నేడు షర్మిల రాక
Published Wed, Sep 11 2013 6:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : సమైక్య ఉద్యమానికి గొంతుకగా మారిన గుంటూరులో ‘సమైక్య శంఖారావం’ మార్మోగనుంది. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిసోదరి షర్మిల బుధవారం జిల్లాలో సమైక్య శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో షర్మిల ఈ నెల 2 నుంచి ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర బుధవారం జిల్లాలోని వినుకొండకు చేరనుంది. వినుకొండలో ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట బహిరంగ సభ జరగనుంది.
అనంతరం యాత్ర వయా కోటప్పకొండ మీదుగా చిలకలూరిపేట -పసుమర్రు - పెదనందిపాడు - కాకుమాను - బాపట్ల - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు మీదుగా రేపల్లెకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు రేపల్లె నెహ్రూసెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుంది. షర్మిల యాత్ర మొత్తం జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల మీదుగా సాగనుంది. రేపల్లె నుంచి కృష్ణాజిల్లాలోని అవనిగడ్డకు చేరుకుని అక్కడ బహిరంగ సభ అనంతరం రాత్రి అవనిగడ్డలో బస చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ వెల్లడించారు.
ఆది నుంచి ఉద్యమిస్తోన్న వైఎస్సార్ సీపీ....
విభజన ప్రకటన వెలువడిన దగ్గర్నుంచీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. గుంటూరు వేదికగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆరు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు.ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో, జననేత జగన్ జైలు గోడల మధ్య ఏడు రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. చివరకు కేంద్రం సమ న్యాయం చేయలేదని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమైక్య విధానాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు, కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖలు రాశారు. అంతకు ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత తమ పదవులకు రాజీనామా లు చేశారు.
ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కీలక భూమిక పోషిస్తున్నాయి. విభజనపై ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా ప్రశ్నించి, పోరాడింది ఒక్క వైఎస్సార్ సీపీయేనని సమైక్యవాదులు, ఉద్యోగ, కార్మిక, కర్షకులంతా ముక్త కంఠంతో ఎలుగెత్తి చెబుతున్నారు. విభజనకు చంద్రబాబు లేఖను కాంగ్రెస్ గండ్రగొడ్డలిగా ఉపయోగించుకుందని ధ్వజమెత్తుతున్నారు. పై పెచ్చు ‘ఆత్మగౌరవ యాత్ర’ అంటూ జిల్లాకు వచ్చిన చంద్రబాబు తానే లేఖ ఇచ్చానని ప్రకటించడం, సీమాంధ్రుల ప్రయోజనాలు పట్టకుండా పర్యటించడంపై నిరసన వెల్లువెత్తింది. సమైక్య నినాదంతో షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.
Advertisement
Advertisement