చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. తమిళనాడు గవర్నర్‌పై సీఎం స్టాలిన్ సంచలన విమర్శలు చేశారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవిని వెంటనే రీకాల్ చేయాలని కేంద్రాన్ని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఇటీవల చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలపించిన తమిళ రాష్ట్ర గీతంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ‘ద్రవిడ’ అనే పదాన్ని పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు. ఇదే సమయంలో ద్రవిడియన్ అలర్జీతో గవర్నర్ బాధపడుతున్నారా?. అందుకే ఆయన తమిళ గేయం నుంచి ద్రవిడ అన్న పదాన్ని తొలగించారా? అని ప్రశ్నించారు. జాతీయ గీతంలోనూ ద్రవిడ అనే పదాన్ని దాటవేసే దమ్ము గవర్నర్‌కు ఉందా అని సవాల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తమిళుల మనోభావాలను దెబ్బతీసిన గవర్నర్‌ను కేంద్రం వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపణలపై తాజాగా గవర్నర్ కార్యాలయం స్పందించింది. గవర్నర్ కేవలం ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, గీతాన్ని ఆలపించిన ట్రూప్ ద్రవిడ పదాన్ని దాటవేసిందని వివరణ ఇచ్చింది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణలు చెబుతూ గాయకుల పరధ్యానం కారణంగానే అది జరిగిందని పేర్కొంది. తమ కారణంగా గవర్నర్‌కు జరిగిన ఇబ్బంది పట్ల క్షమాపణలు కోరింది.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ స్పందనపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమిళ రాష్ట్ర గీతం వివాదం జరుగుతుంటే గవర్నర్ ఎందుకు స్పందించలేదు?. రాజ్‌భవన్‌ను రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదు. తమిళ భాషను కేంద్రం పట్టించుకోవడం లేదు. తమిళ భాష కోసం ఎంతవరకైనా పోరాడుతాం. నిర్బంధ హిందీ భాషను తీసుకువస్తే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment