సాక్షి, అమరావతి/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చిందని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎ.నారాయణస్వామి కితాబిచ్చారు. తద్వారా బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తోందన్నారు.
విజయవాడలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమరసత సమ్మేళనంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. చాలాచోట్ల రాజకీయ పార్టీలకు దళితుల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని.. ఇప్పటికీ 15 రాష్ట్రాల్లో ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ లేకపోవడం ఇందుకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఎన్ని ప్లానింగ్, స్టాండింగ్ కమిషన్లు వచ్చినా అంబేడ్కర్ ఆశించినట్టు అస్పృశ్యతను రూపుమాపలేకపోయాయన్నారు.
కుక్కను ముద్దాడుతున్న సమాజంలో దళితుడిని ముట్టుకోవడానికి ఆలోచిస్తున్నారన్నారు. ఈ దృక్పథంలో మార్పు తెచ్చేందుకు రాజకీయ నాయకులు, అధికారులు సామాజిక కార్యకర్తలుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రత్యేక చీమా రెజ్మెంట్‌లో పోరాడిన దళిత యోధులను సైతం తర్వాత కాలంలో అంటరాని వాళ్లుగా చిత్రీకరించారన్నారు. జాతి వ్యవస్థను సంఘటితం చేస్తున్న అగ్రవర్ణాల్లోని వ్యక్తులు కూడా వెలికి గురయ్యారన్నారు.
ఇప్పటికీ దళిత సీఎంలు గుళ్లలోకి వెళ్లలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోందని.. దళితుల అంటరానితనంపై కూడా చర్చించాలని అభిప్రాయపడ్డారు. సమరసత, ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలు సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ.. సంస్కరణలకు బాటలు వేస్తున్నాయని కొనియాడారు. స్కూళ్లలో దళితులకు ప్రవేశం కల్పించిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, బెనారస్ హిందూ వర్సిటీ తొలి దళిత విద్యార్థి కూర్మయ్య, సామాజిక సంస్కర్త భాగ్యరెడ్డి వర్మలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
అంటరానితనం సోదర కులాల్లోనూ ఉండటం బాధాకరం: ఎమ్మెల్సీ డొక్కా
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. అంటరానితనం కేవలం అగ్రకులాలకే పరిమితం కాలేదని, సోదర కులాల్లోనూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాని నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం చాలా పదునైన ఆయుధమని, దానిని జాగ్రత్తగా సామాజిక సంస్కరణల కోసం ఉపయోగించాలని కోరారు.
ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఇప్పటికీ మనుగడ కోసం సంఘర్షణ పడుతుంటే.. దేశంలో మాత్రం హైందవం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. సమయానికి అనుగుణంగా కావాల్సిన సంస్కరణలతో ఐక్యతను పెంచుకోవాలన్నారు. గన్నవరంలోని శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ.. కుల వ్యవస్థ దేశానికి వెన్నెముక అన్నారు.
ప్రతి కులం వెనుక ఒక సైన్స్ ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కుల సంప్రదాయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. వందేళ్ల కిందటే దళితుల బస్తీల్లో దేవాలయాలు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.విష్ణు మాట్లాడుతూ.. ఆది ఆంధ్రా సమ్మేళనం నిర్వహించి 105 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సమరసత సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, సామాజిక సమరసత మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కోడూరు జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగిపూడి వెంకటశర్మ రాసిన నిరుద్థ భారతం పునర్‌ముద్రణ, వచన వ్యాఖ్యానం, కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ముని మనుమరాలు రాధిక, వేముల కూర్మయ్య కుమారుడు డాక్టర్ రామలింగేశ్వరరావు, భాగ్యరెడ్డి వర్మ మనుమడు అజయ్ గౌతమ్‌లను నిర్వాహకులు సత్కరించారు.
రాజ్యాంగ విలువలను పాటిస్తున్న ప్రభుత్వం ఏపీ
Published Mon, Nov 7 2022 3:41 AM | Last Updated on Mon, Nov 7 2022 3:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment