
దళితుల్లో ఆ మతవ్యాప్తి పెరిగిపోతున్నది!
న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబసభ్యులు ఇటీవలే బుద్దిజంలోకి మారారు. దేశంలోని దళిత వర్గాల్లో బౌద్ధమత వ్యాప్తి పెరుగుతున్న ట్రెండ్‌కు ఈ ఘటన అద్దం పడుతున్నది.
దళితుల్లో బుద్ధిజం బాగా పెరిగిపోతున్నదని తాజాగా ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. దేశంలో దళిత ఉద్యమం విజయవంతం కావడంలో బుద్ధిజం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాల ప్రజలు బుద్ధిజం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో బుద్ధిస్టు ఎస్సీలు 41.59 లక్షల మంది ఉండగా, 2011నాటికి 57.56 లక్షలకు చేరారు. అంటే ఎస్సీల్లో బుద్ధిజం 38శాతం పెరిగింది. 2001 నాటికి దేశంలో ఎస్సీల జనాభా 16.6 కోట్లు ఉండగా.. 2011నాటికి 21.3శాతం పెరిగి 20.14 కోట్లకు చేరుకుంది.
బౌద్ధమతంలో ఉన్న ఎస్సీల్లో 90శాతం మంది మహారాష్ట్రలోనే నివసిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 52.04 లక్షలమంది బుద్ధిస్టులు ఉండగా, అక్కడ బౌద్ధమత వ్యాప్తి 60శాతం వృద్ధిరేటుతో ముందుకుసాగుతుండటం గమనార్హం. అదే సమయంలో 2001 నుంచి 2011 నాటికి హిందూ ఎస్సీల జనాభా కేవలం 19.6శాతం మాత్రమే పెరిగింది. 15.8 కోట్ల నుంచి 18.9 కోట్లకు వారి జనాభా చేరుకుంది. అయితే, మొత్తంగా చూసుకుంటే మాత్రం దళిత జనాభాలో బుద్ధిస్టులు కేవలం 2.83శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో బౌద్ధమత పునరుత్థానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. తన మరణానికి కొన్నిరోజుల ముందు ఆయన బుద్ధమతంలో మారారు. హిందూమతంలో తమ పట్ల అణచివేత ఉందని భావిస్తున్న దళితులు చాలామంది బౌద్ధమతంలోకి మారుతున్నారు.