జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు.
హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.
ఎంత మంది వచ్చినా మాదే గెలుపు
అయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్‌ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభం
విజయ్ ఓడిపోతాడు..
మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.
చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
69 సినిమాపై విజయ్ ఫోకస్
కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment