ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్‌లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.
రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment