కులరహిత సమాజమే ప్రజాస్వామ్యం | Mallepally Laxmaiah Article On BR Ambedkar Death Anniversary Celebrations | Sakshi
Sakshi News home page

కులరహిత సమాజమే ప్రజాస్వామ్యం

Published Thu, Dec 6 2018 1:47 AM | Last Updated on Thu, Dec 6 2018 1:48 AM

Mallepally Laxmaiah Article On  BR Ambedkar Death Anniversary Celebrations - Sakshi

అట్టడుగు వర్గాలు, ప్రత్యేకించి అంటరాని కులాల రాజకీయ హక్కులపై 1919లో సౌత్‌బరో కమిటీ ముందు సుదీర్ఘమైన అభ్యర్థన చేసేనాటికి అంబేడ్కర్‌ వయస్సు ముప్ఫై ఏళ్లు. ఈ హక్కుల సాధన కోసం మూడు పాయల్లో వ్యూహాత్మకంగా తన ఉద్యమాన్ని కొనసాగించారు. అంబేడ్కర్‌ షెడ్యూల్డ్‌ కులాల హక్కుల కోసం తుదిశ్వాస వరకూ పోరాడినప్పటికీ, అంతిమంగా ఒక ప్రజాస్వామ్య సమాజంలోనే దీనికి సంపూర్ణ పరిష్కారం సాధ్యమని బలంగా అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని కుల వ్యవస్థను కూకటివేళ్ళతో పెకలించడానికి ఒక మహాప్రజాస్వామ్య ఉద్యమం ప్రారంభం కావాలి. ఈ ఆకాంక్షకు ఆచరణ రూపమివ్వడమే బాబాసాహెబ్‌కు ఘనమైన నివాళి.

‘‘భారత రాజకీయాల్లో మహాత్మాగాంధీతో పాటు, డాక్టర్‌ అంబేడ్కర్‌ మహాగొప్ప వ్యక్తి. హిందూ కులాల్లో పుట్టిన వాళ్ళందరికన్నా మేధావి. ఇటువంటి వ్యక్తుల గొప్ప కృషివల్ల కుల వ్యవస్థతో కూడిన హిందూయిజం దెబ్బతినక తప్పదు. స్వతంత్ర వ్యక్తిత్వం, వివేకం, నిలు వెత్తు నిజాయితీ కలిగిన అంబేడ్కర్‌ భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ’’ అంటూ అంబేడ్కర్‌ని కొనియాడిన వ్యక్తి మరెవరో కాదు రామ్‌ మనోహర్‌ లోహియానే. సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్‌ మనోహర్‌ లోహియా అంబేడ్కర్‌ మరణానంతరం ఆయనపై చేసిన వ్యాఖ్య ఇది. నిజానికి బాబాసాహెబ్‌ అంబేడ్కర్, రామ్‌ మనోహర్‌ లోహియాలు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భంలేదు.

కానీ ఆ ఇద్దరి మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వారిద్దరి కలయిక కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం జరగక ముందే అంబేడ్కర్‌ మహాపరి నిర్వాణం చెందారు. తను ప్రారంభించిన ‘మాన్‌కైండ్‌’ అనే పత్రికకు రాయాలని కోరుతూ రామ్‌మనోహర్‌ లోహియా 1955 డిసెంబర్‌ పదవ తేదీన అంబేడ్కర్‌కు ఒక ఉత్తరం రాశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా సమ కాలీన రాజకీయాలపై ఉత్తరాల ద్వారా కొంత చర్చ జరిగింది. 1956, అక్టోబర్‌ 5వ తేదీన అంబేడ్కర్‌ ఒక ఉత్తరం రాస్తూ, లోహియాతో సమావేశం కావాలనే తన కోరికను వెలి బుచ్చుతారు. కానీ ఆ సమావేశం జరగకుండానే 1956, డిసెంబర్‌ 6వ తేదీన అంబేడ్కర్‌ మరణించారు. 1957, జూలై,1వ తేదీన లోహియా, ఆయన సన్నిహిత మిత్రుడు మధు లిమాయేకు రాసిన ఉత్తరంలో పై విధంగా పేర్కొన్నారు.

1891 ఏప్రిల్, 14న జన్మించిన అంబేడ్కర్‌ తన 26వ ఏట 1915 కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. 1916లో ‘‘కులాల పుట్టుక’’పై ఒక పరిశోధనా పత్రాన్ని సమ ర్పించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 1919లో సౌత్‌బరో కమిటీ ముందు, అట్టడుగు వర్గాల, ప్రత్యేకించి అంటరాని కులాల రాజకీయ హక్కులపై ఒక సుదీర్ఘమైన అభ్యర్థన చేశారు. 1915లో ఆర్థిక శాస్త్రంలో సాధించిన మాస్టర్స్‌ డిగ్రీతోపాటు, 1927లో లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి డాక్టరేట్‌ పొందిన తర్వాత 1946లో స్టేట్స్‌ అండ్‌ మైనారిటీస్‌’’ అనే డాక్యుమెంట్‌ను రూపొందించారు.

గతంలో ఏ పార్టీ, ఏ రాజనీతివేత్తా చెప్పని విధంగా భూమిని జాతీయం చేయాలనీ, పరి శ్రమలను, ఆర్థిక, వాణిజ్య సంస్థ లను ప్రభుత్వమే నిర్వహించాలనీ సూచించిన గొప్ప సామ్యవాది అంబే డ్కర్‌. 1916లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో కులాల పుట్టుకను శోధించే ప్రయత్నం మొదలు పెట్టారు. 1927లో కుల వివక్షకు వ్యతిరేకంగా మహద్‌ చెరువు సత్యాగ్రహం, కాలారామ్‌ దేవాలయ ప్రవేశ ఉద్యమాలు ఆయన కార్యా చరణ కొనసాగింపు. 1935లో అంటరానితనం, కుల వివక్ష సమసిపోవా లంటే కుల నిర్మూలనే మార్గమంటూ భారత ప్రజలకు ఒక తాత్విక సైద్ధాంతిక భూమికను అందించారు. ఆ తర్వాత అంటరాని వారెవరు? శూద్రులెవరు? అన్న తన పరిశోధనలను కొనసాగిస్తూ, భారతదేశ కుల సమాజం అంతం కావడానికి బౌద్ధం చక్కటి పరిష్కార మార్గమని భావించి బుద్ధుడిని అనుసరించారు.
 
మూడో అంశంగా, రాజకీయ హక్కులు... 1919లో సౌత్‌బరో కమిటీ ముందు చేసిన ప్రసంగం మొదలుకొని 1955లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ప్రణాళికను రూపొందించేంతవరకు ఆయన జీవితమంతా ఒక యుద్ధరంగమే. రణక్షేత్రం నుంచే ఆయన ఆలోచనలు సాగాయి. వయో జన ఓటింగ్‌ హక్కుతోపాటు, అన్ని వర్గాలకు, ప్రత్యేకించి అణగారిన వర్గాలకు రాజకీయ హక్కుల కోసం ఆయన తన సర్వస్వాన్నీ అంకితం చేశారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రముఖ విద్యా వేత్త జాన్‌డ్యూయి మార్గదర్శకత్వంలో అంబేడ్కర్‌ రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు.

అప్పటికే అక్కడ జరుగుతున్న నల్లజాతి ప్రజల పోరా టాలు అంబేడ్కర్‌ను ప్రభావితం చేశాయి. రాజనీతి శాస్త్రంలో ప్రజా స్వామ్య భావనకు ఉన్న గొప్పతనాన్ని జాన్‌డ్యూయి ద్వారా అంబేడ్కర్‌ అర్థం చేసుకోగలిగారు. అదే రాజకీయ హక్కుల పోరాట ఉధృతికి అంబేడ్కర్‌ నడుం కట్టేలా చేసింది. 1919లో సౌత్‌బరో కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలం, సైమన్‌ కమిషన్‌ పర్య టనలో అంటరానికులాల హక్కులకై గొంతెత్తి చాటారు. ఆ తర్వాత 1931, 32లలో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు హాజరయ్యారు. ప్రత్యేక ఓటింగ్‌ హక్కు అయిన కమ్యూనల్‌ అవార్డు సాధించారు. గాంధీ కుట్ర కారణంగా పూనా ఒడంబడిక అనే బృహత్తర కార్య క్రమం నిలిచిపోయింది. దాని ఫలితంగా ప్రత్యేక ఓటింగ్‌ విధానం లేకుండా పోయింది.

అయితే 1935లో మొట్టమొదటిసారిగా ‘భారత చట్టం’(ఇండియన్‌ యాక్ట్‌ 1935)ను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని ప్రాతిపదికగా, 1937లో జరిగే ఎన్నికల్లో పాల్గొనడం కోసం 1936లో అంబేడ్కర్‌ ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(ఐఎల్‌పి)ని స్థాపించారు. మహారాష్ట్రలో ఆ పార్టీ 17 స్థానాల్లో పోటీచేయగా, 14 స్థానాల్లో విజయం సాధించింది. అందులో పదకొండు రిజర్వుడ్‌ స్థానాలుకాగా, మూడు జనరల్‌ స్థానాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీగా ఉన్నది. అయితే జయప్రకాశ్‌ నారాయణ్, ఆచార్య నరేంద్ర దేవ్, రామ్‌ మనోహర్‌ లోహియా స్థాపించిన కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మాత్రం అంబేడ్కర్‌ నాయకత్వం వహిస్తున్న ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీకి మద్దతు పలికింది. ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ కేవలం అంటరాని కులాల కోసం ఆవిర్భవించిన పార్టీ కాదు.

అంటరాని కులాల హక్కులు, వారి ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యమే కానీ అంతకుమించిన విస్తృ తమైన ఆకాంక్షలతో ఆ పార్టీ అవతరించింది. అందుకే కార్మికుల, రైతు  కూలీల హక్కులు ఆ పార్టీకి ప్రాథమిక లక్ష్యాలు అయ్యాయి. పరిశ్రమలు పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడవాలనేది ఆ లక్ష్యాల్లో ఒకటి. అంటే ఐఎల్‌పి కార్మికవర్గ దృక్పథంతో అవతరించిందనేది సుస్పష్టం. 1937 ఎన్నికల తర్వాత కేబినెట్‌ మిషన్‌ అనే పేరుతో భారతదేశ రాజకీయ స్వేచ్ఛ, స్వాతంత్య్రం అనే అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణకు  వచ్చిన క్రిప్స్‌ (ఇఖఐ్క్క ) కమిటీ ముందు కూడా అంబేడ్కర్‌ తన వాదనలను విని పించారు. స్వతంత్ర భారత దేశంలో ఏర్పడే రాజ్యాంగంలో తమకు ప్రత్యేక హక్కులు ఉండాలని నిర్ద్వంద్వంగా ప్రతిపాదించారు.

అయితే, ‘‘లేబర్‌ పార్టీ నాయకుడైన నీకు అంటరాని కులాల కోసం ప్రత్యేకంగా మాట్లాడే హక్కు లేదు’’ అన్న కమిటీ మాటలను పరిగణనలోకి తీసు కొని, ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ స్థానంలో ఆల్‌ ఇండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌ (అఐ ఇఊ)ను స్థాపించారు. దీంతో షెడ్యూల్డ్‌ కులాల హక్కుల రక్షణ ఈ పార్టీ ప్రాథమిక ఎజెండాగా మారింది. 1942లో ఏర్ప డిన ఈ పార్టీ రాజ్యాంగ సభ ఎన్నికల్లో, 1952 జనరల్‌ ఎన్నికల్లో పోటీ చేసింది. కొన్ని స్థానాలు గెలిచినప్పటికీ, అనుకున్నంత ఫలితాలు సాధిం చలేకపోయింది. దీనితో మళ్లీ అంబేడ్కర్‌ రాజకీయ ఉద్యమం నడపడా నికి కేవలం షెడ్యూల్డ్‌ కులాల పేరుతో పార్టీ నిర్మాణం సరికాదని భావిం చారు. కుల ప్రాతిపదికగా ఏర్పడిన రాజకీయ పార్టీ విస్తృతమైన రాజ కీయ వ్యవస్థను శాసించలేదని అంబేడ్కర్‌ అభిప్రాయం. అందుకే 1955లో రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా పేరుతో ఒక రాజకీయ పార్టీకి అంకురార్పణ చేయాలని భావించి, ఒక ప్రణాళికను తయారు చేశారు.

భారత రాజ్యాంగంలోని పీఠికను ఆర్‌పీఐ ప్రాథమిక లక్ష్యంగా అంబేడ్కర్‌ ప్రకటించారు. ప్రణాళికలో ఆ పీఠికను యథాత«థంగా పొందుపరిచారు. ‘‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం ఆశయా లుగా కొత్త పార్టీని ప్రకటించారు. కానీ ఆర్‌పీఐ పార్టీ అంబేడ్కర్‌ మరణానంతరం మాత్రమే ఉనికిలోకి వచ్చింది. 1952 జనరల్‌ ఎన్నికల నుంచి అంబేడ్కర్‌ తన రాజకీయ గమ్యం, గమనం కోసం ప్రయత్నిం చారు. అందులోభాగంగానే సహజ మిత్రుల కోసం అన్వేషించారు. ఆ క్రమంలోనే సోషలిస్టు పార్టీ నాయకులు రామ్‌ మనోహర్‌ లోహియాతో అంబేడ్కర్‌కి సత్సంబంధాలేర్పడ్డాయి. కానీ వాళ్ల కలయిక జరగకుం డానే, వారి రాజకీయ కల సాకారం కాకుండానే అంబేడ్కర్‌ కన్ను మూయడం పెద్దలోటు.

ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మొదట్లో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసినప్పటికీ, తర్వాత అంతర్గత కలహాలతో ఉనికినే పోగొట్టుకున్నది. అంబేడ్కర్‌ తన జీవిత చరమాం కంలో చేసిన రాజకీయ ఆలోచనలు, ఆశించిన కార్యాచరణ ఇంకా పూర్తి కాలేదు. షెడ్యూల్డ్‌ కులాల హక్కుల కోసం తుదిశ్వాస వరకూ పోరాడి నప్పటికీ, అంతిమంగా  ఒక ప్రజాస్వామ్య సమాజంలోనే దీనికి సంపూర్ణ పరిష్కారం సాధ్యమని బలంగా అభిప్రాయపడ్డారు. ఒక మని షికి, ఒక ఓటు, ఒక ఓటు–ఒక విలువ ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యం లభిం చినప్పటికీ, ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయని, రాజ్యాంగ సభ చివరి సమావేశం సందర్భంగా 1949, నవంబర్‌ 25న చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. కుల నిర్మూలన ద్వారా సామాజిక ప్రజాస్వామ్యం, ప్రజలందరికీ సమానావకాశాల ద్వారా, పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రణ, ఆర్థిక ప్రజాస్వామ్యం అందించాలని అంబేడ్కర్‌ అభిలషించారు. అందుకే భారతదేశంలోని కుల వ్యవస్థను, పెట్టుబడి దారీ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించడానికి ఒక మహాప్రజాస్వామ్య ఉద్యమం ప్రారంభం కావాలి. ఈ ఆకాంక్షకు ఆచరణ రూపమివ్వడమే బాబా సాహెబ్‌కు ఘనమైన నివాళి.

(నేడు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా)
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు / lmallepalli@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement