సమానత్వం దిశగా ముందడుగు | Mallepally Laxmaiah Article On Recent Tamil Nadu Temple Incident | Sakshi
Sakshi News home page

సమానత్వం దిశగా ముందడుగు

Published Thu, Feb 24 2022 12:23 AM | Last Updated on Thu, Feb 24 2022 12:29 AM

Mallepally Laxmaiah Article On Recent Tamil Nadu Temple Incident - Sakshi

భారత దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక మహత్తర విప్లవం. వేల సంవత్సరాలుగా ఉన్న అసమానతలకు రాజ్యాంగం చరమగీతం పాడింది. ప్రజలంతా సమానమేననీ, పౌరులందరూ సమానమైన హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. అయితే ఇప్పటికీ దేవాలయాల్లో దళితులకు ప్రవేశం దొరకని సందర్భాలను చూస్తూనే ఉన్నాం. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే! వీటి విరుగుడుకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఏనాడో పరిష్కార మార్గాలను సూచించారు. వాటికి అనుగుణంగానే తమిళనాడు ప్రభుత్వం, హిందువులుగా విశ్వాసం కలిగిన అన్ని కులాల వారికీ పూజారు లుగా ఉండే అవకాశం కల్పిస్తోంది. అంతకుమునుపే కేరళ ప్రభుత్వం ఈ బాటలో నడుస్తోంది. కులనిర్మూలనా ఉద్యమంలో ఇవి గొప్ప ముందడుగులు.

ఒకే రకమైన నేరం చేసినప్పటికీ శిక్షలు కులాన్ని, వర్ణాన్ని బట్టి ఉంటాయని హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతర వ్యాఖ్యానాల ద్వారా ప్రజల మెదళ్ళలో తరతరాలుగా చొప్పించారు. అందుకే చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణులు దైవంతో సమానం కాబట్టి వారిని శిక్షించే అధికారం ఎవరికీ లేదు. క్షత్రియులు ఏది చేసినా రాజ్య రక్షణార్థమై చేస్తారు. అందువల్ల వాళ్ళు శిక్షార్హులు కాదు. వైశ్యులను మందలించాలి, శూద్రులను కఠినంగా శిక్షించాలన్న సూత్రాన్ని వేల సంవత్సరాలుగా  ఘోషిస్తూ వస్తున్నారు. దానికి అడ్డు కట్టపడింది సరిగ్గా 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే!

భారత రాజ్యాంగం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రజ లంతా సమానమేననీ, పౌరులందరూ సమానావకాశాలు, సమాన  హక్కులు కలిగి ఉంటారనీ ప్రకటించింది. దేశ చరిత్రలో భారత రాజ్యాంగమే ఒక విప్లవం. గత రెండువేల సంవత్సరాలకు పైగా భారత దేశంలో ఉన్న ప్రజలను... వర్ణాలుగా, ఆ తర్వాత కులాలుగా విభజించి, ఒకరిపై మరొకరికి ఆధిపత్యం కల్పించి, పుట్టుక ద్వారానే కులం, కులం ద్వారానే గౌరవం, అధికారం కట్టబెట్టిన స్మృతులు, శ్రుతులకు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కాలం చెల్లిపోవడం సమాజానికి జరిగిన ఒక గొప్ప మేలు. రాజ్యాంగం అమలులోకి రావడం ఒక మహత్తరమైన సందర్భమే అయినా, దాని అమలు మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయితే భారత రాజ్యాంగం, దానిపై ఆధారపడి రూపొందించిన చట్టాలు మాత్రం అణగారిన ప్రజలకు ఒక భరోసానిచ్చాయి. 

రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో ఒకసారి మాట్లాడుతూ, ‘‘అది ఎంత మంచి రాజ్యాంగం అయినప్పటికీ, అమలు చేసేవాళ్ళకు చిత్తశుద్ధి లేకపోతే అది నిరర్థకమవుతుంది. ఒక వేళ రాజ్యాంగం చెడ్డదైనప్పటికీ, దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్లయితే, ఆ రాజ్యాంగమే తన స్వరూపాన్ని మార్చుకుంటుంది’’ అని ప్రభుత్వాల స్వభావాన్నీ, రాజ్యాంగం అమలు ప్రాధాన్యాన్నీ స్పష్టంగా విడమర్చి చెప్పారు. 

సరిగ్గా అదే విషయం తమిళనాడులో రుజువైంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు రాజ్యాంగ శక్తిని నిరూపిస్తున్నాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ చిదంబరం నటరాజ దేవాలయంలో ఒక దళిత మహిళకు జరిగిన అవమానం పైన ప్రభుత్వం స్పందించి, ఇరవై మంది అర్చకులపై కేసును నమోదు చేసింది. చిదంబరం నటరాజ దేవాలయంలో ‘కనకసభ’ ప్రాంగణంలోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించిన లక్ష్మి అలియాస్‌ జయశీల అనే మహిళను పూజారులు అడ్డుకోవడం మాత్రమే కాకుండా, కులం పేరుతో దూషించారని ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం పూజారులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. 

గతంలో దేవాలయ ప్రవేశాలను నిరోధించిన సంఘటనల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ అక్కడ ప్రభుత్వాలు నిజమైన దోషు లను విడిచిపెట్టి, ఎవరెవరి మీదనో కేసులు పెట్టాయి. కానీ తమిళ నాడు ప్రభుత్వం దేవాలయాల మీద గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న అర్చక వర్గం పైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం సాహసోపేత నిర్ణయం. ఈ సాహసం చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది ప్రాథమిక హక్కులే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 16, ఆర్టికల్‌ 17, ఆర్టికల్‌ 21 – ఇలా ఎన్నెన్నో ఆర్టికల్స్‌ అసమానతల తొలగింపు లక్ష్యంగా నిర్దేశించుకున్నవి. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఈ ఆర్టికల్స్‌ అన్నింటి వెనుక ప్రజలందరికీ సమానమైన, గౌరవప్రదమైన జీవితాలను అందించాలనే ఏకైక లక్ష్యం ఇమిడి ఉంది. వాటి అమలు బాధ్యతను ప్రభుత్వాల చేతికి ఈ ఆర్టికల్స్‌ అప్పగించాయి. 

ఇప్పటికీ మన దేశంలోని చాలా గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు. ఆధిపత్య కులాలు దేవాలయాలను దళితులకు దూరంగా ఉంచుతున్నాయి. అందువల్ల తమిళనాడు ప్రభుత్వం 2007 సంవత్సరంలో హిందువులుగా విశ్వాసం కలిగి, హిందూ దేవాల యాల్లో పూజలు చేసుకోవాలనుకున్న అన్ని కులాలకు పూజారులుగా ఉండే అవకాశం ఉన్నదని భావించి, అర్హతలను బట్టి వారిని ఎంపిక చేసి, శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కానీ కొంతమంది సనాతనవాదులు ఈ విషయమై కోర్టు కెక్కారు. అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ గొగోయ్, జస్టిస్‌ రమణ ఈ కేసును విచారించి, దేవాలయాల్లో పనిచేయడానికి అవసరమైన సిబ్బందిని, అర్చకవర్గాన్ని ఒక కులానికి మాత్రమే పరి మితం చేయకూడదనీ, హిందువులైన అందరూ హిందూ దేవాల యాల్లో అర్చకులుగా అర్హులేననీ, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సభ చర్చలను ఉదాహరిస్తూ, 2015 డిసెంబర్‌ 16న ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చారు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకే ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. అయితే 2021లో తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో డీఎంకే హిందూ దేవాలయాల్లో వివక్షకు తావు లేకుండా అర్హులైన అందరినీ అర్చకులుగా నియమిస్తామని తన ప్రణాళికలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే 2021 ఆగస్టు 14న గతంలో శిక్షణ పొందిన అర్చకులను ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

అదే విధంగా దక్షిణాదిలో మరొక రాష్ట్రం కేరళ 2017 అక్టోబర్‌ 5వ తేదీన బ్రాహ్మణేతరులను దేవాలయ పూజారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు రాష్ట్రాలు భారత రాజ్యాంగంలోని కీలకమైన సమాన హక్కుల అమలుకు ఒక కొత్త దారిని చూపాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై; వాటిని అమలు చేసిన డీఎంకే, సీపీఎం లపై విమర్శలు వచ్చాయి. కానీ అవి వాటిని పట్టించుకోకుండా, రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను అమలుచేస్తున్నట్టు ప్రకటించాయి. అయితే అంబేడ్కర్‌ 1935 డిసెంబర్‌లో ‘కుల నిర్మూ లన’ పేరుతో ప్రసంగపాఠంలో చాలా విస్తృతంగా కుల సమస్యను గురించి చర్చించారు. ఒక రకంగా భారత దేశ సమాజ మార్పునకు ఈ పుస్తకం ఒక ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. కుల సమస్య సమసిపోవడానికి అడ్డంకిగా ఉన్న అంశాలను, పరిష్కారాలను ఎంతో సైద్ధాంతిక అనుభవంతో వివరించారు. కుల నిర్మూలన జరగాలంటే కేవలం కంటితుడుపు చర్యలు మాత్రమే పనికిరావనీ, ముఖ్యంగా ప్రజల మెదళ్ళను కలుషితం చేసిన, చేస్తున్న ధర్మశాస్త్రాలను తిరస్క రించాలనీ, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలనీ సూచించారు. అంతేకాకుండా హిందూ కులవ్యవస్థలో ఉన్న అసమానతలను తొల గించడానికి ఒక కార్యక్రమాన్ని కూడా అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. 

అన్ని ధర్మశాస్త్రాలనూ పక్కన పెట్టి, హిందువులందరికీ ఆమోద యోగ్యంగా ఉండే ఒక గ్రం«థాన్ని రూపొందించాలని సూచించారు. ఒక కులానికే పరిమితమైన పూజారి వ్యవస్థను రద్దు చేయాలనీ, హిందూ మతం అవలంబిస్తోన్న అందరికీ పూజారి అయ్యే అవకాశం ఉండాలనీ ప్రతిపాదించారు. పూజారులు ప్రభుత్వోద్యోగులుగా ఉండాలనీ, ప్రభుత్వమే వారికి శిక్షణనిచ్చి నియమించాలనీ, ప్రభుత్వో ద్యోగులైన ఐసీఎస్‌(ఇప్పటి ఐఏఎస్‌) ఉద్యోగాల్లాగా ఒక పద్ధతి ప్రకారం నియామకాలు జరగాలనీ పేర్కొన్నారు. దానికి అనుగుణం గానే రాజ్యాంగంలో సమాన హక్కులు, అవకాశాలను పొందు పరి చారు. 1935లో అంబేడ్కర్‌ ప్రతిపాదించిన అంశాలు ఇప్పటికైనా రెండు రాష్ట్రాలు అమలులోకి తీసుకురావడానికి చేస్తున్న కృషి... కుల నిర్మూలనా మహోద్యమంలో ఒక ముందడుగు అని చెప్పక తప్పదు!

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement