ఢిల్లీ కోట బద్దలుకొట్టి సమైక్యరాష్ట్రం సాధించుకుందాం
ఢిల్లీ కోటను బద్దలు కొట్టి సమైక్యాంధ్రను సాధించుకుందామని నాయుడుపేట సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో 44 రోజుల పాటు చర్చ జరిగినా, చంద్రబాబు రెండు చేతుల సిద్ధాంతాన్ని పాటించారని, అసెంబ్లీలో ఒక చేతితో సీమాంధ్ర, మరో చేతితో తెలంగాణ నినాదాలు చేయించారని ఆయన మండిపడ్డారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన సమైక్య శంఖారావానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ప్రతి పేదవాడి చదువు రాజశేఖరుడి స్వప్నమని, కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకతీతంగా పలికే పేరు వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుల గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరిగెట్టిస్తున్న నేత వైఎస్ఆర్ అని ఆయన చెప్పారు.
రాజకీయనాయకుడంటే నేనున్నానని ప్రజలందరికీ భరోసా ఇచ్చేవాడిలా ఉండాలని, చంద్రబాబుకు అది లేదని జగన్ అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకటమేనని వైఎస్ఆర్ నిరూపించారని, ఈసారి ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు. 30 ఎంపీ స్థానాలు సాధించి మనమే ప్రధానిని నిర్ణయిద్దామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ అహంకారానికి - తెలుగు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే రైతన్నకు నీరెక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. అలాగే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ తాగునీరు ఎలా తెస్తారని నిలదీశారు.