ప్రతిధ్వనించనున్న సమైక్య శంఖారావం
Published Mon, Sep 16 2013 4:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్య శంఖారావం సోమవారం జిల్లాలో ప్రతిధ్వనించనుంది. జిల్లాలో ఉద్ధృతంగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పూరించనున్న ఈ శంఖారావం మరింత స్ఫూర్తిని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్న ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తున్నారు. సమైక్య శంఖారావం పేరిట షర్మిల నిర్వహిస్తున్న బస్సు యాత్ర సోమవారం ఉదయం జిల్లాలోకి ప్రవేశించి.. సాయంత్రం ఇక్కడే ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు రాజాంలో, సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళంలో జరిగే సభల్లో రాష్ట్ర విభజన వల్ల వాటిల్లే నష్టాలతోపాటు, సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్‌సీపీ అనుసరిస్తున్న వైఖరిని షర్మిల ప్రజలకు వివరిస్తారు.
యాత్ర సాగేదిలా..
విజయనగరం జిల్లా సాలూరు నుంచి సోమవారం ఉదయం షర్మిల బయలుదేరుతారు. ఆ జిల్లాలోని రామభద్రపురం, తెర్లాం మీదు గా రాజాం చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పొగిరి, పొందూ రు, లోలుగు, చిలకపాలెం, ఎచ్చెర్ల, నవభారత్ జంక్షన్‌ల మీదుగా శ్రీకాకుళం చేరుకుంటారు. సాయంత్రం వైఎస్సార్ కూడలిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. దాంతో ఆమె చేపట్టిన సమైక్య శంఖారావం బస్సుయాత్ర ముగుస్తుంది. కాగా షర్మిల ఇంతకుముందు నిర్వహించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది.
ఆగస్టు 4న ఇచ్ఛాపురంలో జరిగిన పాదయా త్ర ముగింపు సభలోనే షర్మిల సమైక్య శంఖారావం పూరించారు. ఒక తండ్రిలా ఆలోచించి సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని నిలదీశారు. అందరి కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను ఒక ప్రాంతం వారికి ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమని కూడా సూటిగా ప్రశ్నించారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వైఎస్‌ఆర్‌సీపీ నినాదాన్ని, విధానాన్ని ప్రజలకు వివరించేందుకు సమైక్య శంఖారావం పేరిట సీమాంధ్రలోని 12 జిల్లాల్లో బస్సుయాత్ర పూర్తి చేసిన ఆమె 13వ జిల్లాగా శ్రీకాకుళానికి విచ్చేస్తున్నారు.
ఏర్పాట్లలో నాయకులు
సమైక్య శంఖారావం సభలను విజయవంతం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలోనూ, రాజాంలోనూ ముఖ్య నాయకులు , కార్యకర్తలు సమావేశమై దీనిపై చర్చించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జిల్లాలోని పలువురు నాయకులతో మాట్లాడారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వైవీ సూర్యనారాయణ, వరుదు కల్యాణి, ఇతర నాయకులు సమైక్యవాదులను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు రాజాంలో పార్టీ జిల్లా కన్వీనర్ పద్మప్రియ, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పి.ఎం.జె.బాబు తదితరులు కార్యకర్తల సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.
సభలను విజయవంతం చేయండి: పద్మప్రియ
రాజాం, శ్రీకాకుళం పట్టణాల్లో జరిగే సమైక్య శంఖారావం సభలకు సమైక్యవాదులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హజరై జయప్రదం చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్ ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ముగింపు సభ జరగటం కూడా చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో నిలిపారని, ఆ తర్వాత నాలుగేళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులకు అభివృద్ధి చేయడం చేతకాకపోగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని దయ్యబట్టారు. పాలకుల కుటిల యత్నాలను తిప్పి కొట్టేందుకు షర్మిల సమైక్య శంఖారావం సభలను జయప్రదం చేయాలని కోరారు.
Advertisement