Buddhism
-
నేటి సిద్ధార్థుడు!
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే. ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు. మార్చింది ఆ ప్రయాణమే సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బుద్ధుడి మార్గంలో.. మానసిక ప్రశాంతతపై ప్రజల్లో అవగాహన!
‘మనిషి మనసు నుంచే యుద్ధాలు పుట్టు కొస్తాయి.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రపంచ శాంతి స్థాపన సాధ్యం అవుతుంది’ అన్న బుద్ధుడి మాటలే వారికి స్ఫూర్తి.. ఆయన ప్రవచించిన పంచశీల లక్షణాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.. అంతేకాదు ఆయన బోధనలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి చేస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతతను నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న కొత్తూరు మండలం తిమ్మాపూర్‌లో బోధిసత్వ బుద్ధ్ధవిహార్ పేరుతో క్షేత్రాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారే బుద్ధా లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ప్రతినిధులు.మానవతా బౌద్ధ ధర్మం..హైదరాబాద్ చాప్టర్ ప్రధాన కార్యాలయం ఫోగువాంగ్ షాన్ పేరుతో తైవాన్‌లో ఉంది. మానవతా బుద్ధిజాన్ని విరివిగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా మైండ్ కల్చర్‌ను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్ శాఖకు ప్రధాన సలహాదారు అయిన డాక్టర్ బాలు సావ్లా 15 ఏళ్లుగా పని చేస్తున్నారు. రెండు సార్లు ఈ సంస్థకు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.విద్య, వైద్య సేవలు..హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విద్య, వైద్య పరమైన సేవలు అందిస్తున్నారు. ప్రజల్లో మానసిక ప్రశాంతత గురించి అవగాహన కలి్పస్తూనే చాలా ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.దేశ, విదేశాల్లో ప్రచారం..తెలంగాణలో బౌద్ధ మతం ఒకప్పుడు విరాజిల్లింది. బుద్ధుడు నడయాడిన ఘనమైన చరిత్ర మన నేలకు ఉంది. కాలక్రమేణా బౌద్ధమతం కనుమరుగైనప్పటికీ అప్పటి ఆనవాళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ చరిత్ర గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు డాక్టర్ బాలు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, చైనా, కెనడా వంటి దేశాలప్రజలకు ఇక్కడి బౌద్ధ క్షేత్రాల గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు. మానసిక ప్రశాంతత అవసరం..ప్రస్తుతం ఉన్న బిజీ జీవన విధానంలో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. బుద్ధుడు చూపిన మార్గంలో వెళ్తే సులువుగా దాన్ని సాధించవచ్చు. ఇప్పటి తరానికి బుద్ధుడి బోధనలు ఎంతో అవసరం. – డాక్టర్ బాలు సావ్లా, బుద్ధ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్, హైదరాబాద్ శాఖ ప్రధాన సలహాదారు -
అనుమానాలు వీడని అంబేడ్కర్ మరణం
బాబా సాహెబ్ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 1956, అక్టోబర్ 14న నాగపూర్‌లో లక్షల మంది అనుచరులతో హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీకరించారు. నాగపూర్ నాగజాతి ప్రజలు జీవించిన భూమి గనుక,వారంతా బౌద్ధులు గనుక, తాను బౌద్ధం స్వీకరించడానికి నాగ పూర్‌ను ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. అంతే గాని, నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ వారి ప్రధాన కార్యాలయం ఉంది గనుక, వారి ప్రాముఖ్యం తగ్గించడానికి తను ఆ పట్టణాన్ని ఎంచుకోలేదనీ వివరణ ఇచ్చారు. అయితే,ఆ తర్వాత 52 రోజులకే (డిసెంబర్ 6) అంబేడ్కర్ కన్ను మూశారు. ఆయన మరణం వెనుక ఓ కుట్ర ఉందనీ, ఆయన మరణించిన నాటి నుండి నేటి దాకా ఒక ఆరో పణ ఉంది. ఆ ఆరోపణ నిజం కాదని అటు భారత ప్రభుత్వం గానీ, ఇటు ఆరోపణలు ఎదుర్కొన్న వర్గాలు గానీ ఆధారాలు, వివరణలు ప్రజల ముందు పెట్టలేదు. అందువల్ల అనుమానాలు అనుమానాల్లాగే ప్రజల మన సుల్లో సజీవంగా ఉన్నాయి. ఆ రోజుల్లో జీవించి ఉన్న ఇ.వి.ఆర్. పెరియార్ తన వార్తా పత్రిక ‘విడుదలై’లో ఇలా రాశారు. ‘డాక్టర్ అంబే డ్కర్ చనిపోయారని అకస్మాత్తుగా ప్రకటించడం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తోంది. గాంధీ మరణం వెనుక ఏ కారణం, ఏ కుట్ర ఉన్నాయో అలాంటివే అంబేడ్కర్ చనిపోవడం వెనక ఉన్నాయని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ చాలా వివరంగా రాశారు. మొత్తం మీద ఆయన వెలిబుచ్చిన ఆవేదనలోని సారాంశం ఏమిటంటే – గాంధీ మరణానికి కారకులెవరో, వారే అంబేడ్కర్ మరణాకి కూడా కారకులని! అందుకు అవకాశమిచ్చే పలు అంశాలు కూడా ఆ రోజుల్లో చాలా బయటికి వచ్చాయి. ‘తన తండ్రికి విషమిచ్చి తెలియకుండా చంపేశారని’ స్వయానా అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. అంబేడ్కర్ అభిమానులంతా యశ్వంత్‌ను బలపరిచారు. అంబేడ్కర్ మరణవార్త ఈ దేశ ప్రజలకు అనుమానాస్పదమైన వార్త అయింది. ‘తన తండ్రిది సహజ మరణం కాదనీ, హత్య అనీ – దోషులెవరో తేల్చాలనీ – అంబేడ్కర్ కుమారుడు యశ్వంత్ నాటి ప్రధాని నివాసం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ మరణం తర్వాత పదకొండవ రోజున, ఆయన అనుయాయులు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. నాటి ప్రధాని, రాష్ట్ర పతులకు లిఖితపూర్వక నివేదికలు, విన్నపాలు అంద జేశారు. అంబేడ్కర్ మరణం వెనక ఏం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. నాటి ప్రధాని నెహ్రూ స్పందించి నిజనిర్ధారణ కమిటీని నియమించారు. కమిటీ భారత ప్రభుత్వానికి అందజేసిన రిపోర్టు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల ముందుపెట్టలేదు. ఒకవేళ రహస్యాలేవీ లేకపోతే, అది బయటపెడితే అన్ని అనుమానాలకూ తెరపడినట్ట య్యేది కదా! ఢిల్లీ పోలీస్ ఐజీ ఇచ్చిన వివరణను మాత్రం 1957 నవంబర్ 27 నాడు – అంటే దాదాపు సంవత్సరం తర్వాత, అప్పటి హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌తో పార్లమెంట్లో ఒక ప్రకటనగా ఇప్పించారు. ‘అంబేడ్కర్ మరణం సహజమైందని’– ఆ ప్రకటన సారాంశం! అదొక కంటి తుడుపు ప్రకటన అని దేశ ప్రజలు ఆనాడే భావించారు. అసంతృప్తితో రగిలిపోయారు. ఆనాటి నుండి నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వ్యాసాలు, పుస్త కాలు ప్రచురింప బడుతూనే ఉన్నాయి. అసహనం, అసంతృప్తి ఏదోరకంగా బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మధ్యే 2021 జనవరి 26 నాడు నాగపూర్ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు – అంబేడ్కర్ ఎలా చని పోయారో తేటతెల్లం చేయాలని పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నా రంటే... ఆ తేదీన అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది గనుక! వారి పాత్ర లేకపోతే జనం వెళ్ళి వారి కార్యాలయం ముందు ఎందుకు నిరసన ప్రదర్శనలిస్తారూ? అర్థం చేసుకోవా ల్సిన విషయం! నెహ్రూజీ తొలి ప్రధాని అయ్యారు కాబట్టి, సోష లిజానికి, వైజ్ఞానిక ప్రగతికి ఆయన ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అప్పుడు వీరి ఆటలు అంతగా సాగలేదు. అయినా, వారి లక్ష్యసాధనకు వారు నిరంతరం కృషి చేస్తూనే వస్తున్నారు. దాని ఫలితాలను నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం! అంబేడ్కర్‌ది సహజ మరణమా? లేక హత్యా అనేది ఆరోజుల్లో బయటికి రాలేదు. 67 ఏళ్ళ తర్వాత, ఆధారాలన్నీ చెదిరిపోయిన తర్వాత, ఇప్పుడు బయటికి వస్తుందన్న నమ్మకం లేదు గానీ – గతంలో జరిగిన కొన్ని వాస్తవాలు ఈ తరానికి తెలియజేయడం అవసరం అనిపించింది. అయితే,బాబా సాహెబ్ అర్ధంతరంగా వదిలేసిన కర్తవ్యాలనూ, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధననూ ఈ తరం యువతీ యువకులు ముందుకు తీసుకుపోవాల్సి ఉంది. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉండా ల్సిందే! డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత (నేడు అంబేడ్కర్ వర్ధంతి) -
బౌద్ధ వైభవ చిహ్నం తొలగించడమా?
చరిత్రలో హేతువాదాన్ని వ్యాప్తి చేయడంలో అగ్రగామి, బౌద్ధ ధర్మం. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించినది, యజ్ఞ యాగాదులను నిరసించినది కూడా ఇదే ధర్మం. అలాంటి మహత్తర ధర్మాన్ని తెలుగు నేల ఇరు చేతులా హత్తుకుంది. దేశంలోని ఏ బౌద్ధ స్థావరం నుంచి దొరకని ఆనవాళ్లు తెలుగు నేలలో దొరికాయి. అలాంటి తెలుగు నేల విశిష్ట బౌద్ధ వారసత్వపు చిహ్నంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ‘పూర్ణఘటాన్ని’ నెలకొల్పారు. కానీ కొత్తగా ప్రారంభమైన తెలంగాణ సచివాలయంలో ఆ ఆనవాళ్లను చెరిపేశారు. భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో అదే అంబేడ్కర్ పేరిట ఏర్పాటైన సచివాలయంలో బౌద్ధ చిహ్నాన్ని కూల్చేశారు. భారత సెక్యులర్ రాజ్యాంగ నిర్మాత, బౌద్ధ సంస్కృతీ ప్రియుడైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకూ శుభాభినందనలు తెలుపు తున్నాను; కానీ ఈ సందర్భంలోనే సెక్రటేరియట్లో ఉండవలసిన, ఉమ్మడి తెలుగు బౌద్ధ సంస్కృతీ వైభవ ప్రతీకగా అంతకుముందు నుంచీ ఉన్న విశిష్ట శాశ్వత కట్టడాన్ని తొలగించినందుకు విచారం వెలిబుచ్చక తప్పడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో (2008) ఆయన ఆధ్వర్యాన తెలుగు ప్రజల ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ చిహ్నంగా ఆ కట్టడం నాలుగు భాషల ఉద్దీపనతో వెలిసింది. ఎంతోమంది పర్యాటకుల్ని ఆకర్షించిన బౌద్ధ సంస్కృతీ చిహ్నమది (ఘనాకారపు గ్రానైట్ రాయి మీద తొలిచిన పూర్ణఘట ప్రతిరూపం). కానీ నేటి సెక్రటేరియట్ ఆవరణలో ఆ విశిష్ట చిహ్నం ఆనవాళ్ళు ‘కలికానికైనా’ కానరావు. ఇంతకూ ఆ బౌద్ధ ధర్మ సంస్కృతీ వైభవ కట్టడం ఏమైనట్టు? భారత దళిత ప్రజా బాహుళ్య విమోచనకు ఏ బౌద్ధ సౌభ్రాతృత్వ ధర్మాన్ని అంబేడ్కర్ ప్రబోధిస్తూ వచ్చాడో ఆ చిహ్నాన్నే కూల్చేశారు. ఏ యజ్ఞయాగాదులకు దూరంగా జరిగి సర్వ మానవ సమానత్వం లక్ష్యంగా అంబేడ్కర్ ముందుకు సాగాడో –అందుకు విరుద్ధంగా యజ్ఞయాగాదులతో ‘బీఆర్ఎస్’ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన అంబేడ్కర్ సచివాలయ ప్రవేశం చేశారు. విశేషమేమంటే, ‘బౌద్ధ ధర్మ చక్ర ప్రశస్తి’ శాసనం మన దేశం మొత్తం మీద ఏ బౌద్ధ స్థావరం నుంచీ ఇంతవరకూ వెలుగు చూడనందుననే తెలంగాణలోని ‘ఫణిగిరి’ ధర్మ చక్ర ప్రశస్తి శాసనానికి చారిత్రక ప్రాధాన్యం లభించింది. ప్రాకృత భాషను, పాలీ లిపిని, ‘బ్రాహ్మీ’ లిపిని ప్రేమించి, ప్రోత్సహించిన ధర్మం కూడా బౌద్ధానిదేనని మరచి పోరాదు. క్రీ.పూ. 3 – క్రీ.శ. 18 శతాబ్దాల మధ్య వెలువడిన వేలాది శాసనాలను ఉమ్మడి తెలుగువారి సొత్తుగా భావించి ఈ విశేషాలన్నింటినీ ఆవిష్కరించిన ప్రసిద్ధ స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఒకరు. ఈయనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణంలో తెలుగు వారి బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే అత్యున్నత కట్టడ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. సరిగ్గా ఆ కట్టడం ఆనవాళ్లే కనపడకుండా చేసింది కేసీఆర్ పాలన. కాక పోతే అంబేడ్కర్ పేరును ఒక ముసుగుగా వాడుకోవడం పాలకుల కొత్త ‘సంస్కృతి’! కొండా శ్రీనివాసులు, అవధానం ఉమా మహేశ్వరి సంపాదకులుగా శివనాగిరెడ్డి తెలుగు సంస్కృతీ వైభవాన్ని కళ్లకు కట్టి చూపే ‘మీరూ శాసనాలు చదవొచ్చు’అన్న అమూల్య గ్రంథాన్ని అందించారు. ఇందులో ఆయా కాలాల్లో హైందవ, బౌద్ధ మతాలకు మధ్య జరిగిన భావ సంఘర్ష ణలు, లిపిలో వచ్చిన మార్పులు వగైరా చరిత్ర ఉంది. ఈ పరిణామ క్రమానికి శాశ్వత నిలువుటద్దంగా నిలిచిన, సెక్రటేరి యట్ ఆవరణలో స్థాపితమైన ఉమ్మడి బౌద్ధ సంస్కృతీ వైభవ అమూల్య చారిత్రక కట్టడాన్ని ఎందుకు తొలగించారో సమా ధానం కావాలి. హేతువాదాన్ని వ్యాప్తి చేయ డంలో స్థిర చిత్తంతో ముందుకు దూసుకు వెడుతున్న బౌద్ధ ధర్మాన్నీ, దాని తాలూకు ప్రచార సంస్థ లనూ ఎదుర్కొంటున్న దశలో హైందవంలోని ఛాందసులు బౌద్ధా రామాల్ని కూల్చకుండా ఉంటారా అని మహాపండితులు రాహుల్ సాంకృత్యాయన్, తిరుమల రామచంద్ర పదేపదే ప్రశ్నించవలసి వచ్చిందని మరవరాదు. హైదరాబాద్‌లో మూసీ తీరాన ఉన్న క్రీ.శ. 4వ శతాబ్ది నాటి బౌద్ధారామాన్ని కాస్తా 30 ఏళ్ల క్రితమే కొనగండ్ల నరసింహస్వామి ఆలయంగా మార్చేశారని శాసనాల చరిత్రలో పేర్కొన్నారు. అహో బిలం, మంగళగిరి, భీమునిపట్నం (పావురాళ్ల కొండ), సింహాచలం మున్నగు నరసింహ క్షేత్రాలన్నీ ఒకనాటి బౌద్ధ స్థావరాలేనంటారు. హైదరాబాద్‌లో లభించిన ప్రాకృత బౌద్ధ శాసనం క్రీ.శ. 4వ శతాబ్ది నాటిది. ప్రముఖ శాసన పరిశోధకులు పీవీ పరబ్రహ్మ శాస్త్రి దానిని ధ్రువీకరించారు. బౌద్ధానికి విస్తారంగా రాజాదరణ లభించిన విష్ణుకుండినుల కాలంలో (క్రీ.శ. 6వ శతాబ్ది) విష్ణుకుండి మొదటి గోవింద వర్మ పట్టపురాణి పరమభట్టారిక మహా దేవి నల్గొండ జిల్లా తుమ్మల గూడెంలో తన పేర ఒక మహా విహారాన్ని నిర్మించి, సర్వ జీవరాసుల హితాన్ని కోరే బౌద్ధం పట్ల తన మక్కువను తెలియజేసింది. ఇక క్రీ.శ. 14–17 శతాబ్దుల్లో విజ యనగర శాసనాలు బౌద్ధ ధర్మాన్ని తలదాల్చి యశస్సు గడించినవే. కాకతీ యుల తరువాత మొత్తం తెలుగునేలను పాలించిన కుతుబ్‌షాహీలు తెలుగును ప్రోత్సహించినవాళ్లే. సుప్రసిద్ధ నాణేల పరిశోధకులు డాక్టర్ దేమె రాజారెడ్డి కోటిలింగాల తవ్వకాల్లో అనేక పేర్లున్న నాణేలపై గల లిపి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటిదనీ, రాజుల పేర్లు తెలుగులో ఉన్నాయనీ నిర్ధారించారు. తెలుగు లిపి ఆవిర్భావ, వికాసాల గురించి పీవీ పరబ్రహ్మశాస్త్రి, డా.ఎస్. రామచంద్రమూర్తి అనేక విషయాలు వెల్లడించారు. ఇంత చరిత్ర సంస్కృతి ఉభయ ప్రాంతాలలోని తెలుగు వారికి ఉండగా, ఉమ్మడి బౌద్ధసంస్కృతీ వైభవాన్ని వెలార్చిన సాధికార నిర్మాణ రూపాన్ని సెక్రటే రియట్‌లో నామరూపాలు లేకుండా చేయడం దుర్మార్గం. పాలకుల స్థాయికి మించిన దుశ్చర్యగా పరిగణించక తప్పదు. ఇంతకూ ‘జీవతత్వం’ ఎక్కడుందన్న ప్రశ్నకు వేమన్నను అడిగితే చెబుతాడు:‘‘తనువులోన జీవతత్వ మెరుంగక వేరెకలదటంచు వెదుక నేల,భానుడుండ దివ్వెపట్టి వెదుకు రీతి?!’’ abkprasad2006@yahoo.co.in -
66 ఏళ్లుగా సర్వసాధారణం.. ఇప్పుడెందుకు వివాదం!
అక్టోబర్ అయిదవ తేదీన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, మిషన్ జై భీం సంస్థల ఆధ్వర్యంలో పదివేల మందికి పైగా న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్లో బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. అందులో ధమ్మ దీక్ష సంప్రదాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను పఠించారు. గత 66 ఏళ్లుగా ఎక్కడ బౌద్ధ ధమ్మ దీక్షా సమ్మేళనాలు జరిగినా ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం అయ్యింది. ఇప్పుడు దాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకుంటోంది. 1950 అక్టోబర్ 14 విజయదశమి నాడు అంబేడ్కర్ నాయకత్వంలో ఐదున్నర లక్షల మంది బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించినప్పుడు... అంబేడ్కర్ రూపొందించిన 22 ప్రతిజ్ఞలను అనుసరిస్తామని అందరూ శపథం చేశారు. అందులో నైతిక సూత్రాలు, నైతిక జీవన విధానంతో పాటు దేవీ దేవతలను పూజించం అనే అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, బుద్ధుడు ప్రభోదించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తామనే విషయం కూడా ఉంది. అక్టోబర్ 5న జరిగిన బౌద్ధ ధమ్మ దీక్షా స్వీకార ఉత్సవానికి ఢిల్లీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్ కూడా హాజరయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ భారతీయ జనతాపార్టీ నాయకులు వివాదాస్పదం చేశారు. అక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచారనీ, దూషించారనీ, అందులో రాజేంద్ర గౌతమ్ భాగమయ్యారనీ ఆరోపించారు. రాజేంద్ర గౌతమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని, హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందులో భాగంగానే రాజేంద్ర గౌతమ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో గుజరాత్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఈ అంశాన్ని ఆప్‌కు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తున్నదని భావించిన రాజేంద్ర గౌతమ్ తనకు తానుగానే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఈ వివాదాన్ని సృష్టించి, ఆప్‌ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావించింది. అంతే కాకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను దోషిగా నిలబెట్టాలనీ చూశారు. పదవి, బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేవి రెండు విషయాలు నా ముందున్నప్పుడు అంబేడ్కర్ మహోన్నతా శయం మాత్రమే నాకు కనిపించింది. పదవిని వదులుకున్నాను. భవిష్యత్‌లో మరింత శక్తిమంతంగా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గౌతమ బుద్ధుని మార్గంలోనే నడవడానికి నిశ్చ యించుకున్నాను’ అన్నారు. అసలు బాబాసాహెబ్ అంబేడ్కర్ కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని వీడి, సమత, కరుణ, ప్రేమతో నిండిన బౌద్ధాన్ని స్వీకరించడానికి, ఇప్పటికీ ఈ దేశంలోని దళితులు, ఇతర మానవతావాదులు బౌద్ధాన్ని స్వీకరించడానికీ ఎవరు కారకులు? ఏంటి కారణాలు? అనేది ఆలోచించాలి. అంబేడ్కర్ 1935, అక్టోబర్ 13వ తేదీన పదివేల మంది అణగారిన కులాల పేరుతో పిలవబడే అంటరాని కులాల ప్రజలు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ... ‘దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. కానీ హిందువుగా మరణించను. అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. హిందూ సమాజంలోని ఆధిపత్యకులాలు పెడుతున్న బాధలు భరించడం ఇంకా అవసరం లేదు. అయితే ఒక మతాన్ని వీడి, మరో మతాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమానత్వ హోదా, భద్రత, గౌరవప్రదమైన జీవితం లభించగలిగే ధర్మంలోకి వెళ్ళాలి’ అన్నారు. అదే సందర్భంలో అప్పటికే ఐదేళ్లుగా సాగుతున్న నాసిక్‌లోని కాలారామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమాన్ని అంబేడ్కర్ ప్రస్తావించారు. ఏ మతంలోని దేవాలయాలలోకి మనకు ప్రవేశం లేదో, ఆ మతంలో ఉండాల్సిన అవసరం ఉందా అని బహిరంగంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, 1922 మార్చి 20వ తేదీన మహద్‌లోని చౌదర్ చెరువు నీళ్ళను తాగడానికి సాగించిన సత్యాగ్రహం, ఆ సందర్భంగా మహర్లపై జరిగిన దాడి ఆయన మనస్సులో బలంగా నాటుకుపోయింది. మహద్ చెరువులోని నీళ్లు తాగ డానికి అందరికీ హక్కు ఉన్నదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆధిపత్య కులాలు ఆనాటి మహర్లను చాలా క్రూరంగా కొట్టి, గాయపరిచారు. ఈ ఘటనలు కూడా అంబే డ్కర్‌ను పెద్దగా బాధించలేదు. కానీ ఆయన 1919 నుంచి 1932 వరకు దాదాపు 13 ఏళ్లపాటూ పోరాడిన ఫలితంగా ప్రకటించిన ‘కమ్యూనల్ అవార్డు’ వల్ల సాధించిన ప్రత్యేక ఎన్నికల హక్కుని వదులు కోవలసి వచ్చినప్పుడు ఎంతో క్షోభ అనుభవించారు. 1932 ఆగస్టు 16వ తేదీన ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సె మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తే, పూనాలోని ఎరవాడ జైలులో ఉన్న మహాత్మాగాంధీ దానిని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ‘ఇది హిందువులను విభజించడమే’ అనే వాదనను గాంధీజీ ముందుకు తీసుకొచ్చారు. అణగారిన వర్గాల ప్రత్యేక ఎన్నికల విధానాన్ని అంగీకరించనని మొండికేశారు. దీనిని అంబేడ్కర్ తీవ్రంగా ప్రతిఘటించారు. చివరకు హిందూ సంస్థలు, సంఘాలు అంబేడ్కర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. గాంధీజీ ప్రాణానికి ఏమైనా జరిగితే, అణగారిన కులాల భద్రత ప్రమా దంలో పడగలదని భావించిన అంబేడ్కర్ 1932, సెప్టెంబర్ 24వ తేదీన ‘పూనా ఒడంబడిక’కు ఒప్పుకున్నారు. దానివల్ల దళితులు తమ ప్రతినిధులను తాము మాత్రమే ఎన్నుకునే హక్కును కోల్పోయారు. ఈ రోజు మనం చూస్తున్న రిజర్వుడు సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన అంబేడ్కర్‌ను తీవ్రంగా కదిలించింది. ఆలోచింపజేసింది. ఫలితంగా కుల నిర్మూలన ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అంటరానివారెవరు, శూద్రులెవరు వంటి అంశాలతో పాటూ ఇంకా హిందూ మతంపైన అనేక రకాలైన అధ్యయనాలూ, బౌద్ధంపైన పరిశోధనలూ చేశారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు చెప్పండి... బాబా సాహెబ్ అంబేడ్కర్ హిందూ మతం మీదగానీ, కుల వ్యవస్థ మీదగానీ పోరాటాన్ని తీవ్రంగా పదునెక్కించడానికి ఆనాటి హిందూ పెద్దలు, ప్రత్యేకించి గాంధీ లాంటి వాళ్ళు కారణం కాదా? ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే అంబేడ్కరిస్టుల పోకడలు అర్థం అవుతాయి. (క్లిక్: భరత జాతికి ఒక ఆంగ్ల నాడి) రకరకాల కారణాలతో గత 75 సంవత్సరాల్లో 30 వేల మంది దళితులను పొట్టనపెట్టుకున్నారు. 50,000 మందికి పైగా దళిత మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారు. ఇప్పటికైనా హిందూ మత పెద్దలు తమ మతాన్ని సంస్కరించుకోకపోతే దళితులకు, కుల అణచివేతకు గురవుతున్న ఇతర బలహీన వర్గాలకు అంబేడ్కర్ 22 ప్రతిజ్ఞలు మాత్రమే మార్గం అవుతాయనడంలో సందేహం లేదు. (క్లిక్: రూపాయి విలువ తగ్గింది, ఎందుకు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
చరిత్రకు ఆనవాళ్లు.. అబ్బురపరుస్తున్న కళాఖండాలు
చుంచుపల్లి: సంప్రదాయాలకు చిహ్నాలు.. పురాతన బౌద్ద సంస్కృతులు, వారి జీవన విధానాలు.. కళాత్మకమైన కట్టడాలే కాకుండా అపురూప శిల్పాలను చెక్కడంలో వారికి వారే సాటి లాంటి బౌద్దుల నైపుణ్య సృష్టికి ఆనవాళ్లుగా నిలిచాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కారుకొండ గుట్టలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి తరువాత కొత్తగూడెం కారుకొండపై 1860లో బౌద్దులు చెక్కిన అపురూప శిల్ప సంపద నేటికీ చెక్కు చెదరలేదు. వివరాల్లోకి వెళితే.. భారత పర్యటనకు వచ్చిన టిబెట్ బౌద్ద బిక్షువులు బౌద్ద మతాన్ని ప్రచారంలో భాగంగా మధ్యమధ్యలో ధ్యానం చేసుకునేవారు. దానికి వీలుగా కొన్ని గుహలను ఏర్పరుచుకొని ఆ ప్రాంతాల్లో అపురూప కళాఖండాలను తీర్చిదిద్దేవారు. ఆ నేపధ్యంలోనే కొత్తగూడెం కారుకొండ గుట్టపైకి పర్యటనకు వచ్చిన బౌద్దులు ప్రత్యేక గుహలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న గుహల్లోనే 30 నుంచి 40 రోజుల వరకు ధ్యానంలో గడిపేవారని ఇక్కడ చరిత్ర ఆనవాళ్ళు చెపుతున్నాయి. ఆ గుట్టపైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లపై బౌద్ద శిల్పాలు చెక్కినట్లు చరిత్ర చెపుతోంది. ఒకే బండరాయిపై బుద్దుడు పద్మాసనంలో కూర్చుని ద్యానం చేస్తున్న ప్రతిమలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలనాటి బౌద్దులు చెక్కిన అపురూప శిల్పాలను చూసెందుకు చుట్టుపక్కల గ్రామస్తులు గుట్టపైకి వెళ్తుంటారు. కొన్ని దశాబ్దాలుగా వీటిని పట్టించుకోకపోవడంతో అక్కడి శిల్పాలు శిధిలావçస్థకు చేరుకోవటంతో 1986లో ప్రముఖులు, గ్రామస్తులు వీటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 2016లో బౌద్ద గుహల వ్యవహారాలను పురావస్తు శాఖకు అప్పగించింది. పురావస్తు శాఖాధికారులు కారుకొండ గుట్ట చుట్టూ ఇనుప వైరింగ్ ప్రహరీని ఏర్పాటు చేసి గుహలకు కొంత భద్రతను కల్పించారు. ప్రభుత్వం,పురావస్తుశాఖ కారుకొండ బౌద్ద గుహల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత ప్రాచుర్యంలోకి వచ్చే వీలుంది. -
ధమ్మ పథం: నాలుగు భయాలు
ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది. ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది. అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి. నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి. వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు. చదవండి: chaganti koteswara rao: బతుకుబాటకు దారిదీపం -
సముద్రం ఇచ్చే సందేశం
భగవాన్ బుద్ధుణ్ణి‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. అంటే పండితులకూ, పామరులకూ శాస్త అని. శాస్త అంటే గురువు. ఆబాలగోపాలానికీ అర్థమయ్యేట్లు చెప్పగల దిట్ట, నేర్పరి. తాత్త్విక విషయాల్ని చెప్పేటప్పుడు సరైన ఉపమానాల్ని చూపి సులభంగా అర్థమయ్యేలా చెప్పగల మహా గురువు. మనిషి పరిపూర్ణతని చెప్తూ ఆయన సముద్రాన్ని ఉపమానంగా చెప్పిన తీరు అమోఘం. ఒకనాడు బుద్ధుడు శ్రావస్తి నగరానికి తూర్పుదిక్కున విశాఖమాత నిర్మించిన పూర్వారామం లో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణతని గురించి మౌద్గల్యాయనునితో చెప్తూ ‘మౌద్గల్యా’ సముద్రానికి ఎనిమిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాగరానికున్న అద్భుత గుణాలు, అవి మనిషికీ ఉండాలి’ అన్నాడు. ‘భగవాన్! అవేమిటో తెలియజేయండి’ అన్నాడు మౌద్గల్యుడు. ‘మౌద్గల్యా! వాటిలో మొదటిది: సముద్రంలో దిగుతున్నప్పుడు ఒకేసారి లోతు రాదు. క్రమేపీ దాని లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన జ్ఞానాన్ని క్రమేపీ సాధించుకోవాలి. ఒక్కసారే వచ్చిపడాలి అనుకోకూడదు. నెమ్మదిగానే క్రమంలో జ్ఞానలోతులు చూడాలి. నేను చెప్పే జ్ఞానం కూడా అంతే! అది క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది’ అన్నాడు. ‘భగవాన్ అద్భుతం’ అన్నాడు మౌద్గల్యాయనుడు. ‘అలాగే... సముద్రం ఎంత హోరుపెట్టినా, అలలు ఎగసి పడుతున్నా, ఎప్పుడూ అది తన చెలియలికట్ట దాటదు. మన మనస్సూ అలాంటి స్థితినే కలిగి ఉండాలి. నా ధర్మం అలాంటి స్థిర చిత్తాన్ని కలిగిస్తుంది. భిక్షూ! సముద్రాన్ని పరిశీలించు. అదెప్పుడూ తనలో చనిపోయిన జీవుల్ని, కుళ్ళిన శవాల్ని ఉంచుకోదు. ఒడ్డుకు నెట్టేస్తుంది. అలాగే... నా ధర్మం కూడా మనస్సులోని చెడు తలపుల్ని నెట్టేస్తుంది. మనం కూడా చెడ్డ ఆలోచనల్ని అలా నెట్టేయాలి. ఇక నాలుగో ప్రత్యేకత... నదులన్నీ సముద్రంలోకి చేరాక వాటి పేరూ, తీరూ, ఉనికీ కోల్పోతాయి. అన్నీ ఒకటే అయిపోతాయి. మనుషులు కూడా జాతి, మత, కుల ప్రాంతీయ భేదాలు మరచి ఒక్కటై పోవాలి. నా ధర్మం అలాంటి సమసమాజాన్ని నిర్మిస్తుంది. ‘‘ఓ భిక్షూ! ఎన్ని నదులు వచ్చి కలసినా, ఎంతెంత వర్ష కుంభవృష్టి కురిసినా సముద్రం రవ్వంత పెరగదు. మనలో ప్రజ్ఞ కూడా అలాగే ఉండాలి. నా ధర్మంలో ఎందరు నిర్వాణం పొందినా అది ఎప్పటికీ నిండిపోదు. నిర్వాణం పొందేవారికి ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇక సముద్రానికి ఉన్న మరో విశేషం విను, ఎక్కడైనా సముద్రానికి ఒకే రుచి ఉంటుంది. అలాగే నా ధర్మంతో కలిగే ధర్మరుచి కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. మౌద్గల్యా! మణులకూ, రత్నాలకూ, పగడాలకూ, శంఖులకూ సముద్రం నిలయం. ప్రతి మనిషీ అలాంటి సుగుణాల్ని తనలో నింపుకోవాలి. నా ధర్మంలోని పంచశీల, అష్టాంగ మార్గం దశపారమితులు, ఆర్యసత్యాలు అలాంటి మణులే! ఇక సముద్రానికున్న మరో విశేషగుణం– దాపరికం లేని తత్వం. మన మనస్సు అలాగే ఉండాలి. దాపరికం ఉన్నవాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. నా ధర్మం కూడా మనిషిని, మనస్సుని అలా నిష్కల్మషం చేస్తుంది. ఈ ఎనిమిది విశేషణాల్ని మనం సముద్రంనుండి నేర్చుకోవాలి. మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. మౌద్గల్యాయనా!’’ అన్నాడు బుద్ధుడు. ‘‘అద్భుతం, అమోషం, అద్వితీయం... భంతే!’’ అంటూ మౌద్గల్యాయనుడు బుద్ధునికి ప్రణమిల్లాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
‘అప్పుడే నేను మరణించాను’
బీజింగ్: కోవిడ్ మహమ్మారి విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. ఎన్నో కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది మహమ్మారి. నేటికి కూడా చాలా మంది ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. ప్రేమించిన వారు దూరమవ్వడంతో వారిని మర్చిపోలేక.. ఒంటరిగా బతకలేక నరకం అనుభవిస్తున్నారు. వుహాన్ వాసి లియు పే తండ్రి కరోనా బారిన పడి మరణించాడు. తండ్రి చనిపోయిన నాటి నుంచి అతడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లు లియు పేతో కలిసిన తిరిగిన స్నేహితులు, బంధువులు ప్రస్తుతం అతడిని తప్పించుకుతిరుగుతున్నారు. కారణం అతడి తండ్రి కరోనాతో చనిపోవడంతో.. లియుని కలవడం.. ఇంటికి ఆహ్వానించడం వంటివి చేస్తే.. తమకి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందనే అనుమానంతో వారు లియుకి దూరంగా ఉంటున్నారు. తండ్రి దూరమయ్యాడు.. బంధువులు, స్నేహితులు ఆదరించడం లేదు. దాంతో జీవితం పట్ల ఒక లాంటి నిర్లిప్తత భావం ఏర్పరుచుకున్నాడు లియు. ఇన్నాళ్ల నుంచి తాను చేస్తోన్న వ్యాపారాన్ని వదులుకున్నాడు. బుద్ధిజంలోకి మారాలని భావిస్తున్నాడు. కరోనా వైరస్ విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. మహమ్మారి వ్యాప్తి వుహాన్ నుంచి ప్రారంభమైంది. అయితే మొదట చైనా అధికారులు వైరస్ గురించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యమైనది ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తిస్తుందనే విషయాన్ని దాచి పెట్టారు. దాంతో వుహాన్ వ్యప్తంగా దాదాపు 4 వేల మంది కోవిడ్ బారిన పడి మరణించారు. లియు పే తండ్రి కూడా కరోనా వైరస్ బారిన పడి చనిపోయాడు. లియు పే తండ్రి లియు ఓకింగ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కరోనా వైరస్‌గా నిర్థారించారు. అయితే మొదట్లో మహమ్మారి తీవ్రత గురించి తెలియకపోవడంతో.. ప్రభుత్వ సిబ్బంది.. ఆస్పత్రి యాజమాన్యం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ ఏడాది జనవరి 29న అతడు మరణించాడు. అదే రోజున తాను మరణించానంటున్నాడు లియు పే. ఇక తండ్రి మరణం తర్వాత తాను పిచ్చివాడిగా మారిపోయానన్నాడు. వైరస్ గురించి ప్రభుత్వం దాచి పెట్టడం వల్లే తాను తండ్రితో పాటు జీవితాన్ని కోల్పోయానని ఆవేదనం వ్యక్తం చేస్తున్నాడు. చైనా ప్రభుత్వం మీద తనకు ఎంతో కోపంగా ఉండేదని.. ఒకానొక సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావించానని తెలిపాడు లియు. (చదవండి: కరోనాపై చైనా మరో కథ) లియు పేతో పాటు చాలా మంది వుహాన్ వాసులు సోషల్ మీడియా వేదికగా జిన్ పింగ్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల తాము కుటుంబ సభ్యులను కోల్పోయి నరకం అనుభవిస్తున్నామని ఆరోపించారు. ఇక తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన లియు పే.. తన బాధను ఎవరు పట్టించుకోరు అని అర్థం చేసుకున్న తర్వాత తన కోపాన్ని బౌద్ధ మతం వైపు మళ్లించాడు. మందు, మాంసం, ఆల్కహాల్‌ను వదిలేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంతో తనకున్న సంబంధాలన్నింటిని తెంచుకున్నాడు. వ్యాపారన్ని కూడా త్యజించి.. బౌద్ధంలోకి మారాడు. ఇప్పడతని దృష్టిలో డబ్బుకి ఏ మాత్రం విలువలేదు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న లియు జీవిత రహస్యం తెలుసుకునే పనిలో ఉన్నాడు. (చదవండి: యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది బలి) ఇక ప్రస్తుతం వుహాన్‌లో కరోనా కేసులు ఏవి వెలుగు చూడనప్పటికి జనాల్లో మాత్రం భయం పోవడం లేదు. గతంలో వైరస్ బారిన పడి.. కోలుకున్న వారితో మాట్లాడాలంటే సందేహిస్తున్నారు జనాలు. వారితో కలవడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే వివాదాలు తలెత్తుతున్నాయి. వుహాన్‌కు చెందిన 36 ఏళ్ల యువతి తన తండ్రిని కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతుంది. ఇక వైరస్ గురించి.. చైనా ప్రభుత్వం దాన్ని కప్పిపెట్టిన విధానం గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. బంధువులు, స్నేహితులు తనను దూరం పెట్టారనివాపోయింది. ‘జీవితం కొనసాగుతుంది.. కానీ అది మిగిల్చిన గాయాల తడి అలానే ఉంటుంది’. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
హథ్రాస్ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి
లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల బాధితురాలి సామాజిక వర్గం(వాల్మీకి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో ఆ వర్గానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకి వర్గానికి చెందిన 236 మంది ప్రజలందరు బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు. హథ్రాస్ సంఘటనతో తాము బాధపడ్డామని, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ, నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని కుటుంబాలు ఆరోపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. దీనిలో రాజరత్న అంబేద్కర్, వాల్మీకి వర్గ ప్రజలను బౌద్ధమతంలోకి ప్రవేశపెట్టడాన్ని చూడవచ్చు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధృవీకరణ పత్రం కూడా పొందారు. (చదవండి: హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..) బౌద్ధమతంలోకి వెళ్ళిన ప్రజలలో ఒకరైన బిర్ సింగ్ మాట్లాడుతూ, “మా గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన 236 మంది మహిళలు, పిల్లలతో సహా బౌద్ధమతంలోకి మారాము. దీనికి ఎటువంటి ఫీజు తీసుకోలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత, సామాజిక సేవ వంటి మంచి కార్యకలాపాలను చేపట్టాలని మాకు బోధించారు" అని తెలిపారు. ఇక సెప్టెంబర్ 14 న, హథ్రాస్‌లోని బుల్గాది గ్రామంలో వాల్మీకి వర్గానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో ఆగ్రహం చెలరేగింది. ఈ సంఘటన తరువాత, వాల్మీకి సమాజ్ నిరసన వ్యక్తం చేసి వివిధ ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. నలుగురు నిందితులను అలీగఢ్ జైలులో ఉంచారు. -
50 చారిత్రక ప్రాంతాల అభివృద్ధి
నాగార్జునసాగర్: బౌద్ధమతవ్యాప్తికి తోడ్పడిన తెలంగాణలోని నాగార్జునసాగర్ తీరాన ప్రపంచ బౌద్ధమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుద్ధజయంతిని పురస్కరించుకుని శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలో గల మహాçస్తూప ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగర్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల శిక్షణకార్యక్రమం సందర్భంగా శ్రీపర్వతారామాన్ని సందర్శించారని, ఆయన అప్పటికప్పుడు రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం మరో 50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మరో వందకోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చి రాష్ట్రంలోని 50 చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన శ్రీలంకవాసులు ఏర్పాటు చేసిన బుద్ధుని పాదాల చెంత పుష్పగుఛ్చాలు ఉంచారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక పార్లమెంటు సభ్యుడు వెన్.అతురల్యేరతన్‌తెరో, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ నిర్మాణాలు అద్భుతం..
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రముఖ బౌద్ధక్షేత్రమైన నాగార్జునకొండను గురువారం పలు దేశాలకు చెందిన బౌద్ధమత ప్రతినిధులు, గురువులు సందర్శించారు. వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ జగన్నాథరావు, టూరిజం విభాగం జీఎం జోయెల్, జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రత్యేకా«ధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు బౌద్ధమత సంబంధ దేశాల గురువులు సాగర్ జలాశయతీరంలో 275 ఎకరాలలో నిర్మాణాలు జరుగుతున్న శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని సందర్శించేందుకు వచ్చారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న 215 మంది తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఆరు బస్సులు, ఇతర వాహనాల్లో నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. వీరు హిల్‌కాలనీలో బుద్ధవనంలోని మహాస్థూపం, జాతకకథల పార్కులు, ప్రపంచంలోని వివిధ బౌద్ధ క్షేత్రాల్లో వెలుగు చూసిన స్థూపాల నమూనాలను ఆసక్తితో తిలకించారు. విజయవిహార్‌లో అధికారులు తెలంగాణలోని బౌద్ధ ప్రాంతాల చరిత్రను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. అనంతరం హిల్‌కాలనీలోని లాంచీస్టేషన్ నుంచి ప్రత్యేక లాంచీలలో నాగార్జునకొండకు చేరుకున్నారు. అక్కడి మ్యూజియంలోని బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు, సింహళవిహార్, అశ్వమేధ యాగశాలను తిలకించారు. దలైలామా నాటిన బోధివృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆర్కియాలజి విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ సుశాంత్‌కుమార్, మరో అధికారి సత్యనారాయణలు గైడ్‌గా వ్యవహరించారు. కొండను సందర్శించిన బౌద్ధ ప్రతినిధుల బృందంలో తైవాన్‌కు చెందిన బౌద్ధమత గురువు షిషిన్టింగ్తోపాటు తైవాన్‌కు చెందిన 129 మంది, మలేషియాకు చెందిన 27 మంది, హాంగ్‌కాంగ్‌కు చెందిన 43 మంది, అమెరికా కు చెందిన ముగ్గురు, ఇండోనేషియా, థాయిలాండ్, ఇంగ్లండ్, సింగపూర్, చైనాతోపాటు మన దేశానికి చెందిన ఒక్కొక్కరు చొప్పున బౌద్ధ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరి వెంట నాగార్జునకొండ మ్యూ జియం క్యూరేటర్ సాయికృష్ణ, రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు, నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, సాగర్, పెద్దవూర ఎస్ఐలు సీనయ్య, రాజు ఉన్నారు. అద్భుత నిర్మాణాలు.. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని, అంతా పూర్తయితే ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలన్నీ సందర్శించినట్లుగా ఉంటుందని మలేషియాకు చెందిన బౌద్ధ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా, ఇక్కడ తమ దేశానికి చెందిన సంస్థ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని, తైవాన్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే ఒకసారి మతగురువులు వచ్చి స్థల పరిశీలన చేశారని వెల్లడించారు. బుద్ధవనంలో పరిశోధన కేంద్రం శ్రీపర్వతారామంలోని బుద్ధవనంలో పరి శోధన కేంద్రం ఏర్పాటుకు తైవాన్ సంస్థ ముం దుకు వచ్చినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సాగర్‌లోని శ్రీపర్వతారామంలో ఆరా మాలు, యూనివర్సిటీ, అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు వివిధ సంస్థలను ఆహ్వానించేందుకు గతేడాది బౌద్ధమతాన్ని ఆచరించే పలు దేశాలకు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య వెళ్లి వచ్చారు. అక్కడ పలు సంస్థలను కలసి బుద్ధవనం ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ ఏడాది మొదట్లో తైవాన్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులు వచ్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకుస్థల పరిశీలన చేసి వెళ్లారు. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఇప్పుడు మరోమారు సందర్శనకు వ చ్చినట్లు పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు. -
మనోసాధన
మనిషి చేసే కర్మలన్నింటికీ కారకం, ప్రేరకం మనస్సే. అయితే, అది అతి చంచలం. దాన్ని అదుపు చేయడానికి, పొదుపుగా వాడుకోవడానికి, మంచిగా తీర్చిదిద్దుకోవడానికి చాలా సాధన కావాలి. ఆ సాధనే బౌద్ధంలోని అష్టాంగమార్గం. మనస్సుకు ఎలా సాధన ఇవ్వాలి? అని బుద్ధుని అడిగాడు కేశి అనే వ్యక్తి. కేశి మంచి గుర్రపు రౌతు. అప్పుడు బుద్ధుడు ‘‘కేశీ! నీవు మంచి గుర్రపు రౌతువు కదా! నీవు నీ గుర్రాన్ని ఎలా మచ్చిక చేస్తావు?’’ అని అడిగాడు. ‘‘భగవాన్! నేను ముందు చాలా మృదువుగా శిక్షణ ఇస్తాను’’ అన్నాడు కేశి. ‘‘మరి ఎన్నిసార్లు మృదువుగా చెప్పినప్పటికీ వినకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్! అప్పుడు కఠినంగానే శిక్షణ ఇస్తాను. మళ్లీ మళ్లీ చేయిస్తాను’’ ‘‘నీవు ఎంత శిక్షణ ఇచ్చినా అది నీ దారికి రాకపోతే ఏం చేస్తావు?’’ ‘‘భగవాన్! చంపి వంటశాలకు పంపుతాను’’ ‘‘కేశీ! నేను కూడా అంతే! మనిషినిలోని మనస్సుకు శిక్షణ ఇస్తాను. నా దగ్గరకు వచ్చిన వారి మనసుల్ని అకుశలాల నుండి కుశలంవైపు మళ్లేలా చేస్తాను. నా శిక్షణ ఎప్పుడూ ఎప్పుడూ మృదువుగానే ఉంటుంది. కొందరి మనస్సు కరడు గట్టి ఉంటుంది. అలాంటి మనస్సుకు కాస్త కఠినంగానే శిక్షణ ఇస్తాను. ఇక ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా వినని వారిని నీవు గుర్రాన్ని చంపినట్లు మాత్రం చంపను. నా ధర్మంలో, నా మార్గంలో హింసకు తావులేదు. పదే పదే ప్రయత్నిస్తాను’’ ‘‘కేశీ! మనం మనస్సును రౌతు గుర్రాన్ని అదుపులో ఉంచేట్టు అదుపులోనే ఉంచుకోవాలి. నీవు గుర్రాన్ని దారిలోకి తెచ్చుకోడానికి ఎలా శిక్షణ ఇచ్చావో, సాధన చేశావో, నీ మనస్సు విషయంలో కూడా అలాగే సాధన చేయి’’ అని చెప్పాడు. కేశి ఆ మార్గాన్ని పాటించి, అతి తక్కువ సమయంలో మనోసాధనలో మేటిగా నిలిచాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
అయోధ్య వివాదంలో కొత్త మలుపు
చరిత్రను తవ్వడం, అన్వేషించడం, అందులో ఏది లభ్యమైనా జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి. ఏ సంస్థకో, మతానికో దానిమీద గుత్తాధిపత్యం ఉండకూడదు. మత విశ్వాసాలు, రాజకీయ ఎత్తుగడలు, వారి వారి ప్రయోజనాలు బాబరీ మసీదు సమస్యకు పరిష్కారం కావు. అట్లాగైతే చాలా మతాలకు చెందిన ప్రార్థనాలయాలు వేరే మతాల, సంస్థల పునాదులమీద నిర్మాణమై ఉన్నవేనన్న సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. కూలగొట్టడం, తిరిగి నిర్మించడం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. శాంతి సామరస్యం, ప్రేమ, కరుణల పుట్టినిల్లుగా భాసిల్లుతోన్న ఈ దేశంలో హింసకు తావుండకూడదు. ప్రజలు సృష్టించిన చరిత్రనీ, సంస్కృతినీ ప్రజలపరం చేయాలి. ‘‘అయోధ్యలో దాదాపు వంద బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. అందులో 3000 మందికి పైగా బౌద్ధబిక్కులు కార్యకలాపాలు నిర్వ హిస్తున్నారు. వారు మహాయాన, హీనయాన మార్గా లకు సంబం«ధించిన ఎన్నో విషయాలను నేర్చుకుం టున్నారు. ఈ నగరంలో పురాతన బౌద్ధారామం ఉంది. ఇందులో బౌద్ధ తాత్వికులలో ప్రముఖుడైన వసుబంధు ప్రసంగించేవారు. అనేక అంశాలపై అధ్యయనాలను కొనసాగించారు. అంతేకాకుండా ఎన్నో గ్రంథాలను ఆయన ఇక్కడే రచించారు’’ అని చైనా బౌద్ధ యాత్రికుడూ, చరిత్రకారుడూ అయిన హుయాన్‌త్సాంగ్ తన యాత్ర డైరీలో పేర్కొన్నారు. క్రీస్తు శకం 629 నుంచి 645 వరకు ఆయన భారత దేశంలో పర్యటించారు. అంతకుముందు కూడా చైనాకి చెందిన పాహియాన్ భారతదేశంలోని అనేక బౌద్ధ ప్రదేశాలను సందర్శించారు. ఆయన సైతం తన డైరీలో కోసల రాజ్యం గురించీ, అందులో ఉన్న శ్రావస్తి, సాకేత పట్టణాలను గురించీ ప్రస్తావించడం మనం గమనించవచ్చు. అయోధ్యకు మరో పేరు సాకేతనగరమని చరిత్రకారులు నిర్ధారించారు. కోసల రాజ్యం బుద్ధుడి తాత్వికతను అందిపుచ్చుకు న్నట్టు బౌద్ధగ్రంథాలు చెపుతున్నాయి. గౌతమ బుద్ధుడు కోసల రాజ్యంలో ఎక్కువ సమయాన్ని గడి పినట్టు కూడా ఆ గ్రంథాల ప్రస్తావనవల్ల తెలుస్తు న్నది. వీటన్నింటి రీత్యా కోసల రాజ్యంలోని సాకేత (అయోధ్య) పట్టణం బౌద్ధం విస్తరణలో, బౌద్ధ భావ నల సంరక్షణలో కీలకపాత్ర పోషించింది. సరిగ్గా ఇదే విషయం బాబ్రీమసీదు వివాదం కొత్త మలుపునకు దారితీస్తున్నదనడానికి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత నెల 23వ తేదీన వినీత్ కుమా ర్మౌర్య దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. అయోధ్యలో ప్రస్తుత వివాదాస్పద స్థలంలో బౌద్ధ ఆరామం ఉండేదని, దానిని పరి రక్షించి, చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని వినీత్ కుమార్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. వినీత్ కుమార్ మౌర్య ఫైజాబాద్ జిల్లా కజియానాకు చెంది నవాడు. గతంలో లక్నో హైకోర్టులో ఈ విషయమై విచారణ జరుగుతున్న సమయంలో కూడా కొన్ని బౌద్ధ సంఘాలు, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశ యాల వెలుగులో పనిచేస్తున్న కొన్ని సంస్థలు కూడా పిటిషన్లు సమర్పించాయి. వీటిని ఆనాడు పరిగణన లోనికి తీసుకోలేదు. వినీత్ కుమార్ పట్టుదల పరి శోధనల ఆధారంగా ఒక సమగ్రమైన పిటిషన్‌ను తయారుచేసి దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను ఈ విచారణలో భాగం చేసింది. ఇది ఈ రోజు చరిత్ర మరుగున పడిన ఒక ముఖ్యౖ మెన అంశాన్ని బహిర్గతం చేసేందుకు తోడ్పడుతుం దని చాలామంది ఎదురుచూస్తున్నారు. వినీత్ కుమార్ సమర్పించిన పిటిషన్లో ఒక చరిత్ర క్రమం మనకు దర్శనమిస్తుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఎక్కువ కాలం కోసల దేశంలోని శ్రావస్తిలో, సాకేతలో గడిపిన ట్టు ఆయన తన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. చైనా బౌద్ధ యాత్రికులు పాహియాన్, హుయాన్ త్సాంగ్‌లు రాసిన డైరీలలో కూడా ఈ విషయాలు న్నాయి. ఈ విషయాలన్నీ ముందుగా చైనా భాషలో లిఖతమైనాయి. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువాదం జరిగింది. పాహియాన్ రాసిన ‘‘ఎ రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్’’ అనే పుస్తకంలోని 20వ అధ్యా యంలో ఈ విషయాలున్నాయి. ఆయన తన ప్రయా ణంలో కోసలను సందర్శించినట్టు, అక్కడ బౌద్ధం గొప్పతనాన్ని చూసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా హుయాన్‌త్సాంగ్ రాసిన ‘‘బుద్ధిస్ట్ రికార్డ్ ఆఫ్ ద వెస్టర్న్ వరల్డ్’’లోని అయోధ్య అనే అధ్యాయంలో కూడా చాలా వివరాలున్నాయి. అయోధ్యలోని ఒక పెద్ద బౌద్ధ ఆరామం పక్కన పడిపోయిన గోడలు కనిపించాయనీ, అవి వసుబంధు నివసించిన స్థల మని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయోధ్య పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో అశో కుడు నిర్మించిన 200 అడుగుల స్తూపమున్నదని కూడా అందులో ఉదహరించారు. ఈ స్తూపం నిర్మిం చిన చోటనే గౌతమ బుద్ధుడు ఏడు రోజుల పాటు తన బోధనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళా డనీ, అందుకు గుర్తుగానే అశోకుడు ఈ స్తూపాన్ని సైతం నిర్మించారనీ ఆయన పేర్కొన్నాడు. అదే విధంగా సంఘారామానికి రెండు న్నర కిలోమీటర్ల దూరంలో తథాగత గౌతమబుద్ధుని అస్థికలతో నిర్మిం చిన స్తూపమున్నది. ఆరామానికి వాయవ్యంలో బుద్ధుని అస్థికలతో మరొక స్తూపం నిర్మాణం జరిగి నట్టు, దాని ఆనవాళ్ళను సైతం హుయాన్‌త్సాంగ్ కనుగొనడం విశేషం. అదే దిశలో మరొక బోధనా సమావేశ మందిరం ఉన్నట్టు కూడా ఆయన తన పుస్త కంలో పేర్కొన్నారు. ఇలా ఒకటేమిటి.. అయోధ్యలో నడ యాడిన బుద్ధుడి ఆనవాళ్ళెన్నింటినో పట్టిఇ చ్చిన ఘనత హుయాన్త్సాంగ్కే దక్కుతుంది. పాహియాన్, హుయాన్‌త్సాంగ్ డైరీల్లోని చారి త్రక విషయాల ఆధారంగా బ్రిటిష్ పురాతత్వ శాస్త్ర వేత్త కన్నింగ్‌హామ్ చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. అయోధ్యలో కూడా బౌద్ధ అవశేషాలున్నాయని కన్నింగ్‌హామ్ తన పరి శోధనలో తేల్చారు. 1862–63లో జరిగిన ఈ సర్వే తర్వాత మళ్ళీ 1889–1891 కాలంలో మరో అధ్య యనానికి కన్నింగ్‌హామ్ నడుంకట్టారు. అప్పుడు సైతం అదే నిర్ధారణకు వచ్చారు. మరో పురాతత్వ శాస్త్రవేత్త ఎ.కె.నారాయణ్ చేసిన సర్వే కూడా వీటినే ధ్రువపరిచింది. అంతే కాకుండా, బాబ్రీమసీదు వివా దాస్పద స్థలంలో లభించిన 14 స్తంభాలను బౌద్ధాన్ని ఆదరించి, ఆచరించిన, బుద్ధుడి అనుయాయులైన రాజులు నిర్మించినట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ స్థలంలో దొరికిన మరొక శిల్పం ఈ వాదనలను బలపరు స్తున్నది. అయోధ్యపైన ఎ.ఘోష్ సంపాదకత్వం వహిం చిన ‘‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ ఆర్కియా లజీ’’ పదకొండవ సంపుటిలో కూడా బౌద్ధ, జైన గ్రంథాల నుంచి ప్రస్తావనలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన తవ్వకాల్లో రాముడికి గానీ, హిందూ దేవాల యాలకు కానీ సంబంధించిన ఎటువంటి ఆధా రాలూ లభించలేదని పిటిషనర్ వినీత్ కుమార్ చాలా స్పష్టంగానే పేర్కొన్నారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను అలహాబాద్, లక్నో హైకోర్టు బెంచ్‌లు విస్మరించాయని కూడా వినీత్ పిటిషన్లో పేర్కొ న్నారు. సారనాథ్, కుషీనగర్, కపిలవస్తు, శ్రావస్తి లాగా వివాదాస్పదమైన స్థలాన్ని బౌద్ధవిహార్గా ప్రకటించి, పరిరక్షించాలని వినీత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బౌద్ధతాత్వికత దీనిని ధ్వంసం చేసి, మరొక దానిని ఆక్రమించుకోవాలని భావించలేదని, ఇప్పుడు కూడా అక్కడ బౌద్ధ విహారాన్ని నిర్మించా లని తాము కోరడం లేదనీ, దానిని పరిరక్షించాలని మాత్రమే కోర్టును అభ్యర్థిస్తున్నామని, వినీత్ ఫోన్ సంభాషణలో వెల్లడించారు. అదేవిధంగా ఆ స్థలాన్ని ఎవరో ఒకరికి కేటాయించడం వల్ల వైషమ్యాలు పెరి గిపోయి, హింస ప్రజ్వరిల్లగలదని, దానిని నివారించ డానికి చారిత్రక ఆధారాలను మాత్రమే సత్యాలుగా స్వీకరించాలని ఆయన కోరుతున్నారు. ఇదే సంవత్సరం జనవరిలో ‘సాక్షి’ ఎడిటోరి యల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితో పాటు ఇంకా ఇద్దరు మిత్రులతో కలిసి నేపాల్‌లోని బుద్ధుని జన్మ స్థలమైన లుంబిని, ఆయన మహాపరినిర్వాణం పొందిన కుషినగర్తో సహా అయోధ్యలోని వివాదా స్పద స్థలాన్ని చూసే అవకాశం ఈ రచయితకు వచ్చింది. లుంబిని, కుషీనగర్లలో జరిగిన సంపూర్ణ తవ్వకాలవల్ల ఎన్నో చారిత్రక అవశేషాలు బయట పడ్డాయి. కానీ ఈ స్థలం 1885 నుంచి వివాదంలో ఉండటం వల్ల పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహించలేకపోయారు. దానివల్ల చరిత్ర భూగ ర్భంలోనే నిక్షిప్తమై ఉన్నది. ఈ వివాదంపై మహంత్ రఘుబర్ దాస్ ఫైజాబాద్ సబ్ జడ్జి కోర్టులో పిటిషన్ వేస్తూ, ఆ ప్రాంతంలో దేవాలయాలు కడతామని కోరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వివాదం సమసి పోలేదు. క్రీ.శ.ఏడవ శతాబ్దంలో భారత ఉపఖండం మొత్తం పర్యటించిన హుయాన్‌త్సాంగ్ పేర్కొన్న అయోధ్య విశేషాల ఆధారంగా తవ్వకాలు నిర్వహిస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేరుగా తవ్వకాలు చేయాల్సిన అవ సరంలేదు. హైదరాబాద్‌లోని ఎన్.జి.ఆర్.ఐ. లాంటి సంస్థలు తవ్వకాలు జరపకుండానే భూమిలోపల ఉన్న కట్టడాలు, నిర్మాణాల స్వరూపాలను కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పటికే పాహియాన్, హుయాన్‌త్సాంగ్ యాత్రలు, బౌద్ధ సాహిత్యంలోని పాళీగ్రంథాలు, కొన్ని సంస్కృత పుస్తకాలు, కన్నింగ్‌హామ్, కార్నైజ్, నారాయణ్‌లాంటి పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ విష యంలో మార్గనిర్దేశనం చేశారు. అటువంటి ఆధా రాల పునాదిగా చేసుకొని భారతదేశంలోని వారే కాకుండా, ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన పురాత త్వశాస్త్రవేత్తలతో ఒక కమిటీ వేసి, తవ్వకాలు జరిపిం చడం మంచిదేమో ఆలోచించాలి. దీనికి చరిత్రను తవ్వడం, అన్వేషించడం, అందులో ఏది లభ్యమైనా జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించడం జర గాలి. ఏ సంస్థకో, మతానికో దానిమీద గుత్తాధి పత్యం ఉండకూడదు. బాబరీ మసీదు వివాదానికి ఇది మాత్రమే పరిష్కారం. దీనికి మత విశ్వాసాలు, రాజకీయ ఎత్తుగడలు, ప్రయోజనాలు పరిష్కారం కావు. కూలగొట్టడం, నూతన కట్టడాలు తేవడం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. శాంతి, సామ రస్యం, ప్రేమ, కరుణ పుట్టిన ఈ దేశంలో హింసకు తావుండకుండా, కలహాలకు స్థానం లేకుండా ప్రజలు సృష్టించిన చరిత్రనీ, సంస్కృతినీ, వారసత్వ సంప దనూ ప్రజలపరం చేయాలి. వారికే వాటిపైన సర్వ హక్కులూ ఉండాలి. మల్లెపల్లి లక్ష్మయ్య(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ : 97055 66213 -
నెరవేరిన ప్రణబ్, ఆర్ఎస్ఎస్ లక్ష్యం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తన కార్యాలయానికి ఆహ్వానించడం ద్వారా.. తాను అనుకున్న లక్ష్యాన్ని ఆర్ఎస్ఎస్ సాధించింది. ఆది నుంచి వివాదాస్పదమైన ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా అనుకున్నట్లుగానే వీలైనంత ప్రచారం పొందింది. ఇక ప్రణబ్ ముఖర్జీ కూడా తెలివిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నొప్పించక.. తానొవ్వక అన్న రీతిలో బయటపెట్టడంలో విజయం సాధించారు. పైకి చెప్పకపోయినా.. ప్రణబ్ ప్రసంగం ఆర్ఎస్ఎస్ పెద్దలకు అంతగా రుచించనట్లే కనిపించింది. ఏ సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సంస్థ.. దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని తెలివిగా మనసులో మాటను ప్రణబ్ వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ భావజాలం క్షుణ్నంగా తెలిసిన ప్రణబ్.. దానిని పరోక్షంగా విమర్శించేందుకు నెహ్రూ సోషలిజంను చాటిచెప్పే ప్రయత్నం చేశారు. బౌద్ధం ఆవిర్భావం నుంచి ఎంత విధ్వంసం జరిగినా దేశం చెక్కుచెదరకుండా ఎలా కొనసాగిందో ప్రణబ్ చాటి చెప్పారు. సాంస్కృతిక ఐక్యమత్యంపై సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన అంశాల్ని ప్రస్తావించిన ప్రణబ్.. అదే సమయంలో నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ప్రస్తావిస్తూ జాతీయవాదం, దేశభక్తికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పటిలానే తన సొంత ధోరణిలో ప్రణబ్ ప్రసంగం కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని రాజకీయ పునరావాసంగా వాడుకునేందుకు ప్రణబ్ ఏమాత్రం ప్రయత్నించలేదన్న విషయం ఆయన ప్రసంగంతో స్పష్టమైంది. గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ హుందాగావ్యవహరించారు. కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ గతంలో ఐదుగురు భారత రాష్ట్రపతులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరైనా.. ఈ స్థాయిలో ఎన్నడూ ప్రచారం లభించలేదు. ఈ కార్యక్రమ ప్రచార బాధ్యతలు మొత్తం కాంగ్రెస్ పార్టీనే తీసుకుంది. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ప్రణబ్ హాజరుపై ఆ పార్టీ అతిగా స్పందించిందని విమర్శలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించకపోయినా.. ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో పాటు పలువురు సీనియర్ నేతలతో విమర్శలు చేయించింది. సొంత చరిత్రను గుర్తుచేయాల్సింది: లెఫ్ట్ న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ విషయమై సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ..‘ఆరెస్సెస్ ప్రధానకార్యాలయంలో ప్రణబ్ ఇచ్చిన ప్రసంగంలో మహత్మాగాంధీ హత్య వివరాలు అదృశ్యమయ్యాయి. గాంధీ హత్య అనంతరం అప్పటి హోంమంత్రి పటేల్ అరెస్సెస్‌పై నిషేధం విధించడం, బాపూ హత్యతో అప్పటి ఆరెస్సెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడం.. ఇలాంటి సొంత చరిత్రను ఆరెస్సెస్‌కు ఈ భేటీలో ప్రణబ్ మరింత గట్టిగా గుర్తుచేయాల్సింది’ అని ట్వీట్ చేశారు. కాగా తాము ఊహించినట్లే ప్రణబ్ మాట్లాడారనీ, ఏదేమైనా అయన ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సింది కాదని సీపీఐ వ్యాఖ్యానించింది. -
దేవాలయంపై దావా వేసిన సన్యాసి
టోక్యో : బలవంతంగా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఏకంగా దేవాలయంపైనే దావా వేశాడో బౌద్ధ సన్యాసి. ఈ ఉదంతం జపాన్‌లోని టోక్యోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని మౌంట్కోయ మీద ఉన్న కోయాసన్ ఆలయం బౌద్ధులకు ప్రముఖమైంది. ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూవుంటారు. సన్యాసులుగా శిక్షణ పొందటానికి వచ్చిన వారు శిక్షణలో భాగంగా అక్కడ సేవ చేయాల్సి ఉంటుంది. శిక్షణా సమయాన్ని మించి ఎక్కువ సేపు పని చేయించారని సన్యాసి తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. కొన్నిసార్లు ఒక రోజులో 17 గంటల కంటే ఎక్కువ సమయం అతనితో పని చేయించారని పేర్కొన్నారు. సెలవు దినాల్లో కూడా తనతో ఎక్కువ సమయం పని చేయిస్తున్నారన్న కారణంగా అక్కడి కార్మిక సంఘం మద్దతు కూడగట్టుకున్నాడు సదరు సన్యాసి. బలవంతంగా తనతో ఎక్కువ పని చేయించినందుకు పరిహారంగా 70 వేల డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు శ్రమ జపాన్‌లో ప్రధాన సమస్యగా మారింది. 2017లో అదనపు శ్రమ కారణంగా 191 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. షింజో అబే ప్రభుత్వం అదనపు శ్రమను నివారించడానకి తగిన చర్యలు తీసుకున్నా అవి క్షేత్ర స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
వారికి బౌద్ధం శరణం గచ్చామి!
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్‌లోని ఉనా పట్టణంలో 2016, జూలై నెలలో గోసంరక్షుకుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఏడుగురు దళితులు, వారితోపాటు మూడువందల మంది ఇతర దళితులు ఆదివారం నాడు బౌద్ధమతం స్వీకరించారు. మోటా సమాధియాల గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ కుల రహిత బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ ఈ దళిత కుటుంబాలు అగ్రవర్ణాలు ఎక్కడ, ఎప్పుడు దాడిచేస్తాయోమోనని భయాందోళనలకు గురవుతున్నాయి. 2016, జూలైలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న రమేశ్ సర్వయ్య మీడియాతో మాట్లాడుతూ నాడు తమ ఏడుగురిపై దాడిచేసిన వారిలో ఒకరు ఏప్రిల్ 25వ తేదీన మళ్లీ తమలో ఇద్దరిపై దాడి చేశారని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన నుంచి ఇంతవరకు తమ కుటుంబాలపై కూడా మూడుసార్లు దాడులు చేసి బెదిరించారని ఆయన వివరించారు. 2016, జూలై 11వ తేదీన ఉనా పట్టణంలో చనిపోయిన ఆవు మాంసాన్ని ఒలుస్తాన్నారన్న కారణంగా రమేశ్ సర్వయ్య కుటుంబంలోని ఏడుగురు సభ్యులపై దర్బార్ అనే అగ్ర కులానికి చెందిన 40 మంది దాడి చేశారు. సర్వయ్య నలుగురు సోదరులను బట్టలిప్పించి ఇనుప రాడ్లతో కొట్టారు. మరో ముగ్గురిని జీపుకు కట్టి లాక్కుపోయారు. వారి ఒల్లంత హూనమై స్పహతప్పి పడిపోయిన సందర్భంలో వారిని ఒదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించడంతో 43 మంది నిందితులపై పోలీసులు కేసు పెట్టారు. వారిలో 35 మంది బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో విచారణే ప్రారంభంకాలేదు. ఇక తమను ఎప్పటికి హిందువులు తమ వారిగా గుర్తించరని, వారి నుంచి రక్షణ కూడా లేదని గ్రహించే ఇప్పుడు బౌద్ధం పుచ్చుకున్నట్లు సర్వయ్య వివరించారు. 2016 సంఘటన జరిగిన నాటి నుంచి దాదాపు 60 వేల మంది దళితులు దేశంలో బౌద్ధం స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ర్యాలీలు కూడా నిర్వహించారు. వివిధ కారణాల వల్ల అంత మంది బౌద్ధంలోకి వెళ్లలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఐదున్నర వేల మంది బౌద్ధ మతం స్వీకరించారు. -
అంబేడ్కర్ మతం మార్చిన బౌద్ధ సన్యాసి మృతి
లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ బౌద్ధ మతం స్వీకరించిన కార్యక్రమాన్ని నిర్వహించిన బౌద్ధ సన్యాసి ప్రజ్ఞానంద్ కన్ను మూశారు. 90 ఏళ్ల ప్రజ్ఞానంద్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇక్కడి కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మదుమేహం, రక్తపోటు ఒక్కసారిగా పెరగడంతో ఆయన గురువారం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతం స్వీకరించినపుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏడుగురు సన్యాసుల్లో ప్రజ్ఞానంద్ ఒకరు. 13 ఏళ్లకే లక్నోకు వచ్చిన ప్రజ్ఞానంద్ బౌధ్ విహార్ మందిర్‌లో అత్యంత సీనియర్ సన్యాసిగా పేరొందారు. -
బౌద్ధం
బుద్ధుడి శిష్యులలో అగ్రగణ్యుడు, అత్యంత ముఖ్యుడు కాశ్యపుడు. ఆయనను ‘ధమ్మపదం మహాకాశ్యపుడు’ అని గుర్తించడం కద్దు. బుద్ధుడి ధర్మమార్గాన్ని నలు దిశలా విస్తరింప జేయడానికి బుద్ధుడు ఎంపిక చేసుకున్న శిష్యులలో కాశ్యపుడు ప్రథముడు. ఆయన ఎక్కడున్నా బుద్ధుడున్న దిశగా చూసి నేలమీద పడి నమస్కరించేవారు. ఆయన తీరు చూసి అందరూ విస్తుపోయేవారు. ‘‘మీరు జ్ఞానం పొందిన గురువులు. అయినా మీరింకా నమస్కరిస్తున్నారేంటీ’’అని అడిగేవారు. అప్పుడు ఆయన ‘‘మీకు అర్థం కాదు. ఓ పురుగును సీతాకోకచిలుకగా మార్చినది ఆయనే. నేనీ భూమ్మీద ఉన్నంతవరకూ ఆయనకు నమస్కరించకుండా ఉండలేను. పైగా గురువు, శిష్యుడు అనే బంధంలో రాజు – పేదలా తేడాలుండవు. కనుక ఆయనకు నమస్కరించకుండా నేను ఒక్కరోజూ గడపలేను’’ అన్నారు. బుద్ధుడు చివరిక్షణాల్లో మహాకాశ్యపుడు ఎక్కడున్నా తీసుకురమ్మన్నారు. శిష్యులు తీవ్రంగా గాలించారు.‘‘అనందా! కాశ్యపుడు నన్ను విడిచిపెట్టి ఉండడానికి ఇష్టపడలేదు. నేనే వాడిని పంపాను. అతనికి తెలియకుండా నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళకూడదని, తానెక్కడ ఉన్నా కబురుపెట్టాలని హామీ వేయించుకుని వెళ్లాడు. నేను రేపు వెళ్ళిపోతాను. రేపు ఉదయం లోపల అతను గానీ రాకుంటే నేను మృత్యువును ప్రాధేయపడాల్సి ఉంటుంది మరణాన్ని వాయిదా వేయమని. నేను ఇప్పటివరకూ ఎవరినీ ఏదీ అడగలేదు. కనుక కాశ్యపుడు ఎక్కడున్నా సరే తీసుకురావాలి’’ అన్నాడు బుద్ధుడు. అలాగే కాశ్యపుడిని వెతికి బుద్ధుడి వద్దకు తీసుకువచ్చారు. కాశ్యపుడు రావడంతోనే బుద్ధుడు సంతోషపడ్డాడు. ‘‘కాశ్యపా నువ్వు వస్తావని తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వచ్చావు. మంచిది. మరణమా! ఇక నువ్వు నన్ను నీతో తీసుకుపోవచ్చు’’ అన్నాడు బుద్ధుడు. శిష్యులందరూ చుట్టూ నిల్చుని చూస్తుండగా కాశ్యపుడి ఒడిలో బుద్ధుడి తుది శ్వాస వీడిపోయింది.ఎవరికీ లభించని మహాభాగ్యం కాశ్యపుడికి దక్కింది. కాశ్యపుడు ఒక్కడే చివరివరకూ బుద్ధుడి శిష్యుడిగా కొనసాగాడు. అయితే మిగిలిన వారు బుద్ధుడిని వీడి వెళ్ళిన తర్వాత ఎవరికి వారు గురువుగా మారిపోయారు. ఈ క్రమంలో వారు తమ గురువును మరచిపోయారు. కానీ కాశ్యపుడు బయటకు వెళ్ళిన తర్వాత కూడా మేటి శిష్యుడిగానే ఉండిపోయారు. బుద్ధుడి అస్తమయం తర్వాత ఆయన గురువయ్యారు. గురువు అనేది ఓ బాధ్యత. ఆ హోదా కోసం పరితపించక్కర్లేదు. అర్హత ఉన్నవారికి తానుగా ఆ పదవి దక్కుతుంది. – యామిజాల జగదీశ్ -
కూతురు మతం మారడంపై స్పందించిన హీరో
చెన్నై: మతం మారానంటూ తన రెండో కూతురు అక్షరహాసన్ చేసిన సంచలన ప్రకటనపై ఆమె తండ్రి, సీనియర్ హీరో కమల్ హాసన్ స్పందించారు. 'హాయ్ అక్షు. నువ్వు మతం మార్చుకున్నావా? నువ్వు మతం మారినా సరే నాకు నువ్వంటే ఇష్టమే. మతంతో సంబంధంలేని ప్రేమ నిస్వార్ధమైనదని నేను నమ్ముతాను. నీ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ్. ప్రేమతో మీ బాపు (నాన్న)' కమల్ ట్వీట్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ మాట్లాడుతూ.. ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని చెప్పింది. తనకు అక్క శృతీహాసన్ మాదిరిగా దేవుడిపై నమ్మకం లేదని, అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించినట్లు అక్షర వివరించింది. శివ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. సంబంధిత కథనం అందుకే మతం మారాను: నటి Hi. Akshu. Have you changed your religeon? Love you, even if you have. Love unlike religeon is unconditional. Enjoy life . Love- Your Bapu — Kamal Haasan (@ikamalhaasan) 28 July 2017 -
ధర్మం నడిచిన రోజు
భారతదేశంలో పుట్టి, ఈనాడు ప్రపంచం నలుమూలలా విస్తరించిన ధార్మిక మార్గం బౌద్ధం. ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న అగ్రగామి కూడా బౌద్ధమే. ఇందుకు ప్రధాన కారణం ప్రజల వద్దకే ప్రబోధాల్ని తీసుకుపోయే విధానానికి బుద్ధుడు నాంది పలకడమే. ఆ నాంది పలికిన రోజే ఆషాఢ పున్నమి రోజు. అది నేడు. ఆషాఢ పున్నమి విశేషం ఏమంటే... జ్ఞానం తెలుసుకోవడం కోసం ఇల్లు విడిచిన సిద్ధార్థుడు ఆరేళ్లు ఎన్నోచోట్ల, ఎందరో గురువుల దగ్గరకు వెళ్లాడు. ఎక్కడా సరైన దారి కనిపించలేదు. ప్రపంచ ప్రజల దుఃఖాన్ని మాపే మార్గం అగుపించలేదు. చివరికి బుద్ధగయలో ధ్యానసాధన చేశాడు. ఒక వైశాఖ పున్నమి రోజున ఆయనకు ఆ మార్గం అవగతం అయింది. అదే బుద్ధ పూర్ణిమ. బుద్ధునికి కలిగిన సంబోధిలో రెండు ప్రధాన విషయాలున్నాయి. ఒకటి: ఈ ప్రపంచంలో స్థిరమైనది, శాశ్వతమైనది ఏదీ లేదు. ప్రతిదీ, ప్రతిక్షణం మారిపోతూనే ఉంటుంది. మార్పే ఈ ప్రపంచ భౌతిక నియమం. రెండు: మనిషి దుఃఖానికి ముదిరిపోయిన కోరికలు (తృష్ణ) ప్రధాన కారణం. జీవితం మీద, జీవనం మీద మనిషికి సరైన దృక్పథం లేకపోవడం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా తనకు ఇష్టమైనట్లో, అయిష్టమైనట్లో చూడ్డం. ఈ మోహ, ద్వేషాలే దుఃఖానికి కారణం. ఈ దుఃఖం పోవాలంటే సరైన దృక్పథం కావాలి. ఆ సరైన దృక్పథం (సమ్యక్ దృష్టి) కలగాలంటే మనం అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. జ్ఞానం, శీలం, ధ్యానం (నియంత్రణ) ఈ మూడింటి సాకారమే అష్టాంగ మార్గం. ఈ రెండు విషయాల్నీ ఆమూలాగ్రం బోధిస్తే చాలా కష్టంగా అర్థం అవుతుంది. తాను కనుగొన్న ఈ నూతన మార్గాన్ని ఎలా సులభతరం చేయాలా అని మధన పడుతూ అలాగే ఏడువారాలు గడిపాడు. ఈ గంభీర విషయాన్ని సులువుగా ప్రజల భాషలోనే, ప్రజల మధ్య తిరుగుతూ చెప్పాలని నిర్ణయం తీసుకుని.. తన పాత మిత్రగురువులైన ఆలార కాలముడు, ఉద్ధవ రామపుత్రునికి చెప్పాలని చూస్తాడు. కానీ వారిద్దరూ అప్పటికే మరణించడంతో... తన ఐదుగురు మిత్రులు సారనాథ్ (రుషిపట్టణం) జింకల వనంలో ఉన్నారని తెలిసి వారి దగ్గరకు వెళ్లాడు. తాను కనుగొన్న నూతన మార్గాన్ని వారికి ఐదురోజులు బోధించాడు. వారి అనుమానాలన్నీ తీర్చాడు. ఆ ప్రబోధాల సారం మొదటి రోజున కొండన్నకు, రెండోరోజున బద్ధియునికి, మూడోరోజున కాశ్యపునికి, నాలుగోరోజున అశ్వజిత్తుకి, ఐదోనాడు మహానామకు అవగతం అయ్యాయి. వారు ఐదుగురూ ఆయన అనుయాయులుగా మారారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అదే తొలి బౌద్ధ సంఘం. ఇది బౌద్ధసంఘం పుట్టిన రోజు. కాలినడక తిరుగుతూ (చారిక) ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని బయలుదేరాడు. అలా ధర్మచక్రం కదలింది. దానికి గుర్తుగా ఈ రోజున ధర్మచక్ర ప్రవర్తన దినంగా ప్రపంచ బౌద్ధులు జరుపుకుంటారు. బౌద్ధభిక్షువులు దీన్నే మహా గురువైన బుద్ధుని తొలి ప్రబోధదినంగా భావించి గురుపూర్ణిమగా జరుపుకుంటారు. నిజం... ఇది ధర్మం నడక ప్రారంభించిన రోజు. జ్ఞానవెలుగులు పరచిన రోజు. – డా. బొర్రా గోవర్ధన్ -
హింసకు పరిష్కారం బౌద్ధమే!
21వ శతాబ్దానికి బుద్ధుడి బోధనలు అవసరం ► శ్రీలంక ఆర్థిక సుసంపన్నతకోసం చిత్తశుద్ధి ► బౌద్ధమే ఇరుదేశాల సాంస్కృతిక వారధి ► అంతర్జాతీయ వెసాక్ సంబరాల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన ► హిందూ మహాసముద్రంపై చైనాకు పట్టు చిక్కకుండా వ్యూహం కొలంబో: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక పరిస్థితులకు బుద్ధుడి బోధనల ద్వారానే శాంతి చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాద విధ్వంసం నుంచి పరిష్కారం లభించేందుకు బౌద్ధమే సరైన మార్గమన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 14వ అంతర్జాతీయ వెసాక్(బుద్ధ జయంతి) వేడుకలను ఆయన శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు. ‘మన ప్రాంతంలో ఉగ్రవాదం విధ్వంసం సృష్టిస్తోంది. దేశాల మధ్య ఘర్షణ వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలగకూడదు. అందుకే 2500 ఏళ్ల క్రితమే బుద్ధుడు చెప్పిన మాటలు 21వ శతాబ్దానికి బాగా సరిపోతాయి.మన(భారత్–శ్రీలంక) పాలనలో, సంస్కృతిలో సిద్ధాంతాల్లో బౌద్ధం వేళ్లూనుకుపోయింది’ అని మోదీ తెలిపారు. శ్రీలంక జాతి నిర్మాణంలో భారత్ ఓ మిత్రుడిగా, భాగస్వామిగా సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. భారత్–శ్రీలంక మధ్య స్నేహబంధం ఈనాటిది కాదని.. భారత్‌లో బౌద్ధం వ్యాప్తి చెందటంలో శ్రీలంక పాత్ర గొప్పదని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ప్రజలే సాంస్కృతిక వారధిగా నిలిచారన్నారు. ‘భారత్–శ్రీలంక మధ్య స్నేహబంధానికి కాలమే సాక్షి. సన్నిహితమైన పొరుగుదేశంగా మనది లోతైన బంధం. బౌద్ధం ద్వారా ఇది మరింత బలోపేతమైంది.మన ఈ బంధం భవిష్యత్తులోనూ అపరిమితమైన అవకాశాలకు మార్గం చూపుతుంది’ అని మోదీ తెలిపారు. మౌలికవసతులు, అనుసంధానత, రవాణా, విద్యుత్ రంగాల్లో భారత్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత ఇరు దేశాలకు మేలు జరుగుతుందన్నారు. కాగా, కొలంబో నుంచి వారణాసికి ఎయిరిండియా విమాన సేవలు ఆగస్టునుంచి ప్రారంభమవుతాయని మోదీ వెల్లడించారు. ఎంజీఆర్, మురళీధరన్‌లపై.. శ్రీలంకలోని తమిళులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘మీ తాతలు, ముత్తాతలు ఎన్నో కష్టనష్టాలకోర్చి భారత్‌నుంచి బతికేందుకు సీలోన్ (శ్రీలంక)కు వచ్చారు. శ్రీలంకలోని తమిళ సమాజం ప్రపంచానికి ఇద్దరు మహానుభావులను (ఎంజీఆర్, మురళీధరన్) బహుమతిగా ఇచ్చింది’ అని మోదీ అన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ శ్రీలంకలోని క్యాండీలో జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం లంక తేయాకు రంగంలోని తమిళ కార్మికులతో మోదీ భేటీ అయ్యారు. శ్రీలంకలోని తమిళుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం క్యాండీలోని ప్రఖ్యాత బౌద్ధ ఆలయం ‘సేక్రెడ్ టూత్ రెలిక్’ను మోదీ సందర్శించారు. సరైన తరుణంలో.. హిందూ మహాసముద్రంపై పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. శ్రీలంకలో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన చాలా కీలకంగా మారింది. కాగా, వచ్చేవారం కొలంబో పోర్టులో తమ జలాంతర్గామిని నిలిపి ఉంచుకునేందుకు అనుమతివ్వాలన్న చైనా అభ్యర్థనను శ్రీలంక ప్రభుత్వం తిరస్కరించింది. ‘భూభాగమైనా, సముద్రంలోనైనా మన సమాజాల (ఇరుదేశాల) భద్రతను వేర్వేరుగా చూడలేము’ అని వెల్లడించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను విమర్శించారు. చాయ్‌తో ప్రత్యేక అనుబంధం తనకు చాయ్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ లంక పర్యటనలో అన్నారు. ‘మీకూ, నాకు చాయ్‌తో సంబంధం ఉంది. నాకు చాయ్‌తో ఎలాంటి ప్రత్యేక సంబంధముందో మీకు తెలుసనుకుంటా’ అని తెలిపారు. భారత సార్వత్రిక ఎన్నికల సమయంలోని ‘చాయ్‌పే చర్చ’ నినాదాన్నీ ప్రధాని గుర్తుచేశారు. తేయాకు రంగంలోని కార్మికుల హుందాతనం, గౌరవం పెంచటమే ఈ నినాదం ఉద్దేశమన్నారు. ‘శ్రీలంక ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో మూడోస్థానంలో ఉందంటే ఇది మీ శ్రమ కారణంగానే’ అని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే సమక్షంలోనే తేయాకు కార్మికులను మోదీ ప్రశంసించారు. -
సానుకూల దృక్పథం
పూర్వం ఒక మహారాజు దగ్గర గుణ వర్ధనుడు, సుగుణ వర్ధనుడు అనే ఇద్దరు మంత్రులు ఉండేవారు. వారిద్దరిలో ఎవరు యోగ్యులో ఎంచుకొని, వారికి మహామంత్రి పదవి ఇవ్వాలనుకున్నాడు రాజు. వారిద్దరిపై ఏవో కారణాలు చూపి ఆగ్రహం నటించాడు. ఇద్దరినీ పదవినుంచి తొలగాఇంచి నగర బహిష్కరణ చేశాడు. ఇద్దరు మంత్రులూ రాజ్యంలో ఒక మారుమూల గ్రామానికి చేరి అక్కడ జీవిస్తున్నారు. కొన్నాళ్లకి వారిద్దరికీ తిరిగి రమ్మని సందేశం పంపుతూ, దానితోపాటు కాకిమాంసం కూర కూడా పంపాడు రాజు. అది అందుకున్న గుణవర్ధనుడు ‘‘రాజుగారికి నామీద ఇంకా కోపం తీరినట్టు లేదు.అందుకే ఈ కాకి మాంసం పంపాడు!’’అనుకున్నాడు. కానీ సుగుణ వర్ధనుడేమో ‘రాజుగారికి నా మీద కోపం పోయింది. ఆయన ప్రేమతో ఈ కాకి మాంసాన్ని పంపాడు. ఇంతకంటే విలువైన పక్షిమాంసాలు దొరికితే పంపకుండా ఉంటాడా?’అనుకుని వెంటనే బయలుదేరి వెళ్లి, రాజుగారిని కలిశాడు.విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించిన సుగుణ వర్థనుణ్ణి మహామంత్రిని చేశాడు రాజు. సానుకూల, ప్రతికూల దృక్పథాల గురించి బౌద్ధం చెప్పిన సందేశాత్మక కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
బుద్ధిజంలోనే మానవీయత!
మంగళూరు యూనివర్సిటీ అధ్యాపకుడు వలీరియన్ రోడ్రిగస్ ఏఎన్‌యూ(పొన్నూరు): ఆధునిక ప్రపంచం కంటే మానవ విలువలతో కూడిన ప్రపంచాన్ని అంబేడ్కర్ కాంక్షించారని, దాని కోసమే విలువలు, శాంతికి ప్రాధాన్యమిచ్చే బౌద్ధమతాన్ని స్వీకరించారని మంగళూరు యూనివర్సిటీ అధ్యాపకుడు, తత్వవేత్త ప్రొఫెసర్ వలీరియన్ రోడ్రిగస్ అన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, ఏఎన్‌యూ బుద్ధిజం విభాగాలు సంయుక్తంగా ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అండ్ బుద్ధిజం’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు శుక్రవారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొఫెసర్ రోడ్రిగస్ కీలకోపన్యాసం చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ బుద్ధిజం మత, కుల వ్యవస్థకు వ్యతిరేకమని తెలిపారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ మాట్లాడుతూ బుద్ధిజం ప్రధాన ప్రాంతమైన ఏపీ రాజధాని అమరావతిలో అంబేడ్కర్ స్మృతి వనం, 125 అడుగుల విగ్రహం, ధ్యాన కేంద్రం, సమావేశ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
విశ్వమానవ మతం బౌద్ధం
కొత్త కోణం ‘నీకు నీవే యజమానివి. నీ భవిష్యత్‌ను నువ్వే నిర్మించుకో’ అన్న బుద్ధుని ప్రబోధం ప్రపంచం పట్ల మనిషి పట్ల ఆయన తాత్వికతకు అద్దం పడుతుంది. మనుషులు తమ జీవి తాలను తీర్చిదిద్దుకోవడానికి దేవుడు, లేదా అతీంద్రియ శక్తుల అవసరం లేదని, తద్వారా సమాజ పురోభివృద్ధి సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పాడు. బౌద్ధం మనిషి కేంద్రంగా రూపొందినది. దేవుడు, అదృశ్య శక్తుల ప్రమేయం లేనిది. తాను దేవుడిననో, దైవదూతననో, ప్రవక్తననో బుద్ధుడు చెప్పుకోలేదు. జ్ఞానం పొందిన వాడినని మాత్రమే అన్నాడు. ‘‘భావితరాల అవసరానికి సరిపోయే లక్షణాలున్న విశ్వమానవ మతం కావాలి. దేవుడు, మూఢనమ్మకాల పరిధులను అధిగమించి ప్రకృతిని, ఆధ్యా త్మికతను కలుపుకుని ఈ ప్రపంచంలో అన్నింటినీ ఒకేలా చూడగలిగే మతం నేటి అవసరం. ఇటువంటి శాస్త్రీయ పునాదిగల మతం బౌద్ధం ఒక్కటే’’ అని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అన్నాడు. ఆయన మాటలు బౌద్ధం విశ్వజనీన స్వభావాన్ని చాటుతాయి. సమాజంలోని ప్రతిపార్శ్వాన్నీ బౌద్ధం తడిమింది. అల్లకల్లోలంగా ఉన్న ప్రజల జీవితాల్లోని ప్రతి అంశాన్నీ తట్టిలేపింది. 2,600 ఏళ్ల క్రితమే గౌతమ బుద్ధుడు విశ్వసృష్టిని ఒక గొప్ప తత్వవేత్తగా సమకాలీన సామాజిక, రాజకీ యాల నుంచి మాత్రమే గాక, వాస్తవిక దృష్టితో పరిశీలించాడు. దానినే ప్రబో ధించాడు. 19వ శతాబ్ది డార్విన్ కనిపెట్టిన జీవపరిణామ సిద్ధాంతాన్ని క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలోనే బుద్ధుడు ఆవిష్కరించడం ఆశ్చర్యకరం. బౌద్ధ గ్రంథం దిఘనికాయలోని అగ్గన్న సుత్తలో చెప్పిన విశ్వ పరిణామక్రమాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. బుద్ధుని బోధనలలోని ఈ అంశా నికి తగు ప్రాధాన్యం లభించలేదు. అగ్గన్న సుత్త వాసెత్త, భరద్వాజ అనే ఇద్దరు శిష్యులతో బుద్ధుడు జరిపిన సంభాషణ సారాంశమే అగ్గన్న సుత్త. బుద్ధుడు శ్రావస్తి(సావత్తి) సమీపంలోని ఉత్తర వనంలో మిగారమాత భవనంలో ఉన్న సమయంలో వారిద్దరూ వచ్చి... ‘‘ఆర్యా! మమ్మల్నిద్దర్నీ బ్రాహ్మణులు తిడుతున్నారు. బ్రాహ్మణ కులంలో చెడపుట్టారని దూషిస్తున్నారు. ఇది మాకు బాగా బాధ కలిగిస్తున్నది’’ అంటూ వాపోయారు. ‘‘మంచిది, వాళ్లు ఏరకంగా మిమ్మల్ని దూషిస్తున్నారు?’’ అని బుద్ధుడు ప్రశ్నిస్తాడు. ‘‘బ్రాహ్మణ కులం అగ్రకులం. ఇతర కులాలు హీనమై నవి. బ్రాహ్మణ కులం తెలుపు, ఇతర కులాలు నలుపు. బ్రాహ్మణులు పరి శుద్ధులు, ఇతరులు కాదు. బ్రహ్మ నోటి నుంచి వచ్చిన వారు బ్రాహ్మణులు, మిగతావారు అలా కాదు. బ్రహ్మవారసులైన బ్రాహ్మణులను వదిలి మీరు నీచ యువ శ్రమణులు, సేవకులు, బ్రహ్మకాలి నుంచి పుట్టిన వారి దగ్గరకు వెళ్లారు. అటువంటి వారితో వెళ్లడం మంచిది కాదు’’ అని నిందిస్తున్నారని వాసెత్త, భరద్వాజలు చెబుతారు. అప్పుడు బుద్ధుడు వారితో ‘‘బ్రాహ్మణులు సత్యాలను మరుగుపరుస్తున్నారు. అందరిలాగానే బ్రాహ్మణ తల్లులు గర్భం దాల్చి సంతానాన్ని పొందుతారు. పిల్లలకు తల్లి పాలనే అమృతం లాగా అందిస్తారు’’. ఇటువంటి ప్రక్రియనే అన్ని కులాల తల్లులు నిర్వహిస్తున్నారు. వీటిని మరుగు పరిచి పురోహితులు అబద్ధాలు చెపుతున్నారు అంటూ ఆనాటి సామాజిక విభజనను, కులాల అంతరాలను బుద్ధుడు సవివరంగా వారికి తెలియజేస్తాడు. నలుపు, తెలుపు అనే శరీర వర్ణాలు అన్ని కులాల్లోనూ ఉన్నా యని చెపుతూ... నాలుగు కులాలలోనూ మంచివారు, చెడ్డవారు కూడా ఉన్నారు. అయితే ఈ కులాల నుంచి బిక్కుగా మారిన ప్రతి ఒక్కరూ తమ పాత జీవితాన్ని వదిలి పవిత్ర జీవితాన్ని ప్రారంభిస్తారని బుద్ధుడు చెబు తాడు. ఆ సందర్భంగా ఆయన విశ్వసృష్టిని క్రమానుగతంగా వివరించాడు. బుద్ధుని విశ్వపరిణామవాదం మొదట ఈ భూమి మీద కేవలం జలరాశి మాత్రమే ఉండేది. అంతా చిమ్మ చీకటి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేవు. రాత్రీ, పగలు తేడా లేదు. వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాల లెక్కలు లేవు. జీవులుగా గుర్తించని కొన్ని అపరిపక్వమైన ప్రాణులు మాత్రమే ఉన్నాయి. చాలా కాలం తర్వాత భూమి మీద ఉన్న నీటి పైన ఒక రస పొర వ్యాపించింది. వేడి పాలు చల్లారు తున్నప్పుడు పైన ఏర్పడే పొరలాగా అది కనిపించింది. దానికి రంగు, రుచి, వాసన ఉన్నాయి. దాని రంగు మంచి నెయ్యి రంగు. దాని రుచి అడవి తేనె రుచి. ఒక జీవి ఆ రస పొరను రుచి చూసింది. అట్లా ఆ జీవులు క్రమంగా ఆ పొరను తిన్నాయి. దానితో ఆ రస పొర మాయమై సూర్యుడు, చంద్రుడు కనిపించారు. రాత్రి, పగలు ఏర్పడ్డాయి. ఆ విధంగానే ప్రపంచ గతి మొద లైంది. ఎప్పుడైతే రస పొర మాయమైందో పుట్టగొడుగుల్లాంటి శిలీంధ్రం పుట్టుకొచ్చింది. కాలక్రమేణా జీవులు కొంత పరిణామం చెందాయి. చెట్లు, చేమలు, నదీనదాలూ, కాల్వలూ ఏర్పడ్డాయి. జీవులు రకరకాల రూపాల్లో ఆవిర్భవించడం మొదలైంది. అట్లా కాలానుగతంగా, క్రమేణా మనిషి ఆకారం రూపుదాల్చింది. అలా క్రమంగా మనిషి పుట్టుక మరో నూతన ప్రపంచానికి అంకురార్పణ చేసింది. అప్పుడు మనుషులు, ఇతర జీవులూ ఆహారానికి ఆకులూ, అలమలపై ఆధారపడ్డారు. మొరటుదేలిన శరీరాలు క్రమంగా తమ అవసరాల కనుగుణంగా మార్పులకు లోనయ్యాయి. మానవ దేహాల్లోనూ ప్రకృతిసిద్ధమైన మార్పులు సంభవించాయి. ఆహారంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకులు అలమల స్థానంలో పిండి, ఊకలేని మంచి వాసనతో కూడిన ధాన్యం పుట్టుకొచ్చింది. దానినే తినడం మొదలు పెట్టారు. అలా జీవిస్తుండగా పురుషుల, స్త్రీల శరీరాల్లో మార్పు వచ్చింది. క్రమంగా పునరుత్పత్తి ప్రారంభమైంది. లైంగిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఒకటి, రెండు నెలల పాటు బహిష్కరించారు. ఇట్లా ఎన్నో ఆచారాలు వచ్చాయి. అట్లా అప్పటికే ఏర్పడిన కులాల పుట్టుకను, దాని ఇతివృత్తాన్నీ గౌతమ బుద్ధుడు వివరించారు. బ్రాహ్మణ, ఖత్తియ (క్షత్రియ), విస్స(వైశ్య). సుద్ద(శూద్ర) అనే కులాల ప్రస్తావన, వాటి పుట్టుక వివరాలను కూడా అగ్గన్న సుత్తలో బుద్ధుడు వివరించాడు. బుద్ధుని అగ్గన్న సుత్త ప్రపంచ పరిణామ శీలతను, క్రమాన్ని వివరించింది. మూఢనమ్మకాలకు తావులేని శాస్త్రీయ దృక్పథం మనుషులలో ఏర్పడిన భేదాలు మనం సృష్టించుకున్నవేనని అది బోధిస్తుంది. అదేవిధంగా ఒకరు దేవుడి పుత్రులు, మరొకరు సామాన్యులు అనే అసమా నతలను తిరస్కరించి, సమానత్వాన్ని బోధించే నూత్న తాత్వికతను అభివృద్ధి పరుస్తుంది. ఇది ఎంతో వివేచనతో సమాజాన్ని ఆవిష్కరించిన ఘట్టం. బౌద్ధం విశ్వమానవ మతంగా రూపొందడానికి ఉన్న తాత్విక పునాది ఇది. ఇందులో ఎక్కడా మూఢనమ్మకాలకు తావు లేదు. విశ్వపరిణామ క్రమాన్ని ఎంతో సూక్ష్మదృష్టితో పరిశీలించిన బుద్ధుడు ఆ కాలపు విజ్ఞాన ఖనిగా దర్శన మిస్తాడు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిన మాట నిజమే కావచ్చు. అక్కడ ఆయనకు జ్ఞానోదయం కలుగవచ్చు. కానీ అది కళ్లు మూసుకొని ధ్యానం చేయడం వల్ల సాధ్యమైందనేది అబద్ధం. ఆయన తన ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక మనిషి పుట్టుక, జీవనం, మరణాలపై జరుగుతున్న చర్చలన్నింటినీ విన్నాడు. వాటన్నిటినీ అర్థం చేసుకుని, క్రోడీకరించి తన దైన ఒక తాత్వికతను సృష్టించుకున్నాడు. అందువల్లనే ఆనాటి సమాజంలో తప్పుగా ప్రచారమవుతున్న దేవుడు, సృష్టి, జననం, మరణం అనే అంశా లనూ, ప్రత్యేకించి ప్రముఖంగా ప్రచారమవుతున్న అసత్యాలనూ ఆయన తన తాత్విక పరిశోధనలో నిగ్గుతేలిన సత్యాలతో తిప్పికొట్టిన వైనానికి అగ్గన్న సుత్త అద్దం పడుతుంది. మనిషి కేంద్రంగా సాగిన బౌద్ధ తత్వం బుద్ధుని తర్వాత ప్రపంచం దాదాపు 2,600 సంవత్సరాలు ప్రయాణం చేసింది. జీవరాశుల పుట్టుక నుంచి మొదలుకొని మానవ పరిణామక్రమం, శతాబ్దాల క్రమంలో ప్రకృతిలో చోటుచేసుకున్న అనేక మార్పులపై, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లాంటి ఎన్నో ఇతర అంశాలపై చాలా విస్తృత పరిశో ధనలు జరిగాయి. ఎన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. మనిషి క్రమంగా శాస్త్రీయ పరిశోధనా పునాదులపై ఆధారపడి అన్ని విషయాలను అర్థం చేసుకుంటున్నాడు. ఈ ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడని, అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతుందని మనిషి విశ్వసించినట్టయితే, ప్రపంచ గమనం ఆగిపోయేది. అటువంటి విశ్వపరిణామాన్ని పరిశోధించే క్రమానికి శ్రీకారం చుట్టినది గౌతమ బుద్ధుడు. అందువలన ఆ తర్వాత ఎన్నో తాత్విక, శాస్త్రీయ ఆలోచనలకు అంకురార్పణ జరిగింది. భూమి, విశ్వం, విశ్వాంతరాళాల గురించి ఎన్నో నూతన ఆవిష్కరణలు వచ్చాయి. ఖగోళ శాస్త్రంతోపాటు, ఎన్నో విషయాలపైన పరిశోధనలు జరి గాయి. మనిషి గ్రహాలనూ, గ్రహాంతరాలనూ తరచి చూశాడు. అసాధ్యాలను సాధ్యాలుగా మలిచాడు. శాస్త్రీయ ఆలోచనలతో తనను తాను పునరుజ్జీవిం పజేసుకున్నాడు. పాతకాలపు తిరోగమన భావజాలాన్ని వదిలించుకొని ఎప్ప టికప్పుడు తనను తాను నూతన మానవునిగా తీర్చిదిద్దుకునేందుకు వినూ త్నంగా ప్రయత్నించాడు. సరిగ్గా ఇక్కడే బుద్ధుని ఆలోచనలు మరొకసారి స్ఫురణకు వస్తాయి. ‘‘నీకు నీవే యజమానివి. నీ భవిష్యత్‌ను నువ్వే నిర్మిం చుకో’’ అన్న ఆయన ప్రబోధం ప్రపంచం పట,్ల మనిషి పట్ల ఆయన తాత్విక చింతనకు అద్దం పడుతుంది. మనిషి ఎప్పుడైనా తన శక్తి మీద ఆధారపడి మాత్రమే జీవించాలే తప్ప, ఎవరో ఆదుకుంటారనో, ఏ భగవంతుడో, ఏ మానవాతీత శక్తులో మనిషికి అన్నీ సమకూరుస్తాయనే భావనను తిరస్క రించాలని బుద్ధుడు బోధించాడు. మనుషులు తమ జీవితాలను తీర్చిదిద్దు కోవడానికి దేవుడు, లేదా అతీంద్రియ శక్తుల అవసరం లేదని, తద్వారా సమాజ పురోభివృద్ధి సాధ్యం కాదని ఆ రోజుల్లోనే ఆయన స్పష్టంగా తేల్చి చెప్పాడు. బౌద్ధం మనిషి కేంద్రంగా రూపొందినది. దేవుడు, అదృశ్యశక్తుల ప్రమేయం అందులో లేదు. అదేవిధంగా గౌతమ బుద్ధుడు, తాను దేవుడి ననో, దైవదూతననో, ప్రవక్తననో చెప్పుకోలేదు. తాను జ్ఞానం పొందిన వాడి నని మాత్రమే చెప్పుకున్నాడు. తనలాగే ఎవరైనా ఇటువంటి జ్ఞానాన్ని పొంద వచ్చుననే విశ్వాసాన్ని కలిగించాడు. అందువల్లనే బౌద్ధాన్ని అనుసరిస్తున్న దేశాల్లో మావన సంపద చాలా శక్తిమంతంగా రూపొందుతున్నది. అక్కడి వారు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే శక్తిని కలిగి ఉంటున్నారు. ఇది బౌద్ధం తాత్వికతకు ఉన్న బలంగా మనం అర్థం చేసుకోవచ్చు. (హైదరాబాద్‌లో నేటి నుంచి ప్రారంభమౌతున్న ప్రపంచ బౌద్ధ వారసత్వ ఉత్సవాల సందర్భంగా...) - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213