈ అంటరానివారే. పైగా, పారిశ్రామిక రంగానికి ప్రథమ అవసరాలైన రైల్వేలు, గనులలో ఎండనకా, వాననకా, రక్తాన్ని చెమటగా ధారపో సింది కూడా ఈ అంటరానివారే. 1938లో ఇల్లందు బొగు ్గగనిలో ప్రమాదం జరిగి 42 మంది మరణిస్తే, అధికారులు మినహా మిగతా 37 మంది అంటరానివారే. ఇప్పటికీ మల మూత్రాలను ఒంటినిండా పులుముకొని, ప్రాణాలకు తెగించి మ్యాన్‌హోల్స్‌లో దిగుతున్నది కూడా వాళ్లే. నిజానికి వాళ్లు సమాజానికి చేసిన సేవతో పోలిస్తే ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్లు ఏ మూలకూ సరిపోవు. ఒకవైపు సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన వీళ్ళను వేల ఏళ్ళుగా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. అభివృద్ధిపథంలో దూసుకెళు తున్నామనుకుంటోన్న ఈ ఆధునిక, నవీన యుగంలో కూడా ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరం. ‘హీరోషీమా, నాగసాకిలపై బాంబులు వేసి, మారణహోమం సృష్టించినందుకు జపాన్ వెళ్ళిన ప్రతి అమెరికా అధ్యక్షుడూ, ఆప్రాంతానికి వెళ్ళి జపాన్ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆనవాయితీ, అమృ త్‌సర్‌లోని స్వర్ణదేవాలయం మీద భారత సైన్యం చేసిన దాడిపట్ల పశ్చాత్తాపంతో స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రతిప్రధాని విచారం వ్యక్తం చేస్తారు. కానీ రెండువేల ఏళ్ళకుపైగా నూటికి 25 శాతం మంది మీద అమానుషమైన వివక్ష, హత్యలను, అత్యాచారాలను చేస్తున్న హిందూ సమాజంలో మాత్రం ఎటువంటి సానుభూతి కనిపించక పోవడం, కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం బాధకలిగిస్తున్నది. ఒక హిందువుగానే నేను తలవంచి దళితులకు క్షమాపణలు చెబు తాను’ అన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్‌గారి మాట లను హిందూ సమాజం ఒకసారి అవలోకనం చేసుకుంటే యావత్ సమాజం దళితులు, అంటరానివారిపట్ల గౌరవాన్ని ప్రదర్శించగలుగుతుంది. తమ ప్రవర్తన పట్ల పునరాలోచించుకోగలుగుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
రాజ్యాంగ హక్కులే మూలాధారం
పట్నా: ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజానికి రాజ్యాంగం రక్షణ కల్పించిన హక్కులే మూలాధారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. పట్నాలోని భారతి విశ్వవిద్యాలయంలో జరిగిన డా.పతంగ్‌రావు కదమ్ స్మారకోపన్యాసంలో జస్టిస్ మిశ్రా ప్రసంగించారు. పాక్షిక యూథనేషియా(స్వచ్ఛంద మరణం)కు గతంలో సుప్రీం అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ..‘ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ బతికే హక్కున్న ప్రతి పౌరుడికి చనిపోయే హక్కు కూడా ఉంటుంది. దీని ఆధారంగానే తీర్పు ఇచ్చాం’ అని వెల్లడించారు. -
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్‌కు అదనంగా మరో 224 ఆర్టికల్స్‌ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
రాజ్యాంగ హక్కులను కాపాడండి
న్యూఢిల్లీ: దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించడంతో పాటు రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి గానూ ‘సేవ్ ద కాన్స్టిట్యూషన్’ పేరిట దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడి తల్కటోరా స్టేడియంలో దీనిని ప్రారంభించనున్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన దళితులు, పౌర సంఘాలు, పంచాయతీ సమితులు సహా పలువురు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాల్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారం నిర్వహిస్తారని ఎస్సీ విభాగం చైర్మన్ నితిన్ రౌత్ వెల్లడించారు. -
నాకు హాని జరిగితే ఏపీ పోలీసులదే బాధ్యత
బంజారాహిల్స్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాజ్యాంగ హక్కులను కాపాడాలని పోరాడుతున్న తనకు ప్రాణహాని ఉందని తనకు ఏదైనా జరిగితే ఏపీ పోలీసులదే బాధ్యతని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లో విలేకరులతో మాట్లాడుతూ బీసీల సంక్షేమం, హక్కుల సాధనకు పోరాడుతున్న తనకు ముప్పు ఉందని, కొందరు దుండగులు తన కూతురిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై కేంద్ర హోంసెక్రటరీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఏపీ సీఎం, డీజీపీలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీల అమలు మర్చిపోయి ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రావణ రాజ్యం కొనసాగుతున్నదన్నారు. అరాచకాలు పెట్రేగిపోతున్నాయని హక్కులకు విలువ లేకుండా పోయిందన్నారు. -
ప్రజాస్వామ్య విలువల్ని ఎలుగెత్తిన సమైక్య శంఖారావం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభ ఈ నెల 26న జరగనున్న విషయం తెలిసిందే. ఆ సభ నిర్వహణకి అనుమతి సాధించడం కూడా ఒక ప్రజాస్వామిక విజయమని చెప్పుకోవచ్చు. ఈ సభ నిర్వహణకు అడుగడుగునా ఎదురైన అడ్డంకుల్ని చూస్తుంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత దుర్గతి పాలయ్యిందో అర్థమౌతుంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అతి ప్రధానం. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని పేరు. వాక్సాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటిని పౌరులు సకారాత్మకంగా అనుభవించాలి. కానీ, రాష్ట్ర విభజన వంటి అతి కీలకమైన అంశం మీద ఏవో స్వప్రయోజనాల్ని ఆశించి తెలుగు దేశం పార్టీ అనుకూలంగా లేఖ ఇవ్వడం, దానిని సాకుగా తీసుకొని తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్సు పార్టీ దూకుడు నిర్ణయాలు చేయడం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే వివాదాస్పదమైన అంశమయ్యింది. అటువంటి కీలక మైన అంశం మీద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి అతి ప్రధానమైన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సదస్సుకి ఇన్ని అవాంతరాలు రావడం ప్రజాస్వామ్యవాదుల్ని కలవర పెట్టింది. ప్రాథమికమైన భావ ప్రకటనా స్వేచ్ఛని నిలబెట్టవల్సిందిగా జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ప్రజాస్వామ్య హక్కుల గురించి కోర్టులు గుర్తుచేయవల్సి వచ్చింది. సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని, అది తమని రెచ్చగొట్టడానికి ఉద్దేశించిందేనని తెలంగాణా వాదులు పెడబొబ్బలు పెట్టారు. ఈ సభవల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అడ్డుపెట్టారు. సమైక్య వాదినంటూ బుకాయిస్తూ, కాంగ్రెస్సు హైకమాండు ఆజ్ఞల్ని తు.చ. తప్పకుండా అమలు చేశ్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య శంఖారావం గురించి కనీసం ప్రస్తావించలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నట్లే, సీమాంధ్రులు సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి వాదన వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. 'నీ అభిప్రాయం పట్ల నాకు వ్యతిరేకత ఉంది. కానీ, ఆ అభిప్రాయన్ని ప్రకటించడానికి గాను నీకున్న హక్కు నిలబెట్టడానికై నా ప్రాణాలైనా ఒడ్డుతాను అన్న మౌలికమైన భావన రాజకీయ నాయకులకి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం అని చెబుతారు. కానీ, జగన్ తలపెట్టిన సభ అడ్డుకోవడం ప్రజాస్వామ్యబద్దం కాదని, భావ ప్రకటనా స్వేచ్ఛని కాలరాయకూడదని సిపిఎం నేత బి వి రాఘవులు మినహా నోరు విప్పిన నాయకుడు లేరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులు రెండవ తరగతి పౌరులేనన్న భయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, శాంతియుతంగా జరగనున్న సమైక్యంధ్ర శంఖారావం సభ సజావుగా జరిగేలా చూడటం, తద్వారా తాము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామని సీమాంధ్రులకి భరోసా ఇవ్వడం తమ బాధ్యత అని ఏ ఒక్క తెలంగాణా నాయకుడికీ అర్థం కావడం లేదు. రాజకీయంగా ఇంతటి భావ దారిద్ర్యం ఉన్న పరిస్థితుల్లో, ప్రజలకు నేతల మీద నమ్మకం పోతుందన్న సత్యాన్ని సమైక్య శంఖారావం సభకు ఎదురైన అవాంతరాలు చెప్పకనే చెబుతున్నాయి.