Tamil language
-
తమిళనాడు గవర్నర్ Vs స్టాలిన్.. ‘ద్రవిడ’ పదంపై చర్చ
చెన్నై: తమిళనాడులో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. తమిళనాడు గవర్నర్‌పై సీఎం స్టాలిన్ సంచలన విమర్శలు చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవిని వెంటనే రీకాల్ చేయాలని కేంద్రాన్ని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.ఇటీవల చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలో గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలపించిన తమిళ రాష్ట్ర గీతంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ‘ద్రవిడ’ అనే పదాన్ని పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు. ఇదే సమయంలో ద్రవిడియన్ అలర్జీతో గవర్నర్ బాధపడుతున్నారా?. అందుకే ఆయన తమిళ గేయం నుంచి ద్రవిడ అన్న పదాన్ని తొలగించారా? అని ప్రశ్నించారు. జాతీయ గీతంలోనూ ద్రవిడ అనే పదాన్ని దాటవేసే దమ్ము గవర్నర్‌కు ఉందా అని సవాల్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తమిళుల మనోభావాలను దెబ్బతీసిన గవర్నర్‌ను కేంద్రం వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపణలపై తాజాగా గవర్నర్ కార్యాలయం స్పందించింది. గవర్నర్ కేవలం ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, గీతాన్ని ఆలపించిన ట్రూప్ ద్రవిడ పదాన్ని దాటవేసిందని వివరణ ఇచ్చింది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణలు చెబుతూ గాయకుల పరధ్యానం కారణంగానే అది జరిగిందని పేర్కొంది. తమ కారణంగా గవర్నర్‌కు జరిగిన ఇబ్బంది పట్ల క్షమాపణలు కోరింది.ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ స్పందనపై ముఖ్యమంత్రి స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమిళ రాష్ట్ర గీతం వివాదం జరుగుతుంటే గవర్నర్ ఎందుకు స్పందించలేదు?. రాజ్‌భవన్‌ను రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదు. తమిళ భాషను కేంద్రం పట్టించుకోవడం లేదు. తమిళ భాష కోసం ఎంతవరకైనా పోరాడుతాం. నిర్బంధ హిందీ భాషను తీసుకువస్తే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
సింగపూర్‌లో తమిళ భాష వైభవం.. ప్రోత్సహిస్తున్న ఆ దేశ మంత్రి!
పరాయి దేశాల్లో మన భాషకు ప్రాముఖ్యత ఇస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. అక్కడ విద్యా విధానంలో మన భాషలకు ప్రాధాన్యం ఇస్తే.. ప్రతి భారతీయ పౌరుడిగా సగర్వంగా అనిపిస్తుంది. సింగపూర్ దేశంలో అలాంటి అద్భుత సన్నివేశమే చోటు చేసుకుంది. సాక్షాత్తు ఆ దేశ మంత్రి అందుకు నడుబిగిస్తే అది మాములు విషయం కాదు కదా. ఏం జరిగిందంటే..సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మంత్రి ఇంద్రాణి రాజా తమిళ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సంపన్న నగర రాష్ట్రంలో నాలుగు అధికారిక భాషల్లో ఒక దానిని చిన్నారులకు పరిచయం చేయాల్సిన అవసరం గురించి తెలిపారు. అక్కడ సింగపూర్ విద్యా విధానం హిందీ, ఉర్దూ, పంజాబీ, వంటి ఇతర ప్రధాన భారతీయ భాషల తోపాటు తమిళం, మలయాళమ్, చైనీస్(మాండరిన్) వంటి భాషలను పాఠశాలల్లో సెకండ్ లాగ్వేజ్గా ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ఇంద్రాణి రాజా సింగపూర్ ప్రధాన మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ..తమిళ భాష ఇక్కడ ఉండే భారతీయ ప్రజలందర్నీ కలిపే పాస్‌పోర్ట్‌గా పనిచేస్తుంది. దాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనది కాబట్టి దాన్ని పాఠ్యాంశంగా పిల్లలు నేర్చుకోవాలని అన్నారు. కేవలం చదువుగానే గాక వాడుకలో కూడా ఆ భాషను వినియోగించాలన్నారు. చిన్నప్పటి నుంచి చిన్నారులు మాతృభాషను ఉపయోగిస్తున్నంత కాలం ఏ భాష అయిన సజీవంగానే ఉంటుందన్నారు. అంతేగాదు సింగపూర్‌లో తమిళ భాషా వారసత్వాన్ని నిలబెట్టేందుకు తమిళ భాషా మండలి(టీఎల్సీ) గత 18 ఏళ్లుగా తమిళ భాషా ఉత్సావాన్ని(టీఎల్ఎఫ్) నిర్వహిస్తోంది. గత శనివారమే ఈ టీఎల్ఎఫ్ని ప్రారంభించారు. ప్రతి తరం వారి మాతృభాషతో అనుసంధానింపబడి ఉండాలని అదే వారసత్వ సాంస్కృతిక గుర్తింపు అని దాని ప్రాముఖ్యత గురించి చెప్పుకొచ్చారు. 'క్యాపబిల్టీస్' అనే పేరుతో ఈ ఏడాది టీఎల్సీ సింగపూర్‌లో ఈ తమిళ భాషా ఉత్సవాన్ని మార్చి 30 నుంచి ఏప్రిల్ 28 వరకు జరుపుతోంది. ఈ వేడుకల్లో మొత్తం 47 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇలా సింగపూర్‌లో భారత సంతతి తమిళులు సాముహికంగా వినూత్న కార్యక్రమాలు రూపొందించడానికి ఈ ఏడాది థీమ్‌ను కూడా ఎంచుకున్నట్లు టీఎల్సీ చైర్పర్సన్ ఎస్ మనోగరన్ అన్నారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 65%కి పైగా ఎక్కువ ఈవెంట్లు యువకులచే నిర్వహించనున్నారు. కళ, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాల ద్వారా యువతకు తమిళ భాషను చేరువ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా అయినా తమిళ భాషను నేర్చుకోవడం వల్లే కలిగే ప్రయోజనం తెలుసుకోవాలన్నదే తమ ధ్యేయమని అన్నారు మనోగరన్. (చదవండి: US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!) -
తమిళనాడులో దారుణం.. హిందీలో మాట్లాడారని..
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చిన వలస కార్మికులపై ఓ తమిళ వ్యక్తి దాడి చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఓ రైలు ప్రయాణికులతో ఫుల్‌గా నిండిపోయింది. రన్నింగ్‌లో ఉన్న రైలులో ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడుతూ కొందరిని పలకరించాడు. వారికి తమిళంలో రాకపోవడంతో వేరే భాషలో సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆగ్రహానికి లోనైన సదరు వ్యక్తి.. ట్రైన్లో ప్రయణిస్తున్న వలస కార్మికులపై తిట్ల దండకం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా.. వారిపై దాడి చేశాడు. దుర్భాషలాడుతూ చేతితో పంచ్‌లు ఇచ్చాడు. ఓ ప్రయాణికుడి జుట్టు పట్టుకుని లాగుతూ.. తమిళంలో కోపంతో బూతులు తిట్టాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియోను రైట్ వింగ్ మద్దతుదారు కార్తీక్ గోపీనాథ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో రైల్వే అధికారులకు చేరడంతో దీన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 323, 294(బీ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని అంటున్నారు. నార్త్‌లో కూడా దక్షిణాదికి చెందిన కార్మికులు ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా కేంద్రం వర్సెస్ తమిళనాడు అన్న తీరుగా రాజకీయంగా నడుస్తోంది. బలవంతంగా హిందీ అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తమిళనాడు సీఎం స్టాలిన్ హిందీ అమలు విషయంలో రాష్ట్రాలు అమలు చేస్తున్నా రెండు భాషల విధానానికి కేంద్రంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సీరియస్ కామెంట్స్ చేశారు. అంతకుముందు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా.. తమిళనాడు పర్యటన సందర్భంగా నల్లబెలూన్లతో తమిళులు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
హిందీ భాషపై కమల్‌హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళ భాష వర్ధిల్లాలి.. అని నటుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం విక్రమ్. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో సూర్య అతిథి పాత్రలో కనిపించడం విశేషం. మాస్టర్ చిత్రం ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ చిత్ర ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్నిచెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ.. హిందీని వ్యతిరేకించనని, అలాగని తన మాతృభాష తమిళానికి అడ్డుపడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాని పేర్కొన్నారు. 'చిన్నతనంలో శివాజీ గణేషన్ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని. అలా తనకు తొలి గురువు ఆయన అయితే రెండవ గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా బాధ్యత. దీనికి ఎవరూ అడ్డు వచ్చినా ఎదుర్కొంటా. ఇప్పుడు భాష గురించి చర్చ జరుగుతోంది..మాతృభాషను మరవకండి. హిందీకి వ్యతిరేకినని చెప్పను. అన్ని భాషలూ ఒకటే. అందరూ కలిస్తేనే ఇండియా' అంటూ చెప్పుకొచ్చారు. -
ఇది హిందీ ప్రభుత్వం కాదు: కమల్
చెన్నై: ఆయుష్ శాఖపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తమిళ వైద్యులకు హిందీ తెలియదని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కాగా, ఆయుష్ శాఖకు తమిళమే అర్థం కానప్పుడు తమిళనాడు మందులు ఏలా అర్థమవుతాయని తమిళ వైద్యలు ఆయుష్ శాఖను ప్రశ్నించకపోవడం వైద్యుల వినయానికి నిదర్శమని కమల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే భాషలో పనిచేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఇది హిందీ ప్రభుత్వం కాదని, భారత ప్రభుత్వం అని గట్టిగా కౌంటరిచ్చారు. వివరాల్లోకి వెళ్తె, సెంటర్ ఫర్ డాక్టర్స్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయుష్ యూనియన్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా స్పందిస్తూ.. తాను ఇంగ్లీషులో మాట్లాడనని, తాను హిందీలోనే మాట్లాడతానని, హిందీ అర్థం కాని వారు సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. కాగా ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన 37 మంది ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. యోగా మాస్టర్ ట్రైనర్స్ కోసం ఆయుష్ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే చాలా సెషన్లు హిందీలో జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఆయుష్ శాఖ శిక్షణ తరగతిలో హిందీ తెలియని వారు వెళ్లిపోవచ్చని ఆయుష్ కార్యదర్శి రాజేష్ కొట్టెచా పేర్కొనడాన్ని కనిమోళి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనపై శాఖాపరమైన క్రమశిక్షణ తసుకోవాలని డిమాండ్ చేశారు. హిందీ తెలియకపోతే ఎన్ని రోజులు అవమానిస్తారని ధ్వజమెత్తారు. చదవండి: వైరల్ : ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో సేతుపతితో కమల్ -
తమిళ భాషపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: దేశంలోనే కాక ప్రపంచంలో తమిళ భాష చాలా ప్రాచీనమైనదని, ఉన్నతమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికయిన తరువాత మోదీ తొలిసారి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. తమిళ భాషకు చాలా చారిత్రాత్మక, ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇటీవల తాను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన వేళ తమిళ పదాలను కూడా వాడానని ఆయన గుర్తుచేశారు. అలాగే ఏక ఉపయోగ ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా నిషేధించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటోందని, ప్రజలంతా దీనిని ఓ ఉద్యమంలా భావించాలని మోదీ కోరారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 56వ స్నాతకోత్సవానికి మోదీ ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు. -
అమిత్ షా తమిళం కుస్తీ!
సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళ భాషను నేర్చుకుంటున్నారు. ఆ భాష మీద పట్టు సాధించేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నట్టు ఇక్కడి కమలనాథులు పేర్కొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఆయన పర్యటన సాగుతున్నా, మెజారిటీ శాతం హిందీ తెలిసిన వాళ్లు అక్కడల్లా ఉండడం ఆయనకు కలిసి వచ్చిన అంశం. అయితే, తమిళనాట హిందీ అంటే భగ్గుమనే వాళ్లే అధికం. దీనిని పరిగణనలోకి తీసుకున్న అమిత్ షా తమిళం మీద పట్టుకు కుస్తీలు పడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పాగావేయాలనే ప్రయత్నంలో ఉన్న కమలం నేత, ప్రజల్ని ఆకర్షించేందుకు తమిళ ప్రసంగం సాగించే విధంగా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడి ప్రజలు, కేడర్‌తో సంప్రదింపులు జరిపే సమయంలో భాషాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అనర్గళంగా మాట్లాడే విధంగా, అర్థం చేసుకునే విధంగా తమిళం మీద ఆయన సాధనలో నిమగ్నమైనట్టు ఇక్కడి బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేంద్ర ప్రభుత్వానికి స్టాలిన్ వార్నింగ్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మళ్లీ తమిళ జపాన్ని తెరమీదకు తెచ్చారు. జాతీయ రహదారులపై హిందీ సైన్ బోర్డులను తమిళంలోకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే మరో ఉద్యమం తప్పదని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు. హిందీ ప్రాధాన్యత ఇచ్చి తమిళ భాషను తక్కువ చేసి చూస్తే సహించేది లేదని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. బలవంతంగా తమపై హిందీ రుద్దితే ఊరుకునేది లేదన్నారు. కాగా హిందీ పట్ల తమిళనాడు ఇంకా తన వ్యతిరేకతను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దేశమంతా త్రిభాషా సూత్రం అమలు చేయాలన్న కేంద్రం ఉత్తర్వులను అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడు. అక్కడ హిందీ భాషను నేర్పించరు. అంతేకాకుండా ఆకాశవాణిలో వచ్చే హిందీ వార్తలను మిగిలిన కేంద్రాలన్నీ ప్రసారం చేస్తాయి కానీ తమిళనాడులో మాత్రం ప్రసారం కావు. -
తీర్పు సరే మనలో మార్పేదీ?
రెండో మాట మరోవైపు ప్రాచీన ప్రతిపత్తి హోదావల్ల తమిళం ఏడాదికి రూ. 10–15 కోట్ల కేంద్ర నిధులు అందుకుంటూనే ఉంది. కానీ గుర్తింపు ఉన్నా కూడా, తీర్పు వాయిదా పడిన ఫలితంగా ఈ ఎనిమిదేళ్లుగా రూ. 80 కోట్లకు పైగా నిధులను తెలుగువారు కోల్పోయారు. చివరికి మద్రాసు హైకోర్టు బెంచ్ తమిళ సోదరుల కుట్రల వల్ల తెలుగుకు ఎదురైన అడ్డంకిని తొలగిస్తూ మంచి వ్యాఖ్య చేసింది. ఇతర భాషలకు ప్రాచీన ప్రతిపత్తి కల్పించినట్టయితే తమిళ భాష ప్రాశస్త్యం కనుమరుగైపోతుందన్న పిటిషనర్ వాదనను నిరాకరించింది. ‘ఆంధ్ర(తెలుగు) భాష సుందరమైనది. తెలుగు కవిత, దాని సంగీతం మనోహరమైనవి. ఆ భాష గాన మాధుర్య గుణం చేత ఆంధ్ర పద నిర్వచనం కన్యాకుమారి నుంచి తపతీ నదీతీరం దాకా నివసిస్తున్న జనులందరినీ ఒక్కచోట చేర్చగలుగుతోంది. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు కూడా తెలుగు గాన మాధుర్యం చేత ఆంధ్రులే అవుతారు. త్యాగరాజు గానం చేసిన తెలుగుభాష ‘దేవభాష’ (సంస్కృతంతో సమానం) అయినందుననే తెలుగును ప్రాచ్య ఖండపు ఇటాలియన్ భాష అనడం న్యాయంగా ఉంది.’ – నోబెల్ గ్రహీత, సుప్రసిద్ధ శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ (94 ఏళ్ల నాడు ఫిబ్రవరి 21, 1922న హైదరాబాద్ నిజాం కళాశాల తెలుగు విద్యార్థులు సమర్పించిన సన్మానపత్రానికి ఇచ్చిన సమాధానంలో అభిభాషణం.) దాదాపు 3,000 సంవత్సరాల చరిత్ర... లిపి, శాసనాలు, చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక సంబంధమైన ఆవిర్భావ దశల ద్వారా తన ఉనికిని నిరూపించుకున్న భాష... అలాంటి తెలుగు భాషను ప్రాచీన/శ్రేష్ఠమైన భాషలలో ఒకటిగా గుర్తించడానికి పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అవసరమా? ఇంతకీ ఈ అవసరం తెలుగువారు తమకు తాము కల్పించు కున్నది కాదు. ఆ మాటకొస్తే ద్రావిడ భాషా కుటుంబంలోని ఇరుగు పొరుగైన కర్ణాటక, కేరళ రాష్ట్రాలూ, ఒడిశా రాష్ట్రాల భాషాభిమానులూ తమ తమ మాతృభాషలకు ప్రాచీన హోదా కల్పిస్తారా, లేదా అని కేంద్రాన్ని నిలదీసిన ఫలితంగా అనివార్యమైన పోరాటం కూడా కాదు. మరి ఎందుకు అవసర మైనట్టు? అసలు శ్రేష్ఠ భాషా ప్రతిపత్తి ఆలోచనకు బీజం ఎక్కడ పడినట్టు? తమిళ మంత్రుల రాజకీయం యూపీఏ ప్రభుత్వంలో కొందరు తమిళులు భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈ పరిణామానికి బీజం పడింది. 1,000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాషలలో ప్రత్యేక అధ్యయనం, అనంతర పరిశోధనలను ప్రోత్సహించాలని నాటి కేంద్రం ప్రతిపాదించింది. ఆ ఆలోచన ప్రాతిపదికగా కొందరు తమిళ మంత్రులు మంత్రిమండలి సమావేశంలో తమిళ భాషకు ఆ ప్రతిపత్తిని లోపాయికారీగా సాధించుకున్నారు. ఇది మొదటి కుట్ర. రెండో కుట్రలో వారు తలపెట్టిన దుర్మార్గం– ఇలాంటి ప్రతిపత్తికి కావలసిన అర్హతకు పెట్టిన కాలపరిమితి. అది– 1,000 నుంచి 1,500 సంవత్సరాలు. అయినా, ఈ అర్హత ప్రమాణంలోకి ఇతర భాషలు కూడా ఇమిడే అవకాశం ఉంది. నిజానికి సంస్కృతాన్ని ప్రాచీన భాషగా అంతకు ముందే కేంద్రం గుర్తించింది. కానీ ఆ నిర్ణయం అమలులోకి రాలేదు. ఈ లోపునే తమిళ సోదరులు తమ భాషకు ప్రాచీన హోదా కట్టబెట్టించారు. పైగా తెలుగు, కన్నడ, మలయాళం, ఒడిశా లకు ఆ ప్రతిపత్తి దక్కకుండా తమ వంతు ప్రయత్నం చేశారు. కుంభకోణాల ఊబిలో నేటికీ కూరుకుపోయి ఉన్న నాటి కేంద్రమంత్రి మారన్ కేంద్రానికి రాసిన లేఖలో, ‘భాషల ప్రాచీనార్హతకు కనీసం 2,000–3,500 సంవత్సరాల పరిమితిని నిర్ణయించాల’ని ప్రతిపాదించారు. ఇది కేంద్ర నిర్ణయాన్ని మరింత జటిలం చేసింది. 2002–2004 మధ్య జరిగిన ఈ కుట్ర బయటపడేసరికి ఇంతక్రితం ఉదహరించిన భాషా ప్రాంతాల భాషావేత్తలూ, పరిశోధకులూ తిరగబడవలసిన పరిస్థితి తలెత్తింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భాషా సమితులు, భాషోద్యమకారులు, భాషావేత్తలు తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి కోసం పట్టుపట్టడం మొదలుపెట్టారు. కానీ వీరి ఆందోళనకు రాష్ట్ర స్థాయి కేంద్రీకృత వ్యవస్థ కొరవడింది. తెలుగు అధికార భాషా సంఘం కృషి ఏమైనా, 2005 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ప్రాచీన ప్రతిపత్తి ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ప్రాచీనతకు సంబంధించిన సర్వ ఆధారాలను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమర్పించింది. కేంద్ర మంత్రిమండలిలోని తమిళ తంబీల అడ్డంకుల మధ్యనే తుదకు కేంద్రం, తమిళేతర దక్షిణాది భారతీయ భాషలకు ప్రాచీన ప్రతిపత్తి హోదాను సశాస్త్రీయంగా ప్రకటించింది (2008). ఆ ప్రకటనను సవాలు చేస్తూ దారితప్పిన ఒక తమిళ ‘గాం«ధీ’ ‘గిరీశం’ పాత్ర పోషిస్తూ, మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఆకుకు అందని పోకకు పొందని న్యాయవాది వాదనల ఫలితంగా తీర్పు ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు ప్రాచీన ప్రతిపత్తి హోదావల్ల తమిళం ఏడాదికి రూ. 10–15 కోట్ల కేంద్ర నిధులు అందుకుంటూనే ఉంది. కానీ గుర్తింపు ఉన్నా కూడా, తీర్పు వాయిదా పడిన ఫలితంగా ఈ ఎనిమిదేళ్లుగా రూ. 80 కోట్లకు పైగా నిధులను తెలుగువారు కోల్పోయారు. చివరికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ తమిళ సోదరుల కుట్రల వల్ల తెలుగుకు ఎదురైన అడ్డంకిని తొలగిస్తూ శాశ్వతంగా నిలిచిపోయే వ్యాఖ్య చేసింది.‘ఇతర భాషలకు కూడా ప్రాచీన ప్రతిపత్తి కల్పించినట్టయితే తమిళ భాష ప్రాశస్త్యం కనుమరుగై పోతుందన్న తమిళ పిటిషనర్ వాదనను కోర్టు ఆమోదించ జాలదు. ఎందుకంటే ఒక భాష ప్రాశస్త్యం, ఉన్నతి మరొక భాష అభివృద్ధి మీద, పతనంమీద ఆధారపడి ఉండబోదని గ్రహించాలి.’ ఈ సందర్భంగానే ఒక భాషనూ, ఆ భాషకు సంబంధించిన పదాలనూ ప్రస్తావిస్తూ ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ ‘ప్రపంచ భాష’లలోని ప్రతి పదమూ ‘సంరక్షించదగిన ఒక నక్షత్రమే’నన్న చెప్పిన సంగతి మరచి పోరాదు. భాష ప్రాచీనతకు ఏది కొలమానం, ఏది కాదు అన్న మీమాంస ఇప్పటిది కాదు. చివరికి ‘సంస్కృతం’ ఎవరికీ మాతృభాష కాకపోవడానికి, దాని ‘లిపి’ కృత్రిమమైనదని అనడానికి కారణాల్ని వెల్లడిస్తూ అది ‘యాదృ చ్ఛిక సంఘటన’ అనీ, కనుకనే దానిని ‘సంస్కరించవలసి’ వచ్చిందనీ (Sancort or Sanctum Scriptum) కర్నల్ వాన్ కెన్నెడీ అనే పరిశోధక పండితుడు ఒక సుదీర్ఘమైన బృహత్ గ్రంథం రాశాడు. కనుకనే దాని పుట్టు వెంట్రుకల తబ్శీళ్లు తెలియరావని, అందుకే అది ఎవరికీ మాతృభాష కాకుండా కృత్రిమ లిపిగా ఉండిపోయి ఎదుగుదల లేని మృతభాషగా ఉండి పోవలసి వచ్చిందనీ వాన్ కెన్నెడీ పేర్కొన్నాడు. (‘ది ఆరిజన్ ఆఫ్ సాంస్క్రీట్’ గ్రంథం, 9వ అధ్యాయం 1, పేజీ–450). దీని ఆవిర్భావం పశ్చిమాసియా. భాషలన్నీ పరస్పరం తోబుట్టువులు అనుకున్నప్పటికీ, ‘కన్న వారెవరో మాత్రం తెలియద’న్నాడు క్లాప్రోత్ అనే మరొక భాషా శాస్త్ర పండితుడు. బహుశా అందుకనే ఒక భాష ఆవిర్భావ, ప్రగతి దశలకు ప్రాచీనత, శిష్ట ప్రతిపత్తిని ఒక నిర్దిష్ట కాలానికే యూరోపియన్లు పరిమితం చేయలేదని గుర్తించాలి. కనుకనే వారు భాష, సాహిత్యాదులకు, వాస్తు, కళాది రంగాలకు కాలాతీతమైన విలక్షణతను (ఏజ్‌లెస్ డిస్టింక్షన్) ఆపాదించవలసి వచ్చింది. రచననూ, దాని శైలినీ, విశ్వజనీన లక్షణాన్నీ అది ఏ కాలానికి చెందినా– ప్రాచీనమైనా, ఆధునికమైన ‘క్లాసిక్’ అన్నారు లేదా క్లాసికల్ రచన అన్నారు. ఈ ప్రమాణాలతోనే షేక్స్పియర్ నాటకాలనీ, ‘గాన్ విత్ ది విండ్’ లాంటి చలన చిత్రాలని గానీ, సరికొత్త పోకడలు పోయిన చిత్ర కళాఖండాలను, బీథోవెన్, మొజార్డ్, హెడెన్ వంటి వారి సంగీతాన్ని ‘క్లాసికల్ యుగం’ లోనివిగానే భావించారు. చివరికి 18–19 శతాబ్దాలలో రాజకీయ, ఆర్థిక, మానవీయ శాస్త్రాలలో వచ్చిన, తరువాత ఆడమ్ స్మిత్ ‘వెల్త్ ఆఫ్ నేషన్స్’, రికార్డో ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్’, మిల్ ‘పొలిటికల్ ఏకానమీ’, కారల్ మార్క్స్ ‘లేబర్ థీరీ ఆఫ్ వాల్యూ’ వంటి రచనల్ని కూడా క్లాసికల్ కానికి చెందినవిగానే కీర్తించవలసి వచ్చింది. అలాగే నన్నయ నుంచి పోతన దాకా, శ్రీశ్రీ నుంచి నారాయణరెడ్డి, జాషువా; సుబ్బు లక్ష్మి, సుశీల, బాలమురళీలు గాత్ర మాధుర్యంతో గాంధర్వ లోకాలు చూపిం చిన వారంతా పేరుకు ఆధునికులైనా, కాలనియతి లేని క్లాసికల్ యుగకర్తల కిందికే వస్తారు. తెలుగు భాష ప్రాచీనతకు మరొక నిదర్శనంగా సుప్రసిద్ధ గ్రీకు చరిత్రకారుడూ, ప్రామాణిక పండితుడైన జార్జి థాంప్సన్ ‘ప్రాచీన కాలం నుంచి చుట్టరికాలకు, బంధుత్వాలకు సంబంధించిన పేరుకు బహుళ సంఖ్యలో ప్రత్యామ్నాయ పదాలున్న భాష ప్రపంచ భాషల్లో ఒక్క తెలుగు భాష మాత్రమేనని’ ప్రాచీన గ్రీస్ చరిత్రలో పేర్కొనడం మనకి గర్వకారణం. తెలుగును ‘సుందర తెలుగు’ అని ప్రశంసించినందుకు తమిళ మహా కవి సుబ్రహ్మణ్య భారతిని, ద్రావిడ భాషా కుటుంబంలోని తమిళ, తెలుగు భాషల వ్యాకరణ సంప్రదాయాలు సింధు నాగరికత వారసత్వమేనని సమాన హోదాతో అంగీకరించిన ప్రసిద్ధ తమిళ పండితుడు పరిశోధకుడు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య మలయాండేనీ తమిళ చాందసులు వెలివేసినంత పనిచేశారు. తమిళనాడులోని వైగై నదీలోయ, ఆంధ్రప్రదేశ్‌లోని తుంగభద్ర లోయలోనూ తెలుగు, తమిళ సంస్కృతాలు మూడు పూవులూ, ఆరు కాయలుగా ప్రవర్ధి ల్లుతూ వచ్చాయని మలయాండే నిరూపించాడు. తెలుగు లిపికి మూలమైన ‘బ్రాహ్మీ’ కూడా ద్రవిడ భాషా కుటుంబంలోనిదేనని ఆంధ్రప్రదేశ్ సర్వీసులో పనిచేసిన తమిళ పండితుడు కాశిపాండ్యన్, ఎడ్వర్డ్ థామస్‌లు స్పష్టం చేశారు. ఈ ఆధారాలకు తుల్యమైనవే రాయప్రోలు వారు ‘తన గీతి అఱవ జాతిని పాఠకులుగా దిద్ది వర్ధిల్లిన తెలుగువాణి’ అర్పించిన కైమోడ్పులు. సుర వరంవారు ‘ఆంధ్రకుమారి’ని తలచుకుంటూ ‘తేనెతేటల నవకంపు సోల కును సాటియగును మా తెలుగు భాషమతల్లి’ అని కీర్తించారు. అదీ తెలుగు సొగసు. ‘వచ్చిండన్నా, వచ్చాడన్నా’ ఒకటే. కృత్రిమ విభజనతో పలకరిం పులు మరుగున పడినట్టు అనిపించినా మళ్లీ ఆత్మీయతలు చిగురించే కాలం రాకపోదు. అందాకా ‘ఇది మా తెలుగు కాదు’ అనకుండానే ఉభయత్రా మాండలిక, ప్రాదేశికాల మాధుర్యాన్ని జుర్రుకోవచ్చు. అయితే ఒకటి. తెలుగు ప్రతిపత్తికి పట్టిన గ్రహణం వీడిందని అనుకున్నా, బోధనా భాషగా తెలుగు ఎదగకుండా అడ్డుపడుతున్న గ్రహణం అలానే ఉంది. అది దుస్సహం. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్
* తెలుగు, తమిళం, కన్నడ భక్తులకు ధర్మప్రచారం మరింత విస్తృతం * సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖతో సంప్రదింపులు సాక్షి, తిరుమల: తెలుగు బుల్లితెరపై ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేష ఆదరణ పొందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక తమిళ భాషలోనూ కనిపించనుంది. ఇందుకోసం టీటీడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవ ప్రాశస్త్యం, ఆథ్యాత్మిక, ధార్మిక, భక్తి కార్యక్రమాలను జనబాహుళ్యంలో నేరుగా తీసుకెళ్లాలని టీటీడీ సంకల్పించింది. ఆమేరకు జూలై 7వ తేదీ, 2008న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించింది. రోజూ తిరుమల, తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నిర్వహించే విశేష సేవల ప్రత్యక్ష ప్రసారాలు ఎస్వీబీసీ ప్రత్యక్షంగా భక్తుల ఇళ్ల వద్దకే చేరుస్తోంది. రోజుకు 11 గంటలు కేటాయించారు. ఏపీ, తెలంగాణ వారికి తెలుగులోనే వ్యాఖ్యానం చేస్తుంటారు. ఇక తమిళనాడులోని భక్తులకు తమిళ వ్యాఖ్యానం, కర్ణాటకాలోని భక్తులకు కన్నడ వ్యాఖ్యానం చేయటం వల్ల ఆయా ప్రాంతాల్లోని భక్తులకు సులభంగా శ్రీవారి కార్యక్రమాలు చేరుతున్నాయి. వీటితోపాటు తమిళ భక్తుల కోసం ఆథ్యాత్మిక విశేషాలు, ప్రవచనాలు, భక్తి కార్యక్రమాల కోసం 1.30 గంటలు, కన్నడ భక్తుల కోసం గంట కేటాయించారు. ఇలా తమిళ భక్తులకు 12.30 గంటలు, కన్నడ భక్తులకు 12 గంటలపాటు శ్రీవారి కార్యక్రమాలు చేరవేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చేవారిలో 35 నుంచి 45 శాతం తమిళ భక్తులు, మరో 20 శాతం కన్నడ భక్తులు ఉన్నారు. వీరికోసం ప్రత్యేకంగా తమిళంలోనే ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేయాలని రెండేళ్లకు ముందే టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు లెసైన్సు హక్కుల కోసం ఢిల్లీలోని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖకు దరఖాస్తు చేసుకుంది. తమిళ, కన్నడ భక్తుల నుంచి తమ భాషలకు కూడా ప్రాధ్యాత ఇవ్వాలని విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తమిళఛానల్పై దృష్టిపెట్టారు. అతిత్వరలోనే తమిళ ఛానల్ ఎస్వీబీసీకి భక్తుల నుంచి విశేష ఆదరణ ఉంది. తిరుమలకు వచ్చేవారిలో తమిళులు, కన్నడిగులూ ఉన్నారు. వారి భాషల్లోనూ స్వామి కైంకర్యాలతోపాటు టీటీడీ కార్యక్రమాలను విసృతం చేసేందుకు తమిళ ఛానల్ అవసరం ఉంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సంబంధిత మంత్రిత్వశాఖతో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలోనే అనుమతులు వస్తాయని భావిస్తున్నాం. - టీటీడీ ఈవో సాంబశివరావు -
తమిళం బాగా మాట్లాడే వారికి అవకాశాల్లేవ్
తమిళ భాష చక్కగా మాట్లాడే వారికి ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదని నటి ఐశ్వర్య రాజేశ్ వాపోయారు. ఈమె కథానాయకిగా నటించిన తాజా చిత్రం హలో నాన్ పేయ్ పేచురేన్. నటుడు వైభవ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అవ్నీ మూవీస్ పతాకంపై దర్శకుడు సుందర్.సి నిర్మించారు. నవ దర్శకుడు భాస్కర్ పరిచయం అవుతున్న ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎప్రిల్ ఒకటో తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలో గల ఫోర్ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందు లో పాల్గొన్న నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తమిళ భాష తెలి సిన నటీమణులకు తమిళ చిత్రాల్లో అవకాశాలు కల్పించడంలేదన్నారు. అలాంటిది తమిళ భాషను బాగా ఉచ్చరించగలగడం వల్లే తనకి ఈ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చినట్లు దర్శకుడు చెప్పారని, ఇది తాను గర్వంగా భావిస్తున్నట్లు పేర్కోన్నారు. ఇక హలో నాన్ పేయ్ పేచురేన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది మంచి కాలక్షేప కథాచిత్రం అని తెలిపారు. ఇందులో తాను నటుడు వీటీవీ.గణేష్‌కు చెల్లెలిగా నటించానని చెప్పారు. తానింత వరకూ డాన్స్ సరిగా చేసిన సందర్భాలు లేవని అలాంటిది ఈ చిత్రంలో శవంపై ఎక్కి డాన్స్ చేశానని అన్నారు. ఈ శవ డాన్స్‌కు మంచిపేరు వస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఇందులో తనకు జంటగా నటుడు వైభవ్ నటించారని, తమ జంట స్పెషల్‌గా ఉంటుందన్నారు. ఇందులో తాము ఆడే శవ డాన్స్ చాలా లోకల్‌గా ఉంటుందని ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. నటుడు వైభవ్ మాట్లాడుతూ తానీ చిత్రంలో పిక్‌పాకెటర్‌గా నటించానని చెప్పారు. దర్శకుడు కొత్త వారైనా తాను అనుకున్నది తెరపై ఆవిష్కరించారని, అదే విధంగా తనకు కావలసింది వచ్చే వరకూ వదిలేవారు కారని అన్నారు. ఒక సన్నివేశంలో ఒక సంభాషణను తాను సరిగా ఉచ్చరించలేకపోవడంతో దాన్ని 30 సార్లు చిత్రీకరించారని తెలిపారు. అదే రోజు సెట్‌కు వచ్చిన సుందర్.సి అది చూసి అయ్య బాబోయ్ అంటూ పారిపోయారని తెలిపారు.చిత్రంలో శవ డాన్స్‌ను చాలా కష్టపడి చేశాననీ వైభవ్ చెప్పారు. ఈ చిత్రంలో నటి ఓవియ, కరుణాకరన్, వీటీవీ.గణేష్, సింగమ్పులి, సింగపూర్ దీపన్ ముఖ్య పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందించారు. -
నెలాఖరున తమిళనాట పవన్ కల్యాణ్ దీక్ష
హోసూరు(తమిళనాడు): నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని వ్యతిరేకిస్తూ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడులో దీక్ష చేపట్టనున్నారు. ఈ నెలాఖరున ఆయన చేపట్టే దీక్ష కోసం పవన్ అభిమానులు, తెలుగు భాషాభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్బంధ తమిళభాషా చట్టంతో ఈ రాష్ట్రంలో మైనార్టీ భాషలైన తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం విద్యాభ్యాసానికి విద్యార్థులు దూరమైపోతున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి, తెలుగు సాహిత్య పరిషత్ సంస్థలు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించిన విషయం విదితమే. ఆ సమయంలో సమస్య తీవ్రతపై ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా స్పందించారు. తెలుగు భాషా పరిరక్షణకు ముఖ్యమంత్రి జయలలితతో సంప్రదిస్తానని జగన్ హామీనిచ్చినట్లు ఆందోళనలో పాల్గొన్న తెలుగు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కూడా స్పందిస్తూ తమిళనాడులో దీక్ష చేపడతానని ప్రకటించారు. -
అనుమతివ్వండి
మాతృభాష తమిళం వికాసం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మద్రాసు హైకోర్టులో ఇక, తమిళంలోనే అన్ని వ్యవహారాలు సాగించే విధంగా అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడింది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన న్యాయ మహానాడు ముందుకు ‘తమిళం’ నినాదాన్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకెళ్లారు. సాక్షి, చెన్నై : తమిళులకు మాతృభాష మీద మక్కువ ఎక్కువే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యా పరంగా తమిళాన్ని తప్పని సరిచేసి, అల్పసంఖ్యాక భాషల మీద ప్రతాపం చూపించే పనిలో పడ్డారు. అలాగే, ప్రపంచ దేశాల్లో ఏ మూలలోనైనా సరే తమిళుడికి అన్యాయం జరిగిన పక్షంలో తొలుత గళం విప్పేది ఇక్కడి వారే. అలాంటి తమిళులు తమ మాతృభాషలోనే హైకోర్టులో వాదనలకు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదులు విధుల్ని బహిష్కరించి ఆందోళనకు సైతం నిర్వహించినా ఫలితం శూన్యం. ఈ అంశాన్ని తమ చేతిలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన న్యాయ మహానాడు దృష్టికి తమిళం వాదనల్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకెళ్లడం రాష్ట్రంలోని న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. తమిళంలో ‘వాదనలు’ ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖమంత్రి సదానంద గౌడల నేతృత్వంలో సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ఈ మహానాడులో తమిళం వాదన అంశాన్ని పన్నీరు సెల్వం తెర మీదకు తెచ్చారు. ఢిల్లీ వేదికగా కూడా తన ప్రసంగంలో తమ అమ్మ(జయలలిత)ను పదే పదే స్తుతిస్తూ పన్నీరు సెల్వం ముందుకు సాగారు. తమ అమ్మ మార్గదర్శకంలో సాగుతున్న ప్రభుత్వం న్యాయవిభాగం బలోపేతం లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నదని వివరించారు. ప్రజలకు సత్వర న్యాయం లభించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ర్టంలో 986 కోర్టులు ఉండగా, 87 శాతం కోర్టులకు సొంత భవనాలు ఉన్నాయని వివరించారు. కేంద్రం నిధుల్ని సంవృద్ధిగా కేటాయిస్తూ 2017 నాటికి అన్ని కోర్టులకు సొంత భవనాల్ని నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో న్యాయ శాఖకు తాము *809 కోట్లు కేటాయించామని, దీన్ని బట్టి చూస్తే ఏమేరకు న్యాయ విభాగం అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామనో అర్థం చేసుకోవాలని సూచించారు. 178 సివిల్ న్యాయమూర్తుల్ని నియమించామని, ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు. లైంగిక దాడుల కేసుల సత్వర పరిష్కారం కోసం, ఈ కేసుల్ని అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మహిళా పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. తమిళనాడులో డివిజన్‌కు ఒక మహిళా పోలీసుస్టేషన్ ఉందని వివరిస్తూ, మద్రాసు హైకోర్టులో తమిళంలోనే వాదనలు జరిగే విధంగా అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇందుకు తగ్గ చర్యల్ని కేంద్రం, సుప్రీంకోర్టు త్వరితగతిన చేపట్టాలని కోరారు. మాతృభాషలకు అనుగుణంగా వాదనలు, ఉత్తర్వులు తదితర వ్యవహారాలు జరుపుకునే విధంగా రాష్ట్రపతి ఓ చట్టాన్ని ఆమోదించి ఉన్నారని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ దృష్ట్యా, తమిళంలో వాదనలకు అనుమతి వ్యవహారాన్ని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు. -
పౌరాణిక కథతో...
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘వైవస్వత’. మోక్ష శ్రీమయి సమర్పణలో సింహవాహిని చలనచిత్ర పతాకంపై ఎస్. నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విసు రెడ్డి, షామిన్ మన్నన్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వరుణ్వంశీ బలభద్రపాత్రుని-కార్తికేయ వరపర్ల దర్శకులుగా పరిచయమవుతున్నారు. పౌరాణిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామనీ, సాంకేతికంగా భారతీయ చలన చిత్రసీమ ఆశ్చర్యపోయే రీతిలో ఈ చిత్రం ఉంటుందని దర్శకులు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘విదేశాల్లోని దీవుల్లో, దట్టమైన అడవుల్లో ఎక్కువ శాతం చిత్రీకరిస్తాం. పౌరాణిక కథల్లో ఇప్పటివరకూ రాని కథతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రకథా విశేషాలను తెలియజేసే ‘గ్రాఫిక్ బుక్’ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. బంగారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.ఎన్. మహేంద్రబాబు.