విశ్లేషణ
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?
తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత?
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు.
అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు.
అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి.
ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది.
2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు.
పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు.
పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం!
పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి.
పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది.
ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి.
‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment