విభజనతో రాష్ట్రానికి శాశ్వత నష్టం: కొణతాల
విభజన జరిగితే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేయడానికి శనివారం సమైక్య శంఖారావం సభను యథావిధిగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని శుక్రవారం పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ సమీక్షించింది. సవూవేశం అనంతరం పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభా పక్ష ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డిలతో కలిసి కొణతాల మీడియాతో మాట్లాడారు. సమైక్య శంఖారావం ద్వారా ప్రజల మనోభావాలను ఢిల్లీకి తెలియపరుస్తామని, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని, సభను వాయిదా వేయలేకపోతున్నామని కొణతాల చెప్పారు.
విభజనను 60 శాతంవుందిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, కేంద్రం పునరాలోచన చేయకపోవడం సరికాదన్నారు. నవంబర్ 15లోగా విభజన బిల్లు రూపొందిస్తామని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పడం దారుణమని, ఓట్లు, సీట్లు లెక్కలతో కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయన్నారు. విభజన ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పీఠం కదిలేలా, విభజనకు సహకరించే ఆ రెండు పార్టీలకు కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయుక చర్యల్లో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొంటున్నాయని కొణతాల చెప్పారు. వర్షబాధిత ప్రాంతాల్లో పరిస్థితిని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గంటగంటకూ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ ఆదేశించారన్నారు. అధికారుల సహాయ సహకారాలతో బాధితు లను పునారావాస కేంద్రాలకు తరలించాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు సభ జరిగే రోజు కూడా యథావిధిగా అవే పనుల్లో కొనసాగాలని జగన్ సూచించినట్టు కొణతాల చెప్పారు. మిగతా వారు మాత్రమే సభకు రానున్నారని ఆయున చెప్పారు.
సాయంత్రం కూడా సమీక్ష: సమైక్య శంఖారావానికి వరద బాధిత ప్రాంతాల నుంచి తరలి వస్తున్న పార్టీ నేతలతో వారు జిల్లాల నుంచి బయల్దేరే ముందు కూడా శుక్రవారం సాయంత్రం జగన్ ఆయా జిల్లాల్లో వరద గురించిన తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని కొణతాల చెప్పారు. హైదరాబాద్ సభకు బయల్దేరకుండా జిల్లాల్లోనే ఉన్న కొందరు నేతలను స్థానికంగా సహాయ కార్యక్రమాలను చేపట్టాలని జగన్ సూచించారని ఆయన వివరించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులకు శని, ఆదివారాల్లో ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా జగన్ వారిని కోరినట్టు కొణతాల తెలిపారు.