హింసకు పరిష్కారం బౌద్ధమే!
21వ శతాబ్దానికి బుద్ధుడి బోధనలు అవసరం
► శ్రీలంక ఆర్థిక సుసంపన్నతకోసం చిత్తశుద్ధి
► బౌద్ధమే ఇరుదేశాల సాంస్కృతిక వారధి
► అంతర్జాతీయ వెసాక్ సంబరాల్లో ప్రధాని మోదీ ఉద్ఘాటన
► హిందూ మహాసముద్రంపై చైనాకు పట్టు చిక్కకుండా వ్యూహం
కొలంబో: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక పరిస్థితులకు బుద్ధుడి బోధనల ద్వారానే శాంతి చేకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాద విధ్వంసం నుంచి పరిష్కారం లభించేందుకు బౌద్ధమే సరైన మార్గమన్నారు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 14వ అంతర్జాతీయ వెసాక్(బుద్ధ జయంతి) వేడుకలను ఆయన శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు. ‘మన ప్రాంతంలో ఉగ్రవాదం విధ్వంసం సృష్టిస్తోంది.
దేశాల మధ్య ఘర్షణ వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలగకూడదు. అందుకే 2500 ఏళ్ల క్రితమే బుద్ధుడు చెప్పిన మాటలు 21వ శతాబ్దానికి బాగా సరిపోతాయి.మన(భారత్–శ్రీలంక) పాలనలో, సంస్కృతిలో సిద్ధాంతాల్లో బౌద్ధం వేళ్లూనుకుపోయింది’ అని మోదీ తెలిపారు. శ్రీలంక జాతి నిర్మాణంలో భారత్ ఓ మిత్రుడిగా, భాగస్వామిగా సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. భారత్–శ్రీలంక మధ్య స్నేహబంధం ఈనాటిది కాదని.. భారత్‌లో బౌద్ధం వ్యాప్తి చెందటంలో శ్రీలంక పాత్ర గొప్పదని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ప్రజలే సాంస్కృతిక వారధిగా నిలిచారన్నారు.
‘భారత్–శ్రీలంక మధ్య స్నేహబంధానికి కాలమే సాక్షి. సన్నిహితమైన పొరుగుదేశంగా మనది లోతైన బంధం. బౌద్ధం ద్వారా ఇది మరింత బలోపేతమైంది.మన ఈ బంధం భవిష్యత్తులోనూ అపరిమితమైన అవకాశాలకు మార్గం చూపుతుంది’ అని మోదీ తెలిపారు. మౌలికవసతులు, అనుసంధానత, రవాణా, విద్యుత్ రంగాల్లో భారత్ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత ఇరు దేశాలకు మేలు జరుగుతుందన్నారు. కాగా, కొలంబో నుంచి వారణాసికి ఎయిరిండియా విమాన సేవలు ఆగస్టునుంచి ప్రారంభమవుతాయని మోదీ వెల్లడించారు.
ఎంజీఆర్, మురళీధరన్‌లపై..
శ్రీలంకలోని తమిళులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘మీ తాతలు, ముత్తాతలు ఎన్నో కష్టనష్టాలకోర్చి భారత్‌నుంచి బతికేందుకు సీలోన్ (శ్రీలంక)కు వచ్చారు. శ్రీలంకలోని తమిళ సమాజం ప్రపంచానికి ఇద్దరు మహానుభావులను (ఎంజీఆర్, మురళీధరన్) బహుమతిగా ఇచ్చింది’ అని మోదీ అన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ శ్రీలంకలోని క్యాండీలో జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం లంక తేయాకు రంగంలోని తమిళ కార్మికులతో మోదీ భేటీ అయ్యారు. శ్రీలంకలోని తమిళుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం క్యాండీలోని ప్రఖ్యాత బౌద్ధ ఆలయం ‘సేక్రెడ్ టూత్ రెలిక్’ను మోదీ సందర్శించారు.
సరైన తరుణంలో..
హిందూ మహాసముద్రంపై పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. శ్రీలంకలో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన చాలా కీలకంగా మారింది. కాగా, వచ్చేవారం కొలంబో పోర్టులో తమ జలాంతర్గామిని నిలిపి ఉంచుకునేందుకు అనుమతివ్వాలన్న చైనా అభ్యర్థనను శ్రీలంక ప్రభుత్వం తిరస్కరించింది. ‘భూభాగమైనా, సముద్రంలోనైనా మన సమాజాల (ఇరుదేశాల) భద్రతను వేర్వేరుగా చూడలేము’ అని వెల్లడించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను విమర్శించారు.
చాయ్‌తో ప్రత్యేక అనుబంధం
తనకు చాయ్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని మోదీ లంక పర్యటనలో అన్నారు. ‘మీకూ, నాకు చాయ్‌తో సంబంధం ఉంది. నాకు చాయ్‌తో ఎలాంటి ప్రత్యేక సంబంధముందో మీకు తెలుసనుకుంటా’ అని తెలిపారు. భారత సార్వత్రిక ఎన్నికల సమయంలోని ‘చాయ్‌పే చర్చ’ నినాదాన్నీ ప్రధాని గుర్తుచేశారు. తేయాకు రంగంలోని కార్మికుల హుందాతనం, గౌరవం పెంచటమే ఈ నినాదం ఉద్దేశమన్నారు. ‘శ్రీలంక ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో మూడోస్థానంలో ఉందంటే ఇది మీ శ్రమ కారణంగానే’ అని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే సమక్షంలోనే తేయాకు కార్మికులను మోదీ ప్రశంసించారు.