ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. భారత గణతంత్రంలోని గవర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదనేది స్పష్టం.
ముఖ్యమంత్రి సలహా లేకుండా సిట్టింగ్ మంత్రిని తొలగించడం ద్వారా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్యాంగపరంగా అరు దైన సాహసోపేత ప్రయోగం చేశారు. వాస్తవానికి, ఆదేశం జారీ చేసిన కొన్ని గంటల్లో, ఆయన దానిని నిలిపివేశారు. అయినా ఈ చర్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంతో పాటు రాజ్యాంగవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సూచించిందని అనంతరం గవర్నర్ వెల్లడించారు. దేశంలోని అత్యున్నత న్యాయ అధికారిని సంప్రదించకుండా, ముఖ్యమంత్రి తప్పనిసరి సలహా లేకుండా, అసెంబ్లీలో పూర్తి మెజా రిటీ ఉన్న ప్రభుత్వ మంత్రిని తొలగించాలనే అపూర్వమైన ఉత్తర్వు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది.
ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. ఆర్టికల్ 164 ప్రకారం, సీఎం సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. తన మంత్రులను ఎంపిక చేయడం లేదా తొలగించడం పూర్తిగా సీఎం ప్రత్యేకాధికారం. ఒక మంత్రిని వద్దనుకుంటే, తదనుగుణంగా గవర్నర్‌కు సలహా ఇస్తాడు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించే అన్ని దేశాల్లోనూ ఇదే వాడుకగా ఉంటోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, ‘గవర్నర్ సంతుష్టి (ప్లెజర్)తో ఉన్నంతకాలం మంత్రులు తమ బాధ్యతలు నిర్వహిస్తారు’ అని చెబుతోంది. ఇది ఒక మంత్రి మనుగడ పూర్తిగా గవర్నర్ ఇష్టా నిష్టాలపై ఆధారపడి ఉందనీ, ఏ మంత్రి పట్ల అయినా గవర్నర్ తన సంతుష్టిని ఉపసంహరించుకోవచ్చనీ అభిప్రాయాన్ని కలిగించవచ్చు. ‘గవర్నర్ సంతుష్టి’ అనేది ఇక్కడ కీలకమైన అంశం. దాని నిజమైన భావాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51కి వెళ్లాలి.
సెక్షన్ 51లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం, గవర్నర్ తన విచక్షణ మేరకే మంత్రులను పదవుల్లోకి ఎన్ను కోవాలి. అదేవిధంగా సెక్షన్ 51లోని సబ్–సెక్షన్ (5) మంత్రుల ఎంపికకు, తొలగింపునకు సంబంధించి గవర్నర్ తన విధిని విచక్ష ణతో అమలు చేయాలని చెబుతోంది. ఆ విధంగా, భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51, మంత్రులను ఎన్నుకోవడానికీ, వారిని తొలగించడానికీ గవర్నర్‌కు విచక్షణాధికారాలను అందిస్తోంది.
సంతుష్ట సిద్ధాంతం ఇక్కడ పూర్తిగా పనిచేస్తోంది.
భారత ప్రభుత్వ చట్టంలోని నిబంధనలను మన రాజ్యాంగం పెద్ద ఎత్తున పునరుత్పాదన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, 164లో సెక్షన్ 51 గణనీయంగా పునరుత్పాదన అయింది. అటువంటి నిబంధనలో సంతుష్ట సిద్ధాంతం ఒకటి. కానీ రాజ్యాంగ నిర్మాతలు దీనికి సంబంధించి కీలకమైన మార్పు చేశారు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, వారు ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు.
అంటే భారత గణతంత్రంలోని గవ ర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. పైగా ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొల గించే విచక్షణాధికారం గవర్నర్‌కు లేనప్పుడు సంతుష్ట సిద్ధాంతం దాని బలాన్ని కోల్పోతుంది. పైగా రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయిన ముఖ్యమంత్రి నుండి సలహా వచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించడం లాంఛనప్రాయంగా మారుతుంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టంగా నిర్ధారించవచ్చు.
గవర్నర్ తీసుకునే అలాంటి చర్య రాజ్యాంగ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా మనం తీవ్రంగా పరిగణించాలి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన గవర్నర్, మంత్రులను ఇష్టానుసారంగా తొలగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం ఉంది. స్వతంత్రంగా అమలు చేయగల కార్యనిర్వాహక అధికారం గవర్నర్‌కు లేదని గుర్తుంచుకోవాలి.
ఆర్టికల్ 153 ప్రకారం, రాజ్యాంగంలో పేర్కొన్న విచక్షణ విధులు మినహా, అతని అన్ని విధులు మంత్రిమండలి సహాయం, సలహాపై మాత్రమే నిర్వహించబడతాయి. 1974 నాటి శంశేర్ సింగ్ కేసులో, ఎన్ను కోబడిన ప్రభుత్వానికి సంబంధించినంతవరకు గవర్నర్ అధికారాలకు సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. తదుపరి నిర్ణయాలన్నీ దానిని పునరుద్ఘాటించాయి. కాబట్టి, మన రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ స్థానంపై చట్టం స్థిరపడింది.
అలాగే, మంత్రిని నియమించడం లేదా తొలగించడంలో గవర్నర్‌కు విచక్షణాధికారం లేదని ఆర్టికల్ 164 స్పష్టం చేసింది. రెండూ సీఎం పరిధిలోనే ఉన్నాయి. గవర్నర్‌పై కాకుండా సీఎం విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రులు క్యాబినెట్‌లో ఉండగలరు.
గవర్నర్ అత్యున్నత రాజ్యాంగ కార్యనిర్వాహకుడు. ఆయన ఆదర్శప్రాయమైన నిష్పాక్షికతతో వ్యవహరించాలి. క్రియాశీల రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించకూడదని రాజ్యాంగ అసెంబ్లీలో కొంతమంది సభ్యుల నుండి డిమాండ్ వచ్చింది. అటువంటి సూచనలు ఆ సమయంలో తీసుకోనప్పటికీ, రాజకీయ నాయకులు లేదా మాజీ అధికారులు రాజ్‌భవన్ లో పని చేసిన సమయంలో ప్రశంసనీయంగా పనిచేశారు.
ఈ మహోన్నతమైన, ముఖ్యమైన రాజ్యాంగ పదవిని స్వీకరించే స్త్రీ పురుషులకు ఉంటున్న అనుకూలత, అర్హతల గురించి భారతీయ సమాజం చర్చను ప్రారంభించాల్సిన సమయం ఇది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో రాజ కీయాల కేంద్రం మెల్లగా రాజ్ భవన్ వైపు మొగ్గుతోంది. ఇది కచ్చితంగా సానుకూలమైన ఆలోచన మాత్రం కాదు.
పి.డి.టి. ఆచారి
వ్యాసకర్త లోక్‌సభ మాజీ కార్యదర్శి
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment