గవర్నర్ ఆర్‌ఎన్ రవి
సాక్షి, చైన్నె : ఏదీ శాంతి వనం..? ఎక్కడ భద్రత అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు అధికార డీఎంకేలో ఆగ్రహాన్ని రేపింది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ మళ్లీ ప్రభుత్వంతో ఢీ కొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. ఆది నుంచి డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యవహిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఈనేపథ్యంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో రెండు సార్లు డీఎంకే పాలకులు తీర్మానం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన అనేక తీర్మానాలను గవర్నర్ మళ్లీ పక్కన పెట్టే పనిలో పడ్డారు. ఇందులో సిద్ధ వైద్య వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలు ఉన్నాయి. డీఎంకే పాలకులపై పరోక్షంగా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉంటూ వస్తున్న గవర్నర్ ఈ సారి ఆంగ్ల మీడియా వేదికగా విమర్శలు ఎక్కువ పెట్టడం డీఎంకే పాలకులకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది.
వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా..
ఓ ఆంగ్ల మీడియాకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇచ్చిన ఇంటర్వ్యూలోని అంశాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఆయన రాజ్ భవన్‌కు నిధుల కేటాయింపులు, ముసాయిదాల ఆమోదంలో జాప్యం, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘన, శాంతి భద్రతల వ్యవహారం, ద్రవిడ మోడల్ పాలనపై విమర్శలు గుప్పించే విధంగా వ్యాఖ్యలు చేశారు. విద్యా ముసాయిదాలపై గవర్నర్ స్పందిస్తూ, విద్య అన్నది జనరల్ కేటగిరీ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే, వర్సిటీలకు సంబంధించి ప్రభుత్వం పంపించిన ముసాయిదాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. విద్యకు ప్రత్యేక అధికారం ఉందని, ఇందులో రాజకీయం జోక్యం తగదని గవర్నర్ స్పష్టం చేశారు. వీసీల నియామకం బిల్లు నుంచి సిద్ధ వర్సిటీ ముసాయిదా వరకు నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగానే వాటిని పెండింగ్‌లో పెట్టినట్లు పేర్కొనడం గమనార్హం.
నిధులపై రాద్ధాంతం తగదు
రాజ్ భవన్‌కు నిధుల కేటాయింపు, ఖర్చుల గురించి స్పందిస్తూ, రాజ్ భవన్ కేటాయించిన మొత్తం దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం పేర్కొనడం శోచనీయమన్నారు. గవర్నర్‌కు కేటాయించిన నిధులు, ఖర్చులను ఎవ్వరూ కట్టడి చేయలేరని, ఇది గవర్నర్ వ్యక్తిగత నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇక అక్షయ పాత్ర నిర్వహణ అంశం గతంలో పూర్తిగా గవర్నర్ పరిధిలో ఉందని, తద్వారా అక్షయ పాత్ర పేద విద్యార్థుల కడుపు నింపిందని ఆర్‌ఎన్ రవి వివరించారు.
కాలం చెల్లింది..
ద్రవిడ మోడల్ పాలన గురించి స్పందిస్తూ, ఇది కాలం చెల్లిన సిద్ధాంతమని గవర్నర్ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల గురించి స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి ఆజ్యం పోశాయి. అసెంబ్లీ వేదికగా రాష్ట్రం శాంతివనంగా ఉండటం వంటి అంశాలను తాను ప్రాస్తవించక పోవడాన్ని గుర్తు చేస్తూ గవర్నర్ కొన్ని వ్యాఖ్యల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో ఏదీ శాంతి, ఎక్కడ భద్రతా.. అంటూ గవర్నర్ ఎదురు ప్రశ్నలు వేయడం గమనార్హం. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం అనంతరం అనేక చోట్ల జరిగిన పెట్రో బాంబు దాడులు, కోవై పేలుడు ఘటన, కళ్లకురిచ్చి అలర్లు, తిరుచ్చి డీఎంలో వార్, మహిళా పోలీసులకు బెదిరింపులు, ఇసుక మాఫియా చేతిలో వీఏఓ హత్య వంటి అంశాలను ప్రస్తావిస్తూ గవర్నర్‌పై ప్రశ్నలను సంధించడం గమనార్హం.
ఈ పరిణామాలను డీఎంకే నేతలు తీవ్రంగానే పరిగణించారు. ఎదురు దాడికి సిద్ధమయ్యే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే విషయంగా స్పీకర్ అప్పావును ప్రశ్నించగా, అసెంబ్లీ వ్యవహారాలను బహిరంగంగా చర్చించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఎం స్టాలిన్ నిశితంగా పరిశీలిస్తున్నారని సరైన సమయంలో స్పందిస్తారన్నారు. అదే సమయంలో గవర్నర్ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని డీఎంకే వర్గాలు పోరుబాటకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment