అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్‌లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది.
1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు.
రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్‌లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్‌కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్‌ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్‌లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు.
అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి.
అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్‌లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు.
అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్‌లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్‌లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్‌లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్‌ను పెద్దగా బాధించలేదు.
కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ సంఘటన అంబేడ్కర్‌ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి)
రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?)
- మల్లెపల్లి లక్ష్మయ్య
సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment