తమిళం బాగా మాట్లాడే వారికి అవకాశాల్లేవ్
తమిళ భాష చక్కగా మాట్లాడే వారికి ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదని నటి ఐశ్వర్య రాజేశ్ వాపోయారు. ఈమె కథానాయకిగా నటించిన తాజా చిత్రం హలో నాన్ పేయ్ పేచురేన్. నటుడు వైభవ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అవ్నీ మూవీస్ పతాకంపై దర్శకుడు సుందర్.సి నిర్మించారు. నవ దర్శకుడు భాస్కర్ పరిచయం అవుతున్న ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఎప్రిల్ ఒకటో తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఆదివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలో గల ఫోర్‌ఫ్రేమ్స్ ప్రివ్యూ థియేటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందు లో పాల్గొన్న నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తమిళ భాష తెలి సిన నటీమణులకు తమిళ చిత్రాల్లో అవకాశాలు కల్పించడంలేదన్నారు. అలాంటిది తమిళ భాషను బాగా ఉచ్చరించగలగడం వల్లే తనకి ఈ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చినట్లు దర్శకుడు చెప్పారని, ఇది తాను గర్వంగా భావిస్తున్నట్లు పేర్కోన్నారు. ఇక హలో నాన్ పేయ్ పేచురేన్ చిత్రం గురించి చెప్పాలంటే ఇది మంచి కాలక్షేప కథాచిత్రం అని తెలిపారు. ఇందులో తాను నటుడు వీటీవీ.గణేష్‌కు చెల్లెలిగా నటించానని చెప్పారు. తానింత వరకూ డాన్స్ సరిగా చేసిన సందర్భాలు లేవని అలాంటిది ఈ చిత్రంలో శవంపై ఎక్కి డాన్స్ చేశానని అన్నారు. ఈ శవ డాన్స్‌కు మంచిపేరు వస్తుందనే నమ్మకం ఉందన్నారు.
ఇందులో తనకు జంటగా నటుడు వైభవ్ నటించారని, తమ జంట స్పెషల్‌గా ఉంటుందన్నారు. ఇందులో తాము ఆడే శవ డాన్స్ చాలా లోకల్‌గా ఉంటుందని ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం అని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు. నటుడు వైభవ్ మాట్లాడుతూ తానీ చిత్రంలో పిక్‌పాకెటర్‌గా నటించానని చెప్పారు. దర్శకుడు కొత్త వారైనా తాను అనుకున్నది తెరపై ఆవిష్కరించారని, అదే విధంగా తనకు కావలసింది వచ్చే వరకూ వదిలేవారు కారని అన్నారు. ఒక సన్నివేశంలో ఒక సంభాషణను తాను సరిగా ఉచ్చరించలేకపోవడంతో దాన్ని 30 సార్లు చిత్రీకరించారని తెలిపారు. అదే రోజు సెట్‌కు వచ్చిన సుందర్.సి అది చూసి అయ్య బాబోయ్ అంటూ పారిపోయారని తెలిపారు.చిత్రంలో శవ డాన్స్‌ను చాలా కష్టపడి చేశాననీ వైభవ్ చెప్పారు. ఈ చిత్రంలో నటి ఓవియ, కరుణాకరన్, వీటీవీ.గణేష్, సింగమ్‌పులి, సింగపూర్ దీపన్ ముఖ్య పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ విపిన్ సంగీతాన్ని అందించారు.