
ఎంబీబీఎస్ చదవాలనే కలను చెరిపేసిన నీట్ పరీక్ష.. ఓ విద్యార్థిని, అతని తండ్రిని..
చెన్నై: ఎంబీబీఎస్ చదవాలనే కలను చెరిపేసిన నీట్ పరీక్ష.. 19 ఏళ్ల ఓ విద్యార్థిని బలవన్మరణం వైపు అడుగులేయించింది. కొడుకు లేదనే బాధ తట్టుకోలేని ఆ తండ్రి సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు నుంచి మరో నీట్ మరణం నమోదుకాగా.. ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పనిలో పనిగా గవర్నర్ ఆర్‌ఎన్ రవికి చురకలు అంటించారు.
ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఎదుగుదలకు ఆటంకంగా ఉన్న నీట్ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో రద్దు అయ్యి తీరుతుంది. అందుకోసం ప్రభుత్వం న్యాయపరమైన మార్గం ద్వారా ప్రయత్నాలు చేస్తోందని అని సీఎం స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తమిళనాట నీట్ పరీక్ష కారణంగా విద్యార్థులు చనిపోతుండడం తెలిసిందే. ఈ క్రమంలో నీట్ రద్దు కోసం జ్యూడిషియల్ కమిటీ ద్వారా తమ వంతు ప్రయత్నాలు సైతం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. నీట్ రద్దు కోసం అసెంబ్లీ తీర్మానం ద్వారా బిల్లును(anti Neet Bill) తీసుకురాగా.. గవర్నర్ ఆర్‌ఎన్ రవి మాత్రం దానిని ఆమోదించడం లేదు. నీట్ పరీక్ష జరిగాల్సిందేనని గవర్నర్ రవి తన అభిప్రాయం చెబుతున్నారు. ఈ క్రమంలో.. స్టాలిన్ ఇవాళ్టి ప్రకటనలోనూ నీట్ హద్దులు రానున్న కొన్నినెలల్లో బద్దలై తీరతాయని పేర్కొన్నారు.
సంతకం చేయను అని ఎవరైతే అంటున్నారో.. రాజకీయ మార్పులు చోటుచేసుకుంటే వాళ్లు ఎలాగూ కనిపించకుండా పోతారు. అప్పుడు అన్నిమార్గాలు సుగమం అవుతాయి అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన.
చెన్నైకి చెందిన జగదీశ్వరన్ (19) అనే విద్యార్థి రెండుసార్లు నీట్ రాసినా అర్హత సాధించలేదు. దీంతో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్ సైతం సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ తండ్రీకొడుకుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన స్టాలిన్.. ఇవే చివరి నీట్ మరణాలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పంద్రాగస్టు తేనీటి విందు బహిష్కరణ
నీట్ వ్యతిరేక బిల్లు విషయంలో గవర్నర్ చేస్తున్న తాత్సారం, నీట్ జరిగి తీరాలనే మొండిపట్టును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో పంద్రాగస్టుకు గవర్నర్ ఆర్‌ఎన్‌రవి ఇస్తున్న తేనీటి విందును బహిష్కరిస్తున్నట్లు సీఎం స్టాలిన్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ పరామర్శించారు.
குறைந்த மதிப்பெண்(160) பெற்ற என்னால் MBBS 25 லட்சம் பணம் கட்டி படிக்க முடிகிறது 400 மதிப்பெண் எடுத்த நண்பர் ஜெகதீசனால் MBBS சேர முடியவில்லை. - மறைந்த மாணவர் ஜெகதீசனின் நண்பர் ஃபயாஸ்தின்.#NEET #BanNeet pic.twitter.com/6ooI0y5H4E
— Raj ✨ (@thisisRaj_) August 14, 2023