ప్రజాస్వామ్య విలువల్ని ఎలుగెత్తిన సమైక్య శంఖారావం | Samaikya sankharavam hails the spirit of democracy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య విలువల్ని ఎలుగెత్తిన సమైక్య శంఖారావం

Published Mon, Oct 21 2013 1:11 PM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

Samaikya sankharavam hails the spirit of democracy

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత  వైయస్ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన  'సమైక్య శంఖారావం' సభ ఈ నెల 26న జరగనున్న విషయం తెలిసిందే. ఆ సభ నిర్వహణకి అనుమతి సాధించడం కూడా ఒక ప్రజాస్వామిక విజయమని చెప్పుకోవచ్చు. ఈ సభ నిర్వహణకు అడుగడుగునా ఎదురైన అడ్డంకుల్ని చూస్తుంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత దుర్గతి పాలయ్యిందో అర్థమౌతుంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అతి ప్రధానం. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని పేరు. వాక్సాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రతి భారతీయుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులు, వాటిని పౌరులు సకారాత్మకంగా అనుభవించాలి.

కానీ, రాష్ట్ర విభజన వంటి అతి కీలకమైన అంశం మీద ఏవో స్వప్రయోజనాల్ని ఆశించి తెలుగు దేశం పార్టీ అనుకూలంగా  లేఖ ఇవ్వడం, దానిని సాకుగా తీసుకొని తన స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్సు పార్టీ దూకుడు నిర్ణయాలు చేయడం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే వివాదాస్పదమైన అంశమయ్యింది. అటువంటి కీలక మైన అంశం మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వంటి అతి ప్రధానమైన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సదస్సుకి ఇన్ని అవాంతరాలు రావడం ప్రజాస్వామ్యవాదుల్ని కలవర పెట్టింది. ప్రాథమికమైన భావ ప్రకటనా స్వేచ్ఛని నిలబెట్టవల్సిందిగా జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ప్రజాస్వామ్య హక్కుల గురించి కోర్టులు గుర్తుచేయవల్సి వచ్చింది.

సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని, అది తమని రెచ్చగొట్టడానికి ఉద్దేశించిందేనని తెలంగాణా వాదులు పెడబొబ్బలు పెట్టారు. ఈ సభవల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అడ్డుపెట్టారు. సమైక్య వాదినంటూ బుకాయిస్తూ, కాంగ్రెస్సు హైకమాండు ఆజ్ఞల్ని తు.చ. తప్పకుండా అమలు చేశ్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య శంఖారావం గురించి కనీసం ప్రస్తావించలేదు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నట్లే, సీమాంధ్రులు సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి వాదన వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. 'నీ అభిప్రాయం పట్ల నాకు వ్యతిరేకత ఉంది. కానీ, ఆ అభిప్రాయన్ని ప్రకటించడానికి గాను నీకున్న హక్కు నిలబెట్టడానికై నా ప్రాణాలైనా ఒడ్డుతాను  అన్న మౌలికమైన భావన రాజకీయ నాయకులకి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం అని చెబుతారు. కానీ, జగన్ తలపెట్టిన సభ అడ్డుకోవడం ప్రజాస్వామ్యబద్దం కాదని, భావ ప్రకటనా స్వేచ్ఛని కాలరాయకూడదని సిపిఎం నేత బి వి రాఘవులు మినహా నోరు విప్పిన నాయకుడు లేరు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులు రెండవ తరగతి పౌరులేనన్న భయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, శాంతియుతంగా జరగనున్న సమైక్యంధ్ర శంఖారావం సభ సజావుగా జరిగేలా చూడటం, తద్వారా తాము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నామని సీమాంధ్రులకి భరోసా ఇవ్వడం తమ బాధ్యత అని ఏ ఒక్క  తెలంగాణా నాయకుడికీ అర్థం కావడం లేదు. రాజకీయంగా ఇంతటి భావ దారిద్ర్యం ఉన్న పరిస్థితుల్లో, ప్రజలకు నేతల మీద నమ్మకం పోతుందన్న సత్యాన్ని సమైక్య శంఖారావం సభకు ఎదురైన అవాంతరాలు చెప్పకనే చెబుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement