
ఆయనవి చిన్న పిల్లల చేష్టలు
సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు అభివృద్ధిని గవర్నర్ ఆర్‌ఎన్ రవి జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాక తమిళనాడు అసెంబ్లీ కొన్ని విడ్డూరమైన ఘటనలకు వేదికగా మారిందన్నారు. శనివారం సీఎం స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడారు. జాతీయ గీతం బదులు తమిళనాడు రాష్ట్ర గీతాన్ని వినిపించినందుకు నిరసనగా గత వారం అసెంబ్లీలో ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ చేయడాన్ని చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఆయన ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.2022లో తామిచి్చన ప్రసంగాన్ని గవర్నర్ రవి యథాతథంగా చదివారని, మూడేళ్ల నుంచి సంబంధం లేని సాకులు చూపుతూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీని, ప్రజల మనోభావాలను గౌరవించకుండా గవర్నర్ రాజకీయ ఉద్దేశాలతో వ్యవహరిస్తున్నారన్నారు. విధులను నిర్వర్తించని, తమిళ గీతాన్ని గౌరవించని గవర్నర్ తీరుపై సభ నిరసిస్తుందని తెలిపారు. సభలో ఇటువంటివి పునరావృతం కారాదని స్టాలిన్ పేర్కొన్నారు.