కల చెదిరింది.. కథ మారింది
Published Fri, Dec 27 2013 4:32 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM
ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమం.. మలుపులు తిరిగిన రాజకీయం.. ఈ రెండు అంశాలు పశ్చిమగోదావరి తీరానికి ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. చరిత్రకే వన్నె తెచ్చేలా జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం.. రోజుకో తీరున మారిన రాజకీయం.. జిల్లా ముఖచిత్రాన్నే మార్చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణే అభిమతంగా ముందుకుసాగింది. రాష్ట్ర విభజన నిర్ణయంపై ద్వంద్వ వైఖరితో టీడీపీ క్యాడర్‌ను దూరం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా ప్రజా వ్యతిరేకతను చవిచూశారు. - సాక్షి ప్రతినిధి / ఏలూరు
వైఎస్సార్ సీపీలో ఉత్సాహం
వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. గడపగడపకూ పాదయాత్ర ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజల్లోకెళ్లారు. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 24 రోజుల పాటు 278 కిలోమీటర్ల మేర జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించి ఔరా అనిపించారు. ఆ తర్వాత సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్రను కూడా ఆమె జిల్లాలో చేపట్టారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విపత్తులు సంభవించినప్పుడు జిల్లాలో పర్యటించి రైతులను ఓదార్చారు. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లెహర్ తుపాను తర్వాత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు.
సమైక్యమే ఊపిరిగా..
రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత మూడు నెల లపాటు జిల్లా అంతటా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల భావోద్వేగాలను బయటపెట్టింది. ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆందోళన, ఆవేదన ఒక్కసారిగా బయటపడ్డాయి. రోజురోజుకీ ఉద్యమం విస్తరించిన విధానం, అట్టడుగు నుంచి ఉన్నత వర్గాల వరకూ భాగస్వాములైన తీరు రా జకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ఎవరి ప్రోద్భలం లేకుండానే, ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని నడిపించడం మేధావుల్ని సైతం నివ్వెరపరిచింది.
జనమంతా ఒక్కటై..
జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్, భీమవరం ప్రకాశంచౌక్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో ప్రతిరోజూ 15 వరకూ ఆందోళనలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు అనేక ఇతర రంగాలకు చెందిన వారు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది.
యువజనం.. ఉద్యోగుల ప్రభంజనం
సమైక్యాంధ్ర ఉద్యమానికి యువకులు కొండంత అండగా నిలిచారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిచోటా ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వోద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. ఏపీఎన్జీవోలు ఒక దశలో ఉద్యమానికి సారథులుగా వ్యవహరించి ముందుకుతీసుకెళ్లారు. వారు చేసిన 66 రోజుల నిరవధిక సమ్మె కారణంగానే ఉద్యమ ప్రభావం అందరికీ తెలిసింది. వారితోపాటు రైతులు, కార్మికులు, రిక్షా కార్మికులు, తోపుడు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకరేమిటి చివరికి హిజ్రాలు కూడా సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఏలూరు నగరంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జేఏసీలు ఏర్పాటై పకడ్బందీ ఉద్యమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు.
ఉద్యమం.. వినూత్నం
ఉద్యమం అంటే ఒక ప్రదర్శన, ఒక ధర్నా, ఒక బహిరంగ సభ గురించే అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుం టాం. కానీ సమైక్య ఉద్యమంలో చేసినన్ని వినూత్న ఆందోళనలు గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. దిష్టిబొమ్మల దహనాలు, వంటావార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటల ద్వారా ప్రజలు తమ నిరసన తెలిపారు.
కేబినెట్‌లో కావూరి
ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం ఒక్కటే కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిచ్చింది. ఆయనకు కేంద్ర జౌళి శాఖ లభించింది. అయితే మంత్రి పదవి దక్కిందనే ఆనందం పంచుకునేలోపే విభజన వ్యవహారం ముందుకురావడంతో కావూరి అడుగడుగునా నిరసనలు ఎదుర్కోక తప్పలేదు.
దివికేగిన కోటగిరి
జిల్లాపై చెరగని ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి ఈ సంవత్సరం రాజకీయాల్లో అనూహ్యంగా చెప్పుకోవచ్చు. జులై 20న అకస్మాత్తుగా గుండెపోటుతో ఆయన మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం హవా నడిపిన విద్యాధరరావు ఆ తర్వాత పీఆర్పీలో చేరి అది కాంగ్రెస్‌లో విలీనమవడంతో ప్రాధాన్యతను కోల్పోయారు. మళ్లీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో విద్యాధరరావు మృతి చెందారు.
ఇరకాటంలో టీడీపీ
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 2013లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర కూడా జిల్లాలో తెలుగుదేశం పరిస్థితిని మెరుగు పరచలేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆ పార్టీ వైఖరి సమైక్యాంధ్రకు అనుకూలంగా లేకపోవడంతో క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విభజనపై పార్టీ వైఖరిని వివరించేందుకు చంద్రబాబు జిల్లాలో పర్యటించాలని భావించినా ఇక్కడి నేతలు చేతులెత్తేయడమే ఆ పార్టీ పరిస్థితికి ఒక ఉదాహరణ. దీంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
కాంగ్రెస్‌కు కష్టకాలం
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2013లో ఒక్కసారిగా తల్లకిందులైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాతో కుదేలైన ఆ పార్టీ సమైక్య ఉద్యమంతో పాతాళానికి వెళ్లిపోయింది. ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగునా నిలదీసి జిల్లాలో తిరగనివ్వలేదు. దీంతో చాలామంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అయితే సహకార ఎన్నికల్లో అధికారం అండతో ఎలాగోలా నెగ్గుకొచ్చారు. ఆ పార్టీకి చెందిన ముత్యాల వెంకటరత్నం డీసీసీబీ చైర్మన్‌గా, రవివర్మ డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ వెనుకబడిపోయింది.
మారిన రాజకీయ ముఖచిత్రం
సమైక్య ఉద్యమ ప్రభావంతోపాటు అంతకుముందు జరిగిన పరిణామాలతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ప్రజల దృష్టిలో చులకనైపోయారు. గందరగోళంతో తెలుగుదేశం కూడా జనంలోకి వెళ్లడానికి ఇబ్బంది పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమంలో మమేకమైంది.
Advertisement