ప్రజాస్వామ్యం ఉనికే ప్రశ్నార్థకం అయ్యింది: జగన్
బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తోందో ఆయనకు వివరించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులు విభజనను వ్యతిరేకిస్తున్నా, సొంత పార్టీ మనుషులు కూడా విభజన వద్దంటున్నా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని.. చివరకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయంలో కూడా అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారని రాజ్నాథ్ దృష్టికి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లారు. వారి భేటీ సుమారు అరగంట పాటు సాగింది. అనంతరం జగన్, రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. జగన్ మీడియాతో మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి..
''రాజ్నాథ్ సింగ్తో చాలా వివరంగా మాట్లాడాం. ఆయన మాకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై తన పార్టీ సభ్యులతో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి, ఈ అన్యాయంపై స్పందిస్తాయని ఆశిస్తున్నాను. ఆయనతో చాలా సుదీర్ఘంగా చర్చించాము. ఈ రకంగా రాష్ట్రాన్ని విభజించడం మొదలైతే, అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకించినా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇలా చేయడం మొదలైతే రేపు అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందని ఆయనకు చెప్పాం. ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలని, అందరూ కలిసి ప్రతిఘటించాలని ఆయనకు విన్నవించాం. దేవుడు కూడా వీరందరికీ మంచి చేసే ఆలోచనలు ఇస్తాడని ఆశిస్తున్నాం. అసలు నిన్న జరిగిన అన్యాయం అయితే.. నిజంగా ప్రజాస్వామ్యం బతికుందో లేదో అర్థం కావట్లేదు.
తమకు విభజన వద్దని అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా.. పది సెకన్లలో బిల్లు ప్రవేశపెట్టామని చెప్పేస్తారు, ఆమోదం పొందిందని కూడా చెప్పేస్తారు. మామూలుగా అయితే బిల్లు పెట్టినప్పుడు చేతులు పైకెత్తాలని మొదట అడుగుతారు. ఆమోదయోగ్యం అవునో కాదో తెలుసుకుంటారు. ఆమోదించినట్లు ఎక్కువ చేతులు పైకి లేస్తేనే బిల్లును ప్రవేశపెట్టాలి. ఇక్కడ మాత్రం ఇలా అడగలేదు, ఎవరూ చేతులు పైకెత్తలేదు. అయినా బిల్లును ప్రవేశపెట్టేశామని చెప్పడం తీవ్ర అన్యాయం. అసెంబ్లీలో ఏం జరిగిందో అందరూ చూశారు. పార్లమెంటులో జరిగిన విషయాలను ప్రతిపక్ష సభ్యులు కూడా తీవ్రంగా విమర్శించారు. మాతోపాటు సమాజ్ వాదీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీజేపీ.. అన్ని పార్టీలూ కూడా వాకౌట్ చేసిన సంఘటన ఇంతవరకు పార్లమెంటులో ఎప్పుడూ జరగలేదు. అందుకే ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచి ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తాయన్ననమ్మకం మాకుంది''.
మేకపాటి, ఎస్పీవై రెడ్డి, మైసూరారెడ్డి, బాలశౌరి తదితరులు కూడా వైఎస్ఆర్సీపీ బృందంలో ఉన్నారు. గతంలో అద్వానీ, సుష్మా స్వరాజ్లతో కూడా భేటీ అయిన జగన్, ఇప్పుడు పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో ఈరోజు సమావేశమయ్యారు.