బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని కాదనుకుని సన్యాసం
18 ఏళ్లప్పుడే బౌద్ధ భిక్షువైన మలేషియా కుబేరుడు
రాబిన్ శర్మ బెస్ట్ సెల్లర్ ‘ది మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’నవలలో కథా నాయకుడు జూలియన్ మాంటిల్ తిరుగులేని క్రిమినల్ లాయర్. తృప్తిలేని తన జీవన విధానంతో విసిగి అపారమైన ఆస్తులన్నింటినీ అమ్మేసి తనను తాను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అలాంటి కథే.
ఏకంగా 500 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా వదులుకుని మరీ బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ అలియాస్ ఏకే మలేషియాలో మూడో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి రూ.42,000 కోట్ల పైమాటే. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లో విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం ఆయనది. అలాంటి ఏకేకు సిరిపన్నో ఏకైక కుమారుడు. అంతటి ఆస్తినీ వద్దనుకుని బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు.
బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. బౌద్ధాన్ని నమ్మే తండ్రి కృష్ణన్ కూడా ఈ నిర్ణయాన్ని గౌరవించడం విశేషం. ఇదంతా జరిగి 20 ఏళ్లయింది. నాటినుంచీ సిరిపన్నో దాదాపుగా అడవుల్లోనే గడుపుతున్నారు. థాయ్‌లాండ్–మయన్మార్ సరిహద్దులో తావో దమ్ బౌద్ధారామంలో అబాట్ (ప్రధాన సన్యాసి)గా ఉన్నారు. పూర్తిగా భిక్ష మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఓసారి తండ్రిని చూడటానికి వచ్చిపోతుంటారు.
మార్చింది ఆ ప్రయాణమే
సిరిపన్నో జీవితంలోనే భిన్న సంస్కృతులున్నాయి. ఆయన తల్లి మోమ్వాజరోంగ్సే సుప్రిందా చక్రబన్ థాయ్ రాజ కుటుంబీకురాలు. ఆయన తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో పెరిగారు. అక్కడే చదువు పూర్తి చేశారు. ఇంగ్లిష్‌తో పాటు ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలరు. 18 ఏళ్ల వయసులో తల్లితో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. సరదాగా ఓ బౌద్ధారామానికి రిట్రీట్‌కు వెళ్లారు. అక్కడే ఆయనను బౌద్ధం ఆకర్షించింది. అది బలపడి, చూస్తుండగానే జీవన విధానంగా మారిపోయింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment