బాధితుల్ని పరామర్శిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్
కామెంట్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 60 మందికి పైగా మృతి చెందటం, మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూ ఉండటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. జూన్ మూడో వారంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి సీబీసీఐడీ పోలీసులు ఇప్పటి వరకు అనేక మందిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ప్రజలు, పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు, సామాజిక కార్యకర్తలు కల్తీ సారా విక్రయాలను అడ్డుకోటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ – దేశంలో తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులెవరు? తప్పు... కల్తీ సారా తాగిన వారిదా? లేక కల్తీ సారాను కట్టడి చేయలేకపోతున్న వారిదా?
నిజం ఏమిటంటే కల్తీ సారా సేవించటం వల్ల సంభవించే మరణాలు రెట్టింపుగా విషాదకరమైనవి. అవి భయానకమైనవి మాత్రమే కాదు, పూర్తిగా నివారించగలిగినవి కూడా! మనిషి వల్ల సంభవించే ఆ మరణాలను మనిషే సంభవించకుండానూ చూడగలడు. అందుకు కావలసిందల్లా వాస్తవికతలోని పచ్చి నిజాన్ని అంగీకరించటమే!
అందరు మనుషులూ మద్యం సేవించనివాళ్లు కాదు. చాలామంది తాగాలనుకుంటారు. తాగటంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ముసుగు లేకుండా చెప్పాలంటే – ఏ పరిణతి చెందిన, వివేకవంతమైన, ప్రజాస్వామ్య సమాజంలోనైనా అందుకు వారికి కాదనలేని హక్కు ఉంది. ఆ హక్కును నిరాకరించటానికి, ఆమోదయోగ్యం కాని ఆంక్షలు విధించటానికి ఆ సమాజం చేసే ప్రయత్నాలు సమస్యకు కారణం అవుతాయి.
మద్యం కనుక సురక్షితమైన, నాణ్యత గలిగిన, చవకైన లేదా సరసమైన ధరలో... చట్టం అంగీకరించిన, ఆమోదించిన నియమ నిబంధనలకు లోబడి వయోజనులందరికీ లభించినట్లయితే కల్తీ సారాకు ప్రాణాన్ని పణంగా పెట్టుకునేవారెవరూ ఉండరు. మద్యం సేవించేవారిలో అత్యధికులు తీవ్ర అసంతృప్తితో నిరాశకు గురై ఆత్మహత్యను ఆశ్రయించే మనఃస్థితిని కలిగి ఉన్నవారు కాదు.
వారు కేవలం ఉపశమనాన్ని కోరుకునేవారు. ఒత్తిడి నుంచి, అలసట నుంచి కాస్త సేదతీరాలని, లేదా ఆహ్లాదకరమైన సాయంత్రాలను గడపాలనీ అనుకునేవారు. వారు కోరుకున్నది కొనలేకపోయినందు వల్లనే ప్రమాదకరమైన, ప్రాణం తీసే అవకాశం ఉన్న వాటిని వారు ఆశ్రయిస్తారు. అంతేతప్ప, మరణించటం ఎప్పుడూ కూడా వారి ఉద్దేశం కాదని గుర్తుంచుకోండి. అది కేవలం ఉద్దేశపూర్వకం కాని పరిణామం. పరిస్థితులు బలవంతంగా వారిపై వచ్చి పడ్డ పర్యవసానం.
అసలు సమస్యంతా మద్యం చెడ్డదని, అందువల్ల మద్యపానాన్ని నిలువరించాలని, కనీసం తీవ్రస్థాయిలో అందుకు విముఖత కలిగించాలని ఉన్న మన మూల భావనలోనే ఉంది. ‘‘ఔషధాల వినియోగానికి మినహా... ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, మత్తు పదార్థాల వాడకాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి’’ అని రాజ్యాంగంలోని 47వ అధికరణం చెబుతోంది.
మితిమీరిన మద్యపానం చెడు చేస్తుందనటంలో సందేహం లేదు. బుద్ధిహీనులైన వారు మాత్రమే ఈ మాటను కాదంటారు. మితిమీరితే మద్యమేం కర్మ... పంచదార, వెన్న, మీగడ, అంతెందుకు వ్యాయామం కూడా ఆరోగ్యానికి హానికరమైనవే! మోతాదుల్లో తీసుకుంటే అది వేరే సంగతి. సరే, ఏదైనా ఎవరికి వారే నిర్ణయించుకోవాలి.
వారి సొంత తప్పుల్ని కూడా! అయితే మద్యనిషేధం అన్నది ఒక ప్రభుత్వ విధానంగా (బిహార్, గుజరాత్‌లలో మాదిరిగా) పౌర హక్కులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించటం మాత్రమే కాదు, పౌర ‘శిశుపాలన’ కూడా చేస్తుంది. పౌరుల్ని పిల్లలుగా చూసే దేశానికి ఏది సరైనదో తెలియదు. అయితే ప్రజల్ని నర్సరీ పిల్లల్లా చూసే ప్రభుత్వాలు ఈ మాటను అంగీకరించవు.
ఏదేమైనా ఇక్కడొక లోతైన సమస్య ఉంది. మద్యం పట్ల అది మన వైఖరిని వివరిస్తుంది. అందుకే మహాత్మా గాంధీ వంటి నాయకులు, కొన్నిసార్లు మన వంటి రాజ్యాంగాలు మానవ బలహీనతగా లేదా అనైతికమైనదిగా భావించే వాటి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచాలని కోరుకోవటం జరుగుతుంది. ప్రజల్ని సద్వర్తన కలిగినవారిగా తీర్చిదిద్దాలనుకోవటం, కనీసం అలా చేయటానికి ప్రయత్నించాలనుకోవటం నా దృష్టిలో ఒక తప్పుడు అభిప్రాయపు తపన.
నైతిక కోణం నుంచి చూసినప్పుడు ఆ ప్రయత్నం అర్థవంతమైనదిగా కనిపించవచ్చు. బహుశా ఆచరణాత్మక దృక్కోణం నుంచి అది కొన్ని సమస్యల్ని నివారించవచ్చు. కానీ మానవ దృక్కోణం నుండి చూసినప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తి సరైనదని నిర్ణయించినదాన్ని మీరు విభేదించినప్పుడు మీరు సరికాదు అనే భావన ఏర్పడుతుంది.
మహాత్మా గాంధీ; బిహార్, గుజరాత్ ప్రభుత్వాలు మద్యాన్ని ఎలా చూడటం జరిగిందన్న విషయంలో ఇది నిజం. ఫలానా సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్లందరికీ ధూమపాన నిషేధం విధించాలన్న రిషీ సునాక్ మూర్ఖపు ప్రతిపాదన విషయంలో కూడా ఇది నిజం. మనుషుల్ని వారి స్వీయాకర్షణల నుంచి రక్షించగలిగితే పరివర్తన చెందుతారని వారి నమ్మకం. కానీ అది తప్పు.
నిజమైన పరివర్తన మీ తప్పుల నుండి మీరు నేర్చుకోవటం వల్ల వస్తుంది. అయితే నేర్చుకోటానికి ముందుగా మీరు ఆ తప్పుల్ని చేసి ఉండాలి. పొగ తాగటం మానేసినవారికి, మానేయాలని ఎప్పుడూ అనుకోనివారికి మధ్య వ్యత్యాసం ఇదే! అదిలిస్తే కదిలిన దాని కన్నా అనుభవం నుండి నేర్చుకున్నది గట్టి పాఠం అవుతుంది. ఎప్పటికీ మనసులో ఉండిపోతుంది.
మద్యానికి సంబంధించి నిజంగా విచిత్రమైన సంగతి... మన సంస్కృతిలో, ప్రాచీన సంప్రదాయాలలో అది భాగమై ఉండటం! సోమరసం దేవతలకు అమృతం. ముఖ్యంగా ఇంద్రుడికి ప్రీతికరమైనది. మరోవైపు నిషేధం అన్నది విదేశీయులది. అమెరికా 1920లలో మద్య నిషేధానికి ప్రయత్నించి విఫలం అయింది. అది మనం పరిష్కరించవలసిన మరికొన్ని సమస్యల్ని ఉత్పన్నం చేసింది. మనమెందుకు దేవతల మార్గాన్ని అనుసరించకూడదు? అలా చేయటం సంపూర్ణ స్వదేశీ అవుతుంది. అందుకు బదులుగా మనం ఎందుకని అమెరికా మార్గాన్ని అనుకరిస్తున్నాం?
ఈ వ్యాసంలోని నీతి సరళమైనది, సూటిౖయెనది. చట్టం రాసి ఉంచిన ‘మందు’ చీటీని అనుసరించి ప్రజలు నిజాయితీగా, సురక్షితమైన మద్యాన్ని సేవించేలా చూడటంలో సుపరిపాలన ఉంటుంది. దుష్పరిపాలన దానిని కష్టతరం చేస్తుంది, లేదంటే అసాధ్యమైనదిగా మార్చి ప్రజల్ని తరచూ తమ ప్రాణాల్ని హరించే ప్రత్యామ్నాయాల వైపు నెట్టివేస్తుంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment