ఫైల్ ఫొటో: సర్వయ్య సోదరులను బట్టలిప్పించి కొడుతున్న ఘటన (ఇన్‌సెట్: నర్సయ్య)
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్‌లోని ఉనా పట్టణంలో 2016, జూలై నెలలో గోసంరక్షుకుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఏడుగురు దళితులు, వారితోపాటు మూడువందల మంది ఇతర దళితులు ఆదివారం నాడు బౌద్ధమతం స్వీకరించారు. మోటా సమాధియాల గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ కుల రహిత బౌద్ధమతాన్ని స్వీకరించినప్పటికీ ఈ దళిత కుటుంబాలు అగ్రవర్ణాలు ఎక్కడ, ఎప్పుడు దాడిచేస్తాయోమోనని భయాందోళనలకు గురవుతున్నాయి.
2016, జూలైలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్న రమేశ్ సర్వయ్య మీడియాతో మాట్లాడుతూ నాడు తమ ఏడుగురిపై దాడిచేసిన వారిలో ఒకరు ఏప్రిల్ 25వ తేదీన మళ్లీ తమలో ఇద్దరిపై దాడి చేశారని చెప్పారు. ఆ రోజు జరిగిన సంఘటన నుంచి ఇంతవరకు తమ కుటుంబాలపై కూడా మూడుసార్లు దాడులు చేసి బెదిరించారని ఆయన వివరించారు. 2016, జూలై 11వ తేదీన ఉనా పట్టణంలో చనిపోయిన ఆవు మాంసాన్ని ఒలుస్తాన్నారన్న కారణంగా రమేశ్ సర్వయ్య కుటుంబంలోని ఏడుగురు సభ్యులపై దర్బార్ అనే అగ్ర కులానికి చెందిన 40 మంది దాడి చేశారు. సర్వయ్య నలుగురు సోదరులను బట్టలిప్పించి ఇనుప రాడ్లతో కొట్టారు. మరో ముగ్గురిని జీపుకు కట్టి లాక్కుపోయారు. వారి ఒల్లంత హూనమై స్పహతప్పి పడిపోయిన సందర్భంలో వారిని ఒదిలేసి వెళ్లిపోయారు.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సష్టించడంతో 43 మంది నిందితులపై పోలీసులు కేసు పెట్టారు. వారిలో 35 మంది బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసులో విచారణే ప్రారంభంకాలేదు. ఇక తమను ఎప్పటికి హిందువులు తమ వారిగా గుర్తించరని, వారి నుంచి రక్షణ కూడా లేదని గ్రహించే ఇప్పుడు బౌద్ధం పుచ్చుకున్నట్లు సర్వయ్య వివరించారు. 2016 సంఘటన జరిగిన నాటి నుంచి దాదాపు 60 వేల మంది దళితులు దేశంలో బౌద్ధం స్వీకరించాలని నిర్ణయించారు. అందుకోసం ర్యాలీలు కూడా నిర్వహించారు. వివిధ కారణాల వల్ల అంత మంది బౌద్ధంలోకి వెళ్లలేదు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఐదున్నర వేల మంది బౌద్ధ మతం స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment