ఎవరిని అడిగి విభజన నిర్ణయం తీసుకున్నారు: జూపూడి
హైదరాబాద్ : ఎవర్ని అడిగి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు డిమాండ్ చేశారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ...దాన్ని వెనక్కి తీసుకునేది లేదంటున్న కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఎవరి కోసం విభజన చేశారని ఆయన నిలదీశారు. ఎవరి కోసం విభజన నిర్ణయాన్ని తీసుకున్నారో చెప్పాలని జూపూడి ప్రశ్నించారు. ప్రజల నిర్ణయంతో సంబంధం లేకుండా విభజన నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయాన్ని మార్చుకున్న సోనియా...విభజన విషయంలో ఎందుకు మార్చుకోవటం లేదని జూపూడి ప్రశ్నించారు.
వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధి సంక్షేమాలు అందుకున్న ప్రజలు...ఆయన మరణం తర్వాత ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కుతోనే విభజన కుట్ర జరిగిందని జూపూడి ఆరోపించారు. తుపాన్, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా వచ్చినవారిని జూపూడి స్వాగతించారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకూ తరలి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. జగన్ వెంట నడుస్తున్న సైన్యం తుపానులో ఢిల్లీ నాయకులు కొట్టుకుపోవాలని ఆయన అన్నారు.