సమైక్యవాదుల్లో పోరాట పటిమ నింపిన షర్మిల ‘సమైక్య శంఖారావం’
Published Fri, Sep 13 2013 3:57 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో పూరించిన ‘సమైక్య శంఖారావం’ సమైక్య వాదుల్లో పోరాట పటిమను నింపింది. టీడీపీ, కాంగ్రెస్ నేతల్ని అంతర్మథనంలో పడేసింది. చంద్రబాబు బస్సు యాత్రలో అసలు సమైక్యాం ధ్ర పదమే వినపడలేదని, షర్మిల తెలుగు ప్రజల అభీష్టానికి అనుగుణంగా ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేసి సభలకు హాజరైన వారిలో స్ఫూర్తి నింపారని సమైక్యవాదులు గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలావుంటే, టీడీపీ, కాంగ్రెస్ శిబిరాల్లో గుబులు బయలుదేరింది.
జిల్లాలో బుధవారం వినుకొండ నుంచి రేపల్లె వరకు ఏకబిగిన 200 కిలోమీటర్లకు పైగా బస్సు యాత్ర చేసిన షర్మిల ఓట్లు, సీట్ల కోసం రాజకీయ డ్రామాలాడుతున్న కాంగ్రెస్, టీడీపీల అసలు రంగుల్ని బయటపెట్టారు. విభజనకు కారకుడైన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని, తెలుగు ప్రజల నడుమ అగ్గి పెట్టి చలికాచుకుంటున్న కాంగ్రెస్ నేతల వైఖరిని షర్మిల దుయ్యబట్టారు. తెలుగు ప్రజలకు భరోసా కల్పిస్తూ, వారి ఇష్టానికి అనుగుణంగా అడుగులేస్తున్న వైఎస్సార్ సీపీ వెంట జనం నడుస్తుండటంతో టీడీపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటోంది.
పైగా జిల్లా ప్రజలు సమైక్య ఉద్యమానికి కట్టుబడి 44 రోజులుగా ఆందోళనలు చేస్తుండడంతో భవిష్యత్తులో ఆ రెండు పార్టీల పుట్టి మునగడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మనుగడ ప్రశ్నార్థకం కాగలదనే అనుమానాన్ని వ్యక్తచేస్తున్నారు. ఇదే అభిప్రాయం ఆ పార్టీ నేతల ప్రైవేట్ సంభాషణల్లోనూ చర్చకు వస్తుంది. కాంగ్రెస్‌తో చేతులు కలిపామన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుందని, ఇది పార్టీ ఉనికికి ప్రమాదమని టీడీపీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ స్వయంగా ఒప్పుకుంటున్నారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి దారుణం ..
125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పరిస్థితి సీమాంధ్రలో దారుణంగా తయారైందని, తాను మాత్రం ఇప్పుడు ఏ పార్టీలో లేనని జిల్లాకు చెందిన సీనియర్ అయిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ ఉండి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేది కాదని టీడీపీకి చెందిన వారే వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. జిల్లాలో జరిగిన చంద్రబాబు, షర్మిల యాత్రలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు బస్సు యాత్ర ఆద్యంతం ఆత్మస్తుతి,పరనిందగా, సమైక్యాంధ్ర ఉద్యమాలను పట్టించుకోకుండా సాగిందంటున్నారు. జగన్ సోదరి షర్మిల యాత్ర సమైక్యాంధ్రను కాంక్షిస్తున్న కార్మిక, కర్షక, ఉపాధ్యాయ,ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాల్లో మరింత స్ఫూర్తిని నింపిందని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
Advertisement
Advertisement