రేపు సాలూరులో షర్మిల బహిరంగ సభ: పెనుమత్స | Sharmila public meeting tomorrow in saluru | Sakshi
Sakshi News home page

రేపు సాలూరులో షర్మిల బహిరంగ సభ: పెనుమత్స

Published Sat, Sep 14 2013 5:16 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Sharmila public meeting tomorrow in saluru

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన బస్సు యాత్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబ శివరాజు చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా షర్మిల 15న ఆదివారం సాలూరు రానున్నట్టు తెలిపారు. ఆ రోజు సాయంత్రం సాలూరులో జరిగే భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
 రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుపోతుంటే కాంగ్రెస్ నేతలకు పట్టకపోవడం దారుణమని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల మనోభావాలను గుర్తెరిగిన పార్టీగా వైఎస్‌ఆర్ సీపీ పని చేస్తోందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ అధినేతతో పాటు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందేనన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వారి బాధల్లో భాగస్వాములయ్యేందుకు వైఎస్‌ఆర్ కుటుంబం మొత్తం పని చేస్తోందన్నారు.
 
 ఇందులో భాగంగానే షర్మిల బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ షర్మిల బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రాన్ని విడగొట్టాలని కుట్ర పన్నిన కాంగ్రెస్, టీడీపీ నేతలు నేడు ఉద్యమాల్లో పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ ప్రచార కార్యదర్శి గొర్లె వెంకటరమణ మాట్లాడుతూ సాలూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ గేదెల తిరుపతి, డాక్టర్ సురేష్‌బాబు, అంబళ్ల అప్పల నాయుడు, ఇప్పిలి రామారావు, చెల్లూరు ఉగ్రనరసింగరావు, నామాల సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement