మాతృభాష తమిళం వికాసం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం మద్రాసు హైకోర్టులో ఇక, తమిళంలోనే అన్ని వ్యవహారాలు సాగించే విధంగా అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడింది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన న్యాయ మహానాడు ముందుకు ‘తమిళం’ నినాదాన్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకెళ్లారు.
సాక్షి, చెన్నై : తమిళులకు మాతృభాష మీద మక్కువ ఎక్కువే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విద్యా పరంగా తమిళాన్ని తప్పని సరిచేసి, అల్పసంఖ్యాక భాషల మీద ప్రతాపం చూపించే పనిలో పడ్డారు. అలాగే, ప్రపంచ దేశాల్లో ఏ మూలలోనైనా సరే తమిళుడికి అన్యాయం జరిగిన పక్షంలో తొలుత గళం విప్పేది ఇక్కడి వారే. అలాంటి తమిళులు తమ మాతృభాషలోనే హైకోర్టులో వాదనలకు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదులు విధుల్ని బహిష్కరించి ఆందోళనకు సైతం నిర్వహించినా ఫలితం శూన్యం. ఈ అంశాన్ని తమ చేతిలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పలుమార్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన న్యాయ మహానాడు దృష్టికి తమిళం వాదనల్ని సీఎం పన్నీరు సెల్వం తీసుకెళ్లడం రాష్ట్రంలోని న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
తమిళంలో ‘వాదనలు’
ప్రధాని నరేంద్ర మోదీ, న్యాయ శాఖమంత్రి సదానంద గౌడల నేతృత్వంలో సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ఈ మహానాడులో తమిళం వాదన అంశాన్ని పన్నీరు సెల్వం తెర మీదకు తెచ్చారు. ఢిల్లీ వేదికగా కూడా తన ప్రసంగంలో తమ అమ్మ(జయలలిత)ను పదే పదే స్తుతిస్తూ పన్నీరు సెల్వం ముందుకు సాగారు. తమ అమ్మ మార్గదర్శకంలో సాగుతున్న ప్రభుత్వం న్యాయవిభాగం బలోపేతం లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నదని వివరించారు. ప్రజలకు సత్వర న్యాయం లభించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ర్టంలో 986 కోర్టులు ఉండగా, 87 శాతం కోర్టులకు సొంత భవనాలు ఉన్నాయని వివరించారు. కేంద్రం నిధుల్ని సంవృద్ధిగా కేటాయిస్తూ 2017 నాటికి అన్ని కోర్టులకు సొంత భవనాల్ని నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో న్యాయ శాఖకు తాము *809 కోట్లు కేటాయించామని, దీన్ని బట్టి చూస్తే ఏమేరకు న్యాయ విభాగం అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నామనో అర్థం చేసుకోవాలని సూచించారు. 178 సివిల్ న్యాయమూర్తుల్ని నియమించామని, ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి చర్యలు వేగవంతం చేశామని పేర్కొన్నారు. లైంగిక దాడుల కేసుల సత్వర పరిష్కారం కోసం, ఈ కేసుల్ని అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మహిళా పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. తమిళనాడులో డివిజన్‌కు ఒక మహిళా పోలీసుస్టేషన్ ఉందని వివరిస్తూ, మద్రాసు హైకోర్టులో తమిళంలోనే వాదనలు జరిగే విధంగా అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇందుకు తగ్గ చర్యల్ని కేంద్రం, సుప్రీంకోర్టు త్వరితగతిన చేపట్టాలని కోరారు. మాతృభాషలకు అనుగుణంగా వాదనలు, ఉత్తర్వులు తదితర వ్యవహారాలు జరుపుకునే విధంగా రాష్ట్రపతి ఓ చట్టాన్ని ఆమోదించి ఉన్నారని ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ దృష్ట్యా, తమిళంలో వాదనలకు అనుమతి వ్యవహారాన్ని త్వరితగతిన పరిష్కరించాలని విన్నవించారు.
అనుమతివ్వండి
Published Mon, Apr 6 2015 2:19 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement