
ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన ఏకసభ్య కమిషన్
ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫారసు
జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికపై ప్రకటనను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
మొదటి గ్రూపులో 15, రెండో గ్రూపులో 18, మూడో గ్రూపులో 26 కులాలు
ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్
గ్రూప్–1కు 1 శాతం, గ్రూప్–2కు 9 శాతం, గ్రూప్–3కి 5 శాతం రిజర్వేషన్ సిఫారసు
గ్రూపుల వారీగా రోస్టర్ పాయింట్లు సైతం నిర్దేశించిన కమిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభాకు రిజర్వేషన్లను మూడు కేటగిరీలుగా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గతేడాది నవంబర్ 11నుంచి 82 రోజుల పాటు వివిధ కోణాల్లో అధ్యయనం చేసింది.
సోమవారం (Monday) 199 పేజీలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పింపంచింది. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ఒక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2011 జనగణన (Census) ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీ కింద ఉన్న 59 కులాలను వారి సామాజిక స్థితిగతుల ఆధారంగా మూడు గ్రూపులుగా కమిషన్ వర్గీకరించింది. గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చింది.



మూడింటికి ఓకే.. ఒక సిఫారసుకు నో
» ఎస్సీ వర్గీకరణ అమలుకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు సిఫారసులు చేసింది. ఇందులో మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా, ఒక సిఫారసును తిరస్కరించింది.
» ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండగా, ఇందులో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన, ఇంతవరకు పట్టించుకోని షెడ్యూల్డ్ కులాలను కమిషన్ గ్రూప్–1 కేటగిరీలోకి చేర్చింది. వీరి జనాభా మొత్తం ఎస్సీల్లో 3.288 శాతం ఉండడంతో వారికి ఒక (1)శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఫారసు చేసింది.
» ఎస్సీల్లో మధ్యస్తంగా లబ్ధి పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–2లో చేర్చింది. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం ఉండగా, వారికి 9% రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది.
» మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్డ్ కులాలను గ్రూప్–3లో చేర్చింది. ఎస్సీ జనాభాలో 33.963%ఉన్న వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వాలని సిఫారసు చేసింది.
» ఎస్సీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్, మేయర్ తదితర ప్రజాప్రతినిధులతో పాటు గ్రూప్–1 సర్వీ సుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్ కేటగిరీగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ వ్యక్తులకు సంబంధించి రెండో తరానికి రిజర్వేషన్ల ప్రయోజనం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. అయితే ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.
» ఇక ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిలో అనుసరించేందుకు వన్‌మెన్ కమిషన్ ప్రాధాన్యత నమూనాను రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసిన అలాగే భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment