చెన్నై: తమిళనాట బుధవారం అర్ధరాత్రి దాకా పొలిటికల్ హైడ్రామా సాగింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి వివాదాస్పద నిర్ణయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మంత్రి వీ సెంథిల్ బాలాజీని.. మంత్రి వర్గం నుంచి తొలగించడం, అదీ సీఎం స్టాలిన్‌ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై డీఎంకే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి మంత్రిని సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు.. అందుకోసం గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు అర్ధరాత్రి అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు సమాచారం. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు.
ఇదిలా ఉంటే.. బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలపై స్టాలిన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
అంతకు ముందు ఈ పరిణామంపై ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లడారు. గవర్నర్‌పై ధ్వజమెత్తిన ఆయన.. తన మంత్రివర్గంలోని వ్యక్తిని తొలగించే హక్కు గవర్నర్‌కు ఉండదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటుందని తెలిపారు. న్యాయ నిపుణులతో చర్చించేందుకు గానూ సీనియర్ నేతలను ఆహ్వానించారాయన. శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment